సారవంతమైన భూమిలో పంటలు బాగా పండుతాయి. అయితే భూమిని సారవంతం చేయుటకు రైతు కష్టపడి, అందులోని పనికిరాని మొక్కల్ని తొలగించి, దున్ని, నీరుబట్టి, ఎరువులు వేసి అపరిమితంగా కృషి చేస్తాడు. అప్పుడు ఆ భూమి సిరుల పంటలు పండిస్తుంది.

మానవ శరీరం కూడా భూమి వంటిదే. దాన్ని అదుపులో వుంచి చెడును తొలగించి మంచిని పెంచితే పురుషార్ధాన్ని సాధిస్తుంది. శరీరాన్ని సత్వపధాన పయనింప చేయుటకు మంచి అలవాట్లు ఎంతగానో సహకరిస్తాయి. అవి యోగాభ్యాసానికి అనుకూలంగా శరీరాన్ని మనస్సును మలుస్తాయి.

మన అలవాట్లు మంచివైతే అందరూ మనల్ని ఆదరిస్తారు. మంచి అలవాట్లు మనిషికి క్రమ శిక్షణ, సచ్చీలత, సత్సంప్రదాయాల్ని నేర్పుతాయి. చిన్నతనం నుంచి బాలబాలికలకు మంచి అలవాట్లు నేర్పడం తల్లిదండ్రుల బాధ్యత. అయితే యిప్పుడు రకరకాల ప్రలోభాలకు, ఆకర్షణలకు లొంగి యువకులు, పెద్దవాళ్ళేగాక బాలబాలికలు సైతం చెడు అలవాట్లకు లోనవుతున్నారు.ఈ చెడును తొలగించడం దేశ పౌరులందరి కర్తవ్యం. యోగాభ్యాసం వల్ల మంచి అలవాట్లు సాధకులకు అలవడుతాయి. దినచర్య, ఆహరం, ఉపవాసం, నీళ్ళు, మలవిసర్జన, మూత్రవిసర్జన, స్నానం, నిద్రలను గురించిన వివరాలు తెలుసుకొని, వాటిని సక్రమంగా అమలుబరిస్తే యోగాభ్యాసం తప్పక విజయం సాధిస్తుంది.

1. దినచర్య :

ఆరోగ్యంగా వుండటానికి క్రమశిక్షణతో కూడిన దినచర్య అవసరం. ప్రతిదినం మనం చేసే పనులు సరిగాను, సక్రమంగాను వుండాలి. అంటే దినచర్య మంచిగా వుండాలన్నమాట.

ప్రతిరోజూ రాత్రిళ్ళు త్వరగా పడుకొని ప్రొద్దున్నే త్వరగా లేచి దాహం వేసినా వేయకపోయినా చెంబెడు లేక గ్లాసెడు మంచినీళ్ళు తాగాలి. మలమూత్ర విసర్జన కావించి, ముఖం కడుక్కొని ఉదయం అవకాశం దొరికితే వాహ్యాళికి వెళ్ళాలి. తరువాత స్నానం చేయాలి. ముఖం కడుక్కునేప్పుడు నాలిక మీడగల పచిని బద్దతో తప్పక గీకివేయాలి. చాలా మంది పుక్కిలించి ఉమ్మి వూరుకుంటారు. అది సరికాదు. అంతే గాక నోటి లోపలి కొండనాలుకను చేతిబోతన వ్రేలితో (గోరు తగలకుండా చూసుకొని) రెండు మూడు సార్లు కొద్దిగా నొక్కి శుభ్రం చేయాలి. ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రిపూట భోజనం చేసిన తరువాత పళ్ళు తోముకోవాలి. అందువల్ల పళ్ళకు, చిగుళ్ళకు, నాళికకు, నోటికి అంటిన చెడు తొలగిపోతుంది. సూదులతోను, గుండు సూదులతోను పళ్ళు కుట్టుకోకూడదు. ఏమి తిన్నా నోటిలో నీళ్ళు పోసుకుని రెండు మూడుసార్లు తప్పక పుక్కిలించి ఉమ్మివేయాలి.

సాధ్యమైనంత వరకు చన్నీళ్ళతో స్నానం చేయడం మంచిది. చలికాలంలోనూ, బాగా జబ్బు పడినప్పుడు గోరు వెచ్చని నీటితో శరీరాన్ని బాగా రుద్దుతూ స్నానం చేయవచ్చు. శరీర మాలిన్యం తొలగడమే స్నానం యొక్క లక్ష్యం కావాలి.

మనం ధరించే బట్టలుబిగుతుగా వుండక, వదులుగా వుండాలి. ప్రతిరోజూ ఉతికిన బట్టలు ధరించాలి. కొన్ని గ్రామాల్లో యిప్పటికీ ఉతికిన బట్టలు జనం ధరిస్తూ వుంటారు. కానీ అన్ని చోట్ల యిది సాధ్యం కావడం లేదు. అయినప్పటికీ ఉతికిన బట్టలు ధరించడం అన్ని విధాల మంచిది.

నిద్ర ప్రతి జీవికి అవసరం. హాయిగా నిద్రపడితే ఆ మనిషి ఆరోగ్యంగా వున్నట్లు భావించాలి. నిద్రపట్టకపోవడం ఆనారోగ్యానికి గుర్తు, పడుకునే ప్రదేశం శుభ్రంగాను, గాలి వెలుగు వచ్చే విధంగానూ వుండాలి. మంచం లేక చాప, పరుపు, పక్క గుడ్డలు శుభ్రంగా వుండాలి.

ఇతరులతో మంచిగాను, తీయగాను మాట్లాడాలి. సత్యం పలుకుతూ వుండాలి. అయితే సత్యం ప్రకటించే విధానం కటువుగా వుండక, మంచిగా మధురంగా వుండాలి. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్ అని సూక్తి కదా ! స్వార్ధచింతనను తగ్గించుకొని చేతనైనంత వరకు పరులకు ముఖ్యంగా నిస్సహాయులకు, దీనులకు, రోగులకు సేవ, సాయం, మంచి చేయడం అలవాటు చేసుకోవాలి.

ప్రతిరోజూ పడుకోబోయే ముందు ఆనాటి తన దినచర్యకు ప్రతివ్యక్తి సమీక్షించుకొని, రేపటి దినచర్యను నిర్ధారించుకోవాలి. ఏనాటికానాడు తాను చేసిన పొరపాట్లను గమనించుకోవాలి. ముఖ్యమైన విషయాలకు డైరీలో తేదీల వారీగా వ్రాసుకోవాలి. యీ విధమైన దినచర్యకు ప్రతి వ్యక్తి అలవాటు పడితే, క్రమశిక్షణ అలవడుతుంది. తద్వారా దేశానికి మేలు జరుగుతుంది.