Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2


    6. పితరులారా! మీరు మోకాళ్లమీద దక్షిణదిశగా నేలపై ఆసీనులుకండి. ఈ యజ్ఞమును ప్రశంసించండి. మేము మానవులము. మా వలన అపరాధములు జరగవచ్చును. కాని వాటి కొరకు మమ్ము బాధించకండి.

    7. అగ్ని యొక్క లోహిత శిఖవద్ద కూర్చున్న దాతలకు ధనము ప్రసాదించండి. వారి పితరులకు ధనము అందించండి. వారిని ఈ యజ్ఞమున ప్రోత్సహించండి.

    8. సోమపాయులగు ప్రాచీన పితరుల ధనవత్తములు వారు యథావిధిగా సోమపానము చేసినారు, వారు సహితము హవిని  అభిలషింతురు - యముడు సహితము అభిలషించును. పితరులతో కూడ యముడు సుఖించవలెను హోమద్రవ్యములను స్వేచ్చగా భుజించవలెను.

    9. పితరులు -  హవనము చేయుట ఎరిగివారు -అనేక ఋక్కులు రచించి స్తోత్రములు సమర్పించినవారు. తమ కర్మప్రభావమున దేవత్వము నొందినవారు. వారు ఆకలి దప్పులు కలిగి ఉండవచ్చును. అగ్నీ! వారు నీకు విశేష పరిచితులు. వారిని మా వద్దకు తోడ్కొని రమ్ము. వారు యజ్ఞమున కూర్చుందురు. ఈ ఉత్కృష్ట హవి వారి కొరకే అగును.

    10. అగ్నీ! సాధుస్వభావ పితరులు దేవతలతో కూడి హవిని ఆరగింతురు. సేవింతురు. వారు ఇంద్రుని రథమున ఇంద్రునితోబాటు కూర్చుందురు. వారు దేవారాథకులు. యజ్ఞఅనుష్ఠాతలు.  వారు ప్రాచీన ఆధునిక పితరులు. వారిని తోడ్కొని నీవు విచ్చేయుము.

    11. అగ్ని ష్పాత్త పితరులారా! ఇచ్చటికి విచ్చేయండి. ఒక్కొక్కరు మీమీ ఆసనములలో కూర్చొనండి. అభిపూజిత పితరులారా! కుశలపై శుద్ధహవి వడ్డించి ఉన్నది ఆరగించండి. మాకు పుత్ర, పౌత్రాదియుక్త ధనము ప్రసాదించండి.

    12. సమస్తలోక జ్ఞాత అగ్నీ! మేము నిన్ను స్తుతించినాము. నీవు హవిని సుగంధయుతము చేసినావు. పితరులు భుజించవలెను. దేవా! మేము ఎంతో శ్రమించి హవిని సమర్పించినాము భక్షింపుము.

    13. జ్ఞాని అగ్నీ! పితరులు ఇచ్చటికి వచ్చినవారున్నారు రానివారున్నారు. పితరులలో మేము ఎరిగిన వారున్నారు. ఎరుగని వారున్నారు. వారినందరిని నీవు ఎరుగుదువు.

    14. స్వయంప్రకాశ అగ్నీ! పితరులలో అగ్నికి అర్పితమైన వారున్నారు- కానివారున్నారు. వారందరు స్వర్గమున స్వధసహితులై ఆనందించ వలెను. నీవు వారితో కలసి పొమ్ము. వారి కోరిక ప్రకారము వారి ప్రాణాధార శరీరములను దైవ శరీరములు చేయుము.

                                   పదహారవ సూక్తము
                ఋషి - యమపుత్ర దమనుడు. దేవత - అగ్ని. ఛందస్సు
                               1-10 త్రిష్టుప్- మిగిలినవి అనుష్టప్.


    1. అగ్నీ! మృతుని దేహపు సర్వాంశములు భస్మము చేయకుము. ఇతని దేహమును చిన్నా భిన్నము చేయకుము. నీ జ్వాలలకు ఇతని శరీరము పక్వమైనంత ఇతనిని పితరుల వద్దకు పంపుము.

    2. అగ్నీ!  ఇతని శరీరమును నీవు దహించగానే పితరుల వద్దకు పంపుము. ఇతడు మరల సజీవుడైనపుడు దేవతల అధీనమున ఉండును.

    3. మృతవ్యక్తీ! నీనేత్రము సూర్యుని వద్దకు, శ్వాసవాయువును చేరవలెను. నీవు పుణ్యఫలమున ఆకాశము, భూమి మీదకు పొమ్ము. జలములకు వెళ్లదలచిన జలములకే వెళ్లుము. నీ అవయములు వనస్పతులందు ఉండునుగాత.

