Home » D Kameshwari » Neti Kaalapu Meti Kathakulu


    మనసులు ఇరుకై, స్వార్ధాలు పెరిగి ఆర్దిక బంధాలు కుటంబ బంధాలనూ, మొత్తంగా మానవ సంబంధాలనూ మింగేస్తున్న రోజులివి. ఉమ్మడి కుటుంబాలు దాదాపు మృగ్యమవుతున్న నేపథ్యంలో కుటుంబం కోసమే, ఉమ్మడి అవసరాల కొరకే తమ కోరికలను, సౌకర్యాలను త్యాగం చేసిన పాత తరం వారు ఈ పరిణామాన్ని తట్టుకోలేక నలిగిపోతున్న విషయాన్ని ఎన్నో కోణాల్లో తన కథల్లో చిత్రించారు కామేశ్వరి. స్వేచ్చాయుతమైన వాతావరణాన్ని అభిలషించడం, సౌకర్యవంతమైన మెరుగైన జీవనశైలిని కోరుకోవడం తప్పేమీ కాకపోయినా.... పెద్దలకు ప్రేమ భద్రత అందించే బాధ్యత తమకుందని ఇప్పటి తరంలో ఎక్కువమంది మర్చిపోతున్నారు. కొన్నిసార్లు ఆస్తిపాస్తుల కోసం అంతగా లోకజ్ఞానం లేని తల్లిదండ్రులను కూడా మోసం చేస్తున్నారు. 'విలువలు మారాయి' కథలో రచయిత్రి ఇదే చెప్పారు.
    అరవై ఏళ్ళు దాటిన రాజేశ్వరమ్మ మధ్య తరగతి ఇల్లాలు. ఉమ్మడి కుటుంబపు బాధ్యతలు తీరాక, తమ పిల్లల చదువులూ, పెళ్ళిళ్ళకూ పి. ఎఫ్. డబ్బులు ఖర్చుపెట్టి, భర్త రిటైర్ అయ్యాక అతి కష్టం మీద ఓ చిన్న రెండు బెడ్ రూములు ఇల్లు కట్టుకుంటారు. చుట్టూ చెట్లతో పర్ణశాలలా ఉన్న ఇంటిలో గడుపుతుండగా భర్త సదన్ గా చనిపోతాడు. కొడుకు పని చేస్తున్న ఉద్యోగం వదిలి ఇక్కడే ఉద్యోగం చూసుకుని భార్యతో సహా ఆమె దగ్గరికి వచ్చి ఉంటారు. కొన్నాళ్ళకు పక్కింటి వాళ్ళు డెవలప్ మెంట్ కోసం ఇస్తున్నారనీ, తమ ఇల్లు కూడా ఇస్తే మంచి అపార్ట్ మెంట్లు వస్తాయనీ, కొడుకు శ్రీనివాస్ ఆమెను కన్విన్స్ చేసి సంతకం పెట్టిస్తాడు. తమకు చిన్న ఇల్లే అద్ధెకు దొరికిందని చెప్పి ఆమెను వృద్ధాశ్రమంలో చేరుస్తాడు.        ఒక రోజు పక్కింటి వరలక్ష్మి మనవరాలు వందన ఏదో దినపత్రిక రిపోర్టర్ గా ఆ వృద్ధాశ్రమానికి వచ్చి రాజేశ్వరమ్మను గుర్తుపట్టి మాట్లాడుతుంది. మర్నాడు పొద్దున్నే అందరి ఫోటోలు, వివరాలతో వచ్చిన ఆ పత్రికతో శ్రీనివాస్ ధుమధుమలాడుతూ వచ్చి తన పరువు బజారుకెక్కించావని తల్లిని నిందించి ఈ రెండు గదుల ఇరుకు అద్దె ఇంటికెళదాం పదమంటాడు. దానికి బదులుగా రాజేశ్వరమ్మ తనకు వచ్చే పెన్షన్ తో తనక్కడ హాయిగానే ఉన్నాననీ, ఇరుకు ఇంట్లో ఉండడానికి ఇబ్బంది లేదు కానీ, ఇరుకు మనసుల మధ్య ఉండలేనంటుంది. నిజంగానే నిజాయితీ ఉంటే అతని చెల్లెలికి రావాల్సిన వాటా ఇవ్వమంటుంది. కామేశ్వరి కథల్లో ప్రత్యేకత ఇదే! చాలా సార్లు స్త్రీలు నిస్సహాయంగా తలవంచి ఉండకుండా నిబ్బరంగా, ఆత్మవిశ్వాసంతో ఉంటూ పరిస్థతుల్ని ధైర్యంగా ఎదుర్కుంటారు.
    ఈ విభాగంలో ఇంకా 'తల్లి హృదయం, తాగితే పట్టు, పున్నామ నరకం, ఎండమావులు, కొడుకు ఖరీదు, కార్యేషు మంత్రి, సర్దుబాటు'వంటి కొన్ని కథలను స్థలాభావం వల్లా, పునరుక్తి అవుతుందనీ ప్రత్యేకంగా ప్రస్తావించలేదు.
    కుటుంబాలు ఆనందంగా ఉండాలంటే అందులో ఉండే మనుష్యుల మధ్య ప్రేమ, గౌరవం, అభిమానం, బాధ్యత ఉండాలనీ, అవి పరస్పరాధారితాలనీ, అవి లేనప్పుడు ఆ కుటుంబాలలో వ్యక్తుల మధ్య వైరుధ్యాలు, ద్వేషాలు పెరిగి వారు రగిలిపోతూ ఉంటారనీ, కుటుంబాలు విచ్చిన్నమవుతాయనీ రచయిత్రి చాలా కథల్లో, అనేక పాత్రల ద్వారా పలికించారు.
    
