Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2


    15. శూర ఇంద్రా! త్వరగా సోమపానము చేయుము. నీవు ధనికుడవు ప్రశస్తుడవు మమ్ము బాధించకము. స్తోతయగు యజమానిని రక్షింపుము. మాకు విశేషధనములిమ్ము ధనవంతులను చేయుము "మహశ్చరాయో రవేతస్కృధీనః"

                               ఇరువదిమూడవ సూక్తము
                పూర్వవత్ ఋషి దేవతే ఛందస్సు - 1-7, త్రిష్టుప్.
                             5 అభిపారిణి మిగిలినవి జగతి.


    1. ఇంద్రుడు కర్మకుశలుడు. హర్యశ్వములను రథమున పూన్చువాడు దక్షిణ హస్తమున వజ్రము ధరించినవాడు. మేము అట్టి ఇంద్రుని పూజింతుము. సోమపానము చేసిన ఇంద్రుడు గడ్డము, మీసములను దులుపును. వాశాలసేన, అన్నములతో శత్రువును వధించుటకు సాగును.

    2. ఇంద్రుడు విరాటమూర్తి, బలశాలి, దీప్తివంతుడు, ధనాధిపతి. అతని అశ్వములు రెండు హరితవర్ణలు. అవి అడవిలో మంచిగడ్డి మేసినవి ఇంద్రుడు తన  అశ్వములను తీసికొని ధనాదిపతియై వృత్రుని వధించినాడు. అతడు  దస్యుజాతి పేరుసహితము తుడిచిపెట్ట దలచినాడు.

    3. ఇంద్రుడు చిరప్రసిద్ధుడు. ధనికుడు సర్వజన విదితుడు. అన్నరాశికి ప్రభువు. ఇంద్రుడు సువర్ణమయ వజ్రాయుధము ధరించినపుడు హర్యశ్వములు పూన్చిరథము మీద విద్వాంసుల సహితుడై అధిరోహించును.

    4. వర్షము పశువులను తడిపినట్లు ఇంద్రుడు హరిత వర్ణసోమమున తన గడ్డము, మీసములను తడుపును. తదుపరి శోభన యజ్ఞగృమున ప్రవేశించును. అక్కడ సమర్పించిన మధుర సోమ రసమును సేవించును. వాయువు అడవిని కదిలించినట్లు ఇంద్రుడు తన గడ్డము మీసములను దులుపును.

    5. శత్రువులు ఎంతో వాగినారు. ఇంద్రుడు తన మాటలతో వారినోరు మూయించినాడు. శత్రువులను సంహరించినాడు. తండ్రి కొడుకునకు ఆహారము అందించి బలిష్ఠుని చేసినట్లు ఇంద్రుడు మానవులను బలిష్ఠులను చేయును. మేము అట్టి ఇంద్రుని మహా శక్తులను వర్థిల్ల చేయుదుము.

    6. ఇంద్రా! విమద వంశీయులు నీ మహాప్రతిష్ఠను తెలిసికొన్నారు. నీ కొరకు విలక్షణములు, విశాలములగుస్తుతులు రచించినారు. వారికి ఇంద్ర ప్రభువును తృప్తిచెందించుట తెలియును. పశువులకాపరి చేతమేత చూపి పశువును  పిలిచినట్లు - వారు ఇంద్రుని పిలిచెదరు.

    7. ఇంద్రా! నీకు విమద ఋషితోగల మైత్రీ బంధము సడలకుండవలెను. సోదరీ సోదరుల ఏకమనస్కతవలె. మనము ఏకమనస్కులము కావలెను. నీ సఖ్యములు శుభప్రదములు కావలెను. "తేసన్తు సఖ్యాశివాని".

                                   ఇరువది నాలుగవ సూక్తము
                    ఋషి - విమదుడు. దేవత - అశ్వినులు. ఛందస్సు -
                                 ఆస్తారపంక్తి 4,5,6 అనుష్టుప్


    1. ఇంద్రా! ఇది ప్రస్తరఫలముల మీద నలిపిన మధుర సోమరసము. నీ కొరకు సిద్ధముగా ఉన్నది. సేవింపుము. విశేషధనవంత ఇంద్రా! మాకు బహుసంఖ్యక విశేషధనము ప్రసాదించుము. విమదునకు నీవు మహామహుడవు.

