శీతాకాలంలో పిల్లల ఇమ్యూనిటీ పెంచే సూపర్ టిప్స్..!

 


శీతాకాలంలో పిల్లలలో జలుబు,  ఫ్లూ ఎక్కువగా వస్తుంటాయి. అలాగే పొడిగాలి,  చల్లని ఆహారాలు,  చల్లని వాతావరణం వల్ల గొంతు నొప్పి  దగ్గు వంటి సమస్యలు కూడా వస్తాయి.   వైరస్‌లు చల్లని,  పొడి గాలిలో ఎక్కువ కాలం జీవించి ఉంటాయి. పిల్లలు ఎక్కువగా  ఇంటి లోపలే ఉంటారు, దీని వలన ఇన్ఫెక్షన్లు త్వరగా వ్యాపిస్తాయి. జలుబు, ఫ్లూ కారణంగా పిల్లలకు వచ్చే తుమ్ములు, దగ్గు,  అసౌకర్యాన్ని మంత్రం వేసినట్టు క్షణాలు,  నిమిషాలలో ఆపలేము.  అందుకే ఈ శీతాకాలంలో కనీసం పిల్లల రోగనిరోధక శక్తిని పెంచగలిగితే  వారి ఆరోగ్యాన్ని చాలా వరకు నయం చేయగలుగుతాము.  పిల్లలో రోగనిరోధక శక్తిని పెంచే సూపర్ టిప్స్ ఏంటో తెలుసుకుంటే..

పరిశుభ్రత..

పిల్లలు స్కూలుకు వెళ్లి ఇంటికి వచ్చినా,  టాయిలెట్ కు వెళ్లి వచ్చినా,  ఆటలు ఆడుకుని వచ్చినా వారికి చేతులు కడుక్కోవడం నేర్పాలి.  పరిశుభ్రత అనేది పిల్లల దినచర్యలో భాగంగా ఉండేలా చూడాలి. శానిటైజర్ లకు బదులుగా సబ్బుతో 20సెకెన్ల పాటు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం నేర్పాలి.

పిల్లలు తుమ్మినప్పుడు,  దగ్గినప్పుడు మోచేత్తో నోటికి అడ్డుగా పెట్టుకోవడం లేదా నాప్‌కిన్ వంటిది నోటికి అడ్డు పెట్టుకోవడం వంటివి నేర్పాలి.  కళ్లు,  ముక్కు, నోరును పదే పదే చేత్తో తాకకుండా ఉండేలా జాగ్రత్తలు నేర్పాలి.  ఇది పిల్లలను చాలా వరకు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా  కాపాడుతుంది.

ముక్కు తో జాగ్రత్త..

పిల్లలకు చాలా వరకు జలుబు,  ముక్కు నుండి నీరు కారడం వంటి సమస్యలు వస్తుంటాయి.  కొన్ని సార్లు ముక్కు పొడిబారడం, శ్లేష్మం పేరుకుపోవడం వంటివి కూడా వస్తాయి.  వీటి నుండి ఉపశమనం కోసం 0.65% సెలైన్ నోస్ స్ప్రే ను పిల్లలకు ఇవ్వాలి.  ఇది ముక్కును తేమగా ఉంచుతుంది. శ్లేష్మాన్ని క్లియర్ చేస్తుంది. 6సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సున్న పిల్లలకు 3 నుండి 5 నిమిషాలు ఆవిరి పట్టవచ్చు. అయితే పిల్లల చర్మం సున్నితంగా ఉంటుంది కాబట్టి ఆవిరి పట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

నిద్ర..

3-5 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు 10-13 గంటల నిద్ర అవసరం.  అలాగే 6-12 సంవత్సరాల వయసు గల పిల్లలకు 9-12 గంటల నిద్ర అవసరం,  టీనేజ్ పిల్లలకు 8-10  గంటల నిద్ర అవసరం,  నిద్రపోవడానికి కనీసం 30నిమిషాల ముందు టీవీ,  ఉదయాన్నే 10 నిమిషాలు సూర్యరశ్మిలో గడిపేలా చూసుకోవాలి.  ఇలా చేస్తే శరీరంలో నిద్ర గడియారం బాలెన్స్డ్ గా ఉంటుంది.

ఆహారం..

శీతాకాలంలో పిల్లలకు ఇచ్చే ఆహారం కూడా చాలా ముఖ్యం. ప్రోటీన్, రంగురంగుల కూరగాయలు,  వెచ్చగా ఉన్న  ద్రవాలను ఆహారంలో చేర్చాలి. ప్రోటీన్ కోసం గుడ్లు, పప్పులు, కాటేజ్ చీజ్ లేదా టోఫు,  పెరుగును ఇవ్వాలి.

విటమిన్ సి కోసం ప్రతిరోజూ  ఆహారంలో జామ, ఉసిరి, నారింజ, టమోటాలు లేదా క్యాప్సికం లను ఇవ్వాలి.  

జింక్ కోసం వేయించిన శనగలు, గుమ్మడికాయ గింజలు, గుడ్లు,  పప్పులు ఇవ్వాలి.

ప్రోబయోటిక్స్ కోసం తాజా పెరుగు లేదా మజ్జిగను ఇవ్వాలి.

పిల్లలకు వెచ్చని సూప్‌లు,  తేలికపాటి కషాయాలు, నిమ్మకాయ, అల్లం,  తులసి ఇవ్వాలి.

పిల్లలు శీతాకాలంలో తక్కువ నీరు త్రాగుతుంటారు.  కాబట్టి సరిపడినంత నీరు తాగేలా జాగ్రత్త తీసుకోవాలి.

వ్యాయామం..

పిల్లల శరీరం చురుగ్గా ఉండటానికి వ్యాయామం చాలా అవసరం. పిల్లలు ఆడుకోవడానికి ఇష్టపడతారు.  అందుకే ఆటల్లో వ్యాయామాలను భాగం చేసి ఇంట్లోనే వ్యాయామాలు చేయించాలి. స్కిప్పింగ్, యోగ, ఎరోబిక్స్ వంటివి ఎంకరేజ్ చేయవచ్చు.

మందులు..

పిల్లలకు ఏ చిన్న నలత అనిపించినా చాలామంది యాంటి బయాటిక్స్ ఇస్తుంటారు. పిల్లలు నలతను ఎక్కువ సేపు భరించలేరు.  వారి ఇబ్బందిని చూసి యాంటిబయాటిక్స్ ఇవ్వడం తప్పు.  మిగిలిపోయిన సిరప్ లు, ఇంట్లో టాబ్లెట్స్ తో పిల్లలకు నయం చేయాలనే ఆలోచన చేయకూడదు.  వీలైనంత వరకు ఇంటి చిట్కాలను ట్రై చేయాలి.  అల్లం, తేనె, తులసి,  జీలకర్ర, దనియాలు వంటివి ఔషద గుణాలను కలిగి ఉంటాయి. వీటిని తగు విధంగా వాడితే  సమస్యలు మెల్లిగా తగ్గిపోతాయి. కానీ పిల్లలు రెండు రోజులకు మించి అసౌకర్యాన్ని అనుభవిస్తే వైద్యుల దగ్గరకు తీసుకుని వెళ్లడం చాలా ముఖ్యం.

                                    *రూపశ్రీ.