Home » D Kameshwari » Neti Kaalapu Meti Kathakulu


    'మీ అల్లుడు ఇది అడుగుతున్నాడు, ఆయనకు ఫలానాది కావాలట. ఆఫీసుకు వెళ్ళడానికి ఇబ్బంది అవుతోందట.....బండి కొనివ్వండి' అంటూ కూతుర్లే తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టిన సందర్భాలున్న చోట 'కోడలు అలిగిన వేళ' కథలో కొత్తకోడలు మాదిరిగా కొందరయినా అమ్మాయిలు ముందుకు వచ్చి మార్పు తేవాలని కోరుకోవడం అత్యాశ కాదు.    
    గృహహింస గురించి ఇటీవల బాగా చర్చ జరుగుతోంది. ఈ అంశాన్ని కథగా ఎప్పుడో మలిచారు కామేశ్వరి. ఎన్నో కథల్లో గృహహింస అన్నపేరు వాడకపోయినా దాని అనేక రూపాలను చర్చించారు. 'ఆదిశక్తి' కథలో పెళ్ళయి ఇద్దరు పిల్లలున్న రమకు ఏనాడూ పదేళ్ళ సంసారంలో ప్రేమ, ఆప్యాయత లభించకపోగాభర్త ప్రసాద్ నుండి ఎప్పుడూ విసుర్లు, కసుర్లు, ఛీత్కారాలు, అవమానాలు, ఎత్తిపొడుపులు, అరుపులు మాత్రమే దక్కాయి. ఎన్నేళ్ళు ఎదురు చోసినా అతనిలో రవ్వంతయినా మార్పు రాదు. ఓ రోజు చిన్ననాటి స్నేహితురాలు దుర్గ వచ్చేసరికి ఉప్మాలో ఉప్పు మరిచిపోయిందని ప్లేట్ విసిరేసి నానా భీభత్సం చేస్తాడు రమ భర్త. దుర్గ సలహాతో చెప్పకుండా ఇల్లు విడిచిపోతుంది రమ. నాలుగురోజులు పిల్లల్తో అతడు యమయాతన పడ్డాక తిరిగి వస్తుంది. దుర్గ పెట్టిన ఇంటర్నేషనల్ స్కూల్ లో బీ ఎడ్ చేసిన తనకు ఉద్యోగమూ, ఉండడానికి వసతీ లభించిందనీ, డైవోర్స్ కి అప్లై చేస్తాననీ, పిల్లల్ని కూడా తానే పెంచుకుంటాననీ ఆత్మవిశ్వాసంతో చెబుతుంది.
    'ఆడదంటే ఆదిశక్తి. ఆ జగన్మాతకు పది చేతులున్నట్లే గృహిణి కూడా భర్త అవసరాలు తీరుస్తూ, పిల్లల్ని కని పెంచుతూ, ఇల్లూ వాకిలీ దిద్దుకుంటూ, పది చేతులున్నట్లే అందర్నీ చూసుకుంటూ సేవలందిస్తుంది. అలాంటి స్త్రీకి సంసారంలో కాసింత ప్రేమ, ఆప్యాయత, ఆదరణ, గౌరవం లభించకపోగా నిరంతరం తిట్లూ, కోపాలూ, నిరసనలూ ఎదురవుతుంటే ఏ స్త్రీ అయినా ఎంతకనీ సహిస్తుంది? ఆదిశక్తి అవతారమెత్తుతుంది. మెత్తటి రబ్బరు బంతి కూడా నేలకేసి కొడితే రెట్టింపు వేగంతో పైకి ఎగసినట్టు స్త్రీ సహనం కోల్పోతే అపరకాళి అవుతుంది' అన్న మాటలు రమ తల్లిదండ్రుల నోటి గుండా చెప్పించారు రచయిత్రి.
    ఇది నిజానికి దుర్మార్గులైన, పురుషాహంకారులైన మగవాళ్ళందరూ గ్రహించి....మహిళల పట్ల......ముఖ్యంగా కట్టుకున్న భార్యల పట్ల మెలగాల్సిన పద్ధతి నేర్చుకోవాల్సి ఉంది. ఇంట్లో ఉండే ఆడవాళ్ళను ఏం చేసినా అడిగేవారుండరనో, ఏదయినా మాట్లాడొచ్చుననో, వాళ్ళ మీద హింసను ప్రయోగించినా నోరు మూసుకుని పడి ఉండాల్సిందేననో అభిప్రాయం చాలా మంది మగవాళ్ళకు ఉంటుంది. చేయి చేసుకునే వాళ్ళు తక్కువగా ఉన్నా మాటలతో హింసించే, నిందించే వాళ్ళు ఇప్పటికీ చాలా ఎక్కువే. చాలా కథల్లో కుటుంబ వ్యవస్థను గౌరవించాలనీ, సంసారాలు పాడుచేసుకోవద్దనీ చెప్పే కామేశ్వరి గారు...భర్త మరీ దుర్మార్గుడైతేనో, వ్యసనపరుడై తీవ్రమైన కష్టాలు పెడితేనో అతన్ని పట్టుకుని వేలాడే అవసరం ఆ భార్యకు ఎంతమాత్రమూ ఉండక్కర్లేదని చెబుతారు.
