అమ్మాయిలు అందాల మొలకలు అవ్వాలంటే...

టీనేజ్ అమ్మాయిల దృష్టంతా ఎప్పుడూ బరువు పెరగకుండా వుండటం మీదే వుంటుంది. దానికోసం ఎవరు ఏం చెప్పినా, పాటిస్తూ వుంటారు. కొందరయితే భోజనం మానేయటం వంటివి చేస్తుంటారు. అయితే బరువు పెరగకుండా వుండాలనుకోవటం మంచిదే, అయితే అదే సమయంలో శరీరానికి కావలసిన పోషకాలు సమృద్ధిగా అందేలా కూడా చూసుకోవాలి. లేదంటే శారీరక అనారోగ్యంతో పాటు, ముఖ కాంతి కూడా తగ్గిపోతుంది. అంటే సరైన ఆహారం తీసుకోకపోతే అందం మీద కూడా ఆ ప్రభావం పడుతుంది. కాబట్టి విటమిన్లు, ఖనిజాలు, లవణాలు, ప్రోటీన్లు ఇతర ఎంజైములు శరీరానికి చక్కగా అందేలా చూస్తే అందం, ఆరోగ్యం కూడా సొంతం అవుతాయి.

మరి అవన్నీ అందాలంటే ఏం చేయాలి అంటే... రోజూ ఓ గుప్పెడు మొలకెత్తిన గింజలు తినటమే. వీటినుంచి పుష్కలంగా లభించే మాంసకృత్తులు అత్యంత సురక్షితమయినవి. వీటిలో కొవ్వుశాతం తక్కువ, పీచు పదార్దం ఎక్కువ. కొలస్ట్రాల్ అన్న మాటే ఉండదు. కాబట్టి బరువు పెరగకుండా ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా ఇవి తప్పక తీసుకోవాలి రోజు.

అంతే కాదు వీటిని తప్పక తినాలని చెప్పటంలో ఇంకా చాలా ప్రయోజనాలు దాగున్నాయి. ఈ  గింజలకి ఇంత ప్రాధాన్యం ఎందుకూ అంటే మొలకెత్తే సమయంలో వీటిలో క్లోరోఫిల్ శాతం పెరుగుతుంది. ఇది రక్తహీనత తగ్గించటంలో సహాయపడుతుంది. అలాగే ఇవి మొలకెత్తే సమయంలో వీటిలో విటమిన్లు, పీచుపదార్ధాల శాతం చాలా పెరుగుతుంది. పైగా ఏవి సులువుగా జీర్ణం అవుతాయి, మనం తిన్న ఆహరం జీర్ణం అయ్యేలా చేస్తాయి.

ఇంతకీ ఏవేవి తినాలి అంటే... గోధుమ, రాగి వంటి తృణ ధాన్యాలు, పెసలు, శెనగలు, బఠాణి, రాజ్మా, సోయాబీన్స్, వంటి చిక్కుడు జాతి గింజలు, తినటం మంచిది. అలా అని ఎక్కువగా కూడా తినకూడదు. టేనేజర్లు అరకప్పు మొలకెత్తిన ధాన్యాలను తింటే సరిపోతుంది. అది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ లలో ఎప్పుడయినా తినచ్చు. వీటిని నేరుగా తినటం, లేదా పొడి చేసుకుని సూపు లో కలుపుకోవటం, జావగా చేసుకోవటం, లేదా రోటి పిండి లో, దోశల పిండిలో కలపటం వంటివి కూడా చేయవచ్చు. ఆరోగ్యం, అందం రెండింటి ని కాపాడు కుంటూ బరువు తగ్గాలి అనుకుంటే ఈ మొలకెత్తిన గింజలు తినటం మొదలు పెట్టండి.

-రమ