Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2


    4. యముడు అనుచున్నాడు :-
       
    నేను ఇట్టి కార్యము ఎన్నడును చేయలేదు. నేను సత్యవక్తను. అబద్ధములాడలేదు అంతరిక్షమున ఉన్న  గంధర్వ జలధర్త ఆదిత్యుడు మనకు తండ్రి. అంతరిక్షముననే ఉండు సూర్యపత్నిమనకు సహోదర బంధువులము. కావున సంపర్కము ఉచితముకాదు.

    5. యమి అనుచున్నది :-

    రూపకర్త, శుభాశుభప్రేరకుడు, సర్వాత్మ, దివ్యుడు జనకుడగు ప్రజాపతి మనసు ఈ దశలోనే దంపతులను చేసినాడు. ప్రజాపతి కార్యమున లోపములు ఉండవు. మన ఈ సంబంధము ద్యావా పృథ్వులకు కూడ తెలియును.

    6. తొలినాటి సంగతి ఎవడు ఎరుగును? ఎవడు చూచినాడు? ఎవడు వెల్లడించినాడు? మిత్రావరుణుల మహాధామమగు రాత్రింబవళ్లను గురించి నీ అభిప్రాయమేమి?

    7. భార్య భర్తలు ఏక శయ్యాగతులై రమింతురు. అట్లే యమా! నీముందు నాదేహము వెల్లడింతును నీవు నన్ను వలచుము. రమ్ము ! ఒకే చోట ఇద్దరము శయనింతము. రథ చక్రములవలె ఏక కార్యరతుల మగుదుము.

    8. యముడు అనుచున్నాడు :-

    దేవతలకు  చారులున్నారు. వారు రాత్రింబవళ్లు తిరుగుచుందురు. వారి కంటి రెప్పవాలదు. దుఃఖదాయినీ యమీ! త్వరగా మరొకని వద్దకు వెళ్లుము. అతనితో రథ చక్రముల వంటి ఏకకార్యము చేయుము.

    9. రాత్రింబవళ్లలో యమునకు భాగమున్నది ఆ భాగమును యజమానులు అందించవలెను సూర్యుని తేజము యముని కొరకు ఉదయించ వలెను. పరస్పర సంబంధముగల ద్యావాపృథ్విలు యమునికి బంధువులు. యమీ యములు సహోదరులు కావున ఇతరులను వరించవలెను - "యమీర్యమస్య బిభృయాదజామి."

    10. రానున్న కాలమున భగినులు బంధుత్వహీన భ్రాతలను భర్తలుగా పరిగ్రహింతురు. ఇది ఆకాలముకాదు. సుందరీ! నన్ను విడువుము. మరొకరిని పతిగా పరిగ్రహించుము. అతడు నీయందు వీర్యము విడిచిన బాహువులచే ఆలింగనము చేసికొనుము.

    11. యమి అనుచున్నది:-

    సోదరుడు ఉండగా సోదరిని అనాధను చేయు సోదరుడేమి సోదరుడు! సోదరి దుఃఖమును దూరము చేయనివాడు సోదరుడెట్లు? నేను కామమూర్చితనై పలు పలుకులు పలుకుచున్నాను. ఇది తెలిపి నన్ను కౌగిలించు కొనుము -"మేతన్వం సంపిపృగ్ధి"

    12. యముడు అనుచున్నాడు:-

    యమీ! నేను నీ దేహముతో నా దేహమును సంగమింప నిచ్చగించను. సోదరితో సంభోగించిన సోదరుని జనులు పాపిగా చీత్కరింతురు. సుందరీ! నన్ను విడువుము. ఇతర పురుషునితో ఆమోద, ఆహ్లాదముల అనుభవింపుము. నీ సోదరుడు నీతో మైధునము ఇచ్చగించడు - "నతేభ్రాతా సుభగేవష్ఠ్యేతత్"

    13. యమి అనుచున్నది :-

    యమా! నీవు బలహీనుడవు. మీ మనసు, హృదయము నాకు ఏమాత్రము అర్ధము కాకున్నవి. పగ్గము గుఱ్ఱమును కట్టినట్లు, తీవ చెట్టును అల్లుకున్నట్లు అన్యస్త్రీ, నిన్ను స్వేచ్ఛగా ఆలింగనము చేసికొనును. కాని నీకు నన్ను ఇష్టపడవు!

