Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2


    47. పూర్వకాలీనము మరియు అన్నరూప ధారలచే రాలుచు, అన్నింటి అందించు పృథ్విరూపమును ఆచ్ఛాదించుచు, శీత, ఆతప, వర్షనివారకమగు యజ్ఞగృహమును నిర్మించుచు, జలములందు నివసించుచు, స్తోత్రస్వరముల స్తోతలవలె ధ్వనించుచు సొమము యజ్ఞములకు పయనించును.

    48. దేవా! నీవు అభిలషణీయుడవు రథవంతుడవు. మా యజ్ఞమునందు అభిషవ ఫలకముల మీద క్షరితుడవగుము. వసతీవరీ జలమున త్వరగా, నలువైపుల క్షరితవగుము. స్వాదిష్ట మధుర, యాజ్ఞిక, సర్వప్రేరక సోమమా! నీవు దేవతలవంటి సత్య స్తుతిమంతుడవు - "సవితా సత్యమన్మా"

    49. స్తుతుడవగుచు వాయువు పానము కొరకు వెళ్లుము. శోధితుడవగుచు మిత్రవరుణుల పానముకొరకు వెళ్లుము. సర్వులనేతలు, వేగశాలురు, రథవాహనులు అశ్విద్వయపు పానము కొరకు వెళ్లుము. కామవర్షకుడు, వజ్రబాహువగు ఇంద్రుని పానము కొరకు వెళ్లుము.

    50. స్తుత్యసోమమా! మాకు  మంచిమంచి బట్టలు తెచ్చి ఇమ్ము. మధుర దుగ్థములిచ్చు నవప్రసూత గోవులను ఇమ్ము, మమ్ము పోషించుటకు ఆహ్లాదకరమగు సువర్ణము నిమ్ము రథములాగు అశ్వములను సహితము ఇమ్ము.

    51. సోమమా! పవిత్రమున శోధితుడవగుము. మాకు ద్యులోకపు సంపద  లిమ్ము. భూలోకపు సంపద లిమ్ము. సంపద సాధించు శక్తినిమ్ము. నీవు ఋషిమంత్రములను, జమదగ్ని మంత్రములను స్వాదుతరము చేసినావు. అట్లే మా  మంత్రములను చేయుము.

    52. సోమమా! నీ యొక్క శోధితధారలచే మాకు సకల ధనములు కలిగించుము. నిన్ను భజించు యజమానుల వసతీనరీ జలమునకు వెడలుము. అందరి జ్ఞాపకుడు, వాయు వేగవంతుడగు సూర్యుడు, బహుయజ్ఞముల ఇంద్రుడు సోమము వద్దకు  వెళ్లుదురు. సోమమా! నాకు  కర్మనిష్ఠుడగు పుత్రుని ఇమ్ము. నీవు తృప్తిపరచిన ఇంద్ర సూర్యులు కూడ నాకు పుత్రుని ప్రసాదించవలెను.

    53. సోమమా! అందరు నిన్ను ఆశ్రయించువారే! మా యజ్ఞమున తగురీతి క్షరితమగుము. ఫలములు కోరువాడు చెట్టును ఊపినట్లు శత్రుఘాతక సోమము శత్రువులను జయించుటకుగాను. మాకు అరువది వేల ధనములు ఇచ్చినాడు.

    54. బాణములు కురిపించుట, పగవారి తలలు వంచుట సోమపురెండు సులభకార్యములు. అవి అశ్వ, ద్వంద్వ యుద్ధములందు శత్రుసంహారకములు అగును. ఈ ఉభయ కర్మలచే సోమము -  బీరములు పలుకు శత్రువును వధించినాడు.

    సోమమా! శత్రువును దూరము చేయుము యుద్ధము లేకున్నను శత్రువును దూరము చేయుము. అగ్ని హోత్రము ఆచరించని వారిని దూరము చేయుము.

    55. సోమమా! అగ్ని, వాయు, సూర్యనామముల మూడు పవిత్రముల నీకు లభించును. శోధితుడవై మేషలోమ పవిత్రమునకు చేరుదువు. నీవు భజనీయుడవు. దాతవ్య ధనదాతవు. సకల ధనికులకు ధనాధిపతివి.

