Home » D Kameshwari » Neti Kaalapu Meti Kathakulu


    హృదయాన్ని ద్రవింపజేసే 'చీకటి' కథ కామేశ్వరి గారి మంచి కథల్లో ఒకటి. దుర్మార్గుడూ, వ్యసనపరుడూ, స్త్రీ లోలుడూ అయిన తండ్రి రోజూ పొద్దున పూటే తాగి వచ్చి తల్లినీ, తననూ కొట్టడం, హింసించడం చేస్తూ రాత్రి పూట ఇంటికి రాడు కనుక చిన్ని అనే పిల్లాడికి చీకటి అంటే ఇష్టం. ఓ రోజు వాడ్ని తీసుకుని రాఘవులు అనే వ్యక్తితో కలిసి వేరే ఊరికి వెళ్తుంది తల్లి. అప్పటిదాకా అమ్మ ఒడిలో వెచ్చగా పడుకునే చిన్నికి అప్పటినించీ రాత్రి అన్నా చీకటి అన్నా భయం. రాఘవులు అకస్మాత్తుగా ఆక్సిడెంట్ లో పోతాడు. చిన్ని గాడ్ని పెంచడం కోసమే విధి లేని పరిస్థితిలో తల్లి పడుపు వృత్తి చేపడుతుంది. రాత్రిపూట వేరేవాళ్ళతో తనను చూడొద్దని చిన్నిని చీకట్లోనే ఉంచుతుంది తల్లి. అయినా చిన్నికి ఓ రోజు విషయం తెలిసి అప్పట్నుంచీ వెలుగును చూడడానికి ఇష్టపడడు. చివరికి ప్రమాదంలో చింతచెట్టు పైనుంచి కిందపడిన చిన్ని అంధుడై వెలుగుకు శాశ్వతంగా దూరమవుతాడు. 1970 నాటి కథ ఇది. అజ్ఞానం వల్లో, అవిద్య వల్లో, మూర్ఖత్వం వల్లో, వ్యసనాల వల్లో, పరిస్థితుల వల్లో......పిల్లల్ని కనడమే తప్ప సరిగా పెంచడం చేతగాని తల్లిదండ్రుల తాలూకూ సంతానం భవిష్యత్తు ఎంత అంధకారమవుతుందో 'చీకటి' కథ చదివితే బోధపడుతుంది.
    మనిషికీ ప్రకృతికీ ఉన్న అనుబంధాన్ని హృద్యంగా వర్ణించిన కథ 'వృక్షో రక్షతి రక్షితః'. ఈనాడు పెరుగుతున్న నగరీకరణ, దినదిన ప్రవర్ధమానమవుతున్న అపార్టు మెంట్ కల్చర్, ప్రతిదాన్నీ డబ్బు కోణంలో చూసే మనుషుల స్వార్ధం....వీటివల్ల మనిషి ప్రకృతికి ఎలా దూరమవుతున్నాడో చెప్పిన కథ ఇది. రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ చలపతిరావు ఎన్నో చోట్ల పనిచేసి ఆఖరి మజిలీగా తాను చివరగా పనిచేసిన హైదరబాద్ లో స్థిరపడతాడు. ఎప్పుడో చవగ్గా కొన్న స్థలంలో ఇల్లు కట్టుకుని చుట్టూ చెట్లు పెంచుకుని ప్రాణంలా చూసుకుంటుంటాడు. ఇంట్లోని చెట్లన్నీ కొట్టించేసి బిల్డర్ కి అప్పజెపితే కొడుకులిద్దరికీ, కూతుర్లిద్దరికీ తలో అపార్టు మెంటూ, కొంత నగదూ వస్తుందనేది ఆయన పిల్లల వాదన. పూసే కాసే చెట్లను కొట్టొద్దని పిల్లలకన్నా వాటిని ప్రాణంగా చూసుకునే చలపతిరావు అభిప్రాయం. ఎంత చెప్పినా ఆయన వినకపోవడంతో ఇంట్లో ఉండే కోడలు రహస్యంగా చెట్ల వేర్లకు మందు పెట్టిస్తుంది. దాంతో చలపతిరావు మండిపడి వీలునామా మార్చివేసి తన తదనంతరం ఆ చెట్లను కాపాడే షరతు మీద ఇల్లు వృద్ధాశ్రమానికి చెందేలా రాస్తాడు. ప్రకృతిని నిజంగా ప్రేమించడమంటే ఏమిటో ఈ కథ వివరిస్తుంది.
    'పల్లెకే పోదాం' అన్న కథలో 'బ్యాక్ టూ విలేజెస్' అనే కాన్సెప్ట్ ని ఇరవై ఏళ్ల కిందటే రాశారు రచయిత్రి. కొమురయ్య, రాజమ్మ దంపతులు ఊళ్ళో తమకున్న రెండెకరాల స్థలంలో నీటి వసతి లేక సరిగా పంటలు లేకపోవడంతో పట్నానికి వలస వస్తారు. అక్కడ మురికి వాడలో, గాలీ వెలుతురూ లేని ఇరుకు ఇంట్లో ఉండలేక, ప్రతి రోజూ పని దొరక్క, దొరికిన రోజు పది గంటల కష్టమైన పనితో అలసి, వచ్చిన కూలి డబ్బు నిత్యావసరాలకే సరి పోక, రోగాలతో చిక్కి శల్యమయి మళ్ళీ తమ ఊరికే వెళ్ళిపోయి తక్కువ నీటి వనరుతో పండే పంట వేసి బతుకుదాం అని నిర్ణయించుకుని తిరుగుబాట పడతారు. ఊర్లో డబ్బులు పెట్టకుండానేదొరికే ప్రతి వస్తువుకూ పట్నంలో డబ్బు చెల్లించాల్సి రావడం, పల్లెల్లో ప్రతి సీజన్లో చవగ్గా దొరికే కూరగాయలకి సిటీలో విపరీతమైన ధరలుండడం, దూరపు కొండలు నునుపు అన్నట్లున్న నగర జీవితంపై ఉన్న భ్రమలు ఎలా తొలగిపోయాయో చక్కగా చిత్రించారు. అయితే...పల్లెకూ, పట్నానికీ ఆదాయాల్లో వ్యత్యాసం ఎప్పుడూ ఉంటుంది. పైగా రెండెకరాలున్న కొమురయ్య, రాజమ్మ దంపతుల మాట సరే గానీ, ఏ భూమీ లేని నిరుపేదలకు వ్యవసాయాధారిత పల్లెల్లో ఏడాది పొడవునా కూలీ దొరికే మార్గం దుర్లభమే కదా! అందునా ఇరవై ఏళ్ల క్రితం పల్లెల్లో పరిస్థితి ఇప్పటంత మెరుగ్గా లేదు. ఈ ముఖ్య సమస్య వల్లే పట్టణాలకు వలసలు పెరిగాయి. విప్లవోద్యమాలు రగులుకున్నాయి.
    భార్య, నలుగురు ఆడపిల్లలు, ఓ అబ్బాయితో ఉద్యోగం పోయిన గృహస్తుకు తన సంసార సాగరం ఈదడం ఎంత కష్టమో తెలిసినవారికే తెలుస్తుంది. ఆకలి ఎంత భయంకరమో, అది ఎలాంటి పనులు చేయిస్తుందో 'ఆకలి' కథలో చిత్రించారు రచయిత్రి. ఇంట్లో వాళ్ళందరూ ఆకలి కడుపులతో అల్లల్లాడుతుంటే, చిన్న తమ్ముడు ఒక పండైనా తెచ్చి ఇమ్మని ఏడుస్తుంటే రామ్మూర్తి పెద్ద కూతురు ఎదురింటి యువకుడితో గడిపి డబ్బు తెచ్చి ఇంట్లోకి సరుకులు తెచ్చి వంట చేస్తుంది. తల్లి దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. పక్కింటాయన తన కూతురు గురించి చెడ్డగా మాట్లాడితే 'మేము కష్టపడుతుంటే ఒక్కడూ సహాయపడ్డవాడు గానీ, అయ్యో పాపం అన్నవాడు గానీ లేరు గానీ, మా విషయాలు మీకెందుకు?' అంటాడు రామ్మూర్తి. అయితే నిస్సహాయుడైన రామ్మూర్తి ఏమీ చేయలేక సర్దుకుని రాజీ పడినా, ఆకలి తీరడానికి మరెన్నో మార్గాలుండగా కూతురు చేసిన పనిని సమర్ధించడం పలాయనవాదమే అనిపిస్తుంది. అందులోనూ లంచం తీసుకుంటూ పట్టుబడి ఉద్యోగం నుండి పెన్షన్ కూడా లేకుండా డిస్మిస్ చేయబడ్డ వ్యక్తి.....ప్రభుత్వం పెద్ద తిమింగలాలను వదిలి తన లాంటి చిన్న చేపలను పట్టుకున్నందుకు నిందిస్తూ ఉంటాడు. పైగా తక్కువ జీతం, పెద్ద కుటుంబం ఉన్నవాళ్ళు ఏం చేస్తారని సమర్ధించుకుంటాడు తప్ప తన తప్పుందని అంగీకరించడు. ఎక్కడో లెక్కలు రాసే చిన్న ఉద్యోగం చేస్తూ, నెలాఖరులో పావలా వచ్చే కూలి పని చేయడానికి జంకుతాడు. మధ్యతరగతి కుటుంబాలలో బాధల కంటే సమాజపు నిఘా, శూలాల్లాంటి మాటలే ఎక్కువ బాధిస్తాయనే నిజం తెల్పుతుందీ కథ.
    'వేట' సాంకేతికంగా ఎంతో సమాచారాన్ని తెలుసుకుని రాసిన కథ. ఇలాంటి కథలు స్త్రీలు రాయడం అరుదు. పాతికేళ్ళ క్రితమే ఈ కథను ఆమె రాశారంటే రచయిత్రి పరిశీలన, అవగాహన, లోతైన చూపు మనం అర్ధం చేసుకోవచ్చు. రమాకాంత్ అనే ఫారెస్ట్ కన్జర్వేటర్ వ్యసనపరుడు. స్త్రీ లోలుడు. ఒక కాంట్రాక్టు తనకే రావడానికి పట్నాయక్ అనే కాంట్రాక్టర్ అడవి మధ్యలో డాక్ బంగ్లాలో రమాకాంత్ కూ, అతని స్నేహితులకూ విందూ, వేట కోసం మాటు ఏర్పాటు చేస్తాడు. అక్కడ ఎదురుగా టెంట్ హౌస్ లో పట్నాయక్ బార్యని చూసి, కోరిక కలుగుతుంది. రమాకాంత్ కు. మొదటిరోజు పులి తప్పించుకుంటుంది. రెండో రోజు స్నేహితులను పంపి, ఒంట్లో బాగోలేదనే నెపంతో ఉండిపోతాడు రమాకాంత్. ఆ రాత్రి ఎరగా ఉంచిన మేక కోసం వచ్చిన పులిని మిత్రబృందం చంపుతారు, టెంట్ హౌజ్ లో రమాకాంత్ కోరికా తీరుతుంది. తెల్లవారగానే వెళ్ళిపోతూ పట్నాయక్ కే కాంట్రాక్టు వచ్చేలా చూస్తానని రమాకాంత్ చెప్పి వెళతాడు. ఆమె తన భార్య కాదనీ, డబ్బుల కోసం ఆ వృత్తి చేపట్టి, తను కుదిరిస్తే వచ్చిన వ్యక్తి అని పట్నాయక్ ఎప్పటికీ చెప్పడు.


Related Novels


Bhava Bandhalu

Neti Kaalapu Meti Kathakulu

Chikati Podduna Velugu Rekha

Agni Pariksha

More