    14. యముడు అనుచున్నాడు :-

    యమీ! నీవు సహితము అన్యపురుషుని సుఖముగా ఆలింగనము చేసికొనుము. తీవ చెట్టును చుట్టుకున్నట్లు అన్యపురుషుడు నిన్ను ఆలింగనము చేసికొనుగాత. అతని మనసును నీవు దొంగిలింపుము. నీమనసును అతడు దొంగిలించును - "తస్యవాత్వంమన ఇచ్ఛాసవాతవ". నీవు అతని సాహచర్యము చేయుము.

    ఆలోచనామృతము:-

    ఇది వేదము. మానవ జీవితామృతము. వేదమే నరపశువును మానవునిగా మార్చినది. అతనికి బంధములు, అను బంధములు, సంబంధములు నేర్పినది. మానాయనగారు వేదములోనిదని ఒక శ్లోకమును తరచుగా ఉదాహరించుచుండేడివారు.

    "దంతాన్ ధావయేత్ ప్రాతః పలాశవట పిప్పలైః " ఉదయమే దంత ధానము చేయవలెను. అందుకు మోదుగు, మర్ర్రి, రావిని వాడవలెను అని దాని అర్థము.

    వేదమే మానవునకు సకలము నేర్పినది అనిదీని భావము. ఇది వాస్తవమని యే అభిప్రాయము. వేదమును సంహితము చేయునపుడు స్ధిరపడిన ఆచార సంబంధ మంత్రములను తొలగించి యుండవచ్చును.

    2. మానవ జీవితమునకు సంఘము తప్పనిసరి ఈ విషయమును గుర్తించియే బుద్ధభగవానుడు 'సంఘం శరణం గచ్ఛామి' అన్నాడు.

    సంఘము లేక సమాజము మానవ సంబంధములమీద నిలిచి ఉన్నది. ఈ సంబంధములందు లైంగిక సంబంధము ప్రధాన పాత్రవహించును. ఈ సంబంధము వలననే సంతానము, కుటంబము రక్తసంబంధములు ఏర్పడుచున్నవి.

    సమాజపు సౌధమునకు కుటుంబము పునాది వంటిది. కుటుంబము ఎంత పట్టిష్ఠమైన సమాజము అంత బలవత్తరమగును.

    కుటుంబమునకు మూలము స్త్రీ, పురుషుల లైంగిక సంబంధము. ఇదియే ప్రేమలు, అభిమానములుఅనుబంధములకు కారణమగుచున్నది. మానవ జీవితము ఈ అనుబంధాలతోనే మధురమై ఉండును.

    3. నేటిమన మానవ సంబంధములు అనాదిగా జరుతున్న నిరంతరం సాంఘిక అధ్యయన, ఆచరణ ఫలితములు. ఇంతటి మహత్తమమగు మానవ చరిత్రయందు మానవ లైంగిక సంబంధములు నియంత్రించుటలో మేధావులు చాలవరకు కృతకృత్యులైనారని నా అభిప్రాయము ఎంతటి రాక్షసుడయినను తల్లిని, చెల్లెను, అక్కను ఆశించడు. ఇది రాజకీయ బలప్రయోగమక్కరాలేని స్వచ్ఛంద చెలియకట్ట!

    మానవపరిశ్రమ ఈ చెలియలికట్టను. ఆర్ధిక, రాజకీయ రంగములందు నిర్మించలేక పోయినది! అది సాధ్యమైన మానవజాతి ఒక నిర్మల మానవతా సామ్రాజ్యము నిర్మించు కొనగలదు. ఇప్పటికి అది మృగ తృష్ణయే !!!

    4. స్త్రీ, పురుష లైంగిక సంబంధము సంతానమునకు కారణమగు చున్నది. సంతానమే సమాజపు కొనసాగింపు. శారీరక, మానసిక ఆరోగ్య సంతానమే ఆరోగ్య సమాజమునకు  ఆధారము.

    అందువలననే స్త్రీ, పురుష సంబంధములను కఠినముగా నియంత్రించవలసి ఉన్నది. ఒకే రక్తమున కలిగిన సంతానమునకు బుద్ధికుశలత లోపించును అను విషయము నిర్దిష్ఠమైనప్పుడు ఏక గర్భజాతుల లైంగిక సంబంధము నిషేధించబడినది. ఈ యమీ, యమా వృత్తాంతము ఆనాటిది.

