Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2


    5. ప్రదీప్త అగ్ని మా స్తుతులు విన్నాడా? మా హవిగ్రహించినాడా? మేము అగ్నిని సరిగా పూజించినామా? ఏమో! ఎవరికి తెలియును? స్నేహితుడు పిలిచినంత వచ్చును. అట్లే అగ్ని సహితము రావచ్చును. మా ఈ స్తుతి దేవతలను చేరవలెను. ఇక్కడ ఉన్న ఖాద్యములు దేవతల వద్దకు చేరవలెను.

    6. అమర సూర్యుని అపరాధశూన్య, మధురరసవంత జలము పృథ్విపై నానా విధములై ఉండును. సూర్యుడు యముని అపరాధములు క్షమించును. అగ్నీ! క్షమాశీల సూర్యుని కాపాడుము.

    7. యజ్ఞములందు అగ్ని ఉండగా దేవతలు ప్రసన్నులగుదురు. యజమానులు దేవరూప స్థానములందు దేవతలను  ప్రతిష్ఠింతురు. దేవతలు సూర్యునిలో వెలుగును, చంద్రునిలో రాత్రిని స్థాపించినారు. సూర్య చంద్రులు వెలుగులు అందుకొందురు.

    8. అగ్ని జ్ఞానస్వరూపుడు. అగ్ని ఉన్నప్పుడు దేవతలు తమ తమ కార్యములు నిర్వహింతురు. వారి స్వరూపములు మాకు అర్థము కావు. ఈ యజ్ఞమున మిత్ర, అదితి, సూర్యులున్నారు. వారు పాపశూన్య అగ్నికి మేము పాపరహితులమని చెప్పవలెను.

    9. అగ్నీ! సకల దేవతల యజ్ఞగృహమున నిలువుము. మా మాటలు వినుము. అమృతమయ రథమును సిద్ధము చేయుము. దేవతల మాతాపితరులు ద్యావాపృథ్వులు వారిని మా వద్దకు కొనిరమ్ము. నీవు ఇచటనే ఉండుము. దేవతలను వదలి పోకుము.
   
                                పదమూడవ సూక్తము
      ఋషి - అదితి పుత్ర వివస్వతుడు. దేవత - శకట ద్వయము.
                      ఛందస్సు - త్రిష్టుప్ - చివరిది జగతి.


    1. శకటద్వయమా! ప్రాచీన కాలమున అవతరించిన మంత్రములు ఉచ్చరించుచు, సోమాదులు నింపిమిమ్ము పత్నీశాల చివరకు తీసికొని వెళ్లుదును. స్తోత ఆహుతివలె  నాస్తుతివచనము - దేవతలనుచేరవలెను దివ్య ధామమందున్న దేవతలందరు వినవలెను.

    2. మీరు కవలలవలె సాగునపుడు దేవపూజక మానవులు మిమ్ము హోమ ద్రవ్యములతో నింపుదురు. మీరు మీ స్థానములందు నిలువండి. మా సోమము కొరకు శుభస్థానము ఆక్రమించండి.

    3. యజ్ఞమునకు 1) ధాన్య, 2) సోమ, 3)పశు, 4) పురోడాశ 5) ఘృతములను అయిదు ఉపకరణములు. వానిని నేను తగినంత కూర్చెదను. నియమప్రకారము త్రిష్టుపాది నాలుగు ఛందస్సులను ఉపయోగింతును. ఓంకారమును ఉచ్చరించి ప్రస్తుత కార్యమును ప్రారంభింతును. యజ్ఞపు నాభి స్వరూప వేదిమీద సోమమును శుద్ధిచేయుదును.

    4. దేవతలలో ఎవరిని మృత్యుగృహమునకు పంపవలెను? ప్రజలలో ఎవరిని అమరులను చేయవలెను? మేము  యజ్ఞకర్తలము. మంత్రపూత యజ్ఞమును అనుష్ఠింతుము. అందువలన యముడు మమ్ము మత్యుగృహమునకు పంపడు.

    5. సోమము పితృస్వరూపము. ప్రశంసనీయము స్తోతలు సోమమును సప్త ఛందముల స్తుతింతురు. పుత్రస్వరూపులగు పురోహితులు స్తుతింతురు. అభయ శకటములు మానవులు దేవతల కొరకు శోభిల్లును. పని చేయును. దేవతలను, మానవులను పోషించును.

    (మానవుల, దేవతల సమానత్వము వచించినాడు.)

                                పదునాలుగవ సూక్తము
      ఋషి - వైవస్వతపుత్ర యముడు. దేవత - యముడు - పితరులు.
                                 ఛందస్సు - వేరు వేరు.


