Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2


    (కాశ్యప, భరద్వాజ, గౌతమ, అత్రి, విశ్వామిత్ర జమదగ్ని, వసిష్ఠులు సప్తర్షులు.)

    3. శోభన ప్రాజ్ఞుడు , మార్గజ్ఞుడు. దేవసమీపవర్తి, పవమాన సొమము ద్రోణకలశమున ప్రవేశించును. సకలకార్యములందు ప్రాజ్ఞ, రమణీయ సొమము పంచజనులను అనుగమించును.

    4. సహోద్యమాన సామమా! నీ  వారలు, ప్రసిద్ధులగు ముప్పదిముగ్గురు దేవతలు అంతర్హితమార్గన నివసింతురు. పది అంగుళులు ఉన్నతము, మేషలోమ పవిత్రమందు - నీటితో నిన్ను శుద్ధి చేయును.

    5. పవమాన సోమపు ప్రసిద్ధస్థానమున స్తోతలు స్తుతించుటకు ఏకత్రితులగుదురు. అట్టి సత్యస్థానము మాకు లభించవలెను. దినములను ప్రకాశవంతముచేయు సోమజ్యోతి మను మహర్షిని భద్రముగ రక్షించినది. సొమము తన తేజమును అసురుల కొరకు అభిగమన శీలము చేసినాడు.

    6. దేవతలను ఆహ్వానించుటకు ఋత్విక్కులు పశువంత యజ్ఞ, గృహమునకు చేరునట్లు సత్కర్మ ప్రభువు యుద్ధక్షేత్రమునకేగినట్లు - పవమాన సొమము ప్రవాహ జలమున మహిషము వలెనిలిచి- ద్రోణ కలశమునకు చేరును.

                                 తొంబది మూడవ సూక్తము
   ఋషి - గౌతమ నోదస్సు. దేవత - పవమాన సోమము. ఛందస్సు - త్రిష్టుప్.

    1.ఒకేసారి కదలునట్టి భగిస్వరూపలగు పది అంగుళులు సోమమును శుద్ధిచేయును. ప్రాజ్ఞులు, దేవత అభిలషించు సోమమునకు ఆపది అంగుళులే  ప్రేరకములు హరిత  వర్ణసోమము సూర్యపత్నులగు దిశలవైపు మరలును. పరుగుల గుఱ్ఱము నిలిచినట్లు సోమము కలశమున నిలుచును.

    2. సోమము దేవకామి. కావవర్ణకము వరణీయము. తల్లులు పిల్లలను శుభ్రము చేసినట్లు సోమము జలమున శుభ్రము చేయబడును. భర్త భార్య వద్ద కేగినట్లు సోమము అలంకరించిన స్థానమునకు చేరును. పిదప దుగ్ధాదులతో ద్రోణ కలశమున చేరును.

    3. సోమము ఆవు చన్నులను దువ్వును. శోభన ప్రజ్ఞ సోమము ధారలుగా ద్రవించును. చమస ములందున్న శ్రేష్ఠసోమమును -ఒక  వస్తువును చలువచేసిన బట్ట కప్పినట్లు ఆవుపాలు ఆచ్ఛాదించును.

    4. పవమానసోమమా ! పాత్రలందు పడునపుడు దేవతలతో చెలిమిచేయునీవు - మాకు అశ్వయుక్త ధనమును అందించుము. రథికులను కోరునట్టి సోమపు అభిలాషగల, బహువిధ బుద్ధి మాకు ధనదానము చేయుటకు మా ముందుకు రావలెను.

    5. సోమమా! మాకు వెంటనే పుత్రాదియుక్త ధనములిమ్ము. జలములను అందరకు ఆహ్లాదకరము చేయుము. స్తోతల ఆయువు పెంచుము. మా సదన యజ్ఞములకు త్వరగా విచ్చేయుము.

                                  తొంబది నాలుగవ సూక్తము
 ఋషి - అంగిరస కణ్వుడు. దేవత - పవమాన సోమము. ఛందస్సు -త్రిష్టుప్.

    1. సోమము అశ్వసమముగా అలంకరించబడినప్పుడు. సోమకిరణములు సూర్యునివలె ఉదయించినప్పుడు అంగుళులు స్ఫర్థతో సోమమును శోధించును. పిదప కవి సోమము జలములందు కలసి పశుపోషణకు గోపాలుడు గోష్ఠమునకు పోయినట్లు - సోమము కలశమున క్షరితమగును.