    56. సర్వజ్ఞ, విప్ర, సకల భువనస్వామి సోమము క్షరితమగు చున్నాడు. యజ్ఞములకు రసరేణువులనంపుచున్నాడు. మేషలోమ పవిత్రమునకు ఇరుదిశలనుంచి చేరుచున్నాడు. 

    57. పూజ్యులు, అహింసితులగుదేవతలు సోమమును ఆస్వాదింతురు. సోమము ఆస్వాదించిన దేవతలు ధ్వనులు చేయుదురు.ధనాభిలాషులగు స్తోతలు మంత్రములు ఉచ్చరింతురు. అట్లే కర్మ కుశలురగు పురోహితులు తమ పది అంగుళులతో సోమమును ప్రేరేపింతురు సోమమును జలమున కలుపుదురు.

    58. నీవు పవిత్రమున సంశోధితుడవు. నీ సాయమున మేము యుద్ధములందు అనేక ఘన కార్యములు చేయవలెను. మిత్ర, వరుణ, అదితి, సింధు మ్ పృథ్వి, ద్యులోకము మాకు ధనములిచ్చి సమ్మానింప వలెను.
   
                               తొంబది ఎనిమిదివ సూక్తము
     ఋషి - వృషసిరి రాజపుత్రుడు అంబరీషుడు - భరద్వాజ పుత్రుడు ఋజాశ్వుడు.
          దేవత -  పవమాన సోమము. ఛందస్సు - అనుష్టుప్ - 11 బృహస్పతి.


    1. సోమమా! అందరుమెచ్చువాడు, అనేక పోషణలవాడు, యశోవంతుడు, మహామహులను జయించువాడు, మహాబల సంపన్నుడగు పుత్రుని మాకు ప్రసాదించుము.

    2. రథమునెక్కు యోధుడు కవచము ధరించుము. అట్లే బాధారహిత సోమము మేషలోమ పవిత్రమున క్షరితుడగును. స్తుతించబడు సోమము చెక్క కలశమునకు చేరును. ధారగా క్షరితమగును.

    3. బాధలు ఎరుగని సోమము తమమత్తు కొరకని దేవతలచే ప్రోత్సహించ బడును మేషలోమ పవిత్రమున క్షరితుడగును. దీప్తవంత సోమము అంతరిక్షమునకు వెళ్లును. అట్లే  అందరు  కోరుకొను సోమము దుగ్ధాదులను కోరుచు ధారారూపమున సాగును.

    4. సోమమా! నీవు అనేక మందినరులకు, అనేకమంది హవిర్దాతలగు యజమానులకు ధనములు కలుగ చేసెదవు. మాకు అనేక పుత్రపౌత్రయుక్త బహుసంఖ్యాక ధనములిమ్ము.

    5. శత్రుఘూతక సోమమా! మేము మీవారలము కావలెను. అనేకులు అభిలషించునదియు. నీవు ఇచ్చునదియు అగుధనములకు మేము సమీపవర్తులము కావలెను. మేము సుఖములకు అత్యంత సమీపవర్తులము కావలెను.

    6. సోమము శిలలచే అభిషుతము. ఇంద్రప్రియము. అందరు అభిలషించునది. ధారావంతము. యశస్వి అట్టి  సోమమును పనులు చేయుటకు కదలునట్టి, భగినీ స్వరూప అంగుళులు వసతీ వరి ద్వారా సేవించును. యజమానులు శోధింతురు.

    7. అందరు కోరునట్టి సోమరసమున సేవించండి. సోమపు రక్షణలు పొందండి సోమము -సూర్యునివలె అందరి అభిలషణీయుడు. అతడు స్తోతలకు ప్రచుర అన్నము అందించును.

    8. మీరు బలసాధకమగు సోమరసమును సేవించండి. సోమపు రక్షణలు పొందండి. సోమము - సూర్యునివలె - అందరి  అభిలషణీయుడు. అతడు స్తోతలకు ప్రచుర అన్నము అందించును.

    9. మనువునందు ద్యోతమాన ద్యావాపృథ్వులారా! పర్వతవాసి సోమము యజ్ఞమున మీ ఉభయులను సృష్టించినాడు. ఉచ్చస్వరముల యజ్ఞమున ఋత్విక్కులు సోమమును అభిషవించినారు.

