Home » Latest News » బండి సంజయ్ ఎంట్రీతో మరింత ముదిరిన బీఆర్ఎస్ విలీన వివాదం


 

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏపీలో అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌ల మధ్య మాటల యుద్దం రెండు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెంచేస్తోంది. వారి డైలాగ్ వార్‌లోకి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంట్రీతో అగ్గికి మరింత ఆజ్యం పోసినట్లైంది. తెలంగాణ‌లో సీఎం రమేష్ అక్ర‌మంగా కాంట్రాక్టులు ద‌క్కించుకున్నార‌ని.. సీఎం రేవంత్ రెడ్డికి రూ.10 వేల కోట్ల అప్పు ఇప్పించార‌ని.. ఆ సందర్భంగా కుంభ‌కోణం చోటు చేసుకుంద‌ని కేటీఆర్ ఆరోపించారు. 

దానిపై సీఎం ర‌మేష్‌.. నిప్పులు చెరిగారు. కేటీఆర్‌కు మ‌తి భ్రమించింద‌న్నారు. ఆయ‌న వాస్త‌వాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నార‌ని మండిపడ్డారు. బీఆర్ ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తాన‌ని కేటీఆర్ త‌న వ‌ద్ద‌కు వ‌చ్చార‌ని ఈ సంద‌ర్భంగా సీఎం ర‌మేష్ బాంబు పేల్చారు. క‌విత‌ను జైలు నుంచి విడుద‌ల చేయించి.. ఈడీ, సీబీఐ దాడులు జ‌ర‌గ‌కుండా చూస్తే.. బీఆర్ఎస్‌ని బీజేపీలో విలీనం చేస్తామ‌ని కేటీఆర్ త‌న‌కు చెప్పార‌న్నారు. దానికి సంబంధించి సీసీ ఫుటేజ్‌లను కూడా బయటపెడతానని .. దమ్ముంటే దానిపి చ‌ర్చ‌కు రావాల‌ని సవాల్ విసిరారు. 

సీఎం రమేష్ సవాలుపై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. చ‌ర్చ‌కు తాను కూడా రెడీనేన‌ని, అయితే..ఈ చ‌ర్చ‌కు సీఎం రేవంత్ రెడ్డి, ర‌మేష్‌లు ఇద్ద‌రూ క‌లిసి రావాల‌ని అన్నారు. ఇలా ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య మాటల యుద్ధం కొన‌సాగుతున్న స‌మ‌యంలో కేంద్ర మంత్రి, బీజేపీ కీల‌క నా య‌కుడు బండి సంజ‌య్ ఎంట్రీ ఇచ్చారు. ర‌మేష్ చెప్పింది.. నూటికి రెండు వంద‌ల పాళ్లు వాస్త‌వ‌మేనన్నారు. బీఆర్ ఎస్ ద‌గుల్బాజీ రాజ‌కీయాలు చేస్తోంద‌ని విరుచుకుపడ్డారు. బీజేపీలో విలీనం చేస్తామ‌ని ఎప్ప‌టి నుంచో చెబుతున్నార‌ని.. ఈ విష‌యాన్ని క‌విత కూడా చెప్పిన విష‌యం గుర్తులేదా? అని కేటీఆర్ ను ప్ర‌శ్నించారు. 

ఈ క్ర‌మంలో సీఎం ర‌మేష్‌-కేటీఆర్ చ‌ర్చ‌కు రావాల‌ని.. స‌మ‌యం చెబితే.. వేదిక‌ను తానే ఏర్పాటు చేస్తాన‌ని బండి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ర‌మేష్ చేసిన వ్యాఖ్య‌ల‌కు కేటీఆర్ స‌మాధానం చెప్పాల‌న్నారు. కాళేశ్వ‌రంలో ఎవ‌రెవ‌రికి కాంట్రాక్టులు ఇచ్చారో.. ఎలా ఇచ్చారో.. కూడా చెప్పాల‌ని నిల‌దీశారు. బీఆర్ ఎస్ కుటుంబ పార్టీ అని.. దానిని బీజేపీలో విలీనం చేసుకునే ప్ర‌స‌క్తే లేద‌న్నారు. అయితే.. దానిపై కూడా కేటీఆర్ చ‌ర్చ‌కు రావాల్సి ఉంటుంద‌న్నారు. లేక‌పోతే.. ర‌మేష్ చెప్పింది నిజ‌మ‌ని ఒప్పుకొన్న‌ట్టేన‌ని బండి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అంటే బిడ్డా, అల్లుడు, కొడుకు, అయ్య పార్టీ అని బండి సంజయ్ అభివర్ణించారు. 

అంతేకాదు, కేటీఆర్‎కు సిరిసిల్ల ఎమ్మెల్యే టికెట్ సీఎం రమేష్ సాయంతోనే వచ్చిందన్నారు. కేసీఆర్ మొదట కొడుకుకు టికెట్ ఇవ్వలేదని, సీఎం రమేష్ ఆయన్ని ఒప్పించి టికెట్ దక్కేలా చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తమ్మీద కాంట్రాక్టులకు సంబంధించి కేటీఆర్ చేసిన ఆరోపణలతో మొదలైన వివాదం ... చిలికి చిలికి గాలివానలా మారి రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. 

గతంలోనూ బీఆర్ఎస్ విలీనంపై ఎమ్మెల్సీ కవిత మాట్లాడి కలకలం రేపారు. బీజేపీలో విలీనం కోసం ప్రయత్నాలు జరిగినట్లు వెల్లడించారు. సీఎం రమేష్ సైతం అదే విషయాన్ని ప్రస్తావించడం, కేంద్రమంత్రి బండి సంజయ్ దాన్ని ధృవీకరిస్తున్నట్లు మాట్లాడంతో విలీనం వివాదం మరింత ముదిరినట్లైంది. మరి ఈ ఇష్యూలో బహిరంగ చర్చకు సిద్దమంటున్న బీజేపీ నేతల సవాళ్లపై కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.