    2. జలధర అంతరిక్షమును సోమము స్వతేజమున ద్విధా ఆచ్ఛాదించును. సర్వజ్ఞ సోముని కొరకు సకల భువనములు విస్తృతమగుగాత. స్తోత్రములు ఆనంద కరములు. యజ్ఞావిధాయకములు. అవి సోముని గూర్చి యజ్ఞదినములందు - కొట్టమున పాడియావుల్ అరుపుల వలె చప్పుడు చేయును.

    3. బుద్ధిమంతుడగు సోమము స్తుతులవైపు సాగునపుడు - వీరపురుషుని రథము సాగునప్పటివలె మార్గములను నియంత్రించును. సోమము దేవతల ధనము మానవులకు ఇచ్చును. అట్టిధన వృద్ధికి సోమమును స్తుతించవలెను.

    4. సోమము సంపదలందు పుట్టినవాడు. సంపదల కొరకే వెడలును. సోమము స్తోతలకు ధనము, ఆయువు ప్రసాదించును. సోముని సంపదలందుకున్న స్తోతలకు అమరత్వము కలుగును. సోముని యుద్ధములు సత్యములగును "భవన్తి సత్యాసమిథా."

    5. సోమమా! సంపద, బలము, అశ్వములు, గోవులను ఇమ్ము. మహాజ్యోతిని విస్తరించుము. ఇంద్రాది దేవతలకు తృప్తి కలిగించుము. నీ ముందు రాక్షసులందరు ఓడినవారే. క్షరణశీల సోమమా! శత్రువులందరిని హతమార్చుము.

                                తొంబది అయిదవ సూక్తము
 ఋషి - కణ్వపుత్ర ప్రస్కణ్వు దేవత - పవమాన సోమము. ఛందస్సు - త్రిష్టుప్.

    1. నలువైపుల అభిషుతమగు నట్టి హరిత వర్ణసోమము ధ్వనిచేయుము. శోధితమగుచునే కలశగర్భమున కూర్చుండును. ఋత్విక్కులు కలిగించిన సోమము పాలలో కలిసి తన రూపమును వ్యక్తపరచును. స్తోతలారా! సోమము కొరకు హవి సహితముగా పూజ్యస్తోత్రములను సృష్టించండి.

    2. నావికుడు నౌకను నడిపినట్లు - సిద్ధముచేయబడిన సోమము సత్యరూప యజ్ఞమునకు ఉపయుక్త వాక్యమునకు ప్రేరణ కలిగించుచు దీప్తసోమము ఇంద్రాది దేవతల అంతర్హితస్వ రూపమును యజ్ఞమునందు - ఉత్తమ వ్యక్తి కొరకు -ఆవిష్కరించును.

    3. స్తుతుల కొరకు తొందర పడు ఋత్విక్కులు - జలతరంగములవలె - మనసుమెచ్చు స్తుతులను సోమమునకు అర్పింతురు. సోమమును పూజించు స్తుతులు సోముని చేరును. అభిలాషగల స్తుతులు అభిలాషి సోమమున ప్రవేశించును.

    4. ఋత్విక్కులు సోమమును శుద్ధిచేయుదురు. ఎత్తున అభిషవ శిలలపై ఉన్న సోమమును - గేదెను వలె పితుకుదురు. కామాయమాన సోమమును మననీయ స్తుతులు సేవించును. మూడు లోకములందు ఉండు ఇంద్రుడు శత్రు నివారక సోమమును అంతరిక్షమున ఉంచినాడు.

    5. స్తోత్రప్రేరక ఉపవక్త పురోహిత హోతను ప్రోత్సహించును. సోమమా! నీవును అట్లే  స్తోతలను ప్రోత్సహించుటకు ధనాదులు అందించుచు ముందుకు రమ్ము. నీవు యజ్ఞమున ఇంద్రుని వెంట ఉన్నపుడు మేము సౌభాగ్యశాలురము కావలెను. శుభములనిచ్చు ధనస్వాములము కావలెను.

                                 తొంబది ఆరవ సూక్తము
      ఋషి - దివోదాసపుత్రుడు ప్రతర్దనరాజర్షి. దేవత - పవమాన సోమము.
                                       ఛందస్సు - త్రిష్టుప్


    1. సోమము శత్రుబాధక సేనాపతి. శత్రువుల గోవులు సాధించు యుద్ధమున సోమము రథాగ్రమునసాగును. సోమపు ఇంద్రుని సేన ప్రసన్నమగును. మిత్రులగు యజమానులు ఇంద్రుని ఆహ్వానింతురు అట్టి ఆహ్వానమును అలంకృతము చేయుటకు సోమము దుగ్ధాదులను గ్రహించును. ఆ సోమము కొరకు ఇంద్రుడు త్వరగా వచ్చును.