    10. సోమమా! ఇంద్రుడు వృత్రఘ్నుడు. అతని పానము కొరకు నిన్ను పాత్రలందు నింపుదురు.  ఋత్విక్కులకు దక్షిణలు, దేవతలకు హవిస్సులు అర్పించగోరి యజ్ఞగృహమున ఉన్న యజమానికి ఫలప్రదానము చేయవలెనని నిన్ను పూజింతురు.

    11. నిత్యము ప్రాతఃకాలమున ప్రాచీన సోమము పవిత్రమున క్షరితమగును. మూర్ఖులగు హరిశ్చిత నామక దస్యులు ప్రాతఃకాల సోమమును చూచినారు. నీరైనారు మాయమైనారు.

    12. మిత్రులారా ! ప్రాజ్ఞులగుమీరు. మేము శోభితము బలకరము, సుగంధయుక్తమగు సోమమును సేవింతుము. మనము బలిష్ఠసోమమును ఆశ్రయింతము.
   
                                  తొంబది తొమ్మిదవ  సూక్తము
       ఋషి - కాశ్యగోత్ర సుతులు ఇద్దరు. దేవత - పవమాన సోమము.
                    ఛందస్సు - అనుష్టుప్ - మొదటిది బృహతి.


    1.సోమము అందరు కోరువాడు. శత్రువుల రాపెట్టువాడు. అతని కొరకు పౌరుషవంతులు ధనుస్సునకు నారి ఎక్కింతురు. పూజారులగు ఋత్విక్కులు దేవతలముందు - బలశాలియగు సోమము కొరకు - తెల్లని దశాపవిత్రము పరుస్తారు.

    2. రేయిగడచును సోమము జలకములాడును. అన్నమువైపు సాగును. యజమాని పనులు చేయు అంగుళులు హరితళులు హరితవర్ణ సోమమును పాత్రలకు పంపును. అప్పుడు సోమము సవనముకు పయనమగును.

    3. ఇంద్రుడు పానముచేయు సరమున్ననే - ఆ సోమమును మేము సుశోభితము చేయుదుము ! గమనశీల స్తోతలు పూర్వమును, ఇప్పుడును సోమరసపానము చేయుదురు.

    4. అట్టి శోధిత సోమపు ప్రాచీన గాధలను స్తోతలు స్తుతులచే గానము చేయుదురు. అటునిటు కదలు అంగుళులు దేవతలకు సోమరూప హవిని ఇవ్వగలవు.

    5.యజమానులు సోమమును జలమున తడుపుదురు. మేషలోమ పవిత్రమున శోభిల్ల చేయుదురు. దూతవంటి సోమమును దేవతలకు విన్నవించుమని ప్రార్ధింతురు.

    6. అత్యంత మాదక సోమము శోధితమగును. చమసములందు ఆసీనుడగును. ఆబోతు గోవులకు రేతస్సు అందించును. సోమము చమసములకు రసము అందించును. సోమము అభిషుతుడు అగువాడు. కర్మములకు స్వామి.

    7. సోమము దేవతల కొరకు అభిషుతము. ప్రకాశమానము, ఋత్విక్కులు సోమమును శోధింతురు. సోమమును ప్రజలు ధనదాతగా గుర్తించినారు. అప్పుడు సోమము జలమున స్నానము చేసినాడు. (తానమాడుచు జనులకు ధనమిచ్చునని.)

    8. సోమమా! అభిషుతమగుదువు. సర్వత్ర విస్తరింతువు. ఋత్విక్కులచే పవిత్రమునకు తేబడుదువు. నీవు అత్యంత మాదకుడవు. ఇంద్రుని చమసములందు చేరుదువు.

                                  నూరవ సూక్తము
           ఋషులు. దేవత పూర్వమువలె. ఛందస్సు అనుష్టుప్.

    1. గోవు ప్రథమ ఆయువున పుట్టిన గోవును నాకును. అట్లే ద్రోహము ఎరుగని జలము - ఇంద్రునకు ప్రియమై, అందరు కోరునట్టి - సోమమును చేరును.

    2. దీప్యసోమమా! శోధితుడవగుము రెండు లోకములందు వర్ధిల్లు ధనమును మాకు అందించును. నీవు యజమానిఇంట వసింతువు. అతని సకల ధనమును రక్షింతువు.

    3. సోమమా! మేఘము వర్షము కురిపించునట్లు మనోవేగముగల నీ ధారలను కురింపించుము. నీవు పార్థివ, ద్యులోక ధనములను ఇచ్చువాడవు.