    1. అంతఃకరణమా! పితరుల స్వామి యముడు. అతనిని పురోడాశాదులతో అర్చించును. సత్కర్మలు చేసినవారిని యముడు సుఖప్రదేశమునకు చేర్చును. అతడు అనేకుల మార్గములను నిర్ణయించును. సకల మానవ జాతి అతనినే చేరుమ.

    2. యముడు అందరకు ముఖ్యుడు. అతడు మా శుభాశుభములన్నింటిని ఎరుంగును. యముని మార్గమును ఎంతటి వాడును అడ్డుకొన జాలడు. మనపూర్వజులు పోయిన మార్గముననే - కర్మానుసారముగ సకల - జీవులు పోవుదురు.

    3. ఇంద్రుని సారథి మాతల్లి. అతడు కవ్యవంత పితరుల సాయమున వర్ధిల్లును. యముడు అంగిరనామకపితరుల సాయమున వర్ధిల్లును. దేవతలను సంవర్థిల్ల చేయువారును. దేవతలు సంవర్థిల్ల చేయువారును వర్థిల్లుదురు. కొందరు 'స్వాహ' మున కొందరు 'స్వధ' వలన వర్థిల్లుదురు - "స్వాహాన్యేస్వధాయాన్యే మదన్తి"

    4. యమా! అంగిరనామక పితరుల సహితుడవై విస్తృతమగు ఈ యజ్ఞవిశేషమునకు విచ్చేయుము. ఆసీనుడవగుము. ఋత్విక్కుల మంత్రములు నిన్ను ఆహ్వానించవలెను. రాజా! ఈ హవితో సంతుష్టుడవగుము. యజమానులను ప్రసన్నులను చేయుము "రాజన్హవిషా మాదయస్వ".

    5. యమా! అంగిరుల బహురూపులు. వారి  సహితుడవై యజ్ఞమునకు విచ్చేయుము. యజమానుని ప్రసన్నుని చేయుము. నీ  తండ్రి వివస్వతుని యజ్ఞమునకు ఆహ్వానించుచున్నాను. అతడు యజ్ఞపుకుశల మీద కూర్చుండవలెను "యజ్జేబర్హిష్యానిషద్య."

    6. అంగిర, అధర్వ, భృగు పితృగణములు ఇప్పుడిప్పుడే విచ్చేసినారు. వారందరు సోమ అధికారులు అగుదురు. యజ్ఞయోగ్యులగు ఆపితరుల అనుగ్రహమున మేము ఉండవలెను. అందువలన మేము సుమస్కులము, శుభానహమూలము కావలెను "భద్రే సౌమనస్యేస్యామ."

    7. మన ప్రాచీన పితామహాదులు పోయిన మార్గముననే - మృతపితా! నీవును వెళ్లుము. అమృతాన్నమున ప్రహృష్టమనస్కుడగు యముని - వరుణుని దర్శింపుము.

    8. పితా! ఉత్కృష్ట స్వర్గమున నీ పితరులను కలసి కొనుము. నీవు చేసిన కర్మఫలమును కలసి కొనుము. పాపములను వర్జించుము. 'అస్త' నామక గ్రహమున నివసించుము. ఉజ్వల దేహము ధరింపుము - "గచ్ఛస్వతన్వా సువర్చాః"

    9. శ్మశానమందున్న  పిశాచాదులారా! ఈ స్థానము వదలండి, వెళ్లండి. దూరము కండి. ఈస్థలమును పితరులు మృత యజమానుల కొరకు చేసినారు. ఈ స్థలము పగళ్లు, జలములు, రాత్రులతో శోభిల్లును. యముడు ఈ స్థానమును మృతులకు ఇచ్చినాడు "యమోదదాత్య వసోనమస్మై."

    10. మృతపితా! నాలుగు కన్నులు, విచిత్ర వర్ణములుగల రెండు కుక్కల వద్దనుండి వెంటనే సాగి పొమ్ము. విజ్ఞులగు పితరులు యముని వద్ద సుఖముగా ఉండునట్టి ఉత్తమ మార్గమున సాగుము - వారి వద్దకు చేరుము.

    11. యమా! నీ గృహమున రక్షించునని - నాలుగు కన్నులుగలవి మానవుల ప్రశంసలందుకొను రెండు కుక్కులనుంచి ఈ మృత జీవిని రక్షింపుము. రాజా ! ఇతనికి శుభములు కలిగించుము. నిరోగిని చేయుము.