    2. ఇంద్రా! నిన్ను యజ్ఞసామగ్రితోను. స్తుతులతోను. హోమ ద్రవ్యములతోను యజింతుము నీవు సకల కర్మలకు ప్రభువవు. సమస్త కర్మలను సఫలము చేయువాడవు. మేము కోరిన ఉత్తమ పదార్థములను మాకు అందించుము. వినుదునకు నీవు మహామహు డవు.

    3. నీవు వివిధ అభిలషిత వస్తువులకు స్వామివి. ఉపాసకుని ఉపాసనకు ప్రోత్సహింతువు. నీవు స్తోతలకు రక్షకుడవు. మమ్ము పాపముల శత్రువుల నుండి రక్షింపుము.

    4. కర్మనిష్ఠ అశ్వద్వయమా! మీపనులు అద్భుతములు మీరు సత్య స్వరూపులు. వినుదుడు. మిమ్ము స్తుతించినాడు అప్పుడు  మీరు  కలసి కర్రలతో అగ్నిని మధించినారు వేరువేరుగా కాదు.

    5. అశ్విద్వయమా! అరణులను మీ చేతులతో కదిలించినప్పుడు అందునుంచి నిప్పురవ్వలు బయటపడినప్పుడు సమస్త దేవతలు మిమ్ము ప్రశంసించినారు.  దేవతలందరు మిమ్ము మరల అట్లే చేయమని
 అన్నారు. "పునరావహతాదితి".

    6. అశ్విద్వయమా! నేను బయటికి వెళ్లుట ప్రీతికరము కావలెను. తిరిగి వచ్చుట ప్రీతికరము కావలెను. నేను వెళ్లిన చోటన ప్రియము ఎదురు పడవలెను. మీరు మీ దివ్యశక్తిచే సమస్త విషయములందు మము సంతుష్టులను చేయండి.
   
                                  ఇరువది అయిదవ సూక్తము
            ఋషి - విమదుడుగాని వసుక్రుడుగాని. దేవత - సోమము.
                                  ఛందస్సు - అస్తారపంక్తి.


    1. సోమమా! మా మనసులు నిపుణములు, నిర్మనిష్ఠులు అగునట్లు చేయుము. గోవులు గడ్డినివలె స్తోతలు అన్నము కోరుదురు. నీవు గొప్పవాడవు.

    2. సోమమా! పురోహితులు నీ చుట్టు కూర్చుందురు. నిన్ను స్తుతింతురు. నీ మానదు హరింతురు. ధనప్రాప్తి కొరకు నా మనసున  అనేక  కోరికలు కలుగు చున్నవి. నీవు గొప్పవాడవు.

    3. సోమమా! నాడి పరిణతబుద్ధి. దానితో నీ పనుల పరిమాణము తెలియగలను. తండ్రి కొడుకు విషయమునవలె నీవు మావిషయమువలె నీవు మావిషయమున అనుకూలుడవగుము. నీవు గొప్ప వాడవు.

    4. సోమమా! నీరు చేదుటకు కలశము నూతిలోనికి పోవును అట్లే నిన్ను చేరుటకు మాస్తుతులన్నియు సాగును. మా ప్రాణరక్షణకుగాను. ఈ  యజ్ఞమును పూర్తిగావింపుము. దప్పిగొన్నవాడు చెంబుపట్టినట్లు నీవు మమ్ము పట్టుము నీవు గొప్పవాడవు.

    5. నీవు మహానుడవు. మేధావివి. కావున వివిధ ఫలములు కోరు ధీరులు నిన్ను సంతోషపరచెదరు. మాకు గోవులు, అశ్వములుగల పశుశాల ప్రసాదించుము.

    6. సోమమా! మా పశువులను రక్షింపుము వివిధ రూపములుగా ఉన్న  భువనములను రక్షింపుము. మేము జీవించుటకు సకల భువనములను అన్వేషించి మాకు జీవనో పాయము అందించుము. నీవు గొప్పవాడవు. "వివక్షసే"

    7. సోమమా! నీవు దుర్ధర్షుడవు. మమ్ము సకల విధముల రక్షింపుము. శత్రువులను దూరము చేయుము. మమ్ము నిందించు వారు మాకు హాని కలిగించకుండవలెను. నీవు గొప్పవాడవు.

    8. సోమమా! నీ కృత్యములు అద్భుతములు. మాకు అన్నము కలిగించుటకు అప్రమత్తుడవై ఉందువు. మాకు భూమి అందించుటలో నిన్ను బోలిన వాడు లేడు. హాని లేడు. హాని చేయువారినుండియు పాపముల నుండియు మమ్ము రక్షింపుము. "వివక్షసే".

