Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2


    7. అగ్నీ! నీవు పుట్టగానే మహత్వము పొందినావు. స్థానము గ్రహించినావు ఆహుతి యోగ్యుడవైనావు నిన్ను చూడగనే దేవతలు నీ వద్దకు చేరినారు. ఉత్తమ ఋత్విక్కులను నీవు రక్షించినావు వారికి ప్రగతి కలిగించినావు.

                                      ఏడవ సూక్తము
                                    ఋష్యాద్యాః పూర్వవత్

    1.దివ్యాగ్నీ! ద్యావాపృథ్వులందలి సకల విన్నపములను. శుభములను మా కొరకు అందుకొని రమ్ము. దర్శనీయ అగ్నీ! మేము యాజ్ఞకులము కావలెను. అనేక ప్రశంసనీయ రక్షణలతో మమ్ము కాపాడుము.

    2. అగ్నీ! నీ కొరకు స్తుతులు ఉచ్చరించినాము. నీవు మాకు గోవుల, అశ్వముల ధనములు ఇచ్చినావు. కావున నిన్ను ప్రశంసించినాము. నీవు నీ  తేజమున సమస్తమును ఆచ్ఛాదింతువు. శుభకర్మల కొరకు పుట్టినవాడవు. మాకు ధనములిచ్చువాడవు. మానవుడు నీవు ఇచ్చిన భోగ్యధనమును అందుకొనును. నిన్ను స్తుతించును.

    3. నేను అగ్నినే తండ్రిగా, బంధువుగా, భ్రాతగా, చిరకాల మిత్రునిగా భావింతును. నేను మహాగ్నిముఖమును - ద్యులోకమునందున్న పూజనీయ, ప్రదీప్త - సూర్యమండలమును వలె పూజింతును.

    4. అగ్నీ! మేము నిన్ను స్తుతించిన స్తుతులు కృతార్ధములైనవి. నిత్యహోత, దేవతల ఆహ్వాత, మాగృహములందు వసించు నీవు నన్ను రక్షింతువు. నీ సాన్నిధ్యము పొంది నేను యాజ్ఞికుడను కావలెను. నాకు లోహితవర్ణ అశ్వములు, మరింత అన్నము అందవలెను. నాకు లోహితవర్ణ అశ్వములు, మరింత అన్నము అందవలెను. నాకు లోహితవర్ణ అశ్వములు, మరింత అన్నము అందవలెను. అందువలన ప్రదీప్త దినములందు నీకు హోమద్రవ్యములు సమర్పించగలను.

    5. అగ్ని దీప్తయుక్త మిత్రసముడు. యజనీయుడు ప్రాచీన ఋత్విక్కు. యాజ్ఞసమాపకుడు అట్టి అగ్నిని యజమానులు తమ బాహువులచే వెలిగించినారు. మానవులు యజ్ఞము, దేవతల ఆహ్వానమునకు అగ్నిని నిరూపించినారు.

    6. దివ్యాగ్నీ ! ద్యులోకమందలి దేవతలను నీవు స్వయముగా యజింపుము. మానవులు అపరిపక్వులు. అజ్ఞానులు వారు నీవు లేక ఏమి చేయగలరు? నీవు అప్పుడప్పుడు దేవతలను యజింతువు. అట్లే నిన్ను యజించు కొనుము.

    (అగ్నిని యజించలేని మానవుని అశక్తత చెప్పినాడు.)

    7. అగ్నీ! మమ్ము దుష్ట, అదుష్ట భయములనుండి రక్షింపుము. మాకు అన్న కర్తవగుము. దాతవగుము. సుందర పూజనీయ అగ్నీ! మాకు హవన సామగ్రి అందించుము. మా దేహమును పాలింపుము. "తన్వో ప్రయుచ్ఛన్."
   
                                ఎనిమిదవ సూక్తము
          ఋషి - త్వష్టపుత్ర త్రిశిరుడు. దేవత - అగ్ని - ఇంద్రుడు.
                                ఛందస్సు - త్రిష్టుప్.


    1. ఇప్పుడు అగ్ని మహాపతాకము అందుకొని ద్యావాపృథ్వికి సాగుచున్నాడు. దేవతలను పిలుచునపుడు అగ్ని వృషభధ్వని చేయును. ద్యులోకపు దగ్గరలో ఉండి అగ్ని పరివ్యాప్తుడగును. జలనిధియగు అంతరిక్షమున అగ్ని విద్యుత్ రూపమున వర్ధిల్లును.