    12. యమదూతలగు రెండు కుక్కలు పొడవు ముక్కులు గలవి ఇతరుల ప్రాణములు తిని తృప్తి చెందునవి మానవులను వెంబడించునవి. విస్తృత బలవంతములు. అవి మాకు - ఈనాడు - సూర్య దర్శనమునకు - ప్రాణము పోయవలెను.

    13. ఋత్విక్కులారా! యమునకు సోమము సమర్పించండి. యముని కొరకు హవిని హవనము చేయండి. ఏ యజ్ఞపు దూత అగ్ని అగునో, ఏయజ్ఞమును వివిధ ద్రవ్యముల చేసమన్వితము చేయబడునో అట్టి యజ్ఞము యముని చేరును - "యమంహయజ్ఞోగచ్ఛతి."

    14. ఋత్విక్కులారా! యముని కొరకు ఘృతయుక్త హవిని హవనము చేయండి. దేవతలందు యముడు మేము ప్రజీవించుటకు దీర్ఘాయువును ప్రసాదించ వలెను "సనో దేవేష్వాయ మద్దీర్ఘమాయః ప్రజీనసే."

    15. ఋత్విక్కులారా! యముని కొరకు 'మధుమత్తమ' హవిని హవనము చేయండి. మాకన్నముందు శుభప్రద మార్గములు పరచిన ఋత్విక్కులకు నమస్కారము.

    16. యమరాజు త్రికద్రుక యజ్ఞమునకు అధికారి. అతడు ఆరు స్థానములందు వసించును. అతడు విరాట్ ప్రపంచమున సంచరించును. త్రిష్టుప్, గాయత్రి మున్నగు ఛందస్సులలో యముని స్తుతించ బడును.

    (త్రికద్రుకము - జ్యోతి, గోవు, ఆయువు. ద్యులోక భూలోక, జల, ఉద్బిజ్జ, ఉర్క, సూనృతములు యముని ఆరు స్థానములు)

    ఆలోచనామృతము:-

          అచ్ఛేద్యోయమ దాహ్యోయం అక్లేద్యో శోష్యేవచ
          నిత్యం సర్వగతః స్థాణుః అచలో యః సనాతనః

    దీనిని ఛేదించరాదు దహించరాదు బాధించరాదు. శోషింపరాదు ఇది నిత్యము, సర్వగతము, స్థాణువు. అచలము ఇది సనాతనము.

    ఇది భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ ఆత్మనుగురించి ప్రవచించినది.

    ఆత్మజ్ఞానము భారతీయులు మాత్రమే సాధించినారు. పాశ్చాత్యులు దీనిని తెలిసికొనుటకు యుగములు పట్టును. ఏలనన వారికి ఈ విషయమున ఇంకను అక్షరాభ్యాసము కాలేదు. ఆత్మకు దేహము వస్త్రము వంటిదని గీతాకారుడు ప్రవచించినాడు. వాసాంసి జీర్ణాన్యవ్యాని సంయాతి నవాని గృహ్ణాతి నరోపరాణి తథాశరీరాణి విహాయ జీర్ణాన్యవ్యాన్ని సంయాతి నవాని గృహ్ణాతి నరోపరాణి తథాశారీరారాణి విహాయ జీర్ణన్యవ్యాని సంయాతి నవాని దేహినరుడు పాతబట్టలను వదిలేస్తాడు. కొత్త వానిని కట్టకుంటాడు. ఆత్మకూడా అంతే పాత శరీరాన్ని విడిచేస్తుంది. కొత్త దానిని ధరిస్తుంది. ఇది ఊహాజనితం కాదు జీవితాన్ని కాచివడపోసి కనుగొన్న నిత్యసత్యాలు ! ప్రకృతికి పరిణామమేకాని నశింపులేదు గింజ చెట్టుగా మారుతుంది. చెట్టు  కర్రగా మారుతుంది. కర్రకు నిప్పంటుకుని బూడిద అవుతుంది బూడిద మట్టిగా పరిణమిస్తుంది ప్రకృతిసాంతం ఇంతే! ఇది ప్రకృతి ధర్మం! ఈ ప్రకృతి ధర్మాన్ని అనుసరించే ఆత్మపరిణామం అది నశించదు.

    జీవితానికి మృత్యువు మార్పుమాత్రమే. అంతంకాదు. భౌతికంగా ఆలోచించినా మనిషి చచ్చినంత అతని ఆస్తి చచ్చుటలేదు. మరణించిన వాని మరణ శాసనమును అమలుపరచవలసి ఉన్నది. అతని సంతానము వారసులు అతని అభీష్టములను తీర్చవలసి ఉన్నది! శాసనమున మరణించిన వానికే హక్కులు ఎక్కువ!!

