పిల్లలను ప్లే స్కూల్ కు పంపడానికి ముందు ఇవి నేర్పకపోతే చాలా ఇబ్బంది పడతారు..!

పిల్లల జీవితంలో విద్యాబ్యాసం ఇంట్లోనే ప్రారంభమవుతుంది. ఎందుకంటే తల్లి మొదటి గురువు కాబట్టి. అయితే ఒక వయసుకు రాగానే పిల్లలను ప్లే స్కూల్ కు పంపడం ఇప్పట్లో అలవాటైంది. పిల్లలు ప్లే స్కూల్‌లోకి అడుగుపెట్టినప్పుడు మొదటిసారి తల్లిదండ్రుల నుండి దూరంగా కొత్త ప్రపంచంలోకి అడుగుపెడతాడు. పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి రావడాన్ని అస్సలు భరించలేరు. అయితే పిల్లలకు కొన్ని అలవాట్లు ముందే నేర్పిస్తే పాఠశాలలో సర్దుబాటు చేసుకోవడం సులభం అవుతుంది. పిల్లలను ప్లే స్కూల్‌కు పంపే ముందు నేర్పించాల్సిన 5 ముఖ్యమైన అలవాట్లు తెలుసుకుంటే..
ఒంటరిగా ఆహారం తినే అలవాటు..
ప్లే స్కూల్‌లో ఉపాధ్యాయులు ప్రతి బిడ్డకు విడివిడిగా ఆహారం పెట్టలేరు. పిల్లలు ఎవరికి వారు తినాలి. కాబట్టి ఇంట్లో పిల్లలకు చెంచాతో లేదా చేతులతో ఆహారం తినడం నేర్పించాలి. ఆహారం తినేటప్పుడు మొదట్లో కాస్త గజిబిజి చేస్తారు, కానీ ఈ అలవాటు అయ్యే కొద్ది ఆహారం తినడం సులువు అవుతుంది.
టాయిలెట్ కి వెళ్ళే అలవాటు..
పిల్లలకు స్వయంగా టాయిలెట్ కి వెళ్ళడం తెలిసి ఉండాలి. కనీసం అతను టాయిలెట్ కి వెళ్ళాలని అర్థం చేసుకోవాలి, ఆ విషయాన్ని టీచర్ కి చెప్పగలగాలి. టాయిలెట్ కు వెళ్ళినప్పుడు మురికిగా ఉండకుండా, బట్టలు తడిసిపోకుండా ఉండేలా చక్కగా వెళ్లివచ్చేలా పిల్లలకు అలవాటు చెయ్యాలి. ఇది చేయకుండా పిల్లలను ప్లే స్కూల్ కు పంపితే వారు చాలా ఇబ్బంది పడతారు.
షేరింగ్..
పిల్లలు తమ దగ్గరున్న ఏ పదార్థాలను అయినా పక్కనున్న వాళ్లతో పంచుకుని తినడం అలవాటు చేయాలి. ఇలా చేస్తే ప్లే స్కూల్లో స్నేహితులతో వస్తువులను పంచుకోవడం చెడ్డ విషయం కాదని తెలుసుకుంటారు. ఇతరులతో చక్కగా కలిసిపోతారు.
క్రమశిక్షణ..
“కూర్చోవడం”, “నడవడం”, “సైలైంట్ గా ఉండటం” లేదా “వరుసలో నిలబడటం” వంటి చిన్నచిన్న అలవాట్లు, క్రమశిక్షణ పద్దతులను పాటించడం నేర్పాలి. ఇవి పాఠశాలలో ప్రతిరోజూ పిల్లలు ఎదుర్కొంటూ ఉంటారు.
పిల్లలతో కలిసి ఉండటం..
పిల్లలు ఎక్కువ సేపు ఒంటరిగా ఉండటానికి అలవాటుపడితే అతన్ని పిల్లలతో కలిసి ఆడుకునేలా లేదా ఏదైనా టాస్క్ లో పాల్గొనేలా, టీమ్ వర్క్ లాంటి పనులలో ఇన్వాల్వ్ అయ్యేలా చేయాలి. తద్వారా అతను ఇతర పిల్లలతో ఆడుకోవడం, మాట్లాడటం నేర్చుకుంటాడు. ఇది సామాజిక నైపుణ్యాలను బలోపేతం చేస్తుంది.
*రూపశ్రీ.

.webp)

.webp)