    2. ద్యావాపృథ్వులమధ్య కామవర్షక, ఉన్నత తేజోవంతుడగు అగ్ని ప్రసన్నుడగు చున్నాడు. రాత్రి మరియు ఉషః కాలపు బిడ్డ, యజ్ఞక కర్మవంత అగ్ని నినదించును. అగ్ని యజ్ఞమున ఉత్సాహ కర్మలు చేయును. ఆహ్వనీయాది స్థలములందు నిలుచును. దేవతలందు ముఖ్యుడు అగును.

    3. ద్యావాపృథ్వులు అగ్నికి మాతాపితృరూపులు అగ్ని తన తల్లిదండ్రుల తలమీద తన వెలుగులు పరచును అగ్ని సుబలుడు అతని తేజముగతి పరాయణము. దానిని యాజ్ఞికులు యాజ్ఞములందు ధరింతురు. అగ్ని ఆరును. అప్పుడు శోభాయమాన యజ్ఞస్థానమున  వ్యాపించినది, హవ్యాది యుక్తమగు అగ్ని యొక్క దేహమును కవులు ప్రశంసింతురు.

    4. అగ్నీ! నీవు  ప్రశంసనీయుడువు. ఉషః కాలమునకు ముందే అవతరించువాడవు. పరస్పరము కలిగిన రాత్రింబవళ్లను వెలిగింతువు. నీ దేహమునుండి ఆదిత్యుని సృజించినావు జన్యన్మిత్రంతన్వే స్వాయై. యజ్ఞపు ఏడు స్థానములందు వసించినావు.

    5. అగ్నీ! నీవు యాజ్ఞికుడవు చక్షువు వలె ప్రకాశించు వాడవు - భవన చక్షువవు. యజ్ఞరక్షకుడవు. యజ్ఞము కొరకు నీవు జలములకు పౌత్రుడవు. నీవు హవిగ్రహించిన యజమానికి దూతవు అగుచున్నావు.

    (జలమునుండి మేఘము కలుగును. అందువలన మేఘము జలములకు పుత్రుడు. మేఘమునుండివిద్యుదగ్ని ఉద్భవించును. కావున అగ్ని జలముల పౌత్రుడు. నీటి వలన చెట్టు, చెట్టునందు నిప్పు పుట్టును. అందువలన నిప్పు నీటికి మునుమడు.)

    6. అగ్నీ! నీవు అంతరిక్షమునందలి కళ్యాణకర అశ్వముగల వాయువులతో కలసిపోదువు. అప్పుడు నీవు యజ్ఞములకు, జలములకు నేతవగుదువు. ద్యులోకమందు ప్రధానుడు, సర్వ సేవితుడగు సూర్యుని నీలో ధరింతువు. అగ్నీ! నీ నాలుకను హవ్యవాహికను చేతువు - "జిహ్వామగ్నీ చకృషే హవ్యవాహమ్"

    7. త్రితర్ణి యజ్ఞముచేసి ప్రార్ధించినాడు కదా :- యజ్ఞమున తండ్రిని ధ్యానించి అనేక విపత్తులనుండి రక్షణ పోందవలెను. అట్లు ప్రార్ధించిన త్రితుడు తల్లిదండ్రులకు మంచిమాటలు చెప్పినాడు. యుద్ధపు ఆయుధములు అందుకోని సాగినాడు.

    8. ఆప్త పుత్ర త్రితుడు ఇంద్రుని వలన  ప్రోత్సాహితుడైనాడు. తండ్రి యుద్దాస్త్రములు అందుకున్నాడు. యుద్ధము చేసినాడు ఏడుపగ్గముల "త్రిశిరు"ని అతడు వధించినాడు త్వష్టపుత్రుని గోవులను అపహరించినాడు.

     (ఏడు పగ్గములవాడు అనగా "సప్తరశ్మిక" అని మంత్రము. సప్తరశ్మిరాదిత్యః సప్తకిరణములవాడు ఆదిత్యుడు. "రశ్మి' కిరణమగును. పగ్గమగును. త్రిశిరుడు ఏడు పగ్గములకు లొంగని వాడనియు సూర్యునివంటి కాంతిమంతుడనియు భావము.)

    9. ఇంద్రుడు సాధువులకు ప్రభువు. అతడు స్వాభిమాని. స్వతేజోవిరాజితుడగు త్వష్టపుత్రుని వధించినాడు. ఇంద్రుడు గోవులను కేకవేయుచు, త్వష్టపుత్రుడు విశ్వరూపుని మూడు తలలను త్రుంచినాడు.