    5. యమ అనగా కవలలు. ఆదిత్యుడు, ఆదిత్య పత్ని సరణ్యుకు కలిగిన కవలలు యమి, యముడు. వీరి సంవాదము ప్రణయభరితము. మంచి వలపుకథ!

    సముద్రము దానిమధ్య ద్వీపము అది నిర్జన ప్రదేశము అక్కడ యమి, "కామమూత"- కామమూర్చిత.

    "కామార్తాహిప్రకృతి కృపణాశ్చేతనా చేతనేషు" అన్నాడు కాళిదాసుమేఘ సందేశకావ్యమున. కామార్తులకు చేతనా చేతన జ్ఞానము ఉండదని భావము.

    కామార్తురాలయిన యమి తనసోదరుని సంపర్కము కోరినది వారి సంవాదము రమ్యము, రమణీయము నీతిదాయకము.

    ఉభయుల వాదములందు బలము కనిపించును. కాని స్వేచ్ఛాకామమునకు కట్ట కట్టవలసి ఉన్నది. ఒక్క ధర్మమును స్థాపించ వలసి ఉన్నది. అది మానవ కళ్యాణ కారి కావలసిన ఉన్నది.

    ఈ సంవాదమున నిగ్రహము కనపరిచిన వాడు యముడు. అతడు ధర్మమును నిర్వచించినాడు. ఒకచోట చిరుకోపము కనబరచినాడు. మనసులు కలియుట అను ఒక మంచి న్యాయము ఏర్పరచినాడు "తస్యావాత్వం వచ ఇచ్ఛాసవాతవ" అన్నాడు.

    అసలు యమి కోరిన సంబంధము ఎటువంటిది? "రథ్యేవచక్రే" రథచక్రములకు వంటిది రథచక్రములు పరస్పరము కలిసి కొనవు!! గమ్యము చేరుటకు ఉపకరించును !! అయినను ఆమె కామ మూర్చితయే!

    అన్నగా యముడు, యమికి మాత్రమే కాదు సకల మానవాళికి మహత్తమ సందేశము అందించినాడు అందుకే అతనిని ఆశీర్వదించినారు:-

    రాత్రీ భిరస్మాఅహ భిర్దశస్సేత్సూర్యసచక్షుర్ముహు రున్మిమీయాత్ 9 వ మంత్రము.   
       
                                  పదకొండవ సూక్తము
   ఋషి - హవిర్ధానుడు. దేవత - అగ్ని. ఛందస్సు - జగతి - 7, 8, 9 త్రిష్టుప్

    1. అగ్ని మహానుడు. అహింసనీయుడు అతడు కొరకు మహదాకాశమునుండి జలము వర్షించినాడు. ఆదిత్యుని బుద్ధి విశాలము. అతడు సమస్తలోకములను ఎరుగును. యజ్ఞీయ జ్ఞానులు యజ్ఞయోగ్య ఋతువులను యజించవలెను యజ్ఞియోయజతు యజ్ఞియాఁ ఋతూన్

    2. అగ్ని యొక్క గుణములు వివరించగల అప్పరసయు జలములచే సంస్కృతమైన ఆహుతి రూపిణి స్త్రీయు అగ్ని తృప్తి చెందించినారు. నేను ధ్యానమున ఉండి స్తుతింతును. అఖండనీయ అగ్ని మమ్ము యజ్ఞమధ్యమున కూర్చుండ పెట్టవలెను. సకల యజమానులందు పెద్దవాడు మా జ్యేష్ఠ భ్రాత స్తుతించును.

    3. ఉషభజనీయ. కీర్తివంత శబ్ధవంత ఆమె యజమాని కొరకని ఆదిత్యవతియై తొందరపడి వెలువడినది. అప్పుడే యజ్ఞముకొరకు అగ్నిని కలిగించినారు. యజ్ఞాభిలాషికి మాత్రమే అగ్ని ప్రన్నుడగును. అగ్ని దేవతల ఆహ్వాత.

    4. శ్యేనమును అగ్ని ప్రోత్సహించినది. మహాజనుడు, సూక్ష్మదర్శి, హెచ్చుతచ్చులు లేని సోమమును శ్యేనము తెచ్చినది. అగ్రగామి, దర్శనీయ, దేవతల ఆహ్వానకర్తను ఆర్యులు ప్రార్ధించినప్పుడు యజ్ఞక్రియ ఉత్పన్నమగును.

