Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
ఆరవ అనువాకము తొంబది ఏడవ సూక్తము
ఋషి - వేరువేరు. దేవత - పవమనా సోమము. ఛందస్సు - త్రిష్టుప్.
1. సోమము సువర్ణమున శోధితము, ప్రదీప్త కిరణవంతము. తనరసమును దేవతల వద్దకు పంపును అభిషుత సోమము నినదించుచు - ఋత్విక్కులు యజమాని యొక్క పశువంత, సునిర్మిత గృహమునకు వెళ్లినట్లు - పవిత్రమునకు వెళ్లుము.
2.సోమమా! నీవు యుద్ధయోగ్యుడవు. అచ్ఛాదకుడవు. కళ్యాణకారివి. తేజస్వివి, పూజ్యుడవు, కవివి. ఋత్విక్కుల వాక్కును ప్రశంసించ గలవాడవు. సర్వద్రష్టవు, నిరంతర జాగృతుడవు. యజ్ఞమునందు అభిషవణ ఫలకముల మీద ఆసీనుడవగుము.
3. సోమమా! నీవు యశోవంతులలో యశస్వివి. నేలమీద పుట్టినవాడవు. ఆనందదాయకుడవు ఉన్నతమగు మేషలోమ పవిత్రమున శోధితుడవగుదువు. శోధితుడవై అంతరిక్షమున ధ్వనించుము. మంగళమయ రక్షణలతో మమ్ము రక్షింపుము.
4. స్తోతలారా! చక్కగా స్తుతించండి. దేవతలను పూజించండి. ప్రచుర ధనప్రాప్తికి సోమమును ప్రోత్సహించండి. రుచికర సోమము మేషలోను పవిత్రమున శోధితమగును. కలశమున నిలుచును.
5. దేవతలమైత్రి కోరిన ధారావంత సోమము కలశమందు కరుగును. కర్మనిష్ఠులచే స్తుతుడగును. అంతరిక్షమునకు తరలును. "అగన్నింద్ర మహతే సౌభగాయ" మహాసౌభాగ్యము కొరకు ఇంద్రుని వద్దకేగును.
6.హరితవర్ణ, శోధిత సోమమా! నిన్ను స్తుతించుచున్నాము. మాకు ధనము ఇచ్చుటకు విచ్చేయుము. యుద్ధమునాకు సాగు ఇంద్రుని కొరకు నీమదకర రసమును పంపుము. దేవతల రధమున ఆసీనుడవై రమ్ము. యూయం సాత్ స్వస్తిభిః సదానః - నీవు ఎల్లవేళల శుభములు కలిగించి మమ్ము రక్షింపుము.
7. ఉశన కవితో సమముగా కావ్యముగా కావ్యములు రచించిన ఈ మంత్రకర్తయగు ఋషి ఇంద్రాది దేవతల జన్మ వివరములు తెలియును. సోమము విశేషకర్మి. సాధుమిత్రుడు పవిత్రతా ఉత్పాదకుడు దినములకు రాజు అతడు శబ్దముచేయును. పాత్రలందు చేరును.
8. వృషగణనామక ఋషులు హంసగమనులు. వారు శత్రుబలమునకు బెదరినారు. క్షిప్రఘాతక, శత్రుహంత సోముని ఆశ్రయించినారు. యజ్ఞగృహమున చేరినారు. మిత్ర రూప స్తోతలు స్తోత్రయోగ్య, దుర్ధర్ష, క్షరణషీలా సోముని గూర్చి వాద్య సహితముగ గానములు చేసినారు.
9. సోమము శీఘ్రగామి. అనేకులచే స్తుతించబడువాడు. అనాయాసముగ ఆటలాడువాడు. అతనిని ఇతరుల అనుసరించజాలరు. సోమము తీక్ష్ణ తేజస్వి. అతడు వివిధ తేజస్సులను వ్యక్తపరుచును. అంతరిక్షమున ఉన్న సోమము పగలు హరిత వర్ణుడుగను, రాత్రి శుభ్ర ప్రకాశ యుక్తుడగను అగుపించును.
(సోమము పగలు సూర్యుడు రాత్రి చంద్రుడు అగునని.)
10. సోమము క్షరణశీలుడు బలవానుడు గమనశీలుడు. అతడు ఇంద్రునకు బలము కలిగించు రసము నంపును ఇంద్రునకు మత్తు కలిగించుటకు ద్రవించును. సోమము రాక్షసకులహంత. వరణీయ ధనదాత బలములకు రాజు నలుదిశల శత్రువులను సంహరించును.
11. సోమము శిలలచే అభిశుతుడు. మదకర ధారలవాడు. దేవతలను పూజించువాడు పవిత్రముననిలిచి క్షరితగును. ద్యోతమాన, మదకర సోమము ఇంద్రుని స్నేహమును ఆశ్రయించును. ఇంద్రుని బలమునకు ద్రవించును.