    4. ఈ వ్యక్తలో జన్మరాహిత్య దశుండును. నిత్యదశ ఉండును. అగ్నీ! నీ ఉజ్వల జ్వాలతో ఆ అంశము తపింపచేయుము. జ్ఞాని అగ్నీ! నీ మంగళమయ మూర్తులున్నవే వాని ద్వారా ఈ వ్యక్తిని పుణ్యవంతులు ఉండు చోటునకు చేర్చుము.

    5. అగ్నీ! నీకు ఆహుతిస్వరూపుడై, యజ్ఞద్రవ్యములు భుజించువానిని పితరుల వద్దకు  పంపుము.  ఇతని మిగలిన భాగమునకు ప్రాణము వచ్చిలేవవలెను. జ్ఞాని అగ్నీ! అతనికి మరల దేహము కలుగుగాత.

    6. మృతవ్యక్తీ! నీ  శరీరమునందలి ఒక భాగమునుకాకి, మరొక భాగమును, చీమలు, పాములు బాధ పెట్టి ఉండవచ్చును. ఆభాగమున సర్వభోక్త అగ్ని రోగము లేకుండ తీయవలెను. నీ దేహమందు నిలిచినా సోమము సహిత ఆ భాగమును నిరోగిని చేయవలెను.

    (వాటి కాటుకు అగ్ని ఔషధమగునట్లున్నది.)

    7. మృతుడా! నీవు గోచర్మ సహితముగా అగ్ని శిఖా స్వరూప కవచమును ధరింపుము. అట్లు చేయుటవలన - బలపూర్వకముగను, అహంకారయుతముగను నిన్ను దహించుతాకు సిద్ధమగు అగ్ని నీ సర్వాంశములకు వ్యాపించలేడు.

    8. అగ్నీ! ఈ చమసమును అంతకుము. ఇది సోమపాయులను ప్రసన్నులను చేయును. ఈ చమసముదేవతల పానము కొరకైనది. దీనిని చూచి దేవతలు ఉప్పొంగుదురు.

    9. మాంస భోజన అగ్ని పాపములను మోయును. నేను అట్టి అగ్నిని దూరమున ఉంచెదను. ఎవరికి యముడు రాజగునో అగ్ని వారి వద్దకే చేరవలెను. ఇదిగో ఇది ఒక అగ్ని అతడు దేవతల వద్దకు హవిని చేర్చవలెను.

    10. మాంసభోజి, చితావంత అగ్ని మీ ఇంటచేరినాడు. అతనిని నేను దూరము చేతును. మరొకటి జ్ఞాని అగ్ని. పితరులకు యజ్ఞము వహించుటకు ఆ అగ్నిని గ్రహింతును. ఈ అగ్ని యజ్ఞము అందుకోని పరంధామము చేరవలెను.

    11. శ్రద్ధాద్రవ్యములను వహించు అగ్నియు, యజ్ఞమును ఉన్నతము చేయు అగ్నియు దేవతలను, పితరులను ఆరాధించును వారికి హోమ ద్రవ్యములు చేర్చును.

    12. అగ్నీ! నేను నిన్ను ప్రయత్నపూర్వకముగ స్థాపింతును. ప్రయత్న పూర్వకముగ ప్రజ్వలింప చేయుదును. యజ్ఞాభిలాషులగు దేవతల, పితరుల భక్షణకుగాను నీవు ప్రయత్న పూర్వకముగ హోమద్రవ్యములను చేర్చుము.

    13. అగ్నీ! నీవు దహించిన దానిని ఆర్పుము. ఇక్కడ జలములు ఉండవలెను శాఖ, ప్రశాఖల దుర్వ మొలువవలెను.

    14. పృథివీ! నీవు చల్లనిదానవు. నీ మీద  ఎన్నో చల్లని చెట్లున్నవి. నీవు ఆనందదాయనివి. నీమీద అనేక ఆనందదాయక వృక్షములున్నవి ఆడ కప్పకు తృప్తి కలుగునంత వర్షింపుము. అగ్నిని సంతోషపరచుము.

    (శ్రీమదాంథ్ర వచన సంహిత ఏడవ అష్టకము పదవ మండలమున మొదటి అనువాకము సమాప్తము)

               రెండవ అనువాకము        పదిహేడవ సూక్తము
     ఋషి - యమపుత్ర విశ్రవుడు. దేవతలు - ఒక్కరుకారు. ఛందస్సు -
                        1 - 12 త్రిష్టుప్ -13,14 అనుష్ప్


    1. త్వష్ట తనకూతురు 'సరణ్య' వివాహము చేయనున్నాడు. అందుకు సమస్తలోకములు దిగినవి. యముని తల్లి వివాహమైనపుడు వివస్వతుని పత్ని వచ్చినది.

