తిరుమలలో స్వచ్ఛందసేవ
Tirumala Voluntary Seva
.png)
తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి
శ్రీవారి సేవ
భక్తుల సేవే భగవంతుని సేవ
వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన
వేంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి
శ్రీవారి భక్తులకు స్వచ్ఛందంగా సేవలందించేందుకు వీలుగా తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో శ్రీవారి సేవను ప్రవేశపెట్టింది. ఈ సేవ ద్వారా వేలాదిమంది భక్తులకు సేవలు అందించే మహదవకాశం పుణ్యక్షేత్రంలో కలగడమేగాక దేవస్థానం పాలనా యంత్రాంగానికి కూడా తోడ్పడినట్లవుతుంది. శ్రీవారికేగాక శ్రీవారి భక్తులకు సేవ చేయడంవల్ల కూడా భగవంతుని అనుగ్రహం పొందవచ్చు. ఇది సనాతన సంప్రదాయం.

భక్తులు విరామ సమయంలో కళ్యాణకట్ట, నిత్యాన్నదాన భవనం, క్యూ కాంప్లెక్సు, లడ్డూ కౌంటర్లు, ఉచిత బస్సు, యాత్రికుల వసతి సముదాయాలు, విజిలెన్సు, ఆరోగ్య కేంద్రాలు, శ్రీవారి తిరునామం, పుష్కరిణి, సమాచార కేంద్రాలు, ఇంకా శ్రీవారి ఆలయం వెలుపల ఉచిత లగేజీ కేంద్రాలు, వాహనాలు నిలుపు కేంద్రాలు, సి.ఆర్.ఓ. రవాణా కేంద్రం, ఉద్యానవనాలు తదితర ప్రదేశాల్లో తమకు అభిరుచి కలిగిన సేవలను అందించి యాత్రికులకు సేవ చేయవచ్చును. తద్వారా ఆత్మతృప్తిని, భక్తవత్సలుడైన శ్రీవారి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ఈ సేవలో భాగంగా భక్తులు కనీసం 4నుండి 6 గంటలు సేవలు అందించవలసి ఉంటుంది. శ్రీవారి సేవలో మీ శక్తి సామర్ధ్యాల ద్వారా యాత్రికులకు మరింత మెరుగైన సేవలు అందించి తిరుమల క్షేత్రం అంతటా వినూత్నమైన ఒక ఆధ్యాతిమిక వాతావరణం పెంపొందించవచ్చును. గతంలో మహా భక్తులు చేసిన ఇలాంటి సేవే కైంకర్యంగా ప్రసిద్ధి పొంది ఆధ్యాత్మికరంగంలో ఒక స్థిరమైన సంప్రదాయంగా నిలిచింది. శ్రీవారికి ఇంకా భక్తులకు సేవలు అందించి తిరుమల నుంచి శ్రీరామానుజులు, అనంతాళ్వారు తదితర మహనీయులు ఎందరో తరించారు. ఈ పవిత్ర సంప్రదాయాన్ని పునరుద్దరించే ఉద్దేశంతోనే దేవస్థానంవారు శ్రీవారి సేవను ప్రవేశపెట్టారు.
భక్తులు అన్నదానం కాంప్లెక్సు వద్ద ఉన్న కేంద్రంలో తమ పేర్లను నమోదు చేసుకుని ఈ సేవ చేయవచ్చు. పదిమందికి తక్కువ కాకుండా ఒక గ్రూపుగా కనీసం వారంరోజులపాటు భక్తులు ఈ సేవ చేయవచ్చు. గ్రూపులుగా వచ్చేవారు ముందుగా తమ రాక తెలియపరచాలి. ఈ సేవచేసేవారికి తిరుమలలో ఉచిత వసతి, భోజనాలను దేవస్థానం ఏర్పాటు చేస్తుంది. భజన సంఘాలు కూడా పాల్గొనవచ్చు.
భక్తులకు సేవ చేయదలచినవారు
ఓ.యస్.డి. శ్రీవారి సెల్, అన్నదానం కాంప్లెక్సు ఎదురుగా తిరుమల వారిని సంప్రదించాలి.
Tirumala Phone No. 091-0877-2264561
Tirupati Phone No. 091-0877-2263544
శ్రీవారి సేవ చేసే వాలంటీర్లకు మార్గదర్శక సూత్రాలు
శ్రీవారి సేవలో ఒక వారంపాటు సేవలు అందించుటకు పదిమంది సభ్యులకు తక్కువ కాకుండా ఉన్న సముదాయానికి అర్హత లభిస్తుంది. నిస్వార్థ సేవ అందించుటకుగానూ ఈ సభ్యులకు ఆధ్యాత్మిక పరిజ్ఞానం కలిగి ఉండాలి. లింగబేధం లేదు. ఆసక్తిగల సమూహంలోని సభ్యులు తమ చిరునామా, వయసు తదితర పూర్తి వివరాలతో ఈ కింది చిరునామాకు వీలైనంత ముందుగా పంపాలి.
పౌర సంబందాధికారి
తిరుమల తిరుపతి దేవస్థానముల పరిపాలనా భవనం
కె.టి. రోడ్డు, తిరుపతి.
వీరు తమ పిల్లలు, వృద్ధులు, వ్యాధిగ్రస్తులను వెంట తీసుకురాకూడదు.
తిరుమలలో అన్నదానం కాంప్లెక్సు ఎదురుగా ఉన్న శ్రీవారి సేవా కార్యాలయంలో ప్రత్యేకాధికారి లేదా
సూపరింటెండెంట్ గారి వద్ద ఆర్డరు ఇచ్చిన తేదీ ప్రకారం ఉదయం పదిగంటల నుండి ఐదు గంటల లోపు హాజరు కావలసిఉంటుంది.
ఈ సేవలకు ఉచిత వసతి కల్పించబడుతుంది. వీరికి యాత్రికుల ఆమెనిటీస్ కాంప్లెక్సులో వసతి కల్పించినచో లాకరుకు రూ. 200, ఇంకా చాపకు 100 చొప్పున కాషన్ డిపాజిట్ చెల్లించవలసి ఉంటుంది. ఈ మొత్తం తిరిగి ఇవ్వబడుతుంది.
శ్రీవారి సేవా కార్యాలయం వద్ద ప్రతిరోజూ సాయంత్రం నాలుగు గంటలకు డ్యూటీ కేటాయించబడుతుంది. వీరు ప్రతిరోజూ కనీసం నాలుగు నుండి ఆరు గంటలు పని చేయాల్సిఉంటుంది.
సేవలో ఉన్నప్పుడు మాత్రమే శ్రీవారి సేవ స్కార్ఫులను ధరించాలి. శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు వీటిని ధరించాల్సిన అవసరం లేదు.
సేవకులు ప్రతిరోజూ తెల్లవారుజామున రామ్ భగీచ అతిథి గృహం-1 వద్ద గల ధ్యానకేంద్రంలో (వైభవోత్సవ మండపం)లో ధ్యానం చేయవలసి ఉంటుంది.
నిరంతరం గోవింద మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. భక్తులను పలకరించేటప్పుడు ''గోవింద, గోవింద'' అని పలకరించాలి.
యాత్రికులకు సహాయం నిమిత్తం ఈ వాలంటరీ సేవ ఏర్పాటు చేయడమైంది. వాలంటీర్లకు ధనరూపంలో గానీ, వస్తురూపంలో గానీ ఏమీ చెల్లించనవసరం లేదు. ఈ సేవ పూర్తిగా ఉచితం.
ప్రతిరోజూ వీరు భజనలు, నగర సంకీర్తనల్లో పాల్గొనవలసి ఉంటుంది. శ్రీవారి సేవ కార్యాలయంలో అందుబాటులో ఉన్న సంగీత వాయిద్యాలను శ్రీవారి సేవకులు ఉపయోగించుకోవచ్చు.
శ్రీవారి సేవకులు శ్రీనివాసునికి చేసే పవిత్రసేవగా భావించి శ్రీవారి సేవను అంకితభావంతో చేయాలి.
Voluntary service in tirumala, tirumala free service by volunteers, volunteers and govinda mantra, volunteers and srivari cell