12.సోమము కాలముననుసరించి ప్రియకార్యములు చేయువాడు. శోధితుడు. క్రీడావంతుడు. తన రసమున ఇంద్రాది దేవతలను పూజించుటకు కరిగిపోవును. పది అంగుళులు అతనిని ఉన్నతము, మేషలోమ పవిత్రమునాకు పంపును.
13. ఆవులను చూచి లోహితవర్ణ వృషభము అరచును. అట్లే నినదించుచు సోమము ద్యావా పృథ్వుల కరుగును. యుద్ధమున సోమము ఇంద్రుని వలె గర్జించును. తనను అందరకు ఎరుక పరచుటకు సోమము పొలికేక పెట్టును.
14. సోమమా! నీవు దుగ్ధయుక్తుడవు. క్షరణశీలుడవు. శబ్దకర్తవు. నీ రసము మధుర రసము నీవు జలపరిషిక్తు డవగుము. శోధితుడవగుము. నీ ధారలను విస్తృత పరచుము. ఇంద్రుని కొరకు సాగుము.
15. మదకర సోమమా! జలధరముచే వర్షింప చేయుటకు నీ ఘాతుక ఆయుధమున మేఘపు తలవంచునట్లు చేతువు - బలము కొరకు క్షరితుడవగుము. శుభంకర, శ్వేతవర్ణ, పవిత్రమున అభిషిక్త, మాగోవులను అభిలషించు సోమమా! క్షరితమగుమా.
16. దీప్తసోమమా! మా స్తుతులకు ప్రసన్నుడవగమును. మా కొరకు వైదిక మార్గములను సుమము చేయుము. ద్రోణ కలశమున ద్రవించును. గట్టి ఇనుప ఆయుధములతో దుష్టరక్కసులను సంహరించుము. ఉన్నత, మేషలోమ పవిత్రమునకు ధారలతో కదలుము.
17. వర్షము ద్యులోక ఉత్పన్నము. గమనశీలము అన్నవంతము. సుఖముల నిచ్చునది. దానములు చేయునది సోమమా! అట్టి వర్షము కురిపించుము. భూమి మీది వాయువులు ప్రేమపాత్ర పుత్రునివంటివి. వాని కొరకు వెదకుచు - వెదకుచు విచ్చేయుము.
18. ముడిని సడలించి విప్పుదురు. సోమమా! అట్లే నన్ను పాపముల నుండి దూరము చేయుము. నాకు చక్కని మార్గము చూపుము. బలము నిమ్ము. నీవు హరిత వర్ణుడవై పాత్రలందు నిలిచి - వేగవంత అశ్వమువలె ధ్వనులు చేయుదువు. దేవా ! నీవు శత్రుహింసకుడవు గృహవంతుడవు నా వద్దకు రమ్ము.
19. నీవు పర్యాప్త బలవంతుడవు. దేవతల యజ్ఞమునకును, మేషలోను పవిత్రమునకును ధారలతో వెడలుము. బహుధారాయుకు డవగుము. సుగంధసంపన్ను డవగుము. మానవులు యుద్ధములు కల్పించుకున్నారు. అన్నలాభము కొరకు ఆయుద్ధముల నలువైపుల క్రమ్మకొనును.
20. త్రాడులేని, రథములేని, కట్లులేని గుఱ్ఱము అలంకృతమై యుద్ధమున తన లక్ష్యమువైపు ఉరుకులు పెట్టును. అట్లే యజ్ఞమున నిర్మితము, దీప్తమగు సోమము కలశము దిశగా ఉరుకులుపెట్టును.
21. సోమమా! మా యజ్ఞము లక్ష్యముగా నీ యొక్క సారమును ద్యులోకము నుండి మాచమసమలందు సోమము మాకు మేము కోరిన వృద్ధిగల, వీరపుత్రుని ప్రసాదించుము. బలిష్ఠ ధనమును అందించుము.
22. అభిలాషులగు స్తోతల వచనములు మనసునుండి వెడలినప్పుడు - విచిత్రములగు యాజ్ఞిక ద్రవ్యములు అనుష్ఠాన స్థానమునకు తెచ్చినప్పుడు - అప్పుడు ఆవుపాలు ఆతురతగా సోమమువైపు పారును. అప్పుడు సోమము కలశమును చేరును. సోమము ఎల్లరకు ప్రేమ పాత్రుడగు యజమాని వంటివాడు.