    2. అమర  'సరణ్య' ను మానవుల మధ్యదాచినారు. సరణ్యవంటి ఒకస్త్రీని చేసి ఆమెను వివిస్వతునకు ఇచ్చినారు. అప్పుడు అశ్వరూపమున ఉన్న సరణ్య తన గర్భమున అశ్వినులను దాల్చినది. కవల అశ్వినులను కన్నది.

    3. జ్ఞాని, లోకరక్షకుడు పశు రక్షకుడగు పూషనన్ను ఉత్తమలోకములకు చేర్చునుగాత. అగ్నిదేవుడు నిన్ను ధనదేవతల పితరులవద్దకు చేర్చునుగాత.

    4. పూష సకల  జగములకు ప్రాణము. అతడు నీ జీవనమును రక్షించవలెను. అతడు నీ గమ్యస్థానమునకు అగ్రభాగమున ఉండును. అతడు నిన్ను రక్షించవలెను. ఎచట పుణ్యవంతులున్నారో, వారు ఎచటికేతెంచి నారో నిన్ను పూష అచటికి చేర్చవలెను.

    5. పూష సకల దిశలను తెలిసినవాడు. అతడు మమ్ము భయములేని మార్గమున నడిపించవలెను. అతడు కళ్యాణ ప్రదుడు. అతని రూపము లోకములందు వ్యాపించి ఉన్నది. సమస్త వీరులు అతని వెంటనే ఉన్నారు. అతడు మమ్ము ఎరుగును అప్రమత్తుడై అతడు  మా వద్దకు రావలెను.

    6. సకల  మార్గమ్ములందు శ్రేష్ఠమార్గమ్మున పూష దర్శనము ఇచ్చినాడు. స్వర్గ, మర్త్యములందలి శ్రేష్ఠ మార్గమున దర్శనము ఇచ్చినాడు. పూషకు ద్యావా పృథ్వులు ఇరువురు ప్రేయసులు. వారు కలిసిమెలిసి ఉందురు. వారిని పూషదేవుడు రంజింప చేయును.

    7. దేవతలను గూర్చి యజ్ఞము చేయువారు పూజకొరకు సరస్వతిని ఆహ్వానింతురు. దేవతల యజ్ఞము సవివరముగా ప్రారంభమైనపుడు పుణ్యాత్ములు సరస్వతిని ఆహ్వానించినారు. సరస్వతి దాతల కోర్కెలు తీర్చవలెను.

    8. సరస్వతీ! నీవు పితరులతో బాటు ఒకే రథమున సాగుము. వారితోగూడి యజ్ఞద్రవ్యములు స్వీకరింపుము. రారమ్ము. ఈ యజ్ఞమున ఆనందింపుము. మమ్ము రో గరహితులను చేయుము. మాకు అన్నదానము చేయుము.

    9. సరస్వతీ! పితరులు విచ్చేసినారు. దక్షిణ భాగమున కూడినారు. నిన్ను ఆహ్వానించినారు. నీవు యజ్ఞకర్తకు బహుమూల్యము,  విలక్షణమగు  అన్నరాశిని విశేష అన్నమును కలిగింపుము.

    10. జలము మాతృస్వరూపము. జలము మమ్ము పరిశుద్ధులను చేయవలెను. ఘృతపూత జలము మా మలినమును తొలగించవలెను. జలరూపదేవీ! సకల పాపములను నీ ప్రవాహమున తీసికొని పొమ్ము. జలమునుండి మేము స్వచ్ఛముగను, పవిత్రముగను బయటపడుదుము.

    11. ద్రవరూప సోమము ఎంతో చక్కనిది. దీప్తశీల అంశమున క్షరితమగునది. అది ఈ స్థానమున క్షరితమగును - పూర్వస్థానమున క్షరితమైనది. మేము సప్తసవన కర్తలము. ఆధార మధ్యమున విహరించు ద్రవసోమము కొరకు హవనము చేయుదుము.

    12. సోమమా! ద్రవాత్మకుడవాగు నీవు క్షరితుడవగుదువు. నీ అంశము పురోహితుని చేతినుండి ప్రస్తర ఫలకము మీదపడును నీవు పవిత్రము మీద స్థాపించ బడుదువు. అట్టి నీకు నమస్కరింతుము. హవనము చేయుదుము.

