మన దగ్గరి వ్యక్తుల మనస్తత్వాలని ఎలా అర్థం చేసుకోవచ్చో సరదాగా నేర్చుకుందామా? ఎదుటి వ్యక్తికీ నచ్చిన పండు ఏదో తెలుసుకుంటే... దాని బట్టి వారి స్వభావం గురించి అంచనా వేయచ్చట. మన ఇష్టాయిష్టాలు సహజంగా మన స్వభావం, మనస్తత్వం పై ఆధారపడే ఏర్పడతాయి అంటున్నారు నిపుణులు. కాబట్టి ఆ ఇష్టాయిష్టాలు మన స్వభావానికి అద్దం పడుతాయన్నమాట. సరే నచ్చే పండుని బట్టి వారి స్వభావాన్ని ఎలా అంచనా వేయచ్చో తెలుసుకుందాం.

 

ఆరెంజ్ : ఆరెంజ్ ను అమితంగా ఇష్టపడే వ్యక్తుల స్వభావం ఎలా వుంటుందో చూద్దాం. వీరు చాలా సహనంగా ఉంటారు. పట్టుదల ఎక్కువ. వీరి పనితీరు నెమ్మదిగా అనిపించినా కష్టపడే తత్వం వీరి స్వంతం. ఏ బంధంలోనైనా వంద శాతం ఇస్తారు. నమ్మకస్తులు ఎవరైనా ఈ వ్యక్తులపై పూర్తి భరోసా పెట్టవచ్చు. వీరిని ఫ్రెండ్ గా పొందని వారు అదృష్టవంతులనే చెప్పాలి.

 

ఆపిల్ : ఆపిల్ అంటే చాలా ఇష్టమని అన్నారనుకోండి... వాళ్ళు ది బెస్ట్ టీం లీడర్స్ అని అర్థం చేసుకోవాలి. అంటే ముందుండి ఓ టీంని నడిపించే నాయకత్వ లక్షణాలు వీరి స్వంతం. ఉన్నదున్నట్టు ఎదుట వ్యక్తి మొహంపై చెప్పేస్తారు. కాస్త పోగరుబోతుల్లా కనిపిస్తారు. కాని వీరి స్వబావం అది కాదు నిజానికి. కాని మాట కాస్త కరుకుగా ఉంటుంది. వీరిలో నాయకత్వ లక్షణాలుంటాయి కానీ, వీరి లైఫ్ ను వీరే సరిగ్గా, సమర్థవంతంగా నిర్వహించుకోవటంలో కంగారు పడతారు.

మామిడి : మామిడి పండును ఇష్టపడే వ్యక్తుల స్వభావం చాలా స్పష్టంగా ఉంటుంది. వీరి ఆలోచనలలో చాలా క్లారిటి వుంటుంది. వీరిని, వీరి ఆలోచనలని, పద్దతులని ప్రభావితం చేయటం అంత సులువు కాదు. వీరి ఇష్టాయిష్టాలు కూడా చాలా బలంగా ఉంటాయి. వీరి జీవితం ఎంతో చక్కగా సాగిపోతుంది. అయితే నచ్చిన వారి దగ్గర పిల్లల్లా మారిపోతారు.. అల్లరి చేసి ఆనందిస్తారు.

బొప్పాయి : ఈ పండును ఇష్టపడే వ్యక్తులు మన స్నేహితులయితే చాలు. మన పెదవులపై చిరునవ్వు ఎప్పుడూ విరుస్తునే వుంటుంది. మంచి హాస్య స్వభావులు నవ్వుతూ, నవ్విస్తూ ఉంటారు. ఇతరులతో ఎంతో దయగా ఉంటారు. కొత్త వ్యక్తులతో ఇట్టే కలిసిపోగలరు. సఖులూ.

ఫైనాఫిల్, అనాస : వీళ్ళు ఏ పని చేయాలన్నా నిర్ణయం తీసుకుంటే చాలు... వెంటనే మొదలు పెట్టేస్తారు. ధైర్యం ఎక్కువ తనపై తనకుండే నమ్మకమే అందుకు కారణం. వీరికి దేనినైనా సాధించటం ఎంతో తేలిక. అయినా వ్యక్తిగతంగా వీరు ఎవరితోనూ తొందరగా కలవలేరు. కాని ఒకసారి స్నేహితులయితే ఎంతో విలువనిస్తారు ఆ బంధానికి ... కాని వీరిలో బంధంలో ఉండేవారు ఒక్కటి అర్థం చేసుకోవాలి. వీరికి మనసులోని అభిమానాన్ని బయటకి చూపించటం రాదు.

నల్ల ద్రాక్ష : వీళ్ళు మృదు స్వభావులు, కాని ముక్కుపై కోపం వుంటుంది. ఎంత తొందరగా కోపం వస్తే, అంత త్వరగా చల్లారిపోతారు. వీరితో ఉండటానికి ఎవరైనా ఇష్టపడతారు. వీరికి జీవితాన్ని ఎంత అందంగా, ఆనందంగా ఉంచుకోవాలో బాగా తెలుసు. ప్రతీ క్షణాన్ని ఆనందంగా గడపడానికి ఇష్టపడతారు.

సీతాఫలం : వీళ్ళు చాలా లక్ష్యాలు కలిగి ఉంటారు. చాలా తెలివైన వారు. విజయాల కోసం కష్టపడతారు. అయితే ఎదుటి వ్యక్తుల లోని లోపాలని ఇట్టే పసిగడతారు. దాంతో వీరికి శత్రువులు కూడా ఎక్కువే. వీరు అభిమానాన్ని పైకి చూపరు. ఎదుటివారు అర్థం చేసుకోవాలి.

అరటి పండు : వీళ్ళు ఎదుటివారిపై ఎంతో ఇష్టాన్ని చూపిస్తారు. అందరితో ఎంతో మంచిగా ఉంటారు. మంచి సంబంధ బాంధవ్యాలను కలిగి ఉంటారు. అయితే తమ విషయానికి వచ్చేసరికి వారిపై వారికీ నమ్మకం తక్కువ. పక్కవారి తోడుకోసం చూస్తుంటారు. స్వభావసిద్ధంగా వీరు విజయాలకంటే వ్యక్తులకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు.

 

                                                                                                      -రమ