గర్భవతుల్లో పెదవులు, బుగ్గలలోపల బొబ్బలు వస్తే  ఎంత డేంజరో తెలుసా..

పెదవుల మీద, నోటిలో, పెదవుల చుట్టూ, గడ్డం వంటి  ప్రాంతాలలో సాధారణంగా బొబ్బలు, పొక్కులు వస్తుంటాయి. విటమిన్ లోపాల వల్లా, అధిక వేడి కారణంగా ఇవి వస్తుంటాయని పెద్దలు చెబుతుంటారు. కానీ గర్భవతులలో ఇవి ఏర్పడితే మాత్రం  కడుపులో పెరిగే బిడ్డకు పెద్ద హాని ఎదురైనట్టే అంటున్నారు వైద్యులు.  నోటిలోపలా, పెదవుల మీద ఇలా బొబ్బలు, పొక్కులు రావడానికి థ్రష్ హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ ప్రధాన కారణం. ఈ వైరస్  లాలాజలం లేదా జననేంద్రియాలను తాకడం ద్వారా వ్యాపిస్తుంది.  ఒక్కసారి ఈ వైరస్ మనిషిని చేరిందంటే ఇక జీవితాంతం శరీరంలో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. సాధారణం అనుకునే ఈ బొబ్బలు పొక్కుల వెనుక ఉన్న ఇంత ప్రమాదకర పరిస్థితి గురించి, ఇది కడుపులో ఉన్న బిడ్డకు కలిగించే నష్టం గురించి తెలుసుకుంటే..

HSV, HSV 1 అనే వైరస్ లు సాధారణంగా ముఖం, పెదవులపై, మరికొన్ని సార్లు జననేంద్రియాలపై బొబ్బలు కలిగిస్తాయి. మహిళలలో, ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి బొబ్బలు వచ్చినట్టైతే గర్భాధారణం సమయంలో కూడా ఇది ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపులో బిడ్డపై ప్రభావం చూపుతుందా అంటే అసౌకర్యానికి మాత్రం ఖచ్చితంగా గురిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. నార్మల్ డెలివరీ సమయంలో మహిళలకు ఈ ఇన్ఫెక్షన్ ఉంటే అది బిడ్డకు చేరుతుందని అంటున్నారు. అప్పుడే పుట్టిన పిల్లలలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ఈ వైరస్ పిల్లలకు ప్రమాదాన్ని తలపెడుతుంది.

వైద్యుడిని ఎప్పుడు కలవాలి..

ఈ హెచ్ఎస్వి వైరస్ ఉంటే అది కూడా గర్బం మోస్తున్న సమయంలో ఈ వైరస్ యాక్టివ్ గా ఉంటే వెంటనే డాక్టర్ ను కలవాలి.  లక్షణాల ఆధారంగా డాక్టర్ చికిత్స చేస్తారు. వీటి నివారణకు క్రీమ్స్, యాంటీ వైరల్ క్రీమ్స్, ప్రిస్కిప్షన్ మెడిసిన్స్ ఇస్తారు. వీటిని వాడటం వల్ల వైరస్ ప్రభావాన్ని స్థంభింపజేయవచ్చు. అయితే డెలివరీ తరువాత ఈ యాంటీ వైరల్ మందులను వైద్యుల సలహా లేకుండా వాడకూడదు. ఇవి పిల్లలకు ప్రమాదం కలిగిస్తాయి.

తల్లులలో ఉన్న హెచ్ఎస్వి వైరస్ పిల్లలకు కూడా సోకితే వీలైనంత త్వరగా వైద్యుడిని కలవాలి.  ముఖ్యంగా పిల్లలలో జ్వరం, నోటి పూతలు, పెదవుల మీద బొబ్బలు, నోట్లో పొక్కులు వంటి సమస్యలు కనిపిస్తే అసలు ఆలస్యం చేయకూడదు. చాలా చిన్నపిల్లలలో సహజంగానే పోషకాహార లోపం ఉంటుంది. తల్లులు దాన్ని సమర్థవంతగా భర్తీ చేస్తుంటేనే వారు అన్ని ఇన్ఫెక్షన్లను జయించి ఆరోగ్యంగా ఎదుగుతారు.

                                                             *నిశ్శబ్ద.