    9. భయంకర యుద్ధము సంభవించినపుడు మా సంతానమును బలి ఇవ్వవలసి వచ్చినపుడు శత్రుయోధులు చుట్టుముట్టి మమ్ము యుద్ధమునకు పిలిచినపుడు నిరుపమాన శత్రుసంహారకుడవైన నీవు ఇంద్రునకు సాయపడుదువు. అతనిని ఆపదలనుండి రక్షింతువు."వివక్షసే".

    10. సోమము సకల కార్యములను చప్పున చేయును. అతడు భయంకరుడు. ఇంద్రుని తృప్తిపరచువాడు మహామేధావియగు కక్షివాన్ ఋషి బుద్ధిని సోమము సునిశితము చేసినాడు. "వివక్షసే"

    11. సోమము విప్రహవిర్దాత యజమానికి పశుయుక్త ధనము ప్రసాదించును. సోమము సప్తహోతలకు శ్రేష్ఠధనము ఇచ్చును. సోమము అంధుడగు దీర్ఘతమునకు దృష్టి - కుంటి పరావృజునికి నడక ప్రసాదించినాడు. "వివక్షసే"

                                  ఇరువది ఆరవ  సూక్తము   
ఋషి - విమరుడు. దేవత -పూష. ఛందస్సు - 1-4 ఉష్టిక్ మిగిలినవి అనుష్టుప్.

    1. ఎన్నో ఉత్తమ స్తుతులు పూష కొరకు కల్పించ బడినవి పూష దేవతలందు శ్రేష్టుడు సదా రథనియుతుడు అతడు విచ్చేయవలెను. యజమానిని అతని పత్నిని రక్షించ వలెను.

    2. విప్రయజమానికి పూష సూర్యమండలమునందలి జలనిధి తెలియును. అతడు యజ్ఞము చేయవలెను. ఆ జలమును నేలకు దించవలెను. పూష యజమాని స్తుతులు ఆలకించును.

    3.పూష సోమము వంటివాడు. రసములను అందించును. అతడు ఉత్తమ స్తుతులు వినును. పూష జలమును అందించును. మా గోష్ఠమునకు అతడే జలమునందించును.

    4. పూషా! మేము మనసులందు నిన్నే ధ్యానింతుము. నీవు మాస్తోత్రములకు సూర్తివి. పురోహితులు నీ అర్చనలో నిమగ్నులై ఉందురు.

    5. పూష యజ్ఞములందు అర్ధభాగమువాడు. అతడు రథమునకు గుఱ్ఱములను పూన్చిసాగును. అతడు మానవుల పరమ హితైషి. పూష బుద్ధిమంతుడు. బంధువు. అతడు శత్రువులను దూరము చేయును.

    6. పూష ఆడ, మగ మేకలు మున్నగు పశువులకు ప్రభువు. అతడే గొంగళినేయును. బతాలు ఉతుకును.


    7. పూష ప్రభువు అన్నములకు  అధిపతి. పూష ప్రభువు అందరకు పుష్టి కారకుడు పూష దుర్ధర్హుడు. పూశసౌమ్యమూర్తి. క్రీడాస్థలమున పూష తన గడ్డము మీసములను కదలించినాడు.

    8. పూషదేవా! నీ యొక్క రథము కాడిని మేకలు వహించును. నీవు చిరజాతవు పలుమారులు పుట్టినవాడవు. నీవు ఎన్నడును అధికారము కోల్పోలేదు. సకల యాచకుల కోరికలు తీర్చువాడవు.

    9. ఈ మహాపూషదేవుడు తనబలమున మారథమును రక్షించవలెను. అన్నవృద్ధి కలిగించవలెను. మా ఆహ్వానమును చెవియొగ్గి వినవలెను.

                                 ఇరువది ఏడవ సూక్తము   
     ఋషి - ఇంద్రపుత్ర వసుక్రుడు. దేవత - ఇంద్రుడు. ఛందస్సు - త్రిష్టుప్.

    1. ఇంద్రుడు అనుచున్నాడు:-

    భక్త స్తోతలారా! సోమయజ్ఞము అనుష్ఠించు యజమానికి అడిగిన వారములు ఇచ్చుట నా స్వభావము నాకు హోమ ద్రవ్యములు సమర్పించనివాడు సత్యమును బోధించిన వాడగును. నలుదిశల పాపముల చేయుచు తిరుగు వానిని నేను నాశము చేతును.