    4. శత్రువును జయించు శూరుని అశ్వము యుద్ధమునకు పరుగులిడును. అట్లే సోమపు భజనీయ, వేగవంత ధారలు మేషలోమ పవిత్రము మీదికి పరుగులిడును.

    5. క్రాంత దర్శిసోమమా! నీవు ఇంద్ర, మిత్ర, వరుణుల కొరకు అభిషుతడవగుదువు. మాకు జ్ఞానము , బలము కలుగుటకు ధారగా ప్రవహింపుము.

    6. సోమమా! నీవు అత్యంత అన్నదాతావు. అభిషుతుడవు ధారగా పవిత్రమున పడుము. ఇంద్ర, విష్ణ, అన్య దేవతలకు మధురమవమగుమా.

    7. సోమమా! ఆవు దూడను నాకినట్లు - హవిర్థారక యజ్ఞమున - ద్రోహశూన్య మాతృ స్వరూపజలము. హరిత వర్ణుడవగు నిన్ను నాకును.

    8. అంతరిక్షము మహంతము. శ్రవరేయము. సోమమా! నీవు వివిధ కిరణసహితుడవై అంతరిక్షమునకేగుదువు. నీవు వేగ వంతుడవు. హవిర్దాత యజమాని గృహమున ఉందువు. సమస్త అంధకారములను తుడిచివేతువు.

    9. మహాకర్మవంత సోమమా! నీవు ద్యావాపృథ్వులను భరింతువు - పోషింతువు. క్షరణశీల సోమము ! మహిమాన్వితుడవై నీవు కవచమును ధరింతువు.

    (శ్రీమదాంధ్ర వచన సంహిత  తొమ్మిదవ మండలము ఏడవ అంకము నాలుగవ అధ్యాయము సమాప్తము)

        ఓం నతామినన్తి మాయినో నధీరావ్రతా దేవానాం ప్రథమా ధ్రవాణి
        నరోదసే అద్రుహా వేద్యాభిర్నపర్వతాని నమేత స్థివాంసః

               అయుదవ అధ్యాయము        నూట ఒకటవ సూక్తము   
                ఋషి - వేరు వేరు. దేవత - పవమాన సోమము. ఛందస్సు -
                                    అనుష్టుప్ - 2, 3, గాయత్రి


        ఓం పురోజితీవో అన్ధసః సుతాయ మాదయిత్నవే
        అపశ్వానం శ్నథిష్టన సఖాయో దీర్ఘజిహ్వ్యమ్

    1.మిత్రులారా! ఎదుట ఆరగించదగిన అన్నరూప సోమము ఉన్నది. అది అభిషుతము. అత్యంతమాదక రసముగలది. పొడుగు నాలుక కుక్కను ఆవలికి పంపించండి అదిముట్టగలదు.

    2. సోమము అభిషుతము కర్మనిష్ఠము, వడిగల  గుఱ్ఱమువలె - సోమము నలువైపుల వ్యాపించును.

    3. సోమము దుర్ధర్షము. భజనీయము ఋత్విక్కులు సమస్త కోరికలు తీర్చుకొనుటకు సోమమును అభిషవింతురు.

    4. సోమము అత్యంతమధురము మాదకము అభిషుత సోమము పవిత్రమున నిలుచును. ఇంద్రుని కొరకు పాత్రలందు ద్రవించును. సోమమా! నీ మాదక రసము ఇంద్రుని చేరవలెను.

    5. సోమము ఇంద్రుని కొరకు క్షరితమగును. ఇతి దేవసో అబ్రువన్ ఇది దేవతలన్నమాట. సోమము స్తోత్రపాలకుడు. శబ్దకారి. స్వబలమున లోకముల ప్రభువైనాడు. సోమము అతిధుల పూజలను అశించును.

    6. సోమము బహుధారలుగ ద్రవించును. సోమమునుండి మధుర రసము ప్రవహించును. సోమము స్తుతిప్రేరకుడు ధనస్వామి. ఇంద్రునకు మిత్రుడు.

    7. సోమము పోషకుడు భాజనీయుడు ధనకారకుడు సకల ప్రాణులకు స్వామి. సోమము శోధితుడై రాలును. తన తేజమున ద్యావా పృథ్వులను వెలిగించును.


Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More