         సామాజిక కథలు

 

    సమకాలీన సామాజిక పరిస్థితులను నిశితంగా పరిశీలించి కథలు రాసిన రచయిత్రి కామేశ్వరి. మనకు పరిచయం లేని పరిస్థితుల గురించి, తెలియని సమస్యల గురించి. సమాజపు ఇతర కోణాల గురించి కథలు రాసేటప్పుడు రచయితలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నాలుగు కథలు చదివో, రెండు సినిమాలు చూసో రాయడానికి వీలుండదు. రాసినా ఆ కథలు పండవు. కథలు జీవితపు శకలాలు. అవి జీవితాల్లోంచే రావాలి. ఈ విషయంలో రచయిత్రి చాలా శ్రద్ధ తీసుకున్నారు. తన జోన్ కాని కథలు రాసేటప్పుడు స్పష్టమైన అవగాహన పెంపొందించుకుని రాసారు.
    'కంచె మేసిన చేను' కథలో బడుగు వర్గాలు ఎప్పుడూ ఈ వ్యవస్థలో పావుల్లా బలి అవుతూనే ఉంటారనే విషయాన్ని హృదయం ద్రవించేలా సంఘటన రూపంలో చెబుతారు రచయిత్రి. కూలీ పని చేసుకుని బ్రతికే పెంటయ్య భార్య చుక్కి అందాన్ని చూసి మనసుపడ్డ పోలీసులు ఓ రోజు పెంటయ్య లేని సమయంలో చుక్కిని ఇంట్లోంచి తీసుకెళ్ళి అత్యాచారం చేసి ఆ రాత్రంతా బంధించి తెల్లవారి వదుల్తారు. నిజం తెలిసి కూడా తమ పోలీసుల మీద మరక పడకుండా గవర్రాజు అనే కానిస్టేబుల్ కుయుక్తితో, అధికార బలంతో వాళ్ళను కాపాడి, ఏ అండా లేని చుక్కి, పెంటయ్యల నోట్లో మట్టి కొట్టడం ఈ కథలో చూస్తాం. పోలీసుల జులుం, పోలీస్ స్టేషన్ వాతావరణం, వాళ్ళ దేహభాష, మాట్లాడే భాష.....ఇవన్నీ చక్కగా చిత్రించడంలో రచయిత్రి పరిశీలనా, అవగాహనా అర్ధమవుతుంది. చేనును కాపాడాల్సిన కంచె విఫలమవడమే నేరమంటే.....ఇక్కడ కంచెను కాపాడుకోవడం కోసం చేనునే బలిపెట్టడం అనేది ఘోరం. అసలు చేను లేనప్పుడు కంచె అవసరమే లేదు, అలాగే ప్రజలకు ఉపయోగపడాల్సిన ఏ అధికార యంత్రాంగమైనా తమ స్వప్రయోజనాల కోసం ప్రజలకు హాని తలపెట్టడం క్షమార్హం కాని నేరం అని రచయిత్రి ప్రతీకాత్మకంగా చెప్పారు. యాభై ఏళ్ల నాటి ఈ కథ ఇప్పటికీనిలిచి ఉండడమే రచయిత్రి సర్వకాలీన అంశాల ఎంపికను తెలియజేస్తుంది.    