    "పితావైపుత్రనామాసీత్ " కొడుకు తండ్రి రూపముననే పుట్టుచున్నాడు తల్లిదండ్రులనుంచి వారి సంతానము వట్టి జీవితమునే అందుకొనదు. వారి రూపము, గుణగణములు, బుద్ధి, ఆరోగ్యము, అనారోగ్యము అన్నింటి అందుకొనుచున్నారు. ఇవన్నియు ఏడుతరములనుంచి సంక్రమించునని శాస్త్రము అన్నింటివలెనే ఆస్తియు సంతానమునాకు చెందుచున్నది.

    పితా అనగా తండ్రిమాత్రమేకాదు. తల్లిదండ్రులని అర్థము. తల్లిదండ్రులు విగత జీవులైనపుడు సంతానము వారి విషయమున కృతజ్ఞత ప్రేమాభిమానములు ప్రదర్శించవలసి ఉన్నది. అందుకు సంబంధించినవే శ్రాద్థాది కర్మలు.

    విగతాత్మను గురించి సంతానపు ప్రార్థన ఈ సూక్తమున చెప్ప బడినది. ఇది అందముగ, సుందరముగ, రమ్యముగ, రమణీయముగ ఉన్నది.

    విగతాత్మకు సుఖములు ప్రసాదించుమని సంతానము చేయు ప్రార్థన ! ఇందు పితరుల విషయమున సంతానపు శ్రద్ధ చూచినపుడు నాకు కనులు చెమ్మగిలినవి.

    ఋషులు, మహాత్ములు, విద్వాంసులు, కవులు ఎంత ఉదాత్తముగ ఆలోచించినారు! ఎంత గంభిరముగ చెప్పినారు !! ఎంతటి ఆత్మీయత కనబరచినారు. ఇది సనాతన భారతీయ ఆలోచనమునకు తప్ప సాధ్యపడదు

    ప్రేహిప్రేహి పధిభిః పూర్వోభిర్యత్రానః పూర్వేపితరః పరేయుః |
    ఉభారాజానస్వధియా మదన్తాయమం పశ్యసి వరుణంచ దేవమ్ ||

    మరొకసారి ఈ సూక్తము చూడండి.

                                పదిహేనవ సూక్తము
        ఋషి - యమపుత్ర శంఖుడు. దేవత - అగ్ని - పితరులు.
                        ఛందస్సు - త్రిష్టుప్ - 11 జగతి


    1. పితరులు ఉత్తమ, మధ్యమ, అధమములను మూడు శ్రేణులవారు. వారు మమ్ము  అనుగ్రహించ వలెను. మేము సమర్పించిన హోమ ద్రవ్యములను అందుకొనవలెను. ఈ యజ్ఞమునాకు అహింసకులు, మా కర్మానుష్ఠానములకు సంతసించినవారు, మా ప్రాణములు రక్షించదలచిన పితరులు విచ్చేసినారు. వారు మమ్ము రక్షించవలెను.

    2.పితరులు పూర్వము గతించిన వారున్నారు. తదుపరి గతించిన వారున్నారు. భూలోకమునకు దిగివచ్చిన వారున్నారు. భాగ్యశాలురమధ్య మసలు వారున్నారు. నేడు వారందరకు నమస్కరించు చున్నాను.

    3. నాకు పితరులు ఎంతో పరిచితులు. నాకు వారు లభించినారు. ఈ యజ్ఞసము పార్జన ఉపాయము సహితము లభించినది. పితరులు కుశలమీద కూర్చున్నారు. సోమరసము సేవించుచున్నారు. వారందరు విచ్చేసినవారే!

    4. కుశలమీద  కూర్చున్న పితరులారా! విచ్చేయండి. మీకు సకల ద్రవ్యములు సమర్పించినాము. స్వీకరించండి. అనుభవించండి. మాకు ఆశ్రయమొసంగండి. మమ్ము రక్షించండి. మాకు శుభములు సమకూర్చండి. అశుభములను, పాపములను దూరము చేయండి.

    5. కుశలపై మనోహరద్రవ్యములు ఉంచినాము. వీనిని అనుభవించుటకును సోమమును సేవించుటకును పితరులను ఆహ్వానించినాము. వారు విచ్చేయవలెను. మా స్తుతులను గ్రహించవలెను. ఆనందించవలెను మమ్ము రక్షించవలెను.


Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More