Home » Articles » కాలకన్యక పుట్టినరోజే ‘ఉగాది’

 

‘గమ్యం’లేనిది కాలం. ‘సరిహద్దు’ లేనిది కాలం.
వయసు పెరుగుతున్నకొద్దీ వార్థక్యం రావడం ప్రకృతి సహజం. కానీ... ఎంత వయసు పెరిగినా ‘కాలానికి’ వార్థక్యం రాదు. అది నిత్య యవ్వనంతో.. ముందుకు పరుగెడుతూనే ఉంటుంది. ఆ పరుగులో కూడా ఓ లయ ఉంది. ఒకసారి వేగంగా. మరొకసారి నెమ్మదిగా పరుగులు తీయదు.ఒక నిర్ణీత,నియమబద్ధ, నిర్దిష్ఠ వేగంతో ముందుకు సాగుతుంది. వసంత ఋతురాగాల హొయలుతో., గ్రీష్మతాపాల వేడి నిట్టూర్పులతో., వర్షధారల విరుపులతో., వెన్నల రాత్రుల విలాసాలతో., పుష్యమి పూల సౌకుమార్యంతో., పైట తొలగిన శిశిర సుందరిలా పరుగులు తీసే కాలకాంత వయసును నిర్ణయించాలని మన ఋషులు ఆరాటపడ్డారు...ఆలోచించారు. ఎలా లెక్కలు వెయ్యాలో ఓ అభిప్రాయానికి వచ్చి..దివా రాత్రాలు ఏర్పడడానికి  సూర్యుడు కారణమని., చంద్రునిలో హెచ్చుతగ్గుల కారణంగా పక్షాలు ఏర్పడుతున్నాయని., సూర్యుని రాసిమార్పు కారణంగా నెలలు, రెండేసి నెలలు ఒక ఋతువుగాను., ఆరు ఋతువులు ఒక సంవత్సరంగాను నిర్ణయించారు. ఇంతవరకు బాగానే ఉంది. కాలకాంతకు  ఎన్ని సంవత్సరాల వయసు వచ్చిందో తెలుసుకునేదెలా ? తిరిగి ఆలోచనలో పడ్డారు. సమాధానం దొరికింది. మాసాలకు, ఋతువులకు పేర్లు పెట్టారు. మరి ఎన్ని సంవత్సరాలు గతించాయో తెలిసేదెలా ?


వాటికి పేర్లు పెట్టాలనుకున్నారు. ఎన్ని పేర్లని పెడతారు..? అందుకే బాగా ఆలోచించి ప్రభవ, విభవ అని అరవై పేర్లు పెట్టి..ఆ పేర్లు తిరిగి పునరావృతం అయ్యేలా నిర్ణయించారు. ఇప్పటికి లెక్క కుదిరింది. కాలకన్యకు ఎంతత వయసు గతించింది., ప్రస్తుతం ఎంత వయసు నడుస్తోంది తెలుసుకోగలిగారు. సాదారణంగా ఎవరినైనా మీ పుట్టిన రోజు ఎప్పుడో చెప్పండి అని అడిగితే ఫలానా తారీఖు, ఫలానా నెల, ఫలానా సంవత్సరం అని చెప్తారు. మనిషి జీవితానికి మరణమనే గమ్యం ఉంది కనుక అలా చెప్పడం సాధ్యం. కానీ గమ్యం లేని కాలానికి అలా వయసు నిర్ణయించి చెప్పడం కుదరదు. కనుక.., కాలకన్య వయసు చెప్పాల్సి వచ్చినప్పుడు ఫలానా మన్వంతరంలో, ఫలానా యుగంలో, ఫలానా సంవత్సరం అని చెప్పాలి. ఈ లెక్కన కాలకన్య వయసు వైవస్వత మన్వంతరంలోని కలియుగంలో 5115 వ సంవత్సరంలో.. మన్మథనామ సంవత్సరం అన్నమాట.

అంటే...కాలకన్యక జన్మదినమే ‘ఉగాది’ పండుగ అన్నమాట. 
              
ఈ రోజే కాలకన్యక పుట్టినరోజు అని ఎలా నిర్ణయిస్తాం? దీనికీ సమాధానం ఉంది. తొలి ఋతువైన వసంత ఋతువులో, తొలిమాసమైన చైత్రంలో, తొలి పక్షమైన శుక్లపక్షంలో, తొలి తిథి అయిన పాడ్యమి నాడే కాలకన్య వయసును లెక్కించాని నిర్ణయం తీసుకుని, ఆ దిశగా అడుగు వేయడం జరిగింది. అందుకే ఈ రోజు నవ యుగానికి నాంది అయింది.., కాలకన్యకకు జన్మదినమైంది.., మనందరకూ ‘ఉగాది’ పండుగ అయింది.

ఇక ఈ సంవత్సరానికి ‘మన్మథ’ అని పేరు పెట్టడానికి కూడా కారణం ఉంది. సతీవియోగంతో తపోదీక్ష వహించిన పరమశివుని తపస్సు భగ్నంచెయ్యాలని ప్రయత్నించిన మన్మథుడు ముక్కంటి క్రోధాగ్ని జ్వాలలకు దగ్థమై.., తిరిగి అనంగుడుగా పునర్జీవితుడైనది ..ఈ సంవత్సరంలోనే. అందుకే ఈ సంవత్సరానికి ‘మన్మథ’ అని పేరు పెట్టారు. మనకున్న 60 సంవత్సరాలలో మన్మథనామ సంవత్సరం 27 వది. అంటే కాలకాంత ప్రౌఢయవ్వనంలో ఉంటుందన్నమాట. ఈ సంవత్సరమంతా వయసులో ఉన్న యువతీ యువకులను మన్మథ శరాలకు గురిచేస్తూ., వయసు మళ్లిన జంటలకు., గతించిన కాలపు మన్మథ వైభవాలను గుర్తుచేస్తూ., కుసుమశరంలా ముందుకు సాగే ‘మన్మథ నామ సంవత్సర కాలకన్యకకు ’ జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ స్వాగతిద్దాం. మన జీవితాలు ‘ఉగాది పచ్చడి’లా షడ్రసోపేతం కావాలని ఆశిద్దాం.

                                   

- యం.వి.యస్.సుబ్రహ్మణ్యం