చెమట వాసనకి చెక్ పెట్టండి!

 

 

ఎంత అందంగా తయారయితేనేం... చెమటతో బట్టలు తడిచిపోతూ, ఆ తడిచిన బట్టల నుంచి వాసన వస్తూ ఉంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది?! అలాగని ఈ సమస్య గురించి ఎవరికైనా చెప్పుకోవాలంటే సిగ్గు. ఎలా వదిలించుకోవాలో తెలియక విసుగు. చాలామంది పరిస్థితి ఇదే. మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్లను కూడా ఇబ్బంది పెట్టే ఈ సమస్య మరీ అంత పెద్దదేం కాదు. ఈ చిట్కాలు పాటించి చూడండి... చిటికెలో సాల్వ్ అయిపోతుంది.

- మరీ బిగుతుగా ఉండే బట్టలు వేసుకోకండి. సింథటిక్ వస్త్రాలు కూడా వద్దు. వదులుగా ఉండే కాటన్ దుస్తులు వేసుకోండి. లో దుస్తుల్ని ఎప్పటికప్పుడు మార్చేయండి. బట్టలు వేడినీటిలో ఉతికి ఎండలో బాగా ఆరబెట్టుకోండి.

- రోజుకు రెండుసార్లు కచ్చితంగా స్నానం చేయండి. బాహుమూలల్ని బాగా శుభ్రం చేసుకోండి. అవాంఛిత రోమాల్ని ఎప్పటికప్పుడు తొలగించుకోండి. అలాగే స్నానానికి యాంటి బయొటిక్ సబ్బుల్ని వాడండి.

- తప్పనిసరిగా డియోడరెంట్ వాడండి. ఎప్పటికప్పుడు ఒళ్లంతా చక్కగా టాల్కమ్ పౌడర్ రాసుకోండి.

- ఆహారం విషయంలో కూడా జాగ్రత్త అవసరం. మిరియాలు, అల్లం, వెల్లుల్లి, మసాలాల్ని బాగా తగ్గించండి. శరీర ఉష్ట్రోగ్రతను పెంచే ఆహార పదార్థాలు, పానీయాల జోలికి వెళ్లకండి.

- వీలైనంత ఎక్కువగా మంచినీళ్లు తగండి. శరీరంలో ఉండే మలినాలను తొలగించడంలో దాన్ని మించిన ఎక్స్ పర్ట్ ఇంకెవరూ లేరు.

- స్నానం చేసేముందు నిమ్మచెక్కతో బాహుమూలల్ని చెమల ఎక్కువ పట్టే ఇతర ప్రదేశాలన్నీ రుద్దుకోండి. మంచి ఫలితం ఉంటుంది.

- తులసి, వేప ఆకులను కలిపి పేస్ట్ లా చేపి... స్నానం చేసేముందు ఒళ్లంతా బాగా రుద్దుకోండి. ఆపైన గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయండి. కొన్నాళ్ల పాటు ఇలా చేస్తే సమస్య శాశ్వతంగా తీరిపోయే అవకాశం ఉంది.

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సమస్య వెంటాడుతుంటే సిగ్గుపడకుండా ఓసారి స్కిన్ డాక్టర్ ను సంప్రదించండి. తగిన సలహా ఇస్తారు. అవసరమైతే చికిత్స కూడా చేస్తారు.


- Sameera