డబుల్ చిన్ వచ్చిందా.. రోజూ 5 నిమిషాలు ఈ ఫేస్ యోగా చేస్తే సరి!

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ యవ్వనంగా, టోన్డ్ బాడీని కోరుకుంటారు. జిమ్ కు వెళ్లి శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడానికి ఎలా ప్రయత్నిస్తారో.. ముఖ దృఢత్వం కోసం అంతకంటో ఎక్కువ ప్రయత్నిస్తున్నారు. ముఖంలో గీతలు, ముడతలు, ముఖంలో కొన్ని ప్రాంతాలు ఉబ్బినట్టు ఉండటం, కొవ్వు పేరుకుని ఉండటం, డబుల్ చిన్ రావడం వంటివి చూస్తూనే ఉంటాం. వీటిని కవర్ చేయడానికి చాలామంది మేకప్ మీద ఆదారపడతారు. మరికొందరు సర్జరీ వైపు వెళతారు. కానీ ముఖాన్ని సహజంగా టోన్ చేసి డబుల్ చిన్ ను తొలగించుకోవాలని అనుకుంటే అలాంటి వారికి పేస్ యోగా చాలా మంచి పరిష్కారం. ముఖ కండరాలను ఉత్తేజపరిచేందుకు, బలోపేతం చేయడానికి ఫేస్ యోగా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
ఫేస్ యోగా అంటే ఏమిటి?
ఫేస్ యోగా అనేది ముఖ కండరాలను సాగదీసే, టోన్ చేసే, విశ్రాంతినిచ్చే సహజమైన టెక్నిక్. యోగా మాదిరిగానే, ఇది 40 కి పైగా ముఖ కండరాలపై పనిచేస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చర్మాన్ని ఆక్సిజన్‌తో నింపుతుంది, సహజమైన మెరుపును క్రియేట్ చేస్తుంది.
డబుల్ చిన్ తగ్గించడంలో ఎలా సహాయపడుతుంది..
దవడ రేఖ ముఖ నిర్మాణంలో కీలకమైన భాగం. ఇది దానికి పదునైన, మంచి షేప్ ఉండేలా చేస్తుంది. వృద్ధాప్యం లేదా పేలవమైన జీవనశైలి డబుల్ చిన్ రావడానికి కారణం అవుతుంది.
డబుల్ చిన్ తగ్గించే ఫేస్ యోగా..
చీక్ లిస్ట్..
నవ్వుతూ వేళ్లతో మీ బుగ్గలను పైకి ఎత్తాలి. 10 సెకన్ల పాటు అలాగే ఉంచి, ఆపై వదిలేయాలి. 5 సార్లు దీన్ని రిపీట్ చేయాలి. ఇది బుగ్గలను టోన్ చేస్తుంది, దవడ రేఖను క్లియర్ గా ఉంచుతుంది.
ఫిష్ ఫేస్..
బుగ్గలను చేపలాంటి ముఖంలా కనిపించేలా లోపలికి లాగాలి. 10 సెకన్ల పాటు అలాగే ఉంచండి. 5 సార్లు రిపీట్ చేయాలి. ఇది దవడ, బుగ్గలకు వ్యాయామం చేస్తుంది.
దవడ సాగతీత..
తలను పైకి వంచి దవడను విశ్రాంతిలో ఉంచాలి. తర్వాత దానిని క్రిందికి లాగాలి. 5 సెకన్ల పాటు అలాగే ఉంచాలి. 5 సార్లు రిపీట్ చేయాలి. ఇలా సాగదీయడం వల్ల డబుల్ చిన్ తగ్గించడానికి సహాయపడుతుంది.
నాచురల్ క్లోజ్ స్మైల్..
పెదవులు మూసుకుని కొంచెం నవ్వాలి. వేళ్లతో సున్నితంగా ఒత్తిడి చేసి 10 సెకన్ల పాటు అలాగే ఉంచండి. 5 సార్లు రిపీట్ చేయాలి. ఇది కండరాలను బిగుతుగా చేస్తుంది.
క్రమం తప్పకుండా చేయాలి..
ఈ ఫేస్ యోగా వ్యాయామాలను రోజూ కేవలం 5 నిమిషాలు చేస్తే, 2-3 వారాలలోపు ముఖంలో కనిపించే మార్పులను గమనించవచ్చు. దీని వల్ల దవడ రేఖ పదునుగా మారుతుంది. ముఖం గొంతులో కలిసిపోయినట్టు కాకుండా పైకి కనిపిస్తుంది. పైగా యవ్వనంగా కూడా కనిపిస్తారు.
*రూపశ్రీ.