    13. నీ యొక్క రసము బయల్పడినదియు, స్రుక్ కింద రాలినదియు ఈ రెంటిని బృహస్పతి సేవించవలెను. అందు వలన మాకు ధనము లభించును.

    14. వనస్పతులు పాలవలె ప్రవహించవలెను. మాస్తోత్రవాక్కు దివ్య జలము వలె ప్రవహించవలెను. అవన్నియు మమ్ము సంస్కరించవలెను.
   
                                    పద్ధెనిమిదివ సూక్తము
                 ఋషి - యమపుత్ర సంకుసుకుడు. దేవత - వేరువేరు.
                   ఛందస్సు - ప్రస్తారపంక్తి - జగతి అనుష్టుప్ త్రిష్టుప్


    1. మృత్యువా! దేవయానముకాని మార్గమున పయనింపుము. నీవు చూడగలవు వినగలవు నా  విన్నపము ఆలకింపుము. మా పుత్రపౌత్రులను, వీరులను హింసించకుము "ప్రజారి రిరిషో మోత వీరన్"

    2. మృత వ్యక్తుల సంబంధులారా! పితృయానమగు మృత్యుమార్గమును విసర్జించండి. అందువలన చిరాయువు లభించును. "దీర్ఘాయుః ప్రతరం  దధానాః" యజ్ఞానుష్ఠాతలగు యజమానులారా! మీరు  పుత్ర, పౌత్ర గోయుక్తులు కండి ఈ జన్మ, పూర్వజన్మ పాపములను పరిహరించండి పవిత్రులు కండి.

    3. జీవమానవులారా! మృతమానవుల వద్దకు మరలిరండి నేటి మా పితృమేధ యజ్ఞము శుభావహము కావలెను మేము ఈ నాడు సంబరముగా ఆడుటకు, పాడుటకు సమర్ధులము కావలెను. మాకు దీర్ఘాయువు కలుగవలెను.

    4. పుత్ర పౌత్రాదులను రక్షించుటకు మృత్యువును అడ్డగించుటకు మృత్యుమార్గమున  రాళ్లు వేస్తాను. అందువలన మరణము త్వరపడిరాదు. మృత్యువును రాళ్లతో దూరము చేయండి "మృత్యుం దధతాం పర్వతేన"

    (ఇది ఏదో  శిలాచికిత్సవలె అనిపించుచున్నది ఇది మృత్యువును దూరము చేయుటకు ఉపకరించునట్లున్నది. వైద్యులు పరిశీలించవలసి ఉన్నది. ఇది రాయివిసరి మృత్యువును పారద్రోలుట మాత్రముకాదు.)

    5. రోజు తరువాత రోజు గడచిపోవును. ఋతువుదాటి ఋతువు సాగిపోవును. పూర్వకాలపు పితరులు ఉండగా ఇప్పటి పుత్రులు గతించరు. దాతా! అట్లే  మావారికి ఆయువు కల్పించుము. "ధాతారాయూంషి కల్పయైషామ్"

    6. మృతుని పుత్రాదులారా! వృద్ధులైనను ఆయువును అధిష్ఠించండి. జ్యేష్ఠుని పిదప  కనిష్ఠ క్రమమున  కార్యములు నిర్వహించండి. శోభన జన్మత్వష్ట మీతో పాటు ఈ  కార్యమున  ప్రవృత్తుడై ఉన్నాడు. మీరు జీవించుటకు అతడు మీ ఆయువును పోడిగించును. "జీర్ఘ మాయుః కార్తి జీవసేవః"

    (కుటుంబనిర్వహణ నిలువరాదు అందుకు యాజమాన్య క్రమమును ఏర్పరచినాడు.)

    7.విధవలు కానివారు, పతులుగల సుమంగళులు కాటుక కన్నీరు లేనివారై స్వగృహములకు చేరవలెను. మనోవ్యధలేక శోభనులయన ఈస్త్రీలు అందరికన్న ముందు ఇళ్లకు చేరవలెను.

    (గృహకృత్యములకు గృహిణులు ముందేగవలసి ఉన్నది.)

    8. మృతుని పత్నీ! పుత్రాదులను, గృహమున గురించి ఆలోచించుము. ఇచటినుండిలెమ్ము. ఇచట నీపతి గతించినాడు. నీవు వృధాగా అతని వద్ద పడి ఉన్నావు. పాణిగ్రహణ, గర్భధారణాదులు చేయించిన నీ పతి తోడ నీవు స్త్రీకర్తవ్యమును నిర్వాహించినావు. పతి మరణము ధృవపడినది ఇంటికి మరలుము.


Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More