Home » vaddera chandidas » ప్రేమతో ....వడ్డెర చండీదాస్


           
                                                               ప్రేమతో ....


                                                                                 - వడ్డెర చండీదాస్ 
                                                           

                                                                    పరిచయం

    గొప్ప క్రియేటివ్ రచయితలుంటారు.కాని క్రియేటివిటీ,దార్శనికత ఒకరిలోనే వుండటం ప్రపంచంలోనే చాలా అరుదు.అలాంటివారిలో జీన్పాల్ సాత్రే ఒకరు.అలాంటి కోవకు చెందినవారే వడ్డెర చండీదాస్.అయితే సాత్రే చుట్టూ ఐరోపా దేశాల విభిన్న దర్శన దృక్పధాలు సమృద్ధిగా వున్నాయి.కాని కొన్ని శతాబ్దాల తరువాత ఈ ఉపఖండంలోనే ఒక కొత్త దర్శన శాస్త్రాన్ని,Destre and Liberation అనే దర్సన గ్రంధం ద్వారా రచించి ప్రతిపాదించిన ఘనడు ఈ తెలుగువాడు.
    ఈ వుత్తరాలు వడ్డెర చండీదాస్ 1984-2005 మధ్య రాసినవి.మొదటి మూడునేను ఐ.ఐ.టి కాన్పురులో ఫిలాసఫీలో పిహెచ్.డి.చేస్తున్నప్పుడు;11-11-1994 నుంచి నేను హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటిలో ఉన్నప్పుడు రాసినవి.వీటి మధ్యలోనివి నేను గోవా యూనివర్సిటిలో పని చేస్తున్నప్పుడు అక్కడికి రాసినవి.11-1-2005న రాసిన వుత్తరం నాకు చేరిన ఆఖరుది.వీటిలో వ్యక్తిగత విషయాలకన్నా అభిప్రాయాలు,అభిరుచుల ప్రస్తావన ఎక్కువ.యీ వుత్తరప్రత్యుత్తరాలు సాగుతున్న మధ్య,వొకసారి,'మి వుత్తరాలన్ని భద్రపరుస్తున్నాను,ప్రచురిస్తాన'ని నేను రాస్తే అందుకు జవాబుగా 'ఐతే నేను యిక నుంచి 'ఒళ్ళు దగ్గిర పెట్టుకుని రాస్తుండాలి'(24-7-04)అని సమాధానం రాశారు.ఈ కారణాల వల్ల ఈ వుత్తరాలను ప్రచురిస్తున్నాను.
    ఐ.ఐ.టి కాన్పూరులో చదువుతున్నప్పుడు 'హిమజ్వాల'.'Desire and Lideration'చదివాను.సెలవుల్లో తిరుపతి దగ్గిరలోని మా వూరి వొచ్చినప్పుడు శ్రీవెంకటేశ్వర యునివర్సిటి లైబ్రరీకి వెళ్ళేవాడినేకాని,చండీదాస్ను కలవాలన్న కోరిక వున్నా,ధైర్యం లేక ఆ పని చెయ్యలేదు.కాని ఒకసారి గీతాదేవిపై నా అభిప్రాయాన్ని రచయితకు చెప్పాలన్న గాఢమయిన కోరిక నన్ను తన దగ్గరకు తీసుకెళ్ళింది.ఒకరోజు లైబ్రరీనుంచి పక్కనే ఉన్న ఆర్ట్స్ కాలేజి బిల్డింగు దగ్గరకు తడబడుతూనే చేరాను.గదికి తాళం వేసుంది.ఒక గంటకు అపిగా అక్కడే వేచిఉన్నా.అప్పుడు అటెండరు 'సార్ యింటికి వెళ్ళారేమో,యిక ఈ రోజు రారేమో'నని ఇంటి నంబరు యిచ్చాడు.యింటికి వెళితే వాళ్ళ అమ్మాయి తలుపు తెరిచి,'నాన్నగారు లేరు'అని చెప్పారు.అలా మొట్టమొదటిసరి చూసింది తన 'బంగారు తల్లి'రాధికా చేతనను.తిరిగి డిపార్టుమెంటుకు వెళితే అప్పుడేటౌన్ నుంచి స్కూటరు రిపేరు చేసుకొని వొచ్చివున్నారు.అటెండరు నా సంగతి చెపితే లోనికి రమ్మనారు.