చిన్న చిన్న మార్పులతో అందం.. ఆరోగ్యం


ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి వరకు గడియారంలో ముల్లుతో సమానంగా పరుగులు పెట్టే మహిళలతో కాస్త మీ గురించి మీరు పట్టించుకోండని ఎవరైనా చెబితే, ఆ చెప్పినవాళ్ళ మీద బోలెడంత కోపం వస్తుంది. ఉరుకులు, పరుగులు పెడుతూ, అటు ఆఫీసులోనూ, ఇటు ఇంట్లోనూ అన్ని పనులు సమర్థవంతంగా చేయాలనీ, అందరినీ తృప్తిపరచాలనీ హైరానా పడిపోతూ, ఈ హైరానాలో మనకోసం మనం ఆలోచించుకునే తీరిక, కోరిక కూడా వుండదు. కానీ మనకోసం మనం శ్రద్ధ చూపకపోతే ఎలా? అందం ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఆరోగ్యం చురుకుదనాన్ని అందిస్తుంది. సో... అందంగా, ఆరోగ్యంగా వుంటే ఆత్మవిశ్వాసం నిండుగా, మెండుగా వుండి, అది మన ప్రవర్తన తీరులో బయటపడుతుంది. అందుకు పెద్దగా సమయం కూడా అక్కర్లేదు. రోజు మొత్తంలో మన రొటీన్‌కి చిన్నచిన్న మార్పులు, చేర్పులు చేస్తే సరిపోతుంది.

* మొట్టమొదటగా తప్పనిసరిగా చేయాల్సింది... ఉదయం నిద్ర లేస్తూనే హడావిడిగా మంచం దిగి పని ప్రారంభించకుండా ఓ 2 నిమిషాలు దీర్ఘంగా శ్వాస తీసుకుని వదలాలి. ఎక్సర్‌సైజులు వంటివి చేయడానికి టైమ్ వుంటే సరే, లేకపోతే కనీసం శ్వాస ప్రక్రియ పైన దృష్టి పెట్టినా చాలు. ఇక మరో ముఖ్య విషయం... పరగడుపునే రెండు మూడు గ్లాసుల నీటిని తాగడం ద్వారా శరీరం మరింత కాంతిని సంతరించుకుంటుంది. అలాగే రోజులో వీలు చిక్కినప్పుడల్లా మంచి నీటిని తాగటానికి ప్రయత్నించండి. ఇది పెద్ద విషయమా అనుకోకండి. రోజు మొత్తంలో ఎంత మంచినీరు తాగుతున్నారో ఒక్కసారి గమనించి చూడండి. ఇలాంటి చిన్న చిన్న విషయాల పట్ల కూడా కొంచెం శ్రద్ధ పెడితే అందానికి, ఆరోగ్యానికి కూడా మంచింది.

* చాలామంది బ్యూటీ పార్లర్లకి వెళ్ళడానికి ఇష్టపడరు. అంతమాత్రాన మనపై మనం శ్రద్ధ పెట్టకుండా ఉంటే ఎలా? చిన్న చిన్నవే... ఉదాహరణకి స్నానం చేసే గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల ఆయిల్ వేసుకోవడం, మంచి బాడీ లోషన్ అప్లయ్ చేసుకోవడం వంటి చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ పెడితే చాలు... వయసు ప్రభావం కనిపించకుండా చూసుకోవచ్చు. మరో విషయం... ఎండలోకి వెళ్ళేముందు నన్‌స్క్రీన్ లోషన్ వంటివి అప్లయ్ చేసుకోవడం, చలువ అద్దాలు వాడటం వంటివి చాలా చిన్న విషయాలే. కానీ, చాలామంది శ్రద్ధ పెట్టని విషయాలు కూడా.

* సాధారణంగా బయటి నుంచి ఇంట్లోకి అడుగు పెడుతూనే చేయాల్సిన పనులని తలుచుకుంటూ పనిలో పడతాం. కానీ, ఇంటికి రాగానే చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కుని, పచ్చిపాలలో దూదిని ముంచి ముఖాన్ని తుడుచుకోవడానికి రెండు నిమిషాలు కూడా పట్టదు. బయట పొల్యూషన్ ప్రభావం మన ముఖంపైనుంచి పోవడానికి. ఇక వారానికి ఒక్కసారైనా ఒక చెంచా తేనెలో కొంచెం వెనిగర్ కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాలు ఉంచుకుని చల్లటి నీటితో కడిగి చూసుకోండి. అట్టే సమయం పట్టదు సరికదా, మీకు మీరే కొత్తగా కనిపిస్తారు. ఇక ఆడవారిలో ఒత్తిడిని, వయసుని బయటపెట్టేవి కళ్ళకింద నల్లటి చారలు. రోజూ పడుకునే ముందు రెండు కీరా ముక్కల్ని కళ్ళపై పెట్టుకునే అలవాటు చేసుకుంటే చాలు నల్లటి వలయాలు కొన్నాళ్ళలో మాయమవటానికి.

* రోజువారీ కార్యక్రమాలను పూర్తి చేశాక నిద్రకి ఉపక్రమించే ముందు మీకోసం మీరు ఓ 5 నిమిషాలు ఇచ్చుకోగలిగితే చాలు. గోరువెచ్చని నీటిలో పాదాలని ఉంచి, మీకు ఇష్టమైన పుస్తకాన్ని తిరగేయండి. రోజంతటి శ్రమని మర్చిపోవచ్చు. ఇక ఆఖరిది, ముఖ్యమైనది... తప్పనిసరిగా ఎనిమిది గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఏ ఫేస్‌ప్యాక్‌లూ, మేకప్‌లూ అది ఇచ్చే ఆరోగ్యాన్ని, అందాన్ని అందించలేవు నిజానికి.  ఈరోజు మనం చెప్పుకున్న ఈ విషయాలన్నీ చాలా చిన్న చిన్నవే. కానీ, మనం ప్రత్యేక శ్రద్ధ పెట్టనివి కూడా. ఈ చిన్న జాగ్రత్తలతో మన అందాన్ని, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. రోజూ చేయగలిగితే అలవాటుగా కూడా మారుతుంది.. ఏమంటారు?

-రమ