Home » జయహో » మీకు మీరే కోచ్

 

అవును... మీకు మీరే కోచ్. మీ జీవితాన్ని, మీ ఆలోచనల్ని వేరే ఎవ్వరు మీ అంత బాగా అర్థం చేసుకోలేరు. అలాగే మీ బలాలు, బలహీనతలని కూడా మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలనుకుంటున్నారు? ఈ చిన్న ప్రశ్నకి మీకు సమాధానం తెలిస్తే చాలు.. మార్పు ప్రారంభమయినట్టే. మార్పు కావాలని అందరికి ఉంటుంది కానీ అది ఎలా సాధ్యమో కొంతమందికే తెలుసు. ఆ సీక్రెట్ తెలిసినవారే విజేతలుగా పదిమందితో జేజేలు అందుకుంటారు. అలా విజేతలుగా నిలవటానికి ఏం చేయాలో నిపుణులు చేస్తున్న కొన్ని సూచనలు మీకోసం ఇక్కడ ఇస్తున్నాం.

 

మీకు చాలా నచ్చిన ప్రత్యేకత కలిగిన కొంతమంది పేర్లు రాసుకోండి. ఆడ,మగవారు అనే తేడా అక్కరలేదు. ఉదాహరణకు స్టీవ్ జాబ్స్, చందా కొచ్చార్ ఇలా వరసగా వారి పేర్లు వ్రాయండి. వారిలోని ఏ క్వాలిటీ మీకు నచ్చిందో అది రాసుకోండి. ఇప్పుడు ఒక లిస్ట్ సిద్ధంగా ఉంది కదా. ఇక ఆ లిస్టులో ఒక్కో క్వాలిటీని మీలోకి ఎలా తెచ్చుకుంటారో ఆలోచించండి.

 

తను బాగా కష్టపడుతుంది, అతను కొత్తగా ఆలోచిస్తాడు, ఆమె హుందాగా ప్రవర్తిస్తుంది. ఇలా ఏ క్వాలిటీలు మీకు నచ్చాయో వాటిని మీలోను మీరు చూసుకుంటే? బాగుంటుంది కదా! అప్పుడు మీకు మీరెంత నచ్చుతారో ఆలోచించండి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ఇష్టపడటం మొదలు పెడతారో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కావలసిన ఆయుధం అదే. అది మనతో ఉంటే చాలు ప్రపంచాన్నే గెలిచేయగలం అన్న నమ్మకం వచ్చేస్తుంది. ఆ నమ్మకం మనల్ని నిటారుగా నిలబెడుతుంది. తలెత్తి, కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడేలా చేస్తుంది. అప్పుడు మనమూ విజేతలం అవుతాము.