Home » Articles » ఉగాది పచ్చడి.. ఏమిటి? ఎందుకు?

 

ఉగాది పచ్చడి.

 

ప్రతి సంవత్సరం మొదటి రోజు సంవత్సరాది. సంవత్సరాదినే ఉగాది...
యుగాది అని కూడా అంటారు.

ప్రతి ఏటా చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది వస్తుంది.

ఉగాది నాడు ఎన్ని ఇష్టమైన పిండివంటలు చేసుకున్నా ముందుగా ఉగాది పచ్చడి రుచిచూసే తక్కినవి తినడం తరతరాలుగా వచ్చే సంప్రదాయం.

మామిడి ముక్కలు, వేప పువ్వులు, చెరకుగడ ముక్కలు, ఉప్పు, బెల్లం, గుల్ల శనగపప్పు, కొబ్బరి ముక్కలు, అరటిపళ్ళు, చింతపండు రసంతో ఉగాది పచ్చడి చేస్తారు. కొందరయితే మిరియాలు కూడా వేస్తారు. అనేక రకాలైన రుచుల కలగలుపు ఉగాది పచ్చడి.

కాలగమనంలో మన బ్రతుకు తెరువుల్లో సుఖాలకు, ఆనందాలకే కాక ఒకవేళ వస్తే కష్టాలకు సంసిద్ధులమై ఉండాలని ఉగాది పచ్చడి, తీపి, చేదులు పరోక్షంగా ప్రబోధిస్తాయి.

చిరు చేదుకు - వేప పువ్వులు, తీయదనాలకు - చెరకు, బెల్లం, అరటిపళ్ళు, పులుపునకు - చింతపండు రసం, కమ్మదనానికి - కొబ్బరి, గుల్ల శనగపప్పు, కావాలనుకుంటే కారానికి మిరియాలు ఈ ఉగాది పచ్చడిగా కలుపుతారు. భాస్కర శతకంలోనే - ‘ఉప్పులేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా’ అన్నారు.

కనుక శుచిగా చేసుకునే ఉగాది పచ్చడిలో రుచికి ఉప్పు వేస్తారు.

అన్ని రకాల అనుభవాలు జీవితంలో ఉంటాయని, అన్నీ కలిపే జీవితమని అందుకు సంకేతమే ఉగాది పచ్చడి అని పరంపరగా పెద్దలు చెబుతూవచ్చారు.

ఆయురారోగ్యాలతో మానవులం విలసిల్లాలి అనేవి ఎప్పుడూ చెప్పుకునే శుభాకాంక్షలు. చేదు ఆరోగ్యానికి అవసరం. మాధుర్యం అనుభవించడం ఒక భాగ్యం.

వాత, పిత్త, శ్లేష్మాలు అనేవి శరీరాల్లో మనల్ని రుగ్మతలకి గురిచేస్తాయి.

వాటిని హరించే ఆరోగ్య గుణాలు కల శాస్త్రీయమైన ఔషధం వంటిది ఉగాది పచ్చడి. అందుకే ఉగాది పచ్చడి మనకి నచ్చి తీరుతుంది. ఆ పచ్చడి కూడా మన శరీరాలకు శుభాకాంక్షలు పల్కుతుందన్నమాట.

తెలుగు సంవత్సరాది పర్వ మాధుర్యం సర్వమూ ఉగాది పచ్చడిలోనే వుంది.

అందరికీ శ్రీ మన్మథ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

-సన్నిధానం నరసింహ శర్మ