    సరిగ్గా దీనికి విరుద్ధమైన కథ 'ఇది జీవితం'. ఈ కథాకాలం 1970 - 75 మధ్య.. అంటే సుమారు యాభై ఏళ్ల క్రితం కథ. కామేశ్వరి గారి చాలా కథలు స్త్రీల కథలే, స్త్రీ కోణం నుంచి రాసినవే అయినా పురుషుల్లో కూడా మంచివాళ్ళుంటారనీ, కొన్నిసార్లు స్త్రీలు అవివేకంతో, మూర్ఖత్వంతో వారిని అర్ధం చేసుకోకుండా ఇల్లు నరకంగా మార్చుకుంటారనీ చెప్పిన కొన్ని కథల్లో 'ఇది జీవితం' ఒకటి. కథాంశం సీరియస్ దే అయినా, రచయిత్రి ఈ కథను కాస్త హాస్య, వ్యంగ్య ధోరణిలో నడిపారు బెల్ బోటమ్స్, గోగో గ్లాసెస్, పోనీటెయిల్ ధరించి, నవలలూ, సినిమాలూ తెగ చదివీ చూసీ జీవితం అంటే ఓ రంగుల దృశ్యకావ్యంగా భావించే ఇరవై ఏళ్ల రుక్మిణి కి సన్నగా, చామనఛాయలో, ఓ మాదిరి ఎత్తులో ఉండే కాలేజీ లెక్చరర్ సుబ్బారావుతో పెళ్ళవుతుంది.
    తన కలల రాకుమారుడి లక్షణాలు ఒక్కటి కూడా లేని సుబ్బారావుతో జీవితం సహజంగానే బోర్ కొట్టింది రుక్మిణికి. మోస్ట్ రొమాంటిక్ హస్బెండ్ లా లేని సుబ్బారావు శాంతం, సహనం, ఎప్పుడూ నవ్వుతూ ఉండే స్వభావం ఉత్త చేతకాని మొద్దబ్బాయి లక్షణాల్లాగా అనిపించి నిర్లిప్తంగా మారిపోతుంది రుక్మిణి. అయితే అప్పుడప్పుడూ సినిమాకో, షికారుకో తీసుకెళ్ళినా అంతకంటే ఖరీదైన కోరికలున్న రుక్మిణికి ఆ చిన్న చిన్న విషయాలు సంతోషాన్నివ్వవు. ప్రతిదానికీ పెడసరంగా, నెగటివ్ గా మాట్లాడ్డం అలవాటవుతుంది. కొన్నాళ్ళకు భార్య స్వభావమే అంత అనుకుని తన పీ హెచ్ డీ లో మునిగిపోతాడు సుబ్బారావు. ఒక దశలో 'నాకు డైవర్స్ కావాలి' అని అడిగిన రుక్మిణితో ఏదో చదువుకుంటూ ఉన్న సుబ్బారావు యథాలాపంగా 'అలాగే' అని కూడా అంటాడు. ఇంతలో వాళ్ళకు కొడుకు పుడతాడు. ఆ పిల్లవాడు కూడా అడ్వర్టైజ్ బేబీలా కాక జలుబో, దగ్గో, విరోచనాలో బాధపెడుతూ ఉంటే ఎప్పుడూ ఏడుస్తూ ఉంటాడు. పిల్లవాడి చాకిరీ అదనంగావచ్చి చేరడంతో అసంతృప్తి, బాధ, నిరాశ, నిస్పృహల వల్ల కోపం, చిరాకు ఎక్కువవుతుంది రుక్మిణికి.
    ఓ రోజు పిల్లడు ఏడుస్తుంటే చిరాకుతో 'ఎక్కడికన్నా వెళ్ళిపోయి బతుకుదామంటే వీడొకడు నా ప్రాణానికి' అంటూ వాడ్ని ఎత్తి కుదేస్తుంది. దాంతో సుబ్బారావుకు కోపం వచ్చి పిల్లాడ్ని ఎత్తుకుని వాడి ఆలనా పాలనా తను చూసుకోగలననీ, ఆమెను తక్షణమే ఇంట్లోంచి వెళ్ళిపొమ్మనీ, నవలలు చదువుకుంటూ, సినిమాలు చూసుకుంటూ హాయిగా బతకమనీ చెబుతాడు. ఈ పరిణామం ఊహించని రుక్మిణి అప్పట్నుంచీ సుబ్బారావు ఎదుట విసుక్కోవడం మానేస్తుంది. ఇప్పుడు సెల్ ఫోన్లు, సోషల్ మీడియా మనుషుల్ని ఎంత అన్ ప్రొడక్టివ్ గా తయారు చేస్తున్నాయో, యాభై ఏళ్ల క్రితం కలలను అమ్మే కొన్ని నవలలు, సినిమాలు రుక్మిణి లాంటి యువతరాన్ని వాస్తవ జీవితానికి అలాగే దూరం చేసి బాధ్యత తెలియకుండా పాడు చేశాయో తెలిపిన కథ. చివర్లో సినిమాటిక్ ముగింపు ఇవ్వగల్గినా రచయిత్రి లోని వాస్తవిక ధోరణి అలా కాకుండా....ఎవరిలోనైనా మార్పు అంత తొందరగా రాదు, పైగా కొన్ని స్వభావాలు చాలా తీవ్రంగా కరడుగట్టిపోయి ఉంటాయి గానీ మారవు అనే చేదు వాస్తవాన్ని తెలుపుతుంది. పిల్లాడ్ని ఎత్తుకుని 'మా బతుకు ఇంతేరా నాయనా!' అని ఏడ్చింది రుక్మిణి' అన్న వాక్యంతో ఈ విషయాన్ని స్పష్టం చేస్తారు కామేశ్వరి.


Related Novels


Bhava Bandhalu

Neti Kaalapu Meti Kathakulu

Chikati Podduna Velugu Rekha

Agni Pariksha

More