గర్భాశయ ఆపరేషన్ గురించి ఆసక్తికర విషయాలు!


మహిళల్లో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు అన్నీ ఎక్కువ భాగం గర్భాశయానికి సంబంధించినవే ఉంటాయి. చాలామంది మధ్యవయసులోకి అడుగుపెట్టిన మహిళలు గర్భాశయ సమస్యలు భరించలేక ఏకంగా గర్భాశయాన్ని తొలగించుకోవడానికి సిద్ధపడుతుంటారు. ఈ గర్భాశయ తొలగింపు ఆరేషన్, దాని ప్రభావం, దానికి జాగ్రత్తలు తెలుసుకుంటే…


గర్భాశయాన్ని తొలగించే ఆపరేషన్ ను  "హిస్టరెక్టమీ” అంటారు. కొన్ని సార్లు గర్భాశయంతోపాటు దగ్గరగా వున్న అండవాహికను, అండాశయాన్ని కూడా తీసేయవలసి వుంటుంది. క్యాన్సర్ వంటి వ్యాధులు ఒక్కొక్కసారి చుట్టూ వున్న అవయవాలకు కూడా వ్యాపించే ప్రమాదం వుంది. ఇలాంటి సందర్భాలలో మిగతా భాగాల్ని కూడా తీసేయాల్సివస్తుంది.


గర్భాశయాన్ని ఎందుకు తీసివేయాల్సి వస్తుంది ?


గర్భాశయ ముఖ ద్వారంలో క్యాన్సర్ వున్నప్పడు. గర్భాశయంలో క్యాన్సర్ ఉన్నప్పుడు, బహిస్టు సమయంలో మాత్రమే కాకుండా ఇతర సమయాలలో కూడా రక్తస్రావం అవుతున్నప్పుడు, ఈ వ్యాధులు మందులతో నయం కానప్పుడు గర్భాశయాన్ని తొలగించాల్సి వస్తుంది. రక్తహీనత, ఇతర సమస్యల వల్లా, గర్భాశయంలోపల గోడలను ఆనుకొని పెరిగే పెద్ద కణుతుల వల్లా (ఫైబ్రాయిడ్స్), విపరీత రక్తస్రావం. తరచు ఇన్ఫెక్షన్ కు గురి కావడం గర్భసంచి క్రిందికి జారటం అండవాహికలో అండాశయాలలో వ్యాధి వున్నప్పుడు, ప్రసవ సమయంలో గర్భాశయం చిరగటం లేదా ఆపటానికి వీలుకాని రక్తస్రావం అవుతుండడం మొదలైన  లక్షణాలు తీవ్రరూపం దాల్చినప్పుడు గర్భాశయాన్ని తీసివేయాల్సి వస్తుంది.


గర్భాశయాన్ని తీసేస్తే ఏమవుతుంది ?


కేవలం గర్భాశయాన్ని మాత్రమే తీసేసినపుడు మహిళల్లో నెల నెలా వచ్చే బహిస్టు ఆగిపోతుంది. కాని అండాశయాలు ఈస్ట్రోజన్ హార్మోనును ప్రతినెలా ఉత్పత్తి చేస్తూనే వుంటాయి. అండాశయాన్ని తీసేస్తే అకస్మాత్తుగా మెనోపాజ్ వస్తుంది. అలాంటి సందర్భాలలో హార్మోన్లు విడిగా ఇవ్వాల్సి రావచ్చు. హిస్టరెక్టమీని కుటుంబ నియంత్రణ పద్ధతిలో వాడటం కూడా ఎక్కువయింది. పిల్లలు పుట్టకుండా ఉండటానికి దీన్ని ఒక మార్గంగా ఎంచుకుంటున్నారు.


కొన్ని ముఖ్యమైన విషయాలు:- 


గర్భాశయాన్ని తీసివేయడం అనేది భారీ వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారం.


గర్భాశయ వ్యాధులు సోకినపుడు, ఆగకుండా నిరంతరం రక్తస్రావం అవుతున్నపుడు, గర్భాశయం దెబ్బ తిన్నపుడు దాన్ని తొలగించాల్సి ఉంటుంది. 


ఆపరేషన్ తరువాత విపరీతమైన నొప్పి, జ్వరం రావచ్చు. పొత్తి కడుపు పుండులా అనిపిస్తుంది.


 ఆపరేషన్ తరువాత కూడ రక్తస్రావం జరిగినా, కుట్ల దగ్గర చీము పట్టినా, ఇన్ఫెక్షన్ సోకినా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.


గర్భాశయాన్ని మాత్రమే తొలగిస్తే బహిస్టు ఆగిపోతుంది. కానీ క్యాన్సర్ లాంటి వ్యాధులు సోకినపుడు అండాశయాన్ని కూడ తొలగించాల్సి రావచ్చు. ఇలాంటి సందర్భాలలో మెనోపాజ్ వస్తుంది. 


శస్త్రచికిత్స చేయాలంటే..


ఆపరేషన్ అవసరమైన వాళ్లు బరువు ఎక్కువ ఉంటే తగ్గడానికి, బరువు మరీ తక్కువ ఉన్నవాళ్లు పెరగటానికి, డాక్టర్ల సలహా తీసుకోవాలి. హిమోగ్లోబిన్ 12 గ్రాములకంటే ఎక్కువ వుండేటట్టు చూసుకోవాలి, ఒకవేళ రక్తహీనత ఎక్కువగా వుండి హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే సర్జరీ కన్న ముందుగానే రక్తం ఎక్కిస్తారు. షుగర్, బి.పి. వున్నవాళ్లు వాటిని అదుపు చేసుకోవాలి. ఆపరేషన్ కోసం 2,3 బాటిల్స్ రక్తం రడీగా వుంచుకోవాలి.


                                           ◆నిశ్శబ్ద.