23. సోమము ద్యులోక ఉత్పన్నుడు. ధనదాతల కోరికలు తీర్చువాడు. సుమేధ సత్యస్వరూపుడగు ఇంద్రుని కొరకు అతడు తనరసమును అర్పించును. సోమము మహారాజు అతడు ధర్మబలుడు. పది అంగుళులు మరింత సోమమును అందించును.
24. సోమము పవిత్రమున శోధితుడు మానవద్రష్ట దేవతలకు, మానవులకు ప్రభువు. ధనస్వామి. కళ్యాణకర జలములు కలవాడు.
25. అశ్వము యుద్ధమునకుపోవును. సోమమా ! అట్లే నీవు యజమానుల అన్నము కొరకు వెడలము. ఇంద్ర వాయువుల పానము కొరకు వెడలుము. మాకు బహువిధ, ప్రవృద్ధ అన్నమును అందించుము. మా కొరకు ధనములు సాధించుము.
26. సోమము దేవతలను తృప్తిపరచువాడు. పాత్రలందు సిక్తుడు సుబుద్ధి యజ్ఞకర్త, స్వరసేకర్త, హోతలవలె ద్యులోకమునందలి దేవతలను స్తుతించువాడు. అత్యంతమాదకుడు అతడు మాకు వీరపుత్రుని, గృహమును ప్రసాదించవలెను.
27. స్తుత్యసోమమా ! నిన్ను దేవతలు పానము చేయుదురు. దేవతల యజ్ఞమున మహాభక్షకుడవగుము దేవతల పానమునకు క్షరితుడవగుము. నీవు మమ్ము యుద్ధములకు పంపుము అప్పుడు మేము మహా బలముల శత్రువును ఓడింతుము. నీవు శోధితుడవగుము. మా కొరకు ద్యావాపృథ్వులను నివాసవంతము చేయుము.
28. సోమమా! నీవు సింహమువలె అరి భయంకరుడవు నీది మనసును మించిన వేగము, సోమాభిషవ కర్తలకు ఋత్విక్కులచే యోజితుడవు. నీవు అశ్వము వలె ధ్వనులు చేయుదువు. దీప్త సోమమా! సులభ మార్గముల మామనసులను ప్రసన్నము చేయుము.
29. సోమమా! నీవు దేవతల కొరకు పుట్టినావు. నీ ధారలు వందలై వర్థిల్లినవి. క్రాంత దర్శకులు బహువిధమగు నీ ధారలను శుద్ధిచేయుదురు. మా పుత్రుల కొరకు ద్యులోకమునందలి గుప్త ధనమును పంపుము. నీవు మహాధనముల అగ్రగామివి కదా!
30. దినములను కలిగించు సూర్యకిరణములవలె సోమధారలు ఏర్పడును. సోమము ధీరుడగురాజు మంచి మిత్రము కర్మకర్తయగు పుత్రుడు తండ్రిని ఓడించడు - సోమమా! అట్లే నీవు నీ ప్రజను ఓడించకుము.
31. సోమమా! నీవు జలమునుండి మేషలోమ పవిత్రమును దాటుదువు. అప్పుడు మా కొరకు మధురధారలు సిద్ధమగును. నీవు దుగ్థము లక్ష్యముగా క్షరితమగుదువు. నీవు పుట్టినప్పటి పూజ్యతేజమున ఆదిత్యుని పరిపూర్ణుని చేయుదువు.
32. అభిషుత సోమము సత్యరూప యజ్ఞమార్గమున మరిమరి శబ్దము చేయును. అమర, శుక్లవర్ణ సోమమా! నీవు మరింత శోభిల్లుచున్నావు. కవుల బుద్ధికి వాక్కును అందించు సోమమా! నీవు మరింత శోభిల్లుచున్నావు. కవుల బుద్ధికి వాక్కును అందించు సోమమా! నీవు మదకరుడవగుము. ఇంద్రుని కొరకు ద్రవింపుము.
33. సోమమా! నీవు దివుజుడవు. సుపర్ణుడవు దేవతల యజ్ఞమున కర్మమూలమున ధారలు కలిగింతువు. దిగువకు చూడుము. కలశమువైపు సాగుము. ధ్వనులు చేయుము. సూర్యుని కాంతిని చేర్చుకొనుము.
34. యజమానులు "తిస్రోవాచ" మూడు వేదములను స్తుతింతురు వారు - యజ్ఞకారక, సుదృఢ సోమపు శుభస్తుతులను ప్రోత్సహింతురు. ఆబోతు ఆవువైపు ఉరికినట్లు తమ పతిదేవునకు పాలందించుటకు ఆవులు సోమము పరుగులిడును. అభిలాషులగు స్తోతలు స్తుతించుటకు సోమము వద్దకు చేరెదరు.
35. ప్రసన్నకర గోవులు సోమమును అభిలషించును. విప్రస్తోతలు సోమమును స్తుతింతురు పృచ్ఛింతురు. పాలతో కలసి, అభిషుత సోమమును ఋత్విక్కులు పూజింతురు "త్రిష్టుభః సంనవస్తే" త్రిష్టుభమంత్రములు సోమమును చేరును.
36. సోమమా! పాత్రలందు పరిషిక్తుడ వగుము. శోధితుడవగుము. మాకు శుభములు కలుగునట్లు క్షరితుడవగుము. మహా ధ్వనులు చేయుచు ఇంద్రుని ఉదరమున చేరుము. స్తుతులను వర్థిల్లచేయుము. స్తవములను విస్తృతపరచుము.
37. జాగృత, సత్యస్తోత్ర జ్ఞాత, శోధిత సోమము చమసములందు ఆసీనుడగుము. పరస్పరము కలిసిఉన్న, ఎన్నో కోరికలుగల, సుహస్తులగు పురోహితులు పవిత్రమున సోమమును స్పృశింతురు.
38. వర్షము చేరినట్లే ఇంద్రుని వద్దకు శోధితసోమము చేరును. సోమము తన మహిమచే ద్యావా పృథ్వులను పూరించును. స్వతేజమున చీకట్లను తరుమును, సోమపు ప్రియతమ ధారలు రక్షణ కలిగించును. పని చేయించుకున్నవాడు భృతి ఇచ్చినట్లు సోమమా! మాకు త్వరగా ధనమును ప్రసాదించుము.
39. సోమము దేవతల వర్థకుడు. తాను స్వయం వర్థకుడు. పవిత్రమున శోధితుడు. మనోరథపూరకుడు. అతడు స్వతేజమున మమ్ము రక్షించవలెను. అంగిరులు సర్వజ్ఞులు సూర్యజ్ఞాతలు. పితరులు వారు సోమపానము చేసినారు. పణులు అపహరించిన గోవు అడుగుల గుర్తులు కనుగొన్నారు. అంధకారమయ పర్వతమున సోమపు వెలుగున గోవులను చూచినారు. తెచ్చినారు.
40. సోమము మహారాజు. జలవర్ణకుడు అతడు సకల భువనముల విస్తృత జలములను తనలో దాల్చినాడు, అంతరిక్షమున ప్రజలను సృష్టించినాడు. అందరిని దాటిపోయినాడు. కామవర్షక, అభిషుత, దీప్తసోమము ఉన్నతము, మేషలోమ పవిత్రమున యధేచ్ఛగా పెరుగును.
41. పూజ్యసోమము మహాకార్యములు చేసినాడు. జలములను గర్భమున దాల్చినాడు. దేవతలను ఆశ్రయించినాడు. శోధితుడైనాడు. ఇంద్రుని కొరకు బలము సాధించినాడు. "జనయ త్సూర్యేజ్యోతిరిన్దు." సోమము సూర్యునిలో జ్యోతిని సృష్టించినాడు.
42. సోమమా! మాకు అన్నము, ధనము కలుగుటకు వాయువును ఉన్మత్తుని చేయుము. శోధితుడవగుము. మిత్ర వరుణులను తృప్తిపరచుము. మరుత్తుల బలమును పెంచుము. ఇంద్రాదులను ఆనందపరచుము. ద్యావా పృథ్వులను మిత్రులను చేయుము. మాకు ధనమునిమ్ము.
43. సోమము ఉపద్రవనివారకుడు. వేగవంతుడు రాక్షసహింసకుడు. హింసకుల బాధకుడు. తన రసమున పాలను కలుపు కొనును. పాత్రలందు చేరును. "ఇంద్రస్యత్వం తవవయం సఖాయః" నీవు ఇంద్రని మిత్రుడవు మేము నీ మిత్రులము.
44. సోమమా! మధుర భండారమును క్షరింపచేయుము. ధనవర్షక రసమును క్షరింపచేయుము. మాకు వీరపుత్రుల నిమ్ము. పూజ్య అన్నము ప్రసాదించుము. శోధితమగుము. ఇంద్రునకు రుచికరుడవగుము. మాకు అంతరిక్షమునుండి ధనము తెమ్ము.
45. అభిషుత సోమము తనధారలతో - వేగవంత అశ్వమువలె - పరుగులిడును. ప్రవహించు నది పల్లమునకువలె - కలశమునకు పారును. శోధిత సోమము వృక్షోత్పన్న కలశమున ఆసీనుడగును.
46. ఇంద్రా !నీవు సోమాభిలాషివి. ప్రాజ్ఞ, వేగశీల సోమము నీ కొరకు చమసము నందు క్షరితమగును. సోమము సర్వదర్శి రథవంతుడు బలశాలి దేవకామి యజమానుల కొరకు కల్పవృక్షమగును.



