Home » Articles » శ్రీ గోదా కళ్యాణము

శ్రీ గోదా కళ్యాణము

 

 

Goda Kalyanam Goda Kalyanam is celebrated at the end of Dhanurmasam to mark the marriage of Goda devi

 

 

భోగిపండగనాడే శ్రీ గోదారంగనాథుల కళ్యాణము జరుపటం ఆనవాయితీగా వస్తున్న ఆచారము .
ధనుర్మాసం నెలరోజులూ వ్రతంలో భాగముగా అమ్మ అనుగ్రహించిన "తిరుప్పావై " ని అనుసంధించి ఆఖరున కల్యాణంతో ముగించి శ్రీ గోదారంగనాథుల కృపకు  పాత్రులుకావటం  మనందరకూ అత్యంత ఆవశ్యకం .
శ్రీ విల్లి పుత్తూరంలో వేంచేసియున్న వటపత్ర శాయికి తులసీ దమనకాది పాత్రలను వివిధ రకాల పుష్పాలను మాలాలుగా కూర్చి స్వామికి సమర్పిస్తున్న శ్రీవిష్ణుచిత్తులకు శ్రీ భూదేవి అంశమున లభించిన గోదాదేవి దినదిన ప్రవర్డమానముగా పెరుగుతూ తండ్రియొక్క భక్తి జ్ఞాన తత్సార్యాలకు వారసురాలైనది.
తండ్రిచే కూర్చబడిన తోమాలలను ముందుగా తానే ధరించి "స్వామికి తానెంతయు తగుదును" అని తన సౌందర్యమును నీటి బావిలో చూసుకుని మరల అ మాలలను బుట్టలో పెడుతూ ఉండేడిది.
ఇది గమనించిన విష్ణుచిత్తులు ఆమెను మందలించి స్వామికి ఇట్టిమాలలు కై౦కర్యము చేయుట అపరాధమని తలచి మానివేసిరి . శ్రీస్వామి విష్ణుచిత్తులకు, స్వప్నమున సాక్షాత్కరించి ఆమె ధరించిన మాలలే మాకత్యంతప్రీతి __ అవియే మాకు సమర్పింపుడు అని ఆజ్ఞ చేసిరి .
ఈమె సామాన్య మనవకాంత కాదనియు తన్నుద్దరించుటకు ఉద్భవించిన యే దేవకాంతయో భూదేవియో అని తలుస్తూ స్వామి ఆజ్ఞ మేరకు మాలా కై౦కర్యమును చేయసాగిరి.

 

 

Goda Kalyanam Goda Kalyanam is celebrated at the end of Dhanurmasam to mark the marriage of Goda devi

 

 


యుక్త వయస్సు రాలైన గోదాదేవిని చూసిన విష్ణు చిత్తులు ఆమెకు వివాహము చేయనెంచి అమ్మా! నీకు పెండ్లీడు వచ్చినది నీ వేవరిని వరింతువో చెప్పుము నీ కోరిక మేరకే వివాహము చేతును అనిరి.
తండ్రి మాటలు వినిన గోదాదేవి లఙ్ఞావదనయై తమరు సర్వజ్ఞులు తమకు తెలియనిదేమున్నది అపురుషోత్తముని తప్ప నేనింకెవరినీ వరింపను ఇతరుల గూర్చి యోచింపను అని తన మనోభీష్టాన్ని తెలియజేసెను.
అప్పుడు విష్ణుచిత్తులు "కొమడల్" అను లోకప్రసిద్ద గ్రంధము ననుసరించి ఆ వటపత్రశాయి వైభవముతో ప్రారంభించింది నూట ఎనిమిది దివ్య తిరుపతిలలో అర్చామూర్తులైయున్న పెరుమాళ్ళ వైభవాతిశయయులను వర్ణింపసాగిరి అ క్రమములో చివరకు "అజికియ మనవాళన్ అను శ్రీరంగనాథుల రూపరేఖా విలాసములను వర్ణింపగనే "జితాస్మి" అని, ఆమె హృదయమందంతటను అరంగనాథుని దివ్య మంగళ స్వరూపమే నింపి యుంచుకొనినదై గగుర్పాటు పొందుచుండెను.
ఆ స్థితిని గమనించిన విష్ణుచిత్తులు "అదెట్లు సాధ్యము" అని చింతాక్రాంతులై నిదురింప __ ఆ శ్రీరంగనాధులు స్వప్నమున శాక్షాత్కరించి నీ పుత్రిక భూజిత గోదను మాకు సమర్పింపుడు ఆమెను పాణిగ్రహణము చేసికొందును.
వివాహ మహొత్సావానికి నా అజ్ఞమేరకు  తగిన సామగ్రులు తీసుకుని పాండ్యమహారాజు ఛత్రధ్వజ చామరాదులతో మరియు రత్నాదులచే అలంకరించబడిన దంతపు పల్లకిలో మిమ్ముల స్వాగతి౦చెదడు అని పలుకగా __
విష్ణుచిత్తులు మేల్కోంచి అత్యంత ఆనందోత్సాహములతో తనజన్మ సార్ధకమైనదని పొంగి పోవుచూ _ సకల మంగళ వాయిద్యములు మ్రోగుచుండగా గోదాదేవిని శ్రీ రంగమునకు తోడ్కొని పోయిరి.
అచట సమస్త జనులున్నా పాండ్యమహీభూపాలుడున్నా విష్ణు చిత్తులను _ ఆ సన్నివేశము దర్శించి ధనుల్వైరి.