వెళ్లి ఐదు నిమిషాలు క్లుప్తంగా మాట్లాడి హిమజ్వాల గురించి తత్తర పడుతూ-కృష్ణచైతన్యలోని prolomged passivity కి శివరాంలోని brief intensityకి మధ్య కొట్టుకులాడుతున్న గీతాదేవి ఆశ-అని భయంభయంగా లేచి సెలవు తీసుకున్నాను.బయటకొస్తున్న నన్ను వెనక్కి పిలిచి 'ఈ సారోచ్చినప్పుడు మళ్ళిరండి,i mean it'.అన్నారు.చాలా సంతోషంతో,ఆనందంతో ఇంటికి చేరాను,ఆ తర్వాత రెడ్బిల్టింగులో వున్నప్పుడు వెళ్ళి కలిశాను.చాలాసేపు మాట్లాడుకున్నాము,బయట కుర్చీలు వేసుకొని,ముఖ్యంగా సాహిత్యం గురించి.ఆ సందర్భంలో నేను 'కన్యాశుల్కంలోని ప్రత్యేకత అందులో ఒకనాటకం ఆధునిక తెలుగు సాహిత్యంలోని ఒక ప్రధమ రచన కావడం వల్ల ఆధునిక తెలుగు సాహిత్యం యొక్క స్వరూపం ప్రత్యేకతను సంతరించుకుంది.అందులోని మరొక ప్రత్యేకత అందులో హిరోకానీ,యాంటీహీరోకాని లేరు.Decentralized plot అయినందువల్ల ఈ నాటకంలో అందరూ తప్పులు చేస్సారు'అని నేనంటే అది ఆయనకు చాలా నచ్చింది.ఆ తర్వాత మేం వుత్తరాలు రాసుకోవడం మొదలయ్యింది.
    ప్రారంభదశలోని వుత్తరాల సైజు,క్రమం,సాంద్రత తక్కువయినా,తర్వాత చిన్నగా,చిన్నచిన్నగా అవి పెరుగుతూ వొచ్చాయి.మొదటి దశలోని వుత్తరాలలో నేను నా వుత్తారాలలో ప్రస్తావించిన విషయాలకు జవాబులే కాని విడిగా ఆయన తన అభిప్రాయాలను,అభిరుచులను,మనఃస్థితులను పేర్కొన్న దాఖలాలు సాధారణంగా కనిపించవు.ఉదాహరణకు:మొదటి వుత్తరంలో నేను రాసిన ఫిలాసఫికల్ మ్యూజింగ్స్ పై తన అభిప్రాయం,రెండవ వుత్తరం గీతాదేవిపై నా అభిప్రాయానికి స్పందన.మూడవది తన తాత్విక రచన Desire and Librationపై నా అభిప్రాయాలను అంగీకరిస్తూ యింకా అన్వేషణ కొనసాగించమని ప్రోత్సహిస్తూ రాసింది.
    కాని ఆ తర్వాత క్రమంగా నా వుత్తరాలలో ప్రస్తావించిన విషయాలకన్నా,తన గురించి,తన అభిప్రాయాల గురించి ప్రస్తావనలు ఎక్కువవుతూ వొచ్చాయి.ముఖ్యంగా నాలుగవ వుత్తరం,గోవాకు రాసిన మొదటి వుత్తరంలో నేను పంపిన ఫ్రెంచి సింబాలిస్టుకవి బోద్లేర్ (Baudelaire)కవితలి,నా కవితల గురించి ప్రస్తావించినా,ఈ వుత్తరంలో మొట్టమొదటి సారిగా తన అభిరుచుల గురించిన వాక్యం ఉంది.'సంగీతాస్వాదనతో జీవితంసాగుతూవుంది' అని.సంగీతం గురించి నేను ప్రస్తావించక పోయినా,ఈ విష్యం రాయటం,సంగీతం త జీవితంలో ఎంత ప్రాముఖ్యమయినదోవిదితమవుతుంది. సంగీతం చండీదాసు జీవితంలో ముఖ్యమైన పాత్ర వహించిందనే విషయం ఈ వుత్తరాలలో మనకు కనబడుతుంది.అందుకే తన సంగీతం రచన హిమోహరాగిని ;తన ఆఖరి రచన 'అజ్ఞాతనంతూర్మిళం'ల్లోని;దాని గురించిన నిర్నిరిక్షణ,యిందులో ప్రచురిస్తున్నాను.
    ఆ తర్వాతి వుత్తరాలలో తరుచూ కొంతకాలంపాటు ప్రస్తావనకు విషయం తను గోవాలో 'ఆరు నెలలలో ఏడాదికో తగ్గకుండా'వొచ్చి ఉండాలన్న కోరిక గురించి.ఈ ప్రయాణం సఫలం కాలేదు.అరేబియా సముద్ర ప్రాంతాన వుండాలనుకున్న తన కోరిక తీరకుండా మిగిలిపోయినది.'అలా మిగిలిపోయిన ఈ కోరికను 'మహాద్రసార్తి'లో ప్రస్తావించిన 'మొటాఫిజికల్ కాంక్ష'కు మధ్య సంబంధముందని పిస్తుంది.ఈ మోటాఫిజికల్ కాంక్ష:
    "కానీ,వో కోర్కె-తుది కోర్కె,కల్లోల సాగారానందం.
    అర్దరాత్రి పండువెన్నెట్లో కల్లోల సాగరంలో,వోదలాంటిదాన్లో కాక,వో చిన్ని నావలో వొంటరిగా
    -బడబాగ్ని కీలలలోంచి ఆకాశానికి యెగిసిపడే తెలినీలి కెరటాలల్లోని చివనావలో-
    అలా ప్రయాణిస్తూ,ఆ రసైక సాగరంలోంచి అనంతవిశ్వంలో లీనమై పోవాలని,యిది వుత్తి 'ఆలోచన'కాదు.స్వంచన (స్వవంచన )కాదు.
    ఐనా,ఊహ తెలిసిన పసితనం నుంచీ వున్న ఆ మెటాఫిజికల్ కాంక్షకి తొందరేముందని!
    అందుకే అందని అందాకా,మౌనం.యేదీ,ముందుగా-ఆరంభించి ముంగిచని 'సాహిత్యేతర'కళాసృజన ప్రక్రియల పనులు పూర్తి చెయ్యాలిగా!
    అందుకు అక్షరాలు అక్కర్లేదు.''
    పరిశిలనగా చూస్తే ఈ మెటాఫిజికల్ కాంక్ష,పై ప్రస్తావించిన తీరని కోరికలోని ఉపకోరిక (sub-desire)అనిపిస్తుంది.
    చివరిదశలో నేను ఒక్కొక్కప్పుడు వుత్తరాలు రాయకపోయినా తను మాత్రం తరుచూ రాస్తుండే వారు.1991 నుంచే మాయిద్దరి మధ్య గల సంబంధంలోని సాంద్రత పెరుగుతూ వున్నట్లనిపిస్తుంది.దీనికి ఆధారం 20-1-91,26-6-02,20-6-02,6-9-02 వుత్తరాలలోని కొన్ని వాక్యాలు.ఈ సంబంధంలోని పరిణామం కోసం సాధారణంగా అంతర్ముఖుడయిన చండీదాస్ గారిని వెళ్ళి కలిసినప్పుడు నాకు మొదట కొంచెం బెరుకుగాను,భయంగానూ ఉండేది.ఒక్కొక్కప్పుడు చాలా నిబ్బరంగా మెలగాల్సి వచ్చేది.చాలాసేపు మౌనంగా వుండేవారు.అలా అని వెళ్ళిపొమ్మన్నట్లుగా అనిపించేదీ కాదు.అప్పుడుప్పుడూ'వెళ్ళుతున్నాను'అని సూచనప్రాయంగా అన్నా 'అప్పుడే తోదరేమి'అన్నట్లు చూసేవారు.అప్పుడప్పుడూ మరీ ముడుచుకుని స్తబ్దుగా ఉండకుండా సున్నితంగా ఒకటి అరామాట్లాడే వాడిని.
    మా వూరు వెళ్ళినప్పుడల్లా వెళ్ళి కలిసేవాణ్ని.మొదట్లో క్లుప్తంగా మాట్లాడేవారు.ఆ తర్వాత గంటల తరబడి మాట్లాడే వారు రోజంతా చాలా విషయాల గురించి.మా డిపార్టుమెంటులో నాకు తలనొప్పి కలిగించే సమస్యల నుంచి తప్పించు కోడానికి నేను మీటింగులున్న రోజు సెలవు పెట్టేవాడిని,ఒకసారి విషయం చెపితే 'అలా చెయ్యకండి క్యాజువల్ సెలవులు ఎ ఒక్క పనికిగాని ముఖ్యంగా ఒకే పనిని తప్పించుకోడానికి ఉపయోగించరాదు'అని సలహాయిచ్చారు.'మరి యీ సమస్యకు పరిష్కారం ఎలాఅంటే మీరు మీటింగుకు వెళ్ళాలి గాని అక్కడ తప్పుకుండా మాట్లాడాలని లేదుకదా,వేరే గవర్నమెంటు ఉద్యోగాలలోలాగా'.అని ఒక గొప్ప సలహాయిచ్చి నాకు పెద్ద తలనొప్పిని తప్పించారు.యిలా ఎన్నో సాధారణమయిన విషయాలను గురించి మాట్లాడే వారు,సలహాలిచ్చేవారు,అభిప్రారయాలను చెప్పేవారు.మధ్యమధ్యలో చక్కెర,పాలు లేని బ్లాక్ టీ చేసిపెట్టేవారు.




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.