    5. అగ్నీ! పశువులకు గడ్డిరుచికరమగును. అట్లే మాకు నీవు సదా రమణీయుడవు. మానవుల హవనముచే నీవు యజ్ఞము కలిగించుము. స్తోతల స్తోత్రములు వినుచు. హవిరూప అన్నము అందుకొనుచు నీవు అనేక దేవతల వద్దకు వెళ్లుదువు.

    6. నక్షత్రములను మటుమాయము చేయు ఆదిత్యుడు తన తేజమును ద్యావాపృథ్వులందు వ్యాపించును అగ్నీ ! నీవును అట్లే మాతాపితృరూపులగు ద్యావాపృథ్వులను నీ జ్వాలలతో వెలిగించుము. యజ్ఞాభిలాషులగు దేవతల కొరకు యజ్ఞకర్తలు యజ్ఞము చేయసిద్ధముగా ఉన్నారు. వారు హృదయ వ్యగ్రలు. అగ్ని స్తుతులను వర్థిల్ల చేయదలచినాడు. ప్రధాన పురోహితుడగు బ్రహ్మ యజ్ఞము పూర్తి చేయుటకు ఉత్సుకుడై ఉన్నాడు. యజ్ఞమున లోపము జరిగినదేమోనని శంకించుచున్నాడు.

    7. అగ్నీ! నీవు బలపుత్రుడవు. అనుగ్రహశీలుడవు. యజమానులు నిన్ను హవిస్సులతోను, స్తోత్రములతోను సేవింతురు. అట్టియజమాని కీర్తివంతుడగును. అన్నదాత అగును. అశ్వవాహనుడగును. దీప్తశాలి, బలశాలి అగును. నిత్యము సుఖించును.

    8. యజనీయ అగ్నీ! మేము యజనీయ దేవతల కొరకు స్తుతిసమూహములు రచింతుము. అప్పుడు మాకు రమణీయ వస్తువులను ప్రసాదించుము. యజ్ఞద్రవ్యములను అందుకొను అగ్నీ! మాకుధనభాగము అందవలెను.

    9. అగ్నీ! సకల దేవతల యజ్ఞగృహమున నిలువుము. మా మాటలు వినుము. అమృతమయ రథమును సిద్ధము చేయుము. దేవతల మాతాపితరులు -  ద్యావాపృథ్వులను మా వద్దకు కొనిరమ్ము. నీవు ఇక్కడే ఉండుము. దేవతలను వదలి పోకుము.
   
                                పన్నెండవ సూక్తము
          ఋషి - హవిర్ధానుడు. దేవత - అగ్ని. ఛందస్సు - త్రిష్టుప్.

    1. ప్రధాన భూతులకు ద్యావాపృథ్వులు యజ్ఞములందు అందరికన్న మొదలు అగ్నిని ఆహ్వానించవలెను. అగ్నీ! యజ్ఞము చేయుటకు మానవులను ప్రోత్సహించుము. జ్వాలావంతుడవగుము. దేవతలను ఆహ్వానించుటకు ఆసీనుడవగుము.

    2. అగ్ని దివ్యుడు, దేవముఖ్యుడు, సర్వజ్ఞుడు, ధూమధ్వజుడు, ఉద్భిజ్జలనుడు, స్తుత్యుడు, ఆహ్వాత, నిత్యుడు, యజమానుల యజ్ఞకర్త. అగ్ని  ఇంద్రాది దేవతల వద్దకేగుచు యజ్ఞసహితమగు హవిని తీసికొని వెళ్లవలెను.

    3. అగ్ని స్వయముగా సృష్టించు జలమువలన ఉద్భిజ్జములు ఉత్పన్నమగును. అవి భూమిని రక్షించును. సకల దేవతలు నీ జలదానమును ప్రశంసింతురు. నీ తెల్లనిజ్వాలలు స్వర్గమునందలి జలమును వర్షింప చేయును.

    4. అగ్నీ! మా యజ్ఞరూప కర్మలను పెంపొందించుము. వర్షము కలిగించు ద్యావా పృథ్వులారా! నేను మిమ్ము సుత్తింతును. మా స్తుతులు వినండి. యజ్ఞములందు స్తోతలు మిమ్ము స్తుతింతురు. అప్పుడు జలవృష్టి కలిగించుడు. మా మలినములను దూరము చేయుడు.


Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More