    2. ఋషి అనుచున్నాడు :-

    కొందరు దేవానుష్ఠానము చేయని వారున్నారు. కేవలము ఉదర పోషణ నిమిత్తమే జీవించువారున్నారు. నేను అట్టి వారితో యుద్ధము చేయవెడలుదును. అప్పుడు ఇంద్రా! నీ కొరకు బలిష్ఠమైన వృషభయమును వండింతును. పదిహేను తిథులలో ఒక తిథిలో నీకు సోమరసము సమర్పింతును.

    3. ఇంద్రుడు అనుచున్నాడు:-

    దేవశూన్య, దేవకర్మశూన్యులను యుద్ధమున సంహరించినావని చెప్పువానిని నేను చూడనేలేదు. నేను యుద్ధమునకు పోయిఅటువంటి వారిని వధింతును. అప్పుడు జనులందరు నా వీరకృత్యమును విస్తారముగ వర్ణిస్తారు.

    4. నేను అనుకోకుండనే. చప్పున యుద్ధమున దూకుదును. అప్పుడు ఋషులు నా  చుట్టు చేరుదురు. ప్రజాక్షేమమునకుగాను నేను సర్వత్ర సంచరింతును. శత్రువును సంహరింతును. వాని కాళ్లుపట్టుకొని విసరి, బండకు బాదుదును.

    5. యుద్ధములందు నన్ను ఎదిరించువాడు లేడు. నేను గర్జించినపుడు బధిరుడు సహితము గడగడలాడును. అంతెందుకు కిరణ్మయ సూర్యుడే కంపించును.

    (ఇంద్రుని ధ్వని దగ్గర ఉన్న బధిరుని అతిదూరమున ఉన్న సూర్యుని గడగడలాడించునని.)

    6. నేను ఇంద్రుడను. నన్ను విశ్వసించనివారిని దేవతలకు అర్పించిన సోమరసమును బలాత్కారముగా త్రాగువారిని చేతులు చాచుకు హింసకు దిగు వారిని చూచుకుంటాను "దర్శం" నేను మహామహుడను. అందరి మిత్రుడను. న్నను నిందించువారి మీద నా వజ్రపాతము జరుగును.

    7. ఋషి అనుచున్నాడు:-

    ఇంద్రా! నీ దర్శనము కలిగించినావు. వర్షము కలిగించినావు. నీవు చిరంజీవత్వము నొందినావు. పూర్వము శత్రునాశము చేసినావు. తదుపరి కూడ చేసినావు. ఇంద్రుడు సకల  విశ్వముల  అపరంపారుడు. సర్వవ్యాపకుడు. ద్యావాపుథ్వ్రులు అతనిపేరువిని కంపించును.

    8. ఇంద్రుడు అనుచున్నాడు:-

    అనేక గోవులు కూడి యవలు తినుచున్నవి. నేను ఇంద్రుడను స్వామివలె ఈ  గోవులను కాపాడుదును. అవి గోపాలుర చూపులో మేతమేయుటను వీక్షించుచున్నాను. పిలిచినా వెంటనే గోవులు తమ యజమాని వద్దకు చేరినవి యజమాని ఆవు పాలను పిండుకున్నాడు.

    9. ఋషియొక్క స్వకీయ అనుభూతి.

    లోకమందు గడ్డితిను ప్రాణులు మేమే అగుదుము. అన్నము, లేక యవలు తిను మానవులు మేమే అగుదుము. హృదయాకాశామునందలి అంతర్యామి బ్రహ్మ మేమే  అగుదుము. హృదయాకాశమున ఉన్న ఇంద్రుడు తనవారలందరిని ఇష్టపడును. యోగశూన్య, విషయ వాసనల  వారని ఇంద్రుని  సన్మార్గమునకు చేర్చును.

    10. ఇంద్రుడు అనుచున్నాడు:-

    నేను ఇచటవచించున దెల్లయు సత్యమనియు, నిశ్చిత మనియు తెలియుడు. నేనే  ద్విపద, చతుష్పాత్తులనన్నింటిని సృష్టిస్తాను స్త్రీలమీదకు పురుషుని యుద్ధము చేయుటకు పంపువాని ధనమును హరించి భక్తులకు ఇచ్చెదను.

    (మహిళలసైన్యము వేరుగా ఉన్న సూచన) 


Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More