మునగాకుకు సాటిలేదు


ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు చెబుతుంటారు. మనం కూడా తరచూ ఆకుకూరలు వాడుతుంటాం. కానీ తోటకూర, పాలకూర ఇలా కొన్నింటిని మాత్రమే వాడతాం. కానీ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉండే కొన్ని ఆకుకూరలని అసలు పట్టించుకోము. అలా మనం పట్టించుకోకుండా వదిలేసే "మునగాకు" లోని ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఒకసారి చూద్దామా...!

విటమిన్ A అవసరం మనందరికీ తెలిసిందే. ఆ విటమిన్ A కోసం క్యారెట్ లు తింటాం. కానీ క్యారేట్స్ కన్నా నాలుగింతలు ఎక్కువగా విటమిన్ A మునగాకులో దొరుకుతుంది. అలాగే విటమిన్ C కూడా కమలాలలో కన్నా ఏడింతలు ఎక్కువగా ఉంటుంది ఈ మునగాకులో.

రోజు ఒక అరటిపండు ఆరోగ్యానికి మంచిది అంటారు. ఎందుకంటే అందులో పొటాషియం ఎక్కువ కాబట్టి. కానీ అరటిపండులో కన్నా మునగాకులో ఆ పొటాషియం మూడింతలు ఎక్కువగా ఉంటుంది. గుడ్లలో ఉండే ప్రోటీన్స్ ఈ మునగాకులో కూడా ఉంటాయి.

పాలు తాగితే కావలసినంత కాల్షియం మన శరీరానికి అందుతుంది అంటారు. ఆ కాల్షియం పాలల్లో కన్నా మునగాకులో నాలుగింతలు ఎక్కువ. రోజుకో గ్లాసు పాలు తాగే మనం మునగాకుని పట్టించుకోము. అసలు మాములు ఆకుకూరలు వాడినట్టే అన్ని వంటకాలలో ఈ మునగాకుని కూడా వాడవచ్చు. ఈసారి ములక్కాడలు కొనేటప్పుడు మునగాకు గురించి తప్పకుండ అడగండి.


- రమ