|
|
.webp)
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ పాలక మండలి ఈనెల 31న అత్యవసరంగా సమావేశం కానుంది. తిరుమలలో మినీబ్రహ్మోత్సవంగా చెప్పబడే రథసప్తమి ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల జారీ సందర్బంగా తిరుపతిలో తొక్కిసలాట సంఘటన నేపథ్యంలో రథ సప్తమి సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే టీటీడీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. 31న జరగనున్న టీటీడీ అత్యవసర సమావేశంలో భక్తులకు సౌకర్యాలపై అధికారులకు ఛైర్మన్ దిశానిర్దేశం చేస్తారు. వచ్చే నెల 4న రథ సప్తమి సందర్భంగా ఆ రోజు స్వామి వారు మొత్తం ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉంటుందన్న అంచనాలతో టీటీడీ భారీ ఏర్పాట్లు చేయనుంది.
సాధారణంగా వార్షిక బ్రహ్మోత్సవాల్లో మాత్రమే ఉదయం, రాత్రి శ్రీవారి పల్లకీసేవ ఉంటుంది. రథసప్తమి రోజు మాత్రమే తిరుమలలో ఉదయం సూర్యప్రభ వాహనం నుంచి ప్రారంభమయ్యే పల్లకీ సేవలు సాయంత్రం వరకు ఏడు వాహనసేవలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో బ్రహ్మో త్సవాల్లో నిర్వహించే వాహన సేవలతో పాటు మధ్యలో రథోత్సవం, బంగారురథంపై విహారం, చక్రతాళ్వార్లకు శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేయించడం వంటి ఘట్టాలు కూడా నిర్వహిస్తారు. దీంతో రథసప్తమిని మినీ బ్రహ్మోత్సవంగా పరిగణిస్తారు. రథసప్తమి సందర్భంగా ఫిబ్రవరి 4న ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి దర్శనానికి సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. ప్రివిలేజ్ దర్శనాలు కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. తిరుమలలో మినీ బ్రహ్మోత్సవం తరహాలో జరగనున్న రథసప్తమి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని టీటీడీ ఈఓ జె.శ్యామలరావు ఇప్పటికే అధికారులను ఆదేశించారు.