Home » D Kameshwari » Neti Kaalapu Meti Kathakulu


    పులి వేటకు మేకను ఎర వేసినట్టు వ్యాపారానికి స్త్రీని ఎరవేయడం అనేది ఈ కథలో సింబాలిక్ గా చూపబడింది. అడవిలో దట్టమైన, నిటారైన చెట్లు, అడవి పూల మత్తైన వాసన, కుందేళ్ళ, లేళ్ళ పరుగులు, రాత్రి పూట నిశ్శబ్ధం, కీచురాళ్ళ సవ్వడి, లోపలికెళుతున్న కొద్దీ బాటలు మాయమవడం, మంచే మీద మాటు.....ఇలాంటి వర్ణనలు అత్యంత సహజంగా చేశారు రచయిత్రి. పాఠకులు తాము కూడా అక్కడే ఉన్నామా అన్పించేట్లుగా ఉంటుంది ఈ కథ నడక. రచయిత్రి చెప్పక చెప్పిన విషయాలు సూచ్యంగా తెలుస్తాయి, ఆదివాసీలను, గిరిజనులను అతి కఠిన నింధనలతో నియంత్రిస్తూ, వారిని ఉక్కుపాదంతో అణచివేసే ప్రభుత్వ యంత్రాంగం......తమ ఉద్యోగుల్లోని అవినీతిని, అధికార దుర్వినియోగాన్ని అరికట్టలేకపోవడం చేదు నిజం. అంత మందికి తెలిసేలా, చాలా అలవాటైన పనిలా అటవీ అధికారులు పులులను వేటాడ్డం అనేది సామాన్యులకు అంతుపట్టని విషయం వేట నిషేధం అయిన రోజుల్లో బాహాటంగా పదిమందితో వెళ్ళి వేటాడ్డం అనేది నలభై యాభై ఏళ్ల క్రితం కూడా ప్రమాదకరమైన సాహసమే.
    'కాదేదీ కవితకనర్హం' అన్న శ్రీ శ్రీ మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని 'కాదేదీ కథకనర్హం' అంటూ 'కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ, రొట్టెముక్క, అరటి తొక్క....తలుపు గొళ్ళెం, గుఱ్ఱపు కళ్ళెం, హారతి పళ్ళెం...' ఆ పరంపరలో రాసిన తొమ్మిది కథల్లో మూడు కథలు కటిక పేదరికం గురించీ, ఆకలి గురించీ రాసినవి.
    'కుక్కపిల్ల' కథలో కుక్క విశ్వాసానికి మారుపేరు అయినప్పటికీ తిండి పెట్టకపోతే ఏ విశ్వాసమూ ఉండదు అనే నిజాన్ని ధృవపర్చారు. సింహాద్రి అనే బిచ్చగాడు ఏ వీధికుక్కను దగ్గరకు తీసి తను అడుక్కున్నదాంట్లోంచి ఓ ముద్ద పడేస్తూ ఉంటాడు. అనారోగ్యం వల్ల ఇంటింటికీ తిరిగి అడుక్కోలేక ఓ చోటే దగ్గుతూ పడి ఉండడం వల్ల అతడికి భిక్షవేసే వాళ్ళు కరువైతారు. దాంతో కుక్క పిల్ల కూడా రాములు అనే మరో ముష్టివాడి దగ్గరకు వెళ్ళిపోతుంది. విశ్వాసం కన్నా ఆకలి బలీయమైనది అని చెప్పే దీన్ని కథ అనేకన్నా గల్పిక అనొచ్చు. 
    'అగ్గిపుల్ల' తో పొయ్యి వెలిగించుకుని వంట చేసుకోవచ్చు. కానీ, ఈ కథలో ఓ యువతి తన వెంటపడి వేధించే ఓ కామాంధుడి పీడ వదిలించుకోవడానికి అదే అగ్గిపుల్లను వెలిగించి అతనికి నిప్పంటిస్తుంది. చిన్న కథ అయినా ఆత్మరక్షణకు మహిళలు ఎంత సాహసాన్నయినా చేస్తారని చెబుతుంది ఈ కథ.
    'సబ్బుబిళ్ళ' కథలో ఓ ఇంట్లో పని చేసే అమ్మాయికి వాళ్ళ అమ్మగారు బాత్ రూం లో వాడే సబ్బు అంటే చాలా ఇష్టం. ఆ సబ్బు నునుపుతనం, రంగూ, సువాసనా చూసి మనసు పారేసుకుని, ఎలాగైనా ఆ సబ్బు తనకు కావాలనుకుంటుంది. చివరికి ఓ రోజు అమ్మగారు తల స్నానం చేసి బయటికి వెళ్ళాక స్నానాల గది కడిగేటప్పుడు సబ్బు తీసి లంగా కుచ్చెళ్ళలో దాచుకుంటుంది. ఇంతలోనే ఇంటావిడ వచ్చి రవ్వల ముక్కుపుడక ఎక్కడ దాచావంటూ బెదిరిస్తుంది. తనకేం తెలియదంటుంది ఈ అమ్మాయి. పనిపిల్ల తప్ప ఇంకెవరూ లోపలికి వెళ్ళలేదు. చివరికి అమ్మగారు తీవ్రమైన కోపంతో పనిపిల్ల పరికిణీ దులిపిస్తే అందులోంచి సబ్బు బిళ్ళ కింద పడుతుంది. దానికంటుకుని ఉన్న రవ్వల ముక్కుపుడక దొరుకుతుంది. చిన్న సబ్బుబిళ్ళను తీసుకున్న పాపానికి, ఆ పిల్ల మనసులో కూడా తలపెట్టని రవ్వల ముక్కుపుడక దొంగతనం మీదపడింది. తల్లి ఎన్నో ఏళ్లుగా చేస్తున్న ఇంట్లో పని పోగా, దొంగలనే ముద్ర పడింది. ఈ కథ హృదయాన్ని కదిలిస్తుంది. నేరం చేసినప్పటికీ ఆ అమ్మాయి వైపే పాఠకుడి సానుభూతి ఉంటుంది. ఇది కథను ప్రెజెంట్ చేసే విధానంలో రచయిత్రి ప్రతిభను తెలియజేస్తుంది.
    'హారతి పళ్ళెం' కథలో తీవ్రమయిన పేదరికం కొన్ని సార్లు నేరాలకు ఎలా దోహదపడుతుందో చెబుతారు రచయిత్రి. యాభై ఏళ్ల క్రితం గుళ్ళల్లో పూజారులకు జీతాలు కూడా లేని రోజుల్లో భక్తుల చేతుల్లో కూడా ఎక్కువగా డబ్బులుండని సందర్భాల్లో ఆ కాస్త చిల్లర డబ్బులతోనే కుటుంబాన్ని గడపాల్సిన దుర్భర పరిస్థితులు ఉండేవి. బయటికి వెళ్ళి ఇంకో పని చేయలేక, నీతీ ధర్మం తప్పలేక, కుటుంబాన్ని పోషించలేక, కనీస అవసరాలు కూడా తీర్చుకోవడానికి వీలు కాక ఎన్ని అవస్థలు పడతారో తెలిపే కథ ఇది. గుడి కట్టించిన జమీందారుల ప్రాపకం ఉన్నన్నాళ్ళూ బాగానే నడిచిన మాధవయ్య సంసారం ఆ తరువాతి రోజుల్లో చితికి పోయింది. భార్యా, కొడుకూ, కూతురూ, పెళ్ళయి కూడా కట్నం పూర్తిగా ఇవ్వలేనందుకు ఇంటిమీద ఉన్న మరో కూతురు కామాక్షి, ఎప్పుడూ వెంట ఉండే దారిద్ర్యంతో దుర్భర జీవితం గడుపుతున్న మాధవయ్య.....విధిలేని పరిస్థితుల్లో ఆలయంలోని వెండి హారతి పళ్ళెం దొంగిలించి పక్క ఊర్లో అమ్ముదామని ఇంట్లో తెచ్చి పెడతాడు. అది గమనించి కూతురు ఆ పళ్ళేన్ని తిరిగి తెచ్చి గుళ్ళో పెడుతుంది. తండ్రి ఆశ్చర్యపడుతూంటే 'దైవ కార్యానికి ఉపయోగపడే హారతి పళ్ళేన్ని నీచమైన కోరికలున్న లోభులకు ఇచ్చి తన కాపురం చక్కబెట్టడం సరికాదనీ, ఆ నరకం లోకి తనింక వెళ్ళననీ, తనకు టీచర్ ఉద్యోగం వచ్చిందనీ, తనను తాను చూసుకోవడమే కాదు, తల్లిదండ్రులను కూడా పోషిస్తాననీ' చెబుతుంది. అగ్రకులాలైనంత మాత్రాన అన్ని విధాలా కలిగి ఉండరనే వాస్తవంతో బాటు, ఆడపిల్లలకు ఉండాల్సిన ఆత్మస్థైర్యం గురించి వివరంగా ఈకథ తెలియజేస్తుంది.
    'రొట్టె ముక్క' ఆకలిని మరో కోణంలోంచి చూపిన కథ. తండ్రి ఎవరో తెలియని సంటి గాడు, సిన్నిగాడు, ఎనిమిదేళ్ళు పెంచి బిచ్చం అడుక్కోవడం నేర్పిన తల్లి కలరాతో చనిపోయాక రైల్వే ఫ్లాట్ ఫాం మీద అడుక్కు తిని బతుకు వెళ్ళదీస్తుంటారు. ఓ రోజు రైల్లో ప్రయాణం చేస్తున్న ఓ ఘరానా మనిషి ఫిర్యాదుతో ఫ్లాట్ ఫామ్ పైనుండి బిచ్చగాళ్ళందరినీ వెళ్ళగొట్టేస్తారు. దాంతో బయటెక్కడా ఏమీ దొరక్క, ఏ పనీ చేయడం తెలియక పస్తులుంటూ స్టేషన్ బయట చెట్టుకింద గడిపే సిన్ని, సంటి ఓ రోజు తెగించి పట్టాలు దాటి వస్తారు. ఆ టైంలో ఎదురుగా ఆగి ఉన్న ఫస్ట్ క్లాస్ బోగీ కిటికీ లో తల్లిని సతాయిస్తూ చేతిలో పట్టుకున్న రొట్టె తినకుండా ఉన్న ఓ బాబు కనిపిస్తాడు. ఇద్దరూ కూడబలుక్కుని రైలు కదులుతున్నప్పుడు సంటిగాడు పరిగెత్తి ఆ కుర్రది చేతిలో రొట్టె అందుకుంటాడు. అంతలోనే కుర్రాడి తండ్రి సంటిగాడి చెయ్యి పట్టుకుంటాడు. ఆ చెయ్యి విడిపించుకునే ప్రయత్నంలో గింజుకుని చివరికి ఆయన చెయ్యి కొరికి చేతిని వెనక్కు లాక్కుంటాడు గానీ, పట్టు తప్పి రైలుకింద పడి నుజ్జునుజ్జు అవుతాడు. రైలు ఆగుతుంది, పోలీసులు వస్తారు, ఈ లోగా సిన్నిగాడి దృష్టి ఓ పక్కగా విరిగి పడిన సంటిగాడి చేతిలోని రొట్టెముక్కపై పడి ఒక్క గంతులో దాన్ని అందుకుని తింటుంటాడు. ఈ సన్నివేశం చదువుతుంటేనే హృదయవిదారకంగా, జుగుప్స కలిగించేలా ఉంటుంది. ఇక్కడే రచయిత్రి ప్రతిభ కనిపిస్తుంది. ఆకలేసినప్పుడు రొట్టె ముక్క తింటే ప్రాణం నిలుస్తుంది. అదే ఆకలి తీర్చే రొట్టెముక్క కోసం ప్రమాదకరమైన సాహసం చేసినప్పుడు....ఆ రొట్టె ప్రాణం తీస్తుంది తెలుస్తుంది ద్వారా తెలుస్తుంది.


Related Novels


Bhava Bandhalu

Neti Kaalapu Meti Kathakulu

Chikati Podduna Velugu Rekha

Agni Pariksha

More