చలికాలంలో ఫ్యాషన్ గా కనిపించాలంటే ఇలా రెడీ అవ్వండి!!

అమ్మాయిలు సీజన్ తో సంబంధం లేకుండా ఫ్యాషన్ గా కనిపించాలని అనుకుంటారు. వేసవిలో మండిపోతున్న ఎండల్లోనూ తమ మేకప్ నుండి డ్రస్సింగ్ వరకు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వరు. ఇక చలికాలం కూడా  ఇంతే.. ఎంత చలి ఉన్నా చూపరుల మతి పోయేలా ఫ్యాషన్ తో తళుక్కుమంటారు. అయితే ఫ్యాషన్ గా రెడీ అవ్వడం వెనుక కాసింత అవహాన కూడా ఉండాలి. అలాగైతేనే ఈ చలికి చెక్ పెట్టి ఒకవైపు వెచ్చదనాన్ని, మరొకవైపు ఫ్యాషన్ తో వెలిగిపోతూ భళా అని అనిపించుకుంటారు. ఇంతకీ ఈ చలికాలంలో చలికే ఝులక్ ఇవ్వాలంటే  ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, ఎలా రెడీ అవ్వాలి తెలుసుకుంటే..

థర్మల్ టాప్ తో భలే వెచ్చదనం..

చలికాలంలో ప్రతి అమ్మాయి దగ్గరా ఉండాల్సిన టాప్ ఇది. థర్మల్ టాప్ వేసుకుంటే  స్టైలిష్ గానూ, వెచ్చగానూ ఉంటుంది. బోల్డ్ రంగులో పొడవాటి చేతులున్న థర్మల్ షర్టులు, లేదా ఉన్నితో కవర్ చేయబడిన థర్మల్ సెట్ ను ఉపయోగించుకోవాలి. ఇవి ఫ్యాషన్ గానూ, శరీరానికి వెచ్చదనాన్ని కూడా అందిస్తాయి. ఇవి ఏ దుస్తులకు అయినా బేసిక్ గా ఉంటాయి.

లేయర్ మెథడ్..

చలిగా ఉన్నరోజులలో బయటకు వెళ్లాలంటే ఇబ్బంది పడే అమ్మాయిలు అటు ఫ్యాషన్ గానూ, ఇటు  వెచ్చదనాన్ని ఆస్వాదించడానికి లేయర్ మెథడ్ బాగా సహాయపడుతుంది. ఇందులో అందమైన దుస్తులను ఒక దాని మీద మరొకటి స్టైల్ గా కనిపించేలా వేసుకుంటారు. ఇది చూడటానికి అవుట్ స్టాండింగ్ లుక్ ను ఇస్తుంది. శరీర ఆకృతిని బట్టి పొట్టి, పొడవు దుస్తులను ఇందుకోసం వినియోగించవచ్చు.

రన్ అవే లెదర్ బూట్స్

చూడగానే వావ్ అనిపించేలా ఉండే రన్ అవే లెదర్ బూట్స్ మోకాలి వరకు ఉంటాయి. చదునుగా, ముదురు రంగులో ఉన్న ఈ బూట్స్ ను ఏ దుస్తులతో అయినా వేసుకోవచ్చు. ఇది హైక్లాస్ లుక్ ను ఇస్తుంది.

ఫుల్ గ్లోవ్స్

సాధారణంగా చేతులకు తొడుక్కునే గ్లౌజులు మణికట్టు వరకు ఉంటాయి. అయితే ఫుల్ గ్లౌజులు ప్రయత్నిస్తే కొత్త లుక్ వస్తుంది. స్లీవ్ టీ షర్ట్లు లేదా టాప్స్ కు ఈ ఫుల్ గ్లౌజులు వేసుకుంటే ట్రెండ్ కు కొత్తదనం అద్దినట్టు ఉంటుంది. ఈ గ్లౌజులు నలుపు రంగు లేదా వేసుకునే షూస్, బెల్ట్,జాకెట్ రంగులను బట్టి ఎంపిక చేసుకోవాలి.

                                                   *నిశ్శబ్ద.