Home » Yandamuri veerendranath » నల్లంచు-తెల్లచీర

   

     అతడు ఒక్కడు- కనీసం ఒక్కరికి తన నిర్దోషిత్వం గురించి చెప్పాలను కున్నాడు. ఆ ఒక్కరు- మిస్ విజయవాడ!
   
    ప్రపంచమంతా తన గురించి చెడ్డగా అనుకొన్నా ఫర్వాలేదు, ఆమె ఒక్కరూ నిజాన్ని తెలుసుకోగలిగితే చాలు.
   
    ఆమె అతడికి ఏమీకాదు. ఆమె ఎలా వుంటుందో కూడా అతడికి తెలీదు. ఒక అద్భుతమైన ఉత్తరంతో అతడి మనసులో నిద్రాణమై వున్న ప్రేమ దాహాన్ని మేల్కొలిపి, పెద్ద వృక్షంగా మార్చింది ఆమె. ఆమె ఇప్పుడు తన గురించి ఏమనుకుంటూ వుంటుంది? స్వంత భార్యనే హత్య చేసిన హంతకుడినా తను ప్రేమించానని అనుకుని బాధపడుతుందా? తనపట్ల అసహ్యాన్ని పెంచుకుంటుందా?
   
    అతడి కోర్కె క్షణక్షణానికి వృద్ది కాసాగింది. ఆ రాత్రి అతడికి నిద్ర దూరమైంది. పదకొండు అయ్యేసరికి మరి ఆగలేకపోయాడు. శర్మగారున్నారేమో ఆయన ఫోన్ ఎత్తుతారేమో అని కూడా ఆలోచించలేదు.
   
    బంగ్లానుంచి బయటకొచ్చాడు. వీధి నిర్మానుష్యంగా వుంది. రోడ్డు చివర ఒక ఇరానీ హోటల్లో ఫోన్ కనపడింది. డయల్ చేస్తుంటే అతడి వేళ్ళు వణికాయి. "హల్లో" అని అట్నుంచి వినిపించింది. వెంటనే జవాబు చెప్పలేకపోయాడు.
       
    "హల్లో.... మిసెస్ శర్మా హియర్!"
   
    'నేను రవితేజని....ఆగండి, ఫోన్ పెట్టేయకండి, ప్లీజ్!" అన్నాడు తొందర తొందరగా.
   
    ఆ మాటలు చెప్పగానే అటునుంచి సంచలనం అతడు ఊహించగలిగినాడు.
   
    "ఫోన్ పెట్టేయకండి. ఇదే ఆఖరిసారి నేను మాట్లాడటం. ముందు ముందు మిమ్మల్ని విసిగించను. రేపే నేనీ దేశంనుంచి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయే ముందు కనీసం మీ ఒక్కరికయినా నేను మర్దరర్ ని కానని చెప్పుకోవాలని ఇలా ఫోన్ చేస్తున్నాను. అంతే తప్ప ఇంకేమీ కాదు". అటునుంచి సమాధానం లేదు. "హల్లో" అన్నాడు.
   
    "చెప్పండి, వింటున్నాను". అదే స్వరం నెమ్మదిగా వినిపించింది. ఆ కంఠంలో కంపనాన్నిబట్టి, ఈ అర్ధరాత్రి తననుంచి వచ్చిన ఫోన్ కాల్ ఆమెను ఎటువంటి స్థితిలో పెట్టిందో అతడు ఊహించుకున్నాడు. అయినా కూడా ఏదో తెలియని నిబ్బరం ఆ కంఠంలో కనపడుతోంది. ఉత్తరంలో కనపడిన ప్రేమ ఆ కంఠంలో ధ్వనిస్తూ వుండగా, "నా కెందుకో మీరు హత్య చెయ్యలేదనే అనిపించింది. రవీ" అంది మృదువుగా అతడికి ఒక్కసారి మనసులో దిగులంతా తొలగిపోయినట్టు అనిపించింది.
   
    'చాలు, చాలు!' అనుకున్నాడు. "నా కంటూ ఎవరూ మిగల్లేదు నా గురించి మీరొక్కరూ మంచిగా అనుకుంటే చాలు. నా మంచితనం మీద నమ్మకం వున్నవాళ్ళు ఒకరైనా వున్నారు".
   
    అతడికి వెయ్యి ఏనుగుల ధైర్యం వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ జరిగింది జరిగినట్లు చెప్పాడు. ఎక్కడ ఏదీ వదల్లేదు.
   
    అంతా చెప్పి, "ఇదీ జరిగింది. మీరు వ్రాసిన ఉత్తరంతో మొదలైన అలజడి, ప్రియంవద మీద ప్రేమలాటి భ్రమతో ఉధృతమై తుఫానుగా మారింది. దానిలో ఇలా కొట్టుకుపోతున్నాను". పేలవమైన నవ్వు మిళితం చేసి అన్నాడు.
   
    ఆమెకిది షాక్. దానినుంచి తేరుకోవడానికి కొంచెం సేపు పట్టింది. ఆమె తన మనసులో ఇలా అనుకుంది..... "అయామ్ సారీ- అన్న అయిదక్షరాలతో జరిగిన దాన్నలా కొట్టిపడెయ్యలేను రవీ! కానీ నేనెటువంటి పరిస్థితుల్లో ఆ ఉత్తరం వ్రాశానో మళ్ళీ ఆ ప్రభావం నుంచి బయటకు వచ్చి మనసు కంట్రోలు చేసుకోవటానికి ఎంత కష్టపడ్డానో ఈ అర్దరాత్రి ఈ ఫోన్ లో ఎలా వివరించను? ఎంత వివరించినా మీకు జరిగిపోయిన నష్టం పూడదుకదా!"
   
    "ఎక్కడున్నావ్ రవీ, నువ్వు?"
   
    "ఎందుకు?"
   
    "నేను వస్తున్నాను".
   
    "ఇప్పుడా?"
   
    "అవును. ఇప్పుడే!"
   
    "వద్దు, వద్దు" అన్నాడతడు.
   
    "అదేమిటి రవీ?"
   
    అతడు సమాధానం చెప్పటానికి తటపటాయించాడు. ఆమెని కూడా ప్రమాదంలోకి లాగటం అతఃడికి ఇష్టంలేదు. అయినా ముఖ్య కారణం అదికాదు. ఆ ఊరు. ఈ దేశం, ఈ మనుష్యులు అన్నీ వదిలేస్తూ అతడు దూరంగా వెళ్ళిపోవటానికి మానసికంగా తయారవుతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఆమెను చూడటం అతడికి ఇష్టంలేదు.
   
    అతడికి WHOSE LIFE IS IT ANY WAY అన్న ఆంగ్ల చిత్రం గుర్తొచ్చింది. అందులో కధానాయకుడు మంచి చిత్రకారుడు. ప్రకృతిని ఆరాధించే యువకుడు అతడికి జీవితం పూలపాన్పు అటువంటి సమయంలో ఒక ఆక్సిడెంట్ జరిగి, మెడనుంచి క్రింది భాగమంతా పూర్తిగా చచ్చుబడిపోతుంది. కేవలం తల ఒకటే కదలగల స్థితిలో వుంటుంది. అతడి ప్రియురాలు మరొక కుర్రవాడి ప్రేమలో పడి అతడిని వదిలేసి వెళ్ళిపోతుంది. అతడు తను చనిపోవటానికి అనుమతి నివ్వమని కోర్టుని కోరుకుంటాడు. జడ్జి హాస్పటల్ కి వచ్చి అతని వాదన వింటాడు. తనెందుకు చనిపోవాలనుకుంటున్నాడో అతడు కరుణాపూరితంగా వాదిస్తాడు. అతడీ మెర్సీకిల్లింగ్ కి కోర్టు ఒప్పుకుంటుంది. అతడిని ట్రీట్ చేస్తున్న డాక్టరు ఆర్ద్రతతో కదిలిపోతుంది. నీళ్ళు నిండిన కళ్ళతో అతడిని ముద్దు పెట్టుకోవటానికి ముందుకు వంగుతుంది. అతడు వద్దంటాడు. "ఈ ప్రకృతీ-ఈ పూలు- ఈ వర్షం రాత్రులు- నా కిష్టమైన చిత్రాలు.... అన్నిటినుంచీ శలవు తీసుకుంటున్నాను. జీవితం అంటే ఏమీలేదు అన్న వైరాగ్యభావాన్ని బలవంతంగా పెంచుకుంటూ మరణాన్ని ఆహ్వానిస్తూన్న నన్ను, మీ యీ ముద్దు తిరిగి జీవితంలోకి లాగుతుంది. జీవించాలనే ఆశ పెంచుతుంది. వద్దు...." అని అంటాడు.
   
    రావితేజకి అలాటి భావమే కలిగింది. ఈ పరిసరాల్నుంచే దూరంగా పారిపోతున్నప్పుడు తిరిగి 'బెంగ' కలిగించే అనుభవాలు ఎందుకు? తన మనసులో భావాలు ఆమెకి చెప్పలేదు. క్లుప్తంగా 'వద్దు' అన్నాడు. "మనం ఇంతవరకూ ఒక్కసారి కూడా కలుసుకోలేదు. నాకు మీ పేరుకూడా తెలీదు. ఇదేదో తెలియని బంధం నేను హత్యా చేయలేదన్న సంగతి మీ రొక్కరూ నమ్మితే చాలని ఫోన్ చేయించింది. ఉంటాను...."
   
    "రవీ...."
   
    "చెప్పండి".
   
    "మరొక్కసారి ఆలోచించండి. ఇలా పారిపోవటం కన్నా కోర్టుకి వెళ్ళి తేల్చుకోవటం మంచిదేమో...."

    "ఆ విషయం చాలా ఆలోచించాను. ఈ మనుష్యుల తిరస్కారాన్నీ, కోర్టునీ నేను ఫేస్ చేయలేను. ఉంటాను-" ఫోన్ పెట్టేశాడు.
   
    ఇన్ స్పెక్టర్ విన్నది ఈ ఫోన్ కాల్ నే!
   
    శర్మ ఇంటికొచ్చే ఫోన్ కాల్స్ అన్నీ ట్రేస్ చేసి, ఎప్పటి కప్పుడు టేపులతో సహా అతడికి పంపబడుతున్నాయి.
   
    మొదట శర్మ భార్యే 'మిస్ విజయవాడ' అని తెలియగానే అతడికి షాక్ తగిలినట్టు అయింది. వీళ్ళిద్దరికీ మధ్య చాలాకాలం నుంచి అఫైర్ వుందన్నమాట అనుకున్నాడు. కానీ ఆమె సంభాషణ పూర్తిగా విన్న తరువాత, వాళ్ళు ఒక్కసారి కూడా కలుసుకోలేదని అర్ధమైంది.
   
    ఇక అతడు దాని గురించి ఆలోచించటం మానేశాడు.
   
    అతడు ఆలోచిస్తున్నది రవితేజ ఆమెకి చెప్పిన కధ గురించి! అతడు చెప్పినదంతా వాస్తవమైతే నిజంగానే రవితేజ మెడలోతు 'ఊబి' లో కూరుకుపోయాడు. ఇన్ స్పెక్టర్ కి జాలేసింది. ఎంతో తెలివైన వాళ్ళు అనