మీ ఆరోగ్యానికి అద్భుత మంత్రం!

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అయితే ఒంట్లో బాగోలేకున్నా, మనసు భారంగా ఉన్నా అన్నీ భరిస్తూ ఇంటి పని, బయటి పనులు చక్కబెట్టుకుంటూ కుటుంబాన్ని ముందుకు నెట్టుకొచ్చే మహిళలు ఎంతోమంది ఉన్నారు. మగవారు బయటికెళ్లి ఉద్యోగం చేసొస్తే వారికి అన్ని సేవలు చేస్తూ, పిల్లలను, అత్తమామలను చూసుకుంటూ తమ గురించి తాము మరచిపోతారు మహిళలు. ఈ కారణంగా మహిళలు శారీరకంగా బలహీనం అవుతారు. ఇక సంపాదన పరంగా మగవారు ఆడవారిని చాలా తొందరగా మాటలు అనేస్తుంటారు. ఇవి మాత్రమే కాకుండా కుటుంబంలో జరిగే ఎన్నో గొడవలకు మూల కారణంగా మహిళలనే చేస్తుంటారు. బయట ఎన్ని గొడవలు, ఒత్తిడులు ఉన్నా అవన్నీ ఇంటికొచ్చి మహిళల మీద చూపంచే భర్తలు, తండ్రులు, అన్నలు, ఉన్నారు. మరొక విషయం ఏమిటంటే ఆడవారికి ఆడవారే శత్రువులు అన్నట్టు.. సాటి ఆడవారే చులకనగా చూసి, అవమానిస్తుంటారు. ఈ కారణాల వల్ల మహిళలు మానసికంగా బలహీనం అయిపోతుంటారు.

శారీరకంగా, మానసికంగా మహిళలు ఎంతో దృఢంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. అందుకోసం మహిళలు చేయాల్సిన కొన్ని పనులున్నాయి.. ఇవి అద్భుత మంత్రాలనే చెప్పొచ్చు..

మీకోసం.. మీరు..

కుటుంబం, భర్త, పిల్లలు, అత్తమామలు ఇలా ఎందరున్నా ప్రతి మహిళ తన ప్రాధాన్యతను తాను గుర్తుంచుకోవాలి. మొదట తన గురించి తాను జాగ్రత్తగా, బాధ్యతగా ఉండాలి. తన సంతోషాన్ని, తన సమయాన్ని తాను ప్రత్యేకంగా గడపగలగాలి. భారతీయ మహిళకు ఇలాంటి పని కాస్త కష్టమే.. కానీ అసాధ్యం కాదు. కుటుంబానికి కావలసినవన్ని ఓ మహిళ ఇస్తున్నప్పుడు, ఆ మహిళల తనకు కావలసింది తాను తీసుకోవడంలో తప్పు లేదుగా.. ఇలా చేస్తే మహిళలు మానసికంగా బలవంతులు అవుతారు.

ఆరోగ్యం.. మీ బాధ్యత…

మీ ఆరోగ్యం గురించి భర్త, పిల్లలు పట్టించుకుని వారు మిమ్మల్ని  డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తేనే వెళ్లే వర్గానికి చెందినవారు మీరైతే.. ఇప్పుడే మీ పద్ధతి మార్చేసుకోండి. సహజంగా మహిళలకు ప్రతి దశలో ఎన్నో ఆరోగ్యం సమస్యలు వస్తుంటాయి. ఏ పెయిన్ కిల్లరో.. మరే సిరప్పో.. వేసుకుని అప్పటికి సమస్య తగ్గిపోయిందనిపించుకుని ఏళ్లకేళ్ళు గడిపేసే మహిళా మణులు చాలామందే ఉన్నారు. అవన్నీ వదిలి శరీరం సౌకర్యంగా అనిపించకపోయినా, ఏదైనా ఇబ్బంది తలెత్తిన చక్కగా వైద్యులను సంప్రదించాలి. 

