బ్రా ధరించే మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా..

ప్రపంచంలో ఎక్కువ మంది ప్రాణాలను బలిగొంటున్న జబ్బు క్యాన్సర్. చాలామందిలో క్యాన్సర్ చివరి స్టేజ్ కు వచ్చాక తప్ప బయటపడదు. క్యాన్సర్ లో చాలా రకాలు ఉన్నాయి. వీటిలో మహిళలకు ఎక్కువగా ముప్పు కలిగించేది బ్రెస్ట్ క్యాన్సర్. సాధారణంగా నలభై సంవత్సరాలు దాటిన మహిళలలో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.  మహిళల రొమ్ములో మామూలుగానే కణజాలంతో ఏర్పడిన గడ్డలు ఉంటాయి. బ్రెస్ట్ ను చేత్తో తాకినప్పుడు ఈ గడ్డల స్పర్శ తెలుస్తుంటుంది. ఇవి ఏ మాత్రం ప్రమాదం లేనివి. పైపెచ్చు నొప్పి కూడా ఉండవు. కానీ రొమ్ము క్యాన్సర్ లో మాత్రం ఇవన్నీ పూర్తీగా వేరు వేరుగా ఉంటాయి. కొన్ని లక్షణాల ద్వారా రొమ్ము క్యాన్సర్ ను గుర్తించవచ్చు. అలాగే బ్రా వేసుకునే మహిళలకు రొమ్ము క్యాన్సర్ వస్తుందా అనే విషయం నిజమా.. అబద్దమా.. పూర్తీగా తెలుసుకుంటే..

మహిళలకు రొమ్ములలో క్యాన్సర్ గడ్డలు పెరగడాన్ని రొమ్ము క్యాన్సర్ అని అంటారు. ఈ క్యాన్సర్ కణాలు పూర్తీగా  రొమ్మును మొత్తం ఆక్రమించాక  మహిళల ప్రాణాలు కాపాడాలంటే మాత్రం పూర్తీగా రొమ్మును తొలగించాల్సి ఉంటుంది. మహిళల శరీరంలో ముఖ్యభాగం అయిన రొమ్మును తొలగించడం అంటే అది ఎంతో ఆత్మన్యూనతకు దారి తీస్తుంది.  రొమ్ములో ఉండే కణాలలో క్యాన్సర్ కారకాలు చేరి అవి క్రమంగా కణజాలాలుగా రూపాంతరం చెంది క్యాన్సర్ గడ్డలుగా మారతాయి. ఈ క్యాన్సర్ గడ్డలు చేత్తో తాకితే నొప్పిగా ఉంటాయి. అంతేకాదు రొమ్ము మీద  ఉండే చనుమొనల నుండి రసి కారుతూ ఉంటుంది. చీము, రక్తం, ద్రవం కారుతూ ఉంటుంది. చనుమొన చుట్టూ దురద ఏర్పడి దాని కారణంగా కురుపులు వస్తాయి. క్యాన్సర్ గడ్డలు క్రమంగా పెరగడం వల్ల రొమ్ము పరిమాణం కూడా పెరుగుతుంది.  అయితే మహిళలలో నెలసరి సమస్యల సమయంలో రొమ్ములో గడ్డలలో మార్పులు, వాటిని తాకితే నొప్పి కలుగుతుంటాయి. కాబట్టి ఇలాంటి సమయాన్నికూడా పరిగణలోకి తీసుకుంటూ రొమ్ములను సాధారణ రోజుల్లో పరీక్షించుకోవాలి.

ఇకపోతే బ్రా ధరించే మహిళలకు గొమ్ము క్యాన్సర్ వస్తుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే బ్రా ధరించడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు అస్సలు లేవని వైద్యులు చెబుతున్నారు. కాకపోతే బ్రాను నిర్ణీత సమయంలో మాత్రమే ధరించాలి. చాలావరకు వదులుగా ఉన్న దుస్తులు ధరించడం అన్నివిధాలా సురక్షితం.

బ్రా ధరించే అలవాటు ఉన్న మహిళలు బయటకు వెళ్లినప్పుడు మాత్రమే ధరించడం సురక్షితం. ఇంట్లో ఉన్న సమయంలోనూ, రాత్రి నిద్రించేముందు బ్రా తొలగించాలి. బ్రా లకు ఉండే ఎలాస్టిక్ మహిళల రొమ్ము ప్రాంతం నుండి కింద శరీర అవయవాలకు రక్తప్రసరణ జరగడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. దీనివల్ల గుండె మీద ఒత్తిడి పెరుగుతుంది. చాలావరకు సుఖమైన నిద్ర సాధ్యం కాదు. అందుకే ఎల్లవేళలా బ్రా ధరించకూడదని వైద్యులు కూడా చెబుతారు. రొమ్ము క్యాన్సర్ కు బ్రాకు సంబంధం లేదు కానీ బ్రా కారణంగా ఇతర అసౌకర్యాలు అయితే ఉన్నాయి.  రొమ్ము క్యాన్సర్  అవగాహనా నెలగా అక్టోబర్ ను పేర్చొన్నారు. ఈ కారణంగా మహిళలు ప్రమాదకరమైన రొమ్ము క్యాన్సర్ మీద అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం.

                                                                     *నిశ్శబ్ద.