Home » D Kameshwari » Neti Kaalapu Meti Kathakulu


    'అరటి తొక్క' కథ వ్యాపారంలో పోటీ ఎలా ఉంటుందో తెలియజేస్తుంది. నిరాసక్తంగా, అశ్రద్ధగా కిళ్ళీకొట్టు నడిపే ఓ వ్యక్తికి పక్కనే సెంటర్లో పోటీ కిళ్ళీ కొట్టు పెట్టి అరటి పళ్ళు, సోడాలు, ఇతర వస్తువులు కూడా అమ్మే స్త్రీతో వ్యాపారంలో పోటీ ఎదురవుతుంది. అందరినీ పలుకరిస్తూ, నవ్వుతూ మాట్లాడుతూ చకచకా అందించే ఆమె షాపుకు సహజంగానే గిరాకీ పెరుగుతుంది. ఆ సెంటర్లో బీటు పోలీసులు కూడా ఆమె కొట్టుకే వెళ్ళడం రానురానూ ఇవతలి షాప్ నడవక దివాలా తీయడం జరుగుతుంది. సాయంత్రానికి అమ్ముడుపోగా మిగిలిన అరటి పళ్ళను అక్కడికి వచ్చిన చిన్నపిల్లలకు ఆమె ఇస్తూ ఉంటుంది. చివరికి తిండికి కూడా కరువైన మొదటి కొట్టువాడి పిల్లలు అక్కడికెళ్ళి అరటి పళ్ళు అడుక్కు తింటుంటారు. ఓ రోజువాళ్ళు విసిరేసిన తొక్కపై కాలుజారి మొదటి కొట్టు వాడి కొడుకు పడిపోతాడు. అన్నాళ్ళు పెరిగిపోయిన కోపం, ఉక్రోషం, అసూయ కలగలసి మొదటివాడు ఆమెను బండబూతులు తిడతాడు. చివరికి ఒంటరి మహిళ అయిన ఆమె కారెక్టర్ గురించి కూడా నీచంగా మాట్లాడుతాడు. ఆమె చాలా కూల్ గా ఆ అబ్బాయికి వైద్యం చేయిస్తుంది. ఇది చిన్న కథ అయినా, చిన్న చిన్న వ్యాపారాలు మొదలుకొని కార్పొరేట్ స్థాయిల దాకా బిజినెస్ పోటీ స్వభావాన్నీ, ఏ వృత్తి చేసేవాళ్ళయినా అశ్రద్దగా, బద్ధకంగా, నిరాసక్తంగా ఉండకుండా ఉత్సాహంగా, శ్రమ, అంకిత భావం కలగలిసి పని చేస్తేనే విజయం పొందుతారనే విషయాన్నీ తెలియజేస్తుంది. అంతే కాదు, ఒక ఒంటరి మహిళను వేరే రకంగానూ ఓడించలేననుకున్నప్పుడు మగవాడు ఉపయోగించే అస్త్రాలు.... ఒకటి శారీరక బలం చూపడం, రెండు వారి క్యారెక్టర్ మీద బురద జల్లడం, ఈ రెండింటినీ ఎదుర్కొన్న స్త్రీలు ఏ స్థాయి వారైనా జీవితంలో ముందుకెళతారని చెప్పే ఈ కథ ఒక విధంగా భిన్నమైంది.
    'తప్పెవరిది?' కథలో పేదరికం మనిషిని ఎలా లొంగదీసుకుంటుందో, బాల నేరస్థులు తయారవడానికి ఈ సంఘం ఎలా కారణమవుతుందో కళ్ళకు కట్టినట్టు వివరించారు. ఉన్నోళ్ళు, లేనోళ్ళ మధ్య అంతరాలు అంతకంతకూ పెరిగిపోతున్న మాట నిజం. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబంలో పుట్టిన సురేష్ కి నాలుగిళ్ళల్లో పని చేసుకునే తల్లి వరమ్మ, మేస్త్రీ పని చేస్తూ తను సంపాదించిందే కాక ఇంట్లో అడుగూ బొడుగూ ఎత్తుకుపోయి తాగే తండ్రి నర్సయ్యా ఉంటారు. తల్లి ఎవరినో బదులడిగి సురేష్ పరీక్ష ఫీజు కోసం ఇంట్లో తెచ్చి పెట్టిన డబ్బును తండ్రి ఎత్తుకుపోయి తాగేస్తాడు. లేట్ ఫీజు కట్టడానికి ఫైన్ తో సహా ఆ రోజే ఆఖరవడంతో స్నేహితుడు కిష్టప్ప సహాయంతో గట్టెక్కుతాడు సురేష్. సాయం చేయడంతో బాటు దొంగతనంగా కిళ్ళీ కొట్టుకు డ్రగ్స్ సప్లై చేసే పని చూపిస్తాడు కిట్టప్ప. దాంతో రెండు మూడు సార్లు అలా చేసి డబ్బు సంపాదిస్తాడు సురేష్. ఓ రోజు పోలీసులు వచ్చి సురేష్ ను పట్టుకుపోవడంతో అసలు విషయం బయటపడి వరమ్మ ఏడుస్తుంది. ఈ కథ రాయబడ్డ దశాబ్దం తరువాత కాఫీ టిఫిన్ సెంటర్స్, సినిమా థియేటర్స్, బేకరీలు కేంద్రంగా డ్రగ్స్ అమ్మకం జరుగుతోందనీ, స్కూల్ పిల్లలు, కాలేజీ విద్యార్ధులూ, సాఫ్ట్ వేర్ ఉద్యోగులూ డ్రగ్స్ కి బానిసలు అవుతున్నారనీ, సినిమా వాళ్ళూ, బడా బాబులూ, కొందరు సామాన్యులూ ఈ సరఫరాలో భాగస్వాములవుతున్నారనీ వార్తలు వస్తున్న నేపథ్యంలో రచయిత్రికి సమాజంలో వస్తున్న మార్పుల పట్ల ఎంత లోతైన అవగహన ఉందో అర్ధమవుతుంది.
    అయితే, ఇదే కథ 'దోషులెవరు?!' పేరుతో పాత్రల పేర్లు మార్చి ఎనిమిదేళ్ళ తరువాత తిరిగి రాశారు రచయిత్రి. బహుశా ఇది కేవలం పొరపాటైనా అయి ఉంటుంది, లేదా అప్పటికీ, ఇప్పటికీ మత్తుమందుల సరఫరా, అందులో అభంశుభం తెలియని పిల్లల్ని పావులుగా వాడుకోవడం మరింత పెరిగింది గనుక ఈ విషయం గురించి ఎక్కువగా రాయాల్సిన అవసరం ఉందని భావించడం కూడా అయి ఉండవచ్చు.
    ఇంచుమించు ఇదే అంశంపై ఉన్న మరో కథ 'బ్రతుకు తెరవు'. రెండెకరాల భూమున్న కొమురయ్య వ్యవసాయంలో అప్పులు ఎక్కువై పొలం అమ్మిన డబ్బులు అప్పులు తీర్చడానికి సరిపోక, అప్పులిచ్చినవారి వత్తిడి తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటాడు. తన పిన్ని భూదేవి సలహాతోనూ, సహకారం తోనూ కొడుకు వెంకటేష్ ని తీసుకుని హైదరాబాద్ పట్నం చేరిన కొమురయ్య భార్య మల్లమ్మ ఓ అపార్టు మెంట్లో నాలుగు ఇళ్ళల్లో పనికి కుదురుతుంది. అప్పటికి అకడమిక్ ఇయర్ మధ్యలో కాబట్టి వచ్చే ఏడు బళ్ళు తెరిచేనాటికి కొడుకును స్కూల్లో వేద్దామనుకుంటుంది మల్లమ్మ. భూదేవి కొడుకు యాదగిరి అదే అపార్టు మెంట్స్ లో లిఫ్ట్ బాయ్ గా పనిచేస్తుంటాడు. లిఫ్ట్ లో పైకే కిందికీ తిరగడం ఎంతో సరదాగా భావించిన వెంకటేష్ లిఫ్ట్ నడపడంలోని మెళకువలన్నీ నేర్చుకుంటాడు.
    ఓ రోజు యాదగిరి లేని సమయంలో ఎవరో లిఫ్ట్ డోర్ గట్టిగా వేయకపోవడంతో మధ్యలో ఆగిన లిఫ్ట్ ని చూసి గ్రిల్ డోర్ లో తన చేయి పెట్టి వెంకటేష్ సవరించబోతుండగా మరెవరో పైన మీట నొక్కేసరికి లిఫ్ట్ సడన్ గా కదిలి పైకి వెళ్తుంది. ప్రమాదంలో వెంకటేష్ చెయ్యి మణికట్టు దాకా తెగిపోవడమే కాక, తలకు బలమైన గాయమవుతుంది. ఆ తరువాత ఆసుపత్రి ఖర్చులూ, అప్పులూ... అవి తీర్చడానికి మరో రెండిళ్ళలో పని.... వీటన్నిటితో తల్లి కష్టపడుతుండడం చూసి, తనూ తలకు తగిలిన దెబ్బ వల్ల చదువు మీద ధ్యాస పెట్టలేక, యాదగిరి మరెక్కడో వాచ్ మాన్ గా కుదరడంతో..ఓనర్స్ ని బతిమిలాడి లిఫ్ట్ బాయ్ ఉద్యోగంలో చేరతాడు వెంకటేష్. వ్యవసాయం, అప్పులు, రైతుల ఆత్మహత్యలు, భూములు అమ్ముకుని పట్నాల్లో కూలీలుగా మారడం, అనారోగ్యాలు, ఆసుపత్రి ఖర్చులు జీవితాల్ని అతలాకుతలం చేయడం, పేదరికం వల్ల బాల కార్మికులు తయారవడం వంటి సమస్యలు ఈ కథా సమయానికి రెండు దశాబ్దాల తరువాత ఇప్పటికీ ఏమాత్రం మారకపోగా మరింతగా పెరిగాయనేది మనం గమనిస్తున్న సత్యం. అటు భర్త ఆత్మహత్య చేసుకున్నా, ఇటు కొడుకు అంగవైకల్యం పొందినా మల్లమ్మ దుఃఖాన్ని దిగమింగిన తీరు, బతుకు తెరువు ఏర్పరచుకుని జీవితాన్ని తిరిగి నిర్మించుకున్న విధానం పాఠకులకు కంటతడి తెప్పిస్తుంది. స్త్రీల కోణం లోంచి కథలు రాసే కామేశ్వరి గారు తన కమిట్ మెంట్ ను మరోసారి చూపిన కథ ఇది.
    అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన మన దేశంలో సార్వత్రిక ఎన్నికలు మొదలుకొని సర్పంచ్ ఎన్నికల దాకా డబ్బు, మందు ఎలా ప్రధాన పాత్ర వహిస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీటితోబాటు ప్రైవేటు సైన్యాలు, గూండాయిజాలు, కులాల కుమ్ములాటలూ, కుట్రలూ, కుయుక్తులూ అత్యంత సాధారణం. గ్రామీణ రాజకీయాలూ, పార్టీల మధ్య ద్వేషాలూ, ఎన్నికల్లో రక్తపాతం..... వీటి గురించి రచయిత్రులు తక్కువ కథలు రాశారు. అవగాహన, పరిశీలన లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం కావచ్చు. కామేశ్వరి గారి కలం ఈ కథాంశాన్నీ వదల్లేదు. 'చదరంగం' కథలో చూపించారు. 


Related Novels


Bhava Bandhalu

Neti Kaalapu Meti Kathakulu

Chikati Podduna Velugu Rekha

Agni Pariksha

More