Home » Latest News » కొత్త డీజీపీ హరీష్ గుప్తా ప్రస్థానమిదీ!


ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీశ్ గుప్తాను నియమిస్తూ ఏపీ సర్కార్  ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీకాలం ఈ నెల 31వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో హరీశ్ గుప్తాను కొత్త డీజీపీగా నియమించింది. ఈయన గతంలో కూడా ఒక సారి రాష్ట్ర డీజీపీగా పని చేశారు.  గత ఏడాది ఎన్నికల సమయంలోనూ హరీశ్ గుప్తాను ఎన్నికల సంఘం డీజీపీగా నియమించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమించింది.

 ఇప్పుడు మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం హరీష్ గుప్తాను డీజీపీగా ఎంపిక చేసింది. 1992 బ్యాచ్కు చెందిన ఈయన ప్రస్తుతం విజిలెన్స్ డీజీగా ఉన్నారు. ఒక సారి డీజీపీగా పని చేసిన అధికారికి మరోసారి డీజీపీగా బాధ్యతలు అప్పగించడం చాలా చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఈ కారణంగా ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ పగ్గాలు చేపట్టనుండటం ప్రత్యేకతను, ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం కొత్తగా డీజీపీ బాధ్యతలు చేపట్టనున్న హరీష్ కుమార్ గుప్తాను గత ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం ఏపీ డీజీపీగా ఎంపిక చేసింది. అప్పటి వరకూ రాష్ట్ర డీజీపీగా ఉన్న కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని తప్పించి హరీష్ కుమార్ ను ఎంపిక చేసింది. దీంతో హరీష్ కుమార్   2024 మే 6 నుంచి 2024 జూన్‌ 19 వరకు ఆయన డీజీపీగా ఉన్నారు.

హరీష్ కుమార్ గుప్తా  1992 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఈయన కెరీర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఖమ్మం జిల్లా ఏఎస్పీగా మొదలైంది. ఆ తరువాత ఆయన   మెదక్, పెద్దపల్లి లలొఏఎస్పీగా పని చేశారు. అదనపు ఎస్పీగా కరీంనగర్‌లో పని చేశారు. కృష్ణా, నల్గొండ జిల్లాల్లో ఎస్పీగా పని చేసిన ఆయన ఆ తరువాత సీఐడీలో ఎస్పీగా పని చేశారు. 

ఇక  2017 నుంచి 2019 వరకు లా అండ్‌ ఆర్డర్‌ విభాగంలో అడిషనల్ డీజీగా పని చేసిన హరీష్ కుమార్ గుప్తా ఆ తరువాత  పోలీసు రిక్రూర్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌గాను, హోం శాఖ ముఖ్య కార్యదర్శిగాను పని చేశారు. ప్రస్తుతం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డీజీగా ఉన్నారు. ఈ మధ్యలో ఆయన  హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో సౌత్‌జోన్‌ డీసీపీగా పని చేశారు. తర్వాత విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మంట్‌ విభాగానికి డీఐజీగా కూడా విధులు  విర్వర్తించారు. అలాగే గుంటూరు రేంజ్‌ ఐజీగాను బాధ్యతలు నిర్వర్తించారు.