ప్రతి మహిళా కాల్షియం, ప్రోటీన్, విటమిన్, బోన్ స్ట్రేంగ్త్ పరీక్షలు, హిమోగ్లోబిన్ పరీక్షలు ఆరు నెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి అయినా చెక్ చేయించుకోవాలి.

పోషకారం మీకే ముఖ్యం..

మీగడ పెరుగాంతా భర్తకూ, పిల్లలకూ వడ్డించి తనకు మాత్రం నీళ్లు కలిపి పలుచని మజ్జిగతో భోజనాన్ని మ్యా.. మ్యా.. అనిపించే మహిళలు బోలెడు ఉన్నారు. మగవాళ్ళు ఎక్కువ తినాలి అనే మాటతోనో.. ఎదిగే పిల్లలకు పెట్టాలి కదా అనే సమర్థింపుతోనో ఇంటివారికి ఎక్కువ పెట్టడంలో తప్పు లేదు.. అది వారి మీద ఇల్లాలికి ఉన్న ప్రేమ. కానీ.. ఆడవారికే ఆహారం అవసరమే కదా.. ఉదయం లేచి ఇల్లు ఊడవడంతో మొదలుపెట్టే పనికి రాత్రి భోజనాలు అయ్యాక తిన్నవి కడిగి సర్దిపెట్టే వరకు విరామం అనేది ఉండదు. కాబట్టి ఇంట్లో భర్త, పిల్లలకు పెట్టే దానికంటే ఎక్కువగా, మంచి పోషకాహారం ఆడవారికే అవసరం.

యోగా.. ధ్యానం...కావాలి..

యోగా.. ధ్యానం మనిషిని శారీరకంగా, మానసికంగా దృఢంగా చేస్తాయి. యోగ లోని ఆసనాల వల్ల  మహిళల శరీరంలో వివిధ అవయవాల పనితీరు మెరుగవుతుంది. కండరాలు, ఎముకలు బలోపేతం అవుతాయి. రక్తపోటు స్థాయిలు అదుపులో ఉంటాయి, శరీరంలో అదనపు కొవ్వు, దాని ద్వారా వచ్చే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. గర్భాశయం, థైరాయిడ్, హార్మోన్స్ అసమతుల్యత వంటివి ఆమడ దూరం పోతాయి. ధ్యానం వల్ల చక్కని ఏకాగ్రత, దృఢ నిర్ణయం తీసుకునే సామర్థ్యము పెరుగుతుంది. మానసిక ఒత్తిడులు అధిగమిస్తారు. నెలసరి సమయంలోనూ, గర్భధారణ, ప్రసవం, పిల్లల పెంపకం, భర్తతో అనుబంధం, మెనోపాజ్ దశ ఇలా అన్ని సమయాలలో ఒత్తిడి సహజంగా ఉంటుంది మహిళల్లో. ఈ ఒత్తిడిని డీల్ చేయడానికి ధ్యానం బాగా సహకరిస్తుంది.


గమనిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా తమకు తాము ప్రాధాన్యత ఇచ్చుకునే మహిళల్లో అస్తిత్వం మెరుగ్గా ఉంటుంది. ప్రతి మహిళా కుటుంబాన్ని, గృహిణి బాద్యతనూ కలిగి ఉంటారు. అయితే వాటితో పాటు ప్రపంచాన్ని కూడా శాసించగలిగేవారు కొందరే ఉంటారు. ప్రతి మహిళా ప్రపంచాన్ని శాసించక పోయినా.. తన ప్రపంచాన్ని తాను శాసించుకోగలిగే శక్తిమంతురాలు కావాలి. తన ఆరోగ్యాన్ని తాను కాపాడుకోవాలి.  అప్పుడే మహిళా దినోత్సవ అర్థానికి సార్ధకత చేకూరుతుంది.


                                   ◆నిశ్శబ్ద .