    (త్రితుడు ఇంద్రుని అంతటివాడని చెప్పుట ఈ మంత్ర ద్రష్ట, త్రితుడే !)
   
                                    తొమ్మిదవ సూక్తము
    ఋషి - అంబరీష రాజర్ణి పుత్రుడు సింధుద్వీపుడు. త్వష్టపుత్రుడు త్రిశిరుడు కూడ కావచ్చును. దేవత -  ఆపః జలము. ఛందస్సు - 1,2 అనుష్టుప్, మిగిలినవి గాయత్రి

        అపోహిష్ఠామ యోభువస్తాన ఉర్జే దధావత|
        మహేరణాయ చక్షసే ||

    1. జలమా! నీవే  సుఖములకు ఆధారమవు. అన్నసంచయము చేయుము. మాకు సమ్యక్ జ్ఞానము ప్రసాదించుము.

    2. జలమా! తల్లులు పిల్లలకు పాలిచ్చినట్లు - నీవు నీ యొక్క సుఖప్రద రసమును మాకు ప్రసాదించుము.

    3. జలమా! ఏ పాపమును నాశము చేయుటకు నీవు మమ్ము ప్రసన్నులను చేయుదువో ఆపాపమునశించవలెనను కోరికగల వారలమై నిన్ను తలకు ఎత్తు కొందుము. జలమా! మా వంశమును వర్ధిల్ల చేయుము.

    4. దివ్యజలము మా యజ్ఞములకు సుఖవిధానము కలిగించవలెను. జలములు పాన ఉపయోగ్యములు కావలెను. అని పుట్టిన రోగములను శాంతింప చేయవలెను. పుట్టనున్న వానిని తొలగించవలెను. మా శిరసుల మీద ద్రవించుము. అభిస్రవన్తువః.

    5. కోరిన వస్తువులన్నింటికి స్వామి జలమగును. అతడే మానవులకు ఆవాసము కల్పించును. మేము జలములను వైద్యము ప్రసాదించుమని ప్రార్దించుచున్నాము "ఆపోయాచామి భేషజమ్"

    6. సొమము అనుచున్నాడు:-

    జలములందే ఇహ సౌఖ్యములు ఉన్నవి. ఔషధములు ఉన్నవి అగ్ని ఉన్నది.

    7. జలమా! మా దేహములను రక్షించు ఔషధులకు పుష్టినిమ్ము. అందువలన మేము చిరకాలము సూర్యుని చూడగలము.

    8. జలమా! నేను దుష్కృత్యములు చేసి ఉండవచ్చును. హింసాకార్యములకు తలపడి ఉండవచ్చును. అభిసంపాతము చేసి ఉండ వచ్చును అసత్యము పలికి ఉండవచ్చును. వాటిని అన్నింటిని దూరము చేయుము.

    9. నేను నేడు జలములందు వసించినాను. జలరసమును పానము చేసినాను. అగ్నీ! నీవు జలయుక్తుడవై విచ్చేయుము. నన్ను తేజస్విని చేయుము. 'సృజవర్చసా.'

    ఆలోచనామృతము:-

    భారతజాతికి ప్రాచీనసంస్కృతి, మహోన్నత నాగరకత, విలక్షణ సంప్రదాయము కాలమునకు అందని చరిత, అపార సాహిత్యము, అనంత కళలు ఉన్నవి. అందుకు భార జాతిహిమదున్నతమై గర్వించవచ్చును.

    నేడు తాము అత్యంత నాగరకులమని జబ్బలు చరుచుకొను జాతులకు ఒక్క అజంతా, ఒక్క ఎలోరా, ఒక్కబేలూరు, ఒక్కరామాయణము ఒక్క సంగీత శాస్త్రము, ఒక్క ధన్వంతరిలేడు. వారికి ఉన్నవి కాసులు. అవి ధనమదమునాకు చిహ్నములేగాని మనిషి మనసుకు, సంస్కృతికి చిహ్నములుకావు.

    భారత దేశమును పాలించిన పరదేశీయులలో భారత సంప్రదాయ సంస్కృతులకు ఎనలేని ద్రోహము చేసిన వారు ఆంగ్లప్రభువులు -  ఆంగ్లప్రజలుకారు. కొంతమంది తెల్లవారు మన సంప్రదాయ సంస్కృతులకు ముగ్ధులైనారు భారత జీవన స్రవంతిలో భాగములైనారు.

    ఆంగ్లప్రభువుల పరిపాలనా విధానము తేనెపూసిన కత్తివంటిది. తేనెరుచి చూపి తలనరుకుట వారి పాలనా సంస్కృతి ! తాము పాలించు దేశపు సంస్కృతీ సంప్రదాయములను అడుగంటించి తమనాగరకతయే ఉత్తమమైనదని పాలకులతో వప్పించుటకు ప్రయత్నించుట వారి కుటిల రాజనీతి !! ఆ నీతినే భారతీయులమీద ప్రయోగించినారు!!!

    తమసంస్కృతిని నీచముగా భావించి పాలకుల సంస్కృతిని అందలమెక్కించుట బానిస జాతిలక్షణము. భారతజాతి బానిసజాతి వలెనే ప్రవర్తించినది. స్వాతంత్ర్యము సాధించిన తరువాత ఆంగ్లబానిసత్వమును స్వచ్ఛందముగ తలకెత్తుకున్నది! ఆంగ్లములేక మనకు దిక్కు లేదన్నట్లు ప్రవర్తించుచున్నాము. ఆంగ్లేయులు మానను 'మీరు చరిత్ర  హీనులు' అన్నారు 'అవును మేము చరిత్రహీనులమే' అని  మనము అంగీకరించినాము. అనంత చరిత్రగల భారతజాతిని చరిత్రహీనులగుఆంగ్లేయులు 'మీకు నీటినిగురించి తెలియదు. నీటి వాడకము తెలియదు' అన్నారు 'అవును మహాప్రభూ తెలియదు. మీరు అదేశించండి ఆచరింతుము.' అన్నామేకాని.

    కాలపు సుదీర్ఘహస్తములకు అని వేదములందే నీటిని గురించి వివరించబడి ఉన్నది అని మనము అనలేదు జీవనమునకు నీరే ఆధారము అన్న ఋగ్వేదము 'ఆపత్సు సర్వేభేషజీః' అన్నది. నీటిలోనే సర్వవైద్యములున్నవి అన్నది. మన ఆరోగ్యము నీటివాడకము మీద ఆధారపడి ఉన్నదన్న పాశ్చాత్య వైద్యవిధానము దీనిని కొత్తగా కనుగొన్నదా? ఇది  మనమాటలే మనకు చెప్పి మనను వంచించుట కాదా! మనము వంచకులకు స్వచ్ఛందముగా బానిసలము అయినామనుట నిత్యసత్యముకాదా!

    ఈ సూక్తము జలమునకు అంకితమైనది జలము విషయమున వివరముగా విలక్షణముగా చెప్పినాడు ఒకరకమగు జలచికిత్సను తొమ్మిదవ మంత్రమున వివరించినాడు.

    అప్సుమేసోమో అబ్రవీదన్తర్విశ్వాని, భేషజా!
    అగ్నించ విశ్వశమ్భవమ్.
    ఇది ఆరవ మంత్రము

                                  పదవ సూక్తము
            ఋషి - వివస్వతపుత్ర యమి, యముడు. దేవత  -
                 యముడు - యమి. చంధస్సు - త్రిష్టుప్


    1. యమి, యమునితో అనుచున్నది:-

    ఇది విశాల సముద్రము. సముద్రమధ్యమున ద్వీపము. ఈ ద్వీపము నిర్జనము. ఇచటనీ కొరకు వేచియున్నాను. ఏలననగా నీవు గర్భావస్థనుండియే సహచరుడవు - నీవలన నా గర్భమున కలుగు పుత్రుడు శ్రేష్ఠుడగునని విధాత తలచినాడు.

    2. యముడు యమితో అనుచున్నాడు :-

    యమీ! యముడు నీ సహచరుడు అగును. కానినీవు కోరినవంటి సంపర్కము చేయజాలడు. ఏలనన నీవు నాసహోదరివి. భగినివి అగంతవ్యవు. అదికాక నీవన్నట్లు ఇది నిర్జర ప్రదేశముకాదు. ప్రజాపతి పుత్రులగు దేవతలందరు చూచు చున్నారు.

    3. యమి అనుచున్నది :-

    మానవులకు అట్టి సంపర్కము నిషేధమైయున్నది. అయినను దేవతలు ఇష్టపూర్వకముగా అట్టి సంపర్కము చేయుదురు. అందువలననే నాకు అట్టి కోరిక కలిగినది. నీవు సహితము అట్లే చేయుము. పుత్రుని ప్రసాదించు తండ్రివలె నా దేహమున వసించుము. నాతో సంభోగింపుము.    


Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More