 

 

Goda Kalyanam Goda Kalyanam is celebrated at the end of Dhanurmasam to mark the marriage of Goda devi

 

 


ఇట్లు అండాళ్ తల్లి తాను చేసిన ధనుర్మాసు వ్రత కారణమున పరమాత్మను తానుపొంది మనలను ఉద్దరించుటకు మార్గదర్శినియై నిలచినది.
శ్రీరంగనాధుడు, స్వయముగా అమెనే వరించి _ పాణిగ్రహణము చేసివాడు దీనినే మనము భోగిపండుగనాడు భోగ్యముగా జరుపుకొనుచున్నాము.
శ్రీ గదా రంగనాథుల కళ్యాణము చూచినను చేయించినను, ఈ కథ వినినను __చదివిననూ సకల శుభములు చేకూరుననుటలో సందేహములేదు.
గోదారంగనాథుల వారి కల్యాణి గీతాన్ని నిత్యమూ అలపిద్దాం లోకకల్యాణానికి పాటు పడదాం.

            కల్యాణ గీతిక
        (కాంభోజ  రాగము _ త్రిపుట తాళము )
    ప ..     _ శ్రీ గోదారంగనాధుల కళ్యాణము గనరే
       
    అ..ప..    _ శ్రీ కల్యాణముగని  _ శ్రీల భిల్లరే!

    చ..      _ ఆకాశమే విరిసి _ పందిరి యైనది
            భూదేవియే మురిసి __ అరుగు వేసినది

        అష్టదిక్కులు మెరసి _ దివిటీలు నిలిపినవి
        అష్టైశ్వర్యములు  తరలి __ నిలువెల్ల కురిసినవి....

    చ ...     విష్ణు చిత్తుని కన్య విష్ణువునే వలచినది
        నిష్టతో మార్గళి వ్రతము చేసినది
        ఇష్టసఖులను మేల్కోల్పి  _ వెంటగోన్నది
        జిష్ణుని హితకరు కృష్ణుని చేబట్టినది

    చ ....    జీవాత్మయే పరమాత్మకు అంశమ్మని చాటినది
        శేషి శేషభూతులు పరమార్ధము తెలిపినది
        దివ్య మంగళ విగ్రహ సాయుజ్యము నరశినది
        దివ్య ద్వయ మంత్రార్ధంబిలను __స్థాపించినది
   
    చ ...     శ్రీ గోదా రంగనాథుల కల్యాణ గుణ విభవము
        శ్రీ ద్వయ మంత్ర రత్నమ్మున కన్వీయ మీజగము
        ఇదిగనిన అనుసంధి౦చిన శుభప్రదము
        మదినిపాడరె _ రంగనాథుని గీతము జయము జయము


            అండాళ్ దివ్య తిరుగడిగళే శరణమ్   

 

- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రంగనాథ్