    2. సోమపు హరితవర్ణ కిరణమును అంగుళులు అభిషవించును. సోమము ఎంతో వ్యాప్తము. అయినను నిలిచినా రథము వంటి దశాపవిత్రమున నిలుచును. ప్రాజ్ఞసోమము ఇంద్రుని మిత్రము. సోమము పవిత్రమున శుద్ధియై శోభన స్తుతులను స్తోతను చేరును.

    3. ద్యోతమాన సోమమా! నీవు ఇంద్రుని పానపదార్థమవు. మా యజ్ఞము దేవసేవితము. అందు ఇంద్రుని మహాపానమునకు ద్రవించుము. నీవు జలకర్తవు. ద్యావాపృథ్వుల  అభిషేక్తవు. విస్తృంతరిక్షము నుండి వచ్చువాడవు. శోధితుడవగువాడవు. మాకు ధనాదులు ప్రదానము చేయుము.

    4. మా యజ్ఞము  అపరాజితము. అవినాశ్యము. పవమాన సోమమా! యజ్ఞముకొరకు ముందుకు రమ్ము. మా మిత్రులందరు నీ రక్షణలు కోరుచున్నారు. నాకు సహితము నీ రక్షణ కావలెను.

    5. సోమము క్షరితమగును. అతడు స్తుతిజనకుడు ద్యులోక జనకుడు. పృథ్విజనకుడు. అగ్ని జనకుడు. ప్రేరక సూర్యజనకుడు. ఇంద్ర జనకుడు. విష్ణు జనకుడు.

    6. సోమము దేవస్తోతలగు పురోహితులందు బ్రహ్మకవులందు శబ్దవిన్యాసకర్త. విప్రులందు ఋషి. వన్యప్రాణులందు  మహిషము. పక్షులకు రాజు. ఆయుధములందు స్వధితి. శబ్దము చేయు సోమము పవిత్రమున దాటును.

    7. పవమాన సోమము నదీతరంగములవంటి స్తుతివాక్యములను ప్రోత్సహించును. కామవర్దక, గోజ్ఞాన సోమము అంతరంగములను చూచును. నిరాటంక బలమును అధిష్ఠించును.

    8. సోమమా! నీవు  మాదకరుడవు. యుద్ధములందు శత్రుహంతవు. అగమ్యుడవు. అపొర జలయుక్తుడవు. శత్రుబలమును అధిగమింపుము. గోవులకు ప్రేరణ కలిగించుచు నీ అంశమును ఇంద్రుని వద్దకు పంపుము.

    9. సోమము ఆనందదాయకము. రమణీయము. సోమము వద్దకు చేరుదురు. సోమము బహుధారలవాడు. పాత్రలందు నిలుచువాడు. యుద్ధమునకు అశ్వము వెళ్లినట్లు ఇంద్రుని కొరకు ద్రోణకలశమునకు చేరును.

    10. సోమము ప్రాచీనుడు. ధనాధిపతి మిత్ర రక్షకుడు జన్మతోనే జలమున శుద్ధియగువాడు. రాతిమీద పిండబడువాడు. ప్రాణులకు ప్రభువు. కర్మల  కొరకు కరుగువాడు. అతడు యజమానులకు చక్కని మార్గము చూపును.

    11. పవమాన  సోమమా! మా పూర్వజులు కర్మకుశలురు. వారు నీ సాయమున అగ్నిప్టోమాది కర్మలు నిర్వహించినారు. వేగవంత అశ్వముల సాయమున నీవు శత్రువులను వధింతువు. రాక్షసులను తొలగింపుము ధనము ప్రసాదించుము "మఘవాభవానః" మా ఇంద్రుడవగుము.

    12. ప్రాచీనకాలమున నీవు మనువునకు అన్నము కలిగించినావు. శత్రువులను వధించినావు. ధనపురోడాశాదులను అతనికి ఇచ్చుటకు వచ్చినావు. అట్లే మాకు ధనములు అందించుటకు విచ్చేయుము ఇంద్రుని యందు చేరుము. అతనికి ఆయుధములు ఇమ్ము.

    13. సోమమా! నీవు బలకరుడవు. రసవంతుడవు. యజ్ఞకుడవు జలముల కలియుము. మేషలోను పవిత్రము ఉన్నతము. అందు ద్రవించుము. నీవు అత్యంత మాదకుడవు. ఇంద్రుని పానయోగ్యుడవు. జలమున్న ద్రోణకలశమున నిలువుము.

    14. సోమమా! నీవు యజ్ఞములందు యజమానులకు వివిధ ధనములు ఇచ్చువాడవు. బహుధారలవాడవు. ఆకసమునుండి వాన కురిపించుము. పాలు, నీరు ప్రసాదించి మా జీవనములను వర్థిల్లచేయుము. ద్రోణకలశమున ద్రవించుము.

    15. సోమము స్తోత్రములచే పరిశుద్ధడగును. పరుగులిడు గుఱ్ఱమువలె శత్రువును దాటిపోవును దైన్యమెరుగని ఆవుయొక్క పాలవలె పరిశుద్ధుడు. విశాల మార్గము వలె  అందరి ఆశ్రయము. వాహకఅశ్వమువలె సోమము స్తోత్రములచే నియంత్రితుడగును.

    16. సోమము శోభన ఆయుధవంతుడు ఋత్విక్కులచే శోధితుడు. సోమమా! నీ మూర్తి గుహ్యము రమణీయము. ఆమూర్తిని వ్యక్తపరచుము. నీవు అశ్వసముడవు. మేము అన్నాభిలాషులము. మాకు అన్నము అందించుము. ఆయువునిమ్ము. పశువులనిమ్ము "అభిపాయమభిగో దేవసోమ."

    17. సోమము అందరి అభిలషనీయుడు. వ్యక్తమగువాడు అతనిని మరుత్తుల పసిబిడ్డనువలె పోషింతురు సప్తమరుత్తులు వాహక  సోమమును అలంకరింతురు. క్రాంతికర్మ, కవిశబ్ద వాచ్య సోమము శబ్దముచేయును. స్తుతులవెంట పవిత్రమును దాటిపోవును.

    18. సోమము ఋషి సమమనస్కుడు. సర్వద్రష్ట. సూర్యసంభక్తుడు. బహుస్తుతువంతుడు. కవులందు శబ్దవిన్యాసకర్త. పూజ్యుడు. ద్యులోకమున వసించగోరును. స్తుత్యుడగును. ఇంద్రుని  ప్రకాశింప చేయును.

    19. సోమము అభిషనఫలక విరాజితుడు. ప్రశంసనీయుడు సమర్థుడు పాత్రస్థితుడు. ఆయుధధారి. జలప్రేరకుడు. అంతరిక్షవాసి. మహానుడు. నాలుగవదగు చంద్రలోకమును సేవించును.

    20. సోమము అలంకరించుకున్న నరునివంటివాడు. స్వదేహమును శుభ్రపరచుకొనువాడు. ధనదానముకు ఆతురపడువాడు. వేగవంత అశ్వమువంటి నడకలవాడు, వృషభమువలె శబ్దము చేయువాడు, పాత్రలకు పయనించువాడు, శబ్దము చేయుచు అభిషవణ ఫలకముల మీద  ఆసీనుడగును.

    21. సోమమా! ఋత్విక్కులచే శోధితుడవగుము. క్షరింపుము తేపతేప పలుకుము. మేషలోమ పవిత్రమున చేరుము. అభిషవణ ఫలకముల మీద  ఆడుము. పాత్రలందు తిష్ఠవేయుము. "ఇంద్ర తేరసోమదిరో మమత్తు." నీరసము ఇంద్రునకు మత్తు కలిగించవలెను.

    22. సోమపు మహాధారలు సిద్ధమగుచున్నవి. వానిలో గోరసము కలుపు బడుచున్నది. ద్రోణకలశమునకు చేరుచున్నది. సోమముగాన కుశలుడు. విద్వాంసుడగు సోముడు గానము చేయుచు-లంపటుడు మిత్రుని భార్య వద్దకు  ఉరికినట్లు - పాత్రలకు పరుగులిడును.

    23. సోమమా! నీవు శోధ్యమానుడవు. స్తోతలచే అభిషుతడవు. ద్రవించువాడవు. జారుడు వ్యభిచారిణి వద్దకేగినట్లు - నీవు శత్రువినాశము చేయుచు విచ్చేయుదువు. ఎగురుపక్షి చెట్టు కొమ్మన కూర్చున్నట్లు - శోధితుడవైన  నీవు ద్రోణకలశమున కూర్చుందువు.

    24. తల్లులు పిల్లలకు పాలిచ్చినట్లు సోమమా! యజమానులకు ధనము దుహించునట్టి శోభనధారలుగల నీ దీప్తులు పాత్రలకు చేరును. సోమమా! నీవు హరితవర్ణుడవు. తేబడినవాడవు. ఋత్విక్కులచే బహుధా వరణీయుడవు వసితీవరి జలములందును. యజమానుల కలశములందును. మాటిమాటికి శబ్దము చేయుదువు.

    (శ్రీమదాంధ్ర వచన ఋగ్వేదసంహిత ఏడవ అష్టకము తొమ్మిదవ మండలమున అయిదవ అనువాకము సమాప్తము.)


Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More