    'ఈ దేశమే గతి బాగుపడునో' - స్వచ్చత, పరిశుభ్రత విషయంలో మనం ఎంత దూరంలో ఉన్నామో కళ్ళకు కట్టినట్లు చిత్రించిన కథ. 1993 'వనిత దీపావళి సంచిక'లో వచ్చిన ఈ కథ లోని పరిస్థితులు ముఫ్ఫై ఏళ్ల తరువాత కూడా ఏమీ మారలేదు. విమలాదేవి అనే జమీందారిణి తన భవనం చుట్టూ ఉన్న మురికివాడలను స్వంత ఖర్చుతో బాగుపరిచి, స్వచ్చత, పరిశుభ్రత, పచ్చదనం అనేవి ఆరోగ్యానికీ, భవిష్యత్తుకూ ఎంత అవసరమో వివరించి చెప్పి, ఆచరణలో కూడా చూపెడుతుంది. ప్రజలు ఆమెను స్వచ్చందంగా నాయకురాలిగా ఎన్నుకున్నాక, ఆమె మరికొంచెం ముందుకెళ్ళి ఉపాధికల్పన దిశగా కృషి చేస్తూంటే కుటిల రాజకీయ శక్తులు ఆమె మీద బురదజల్లి అపనిందలకు గురిచేసి చివరికి రాజకీయాలకు దూరం చేస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో 'జన్మభూమి' పథకం గానీ, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ 'స్వచ్చ భారత్ గానీ అమలులోకి రాకముందే పరిశుభ్రత ప్రాధాన్యత గురించి భవిష్యత్ దర్శనం తో ఈ కథ రాసిన కామేశ్వరి గారి ఊహాశక్తికి జోహార్లు. అయితే మున్సిపల్ శాఖామంత్రి ఒక పట్టణానికే పరిమితం కారన్న చిన్న లాజిక్ తప్ప....కథ, కథాగమనం ఎంతో బాగున్న, ఇప్పటికీ అవసరమైన కథ ఇది.
    'మనిషి చేసిన దేవుడు' అన్న కథలో చదువుకున్నా ఉద్యోగం రాక, వృద్దులయిన తల్లిదండ్రులకు సహాయపడాల్సింది పోయి వారికి భారమవడం నచ్చక, శ్రోత్రియ కుటుంబంలో పుట్టిన ఖర్మానికి కూలీనాలీ చేసుకోను చేతకాక శంకరం అన్న యువకుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో సర్వం పరిత్యజించి సన్యాసిని మారి, కాలక్రమేణా శంకరానందస్వామిగా రూపాంతరం చెందడాన్ని ఎంతో సహజంగా చిత్రించారు రచయిత్రి. దొంగ స్వాములు, మోసగాళ్ళు, కామ పిశాచులు.....సన్యాసుల ముసుగులో నేర సామ్రాజ్యాలు విస్తరింపజేస్తున్న క్రమంలో నిరాడంబరంగా ఉంటూ, నమ్మిన భక్తులు ఇచ్చే పళ్ళూ, పాలూ వంటి సాత్వికాహారం తింటూ, ఓ పాత ఆలయంలో నివసిస్తూ, తనకు తోచిన నాలుగు మంచి మాటలు భక్తులకు ప్రబోధిస్తూ జీవితాన్ని మలచుకున్న శంకరం పట్ల సానుభూతే తప్ప పాఠకులకు కోపం రాదు. భక్తుల విశ్వాసం కోల్పోనంతవరకూ నేరాలు చేయకుండా, విలాసవంతమైన జీవితం జోలికి పోకుండా సన్యాసిలా నిరాడంబర జీవితం గడపవచ్చని తెలియజేసారు రచయిత్రి.


Related Novels


Bhava Bandhalu

Neti Kaalapu Meti Kathakulu

Chikati Podduna Velugu Rekha

Agni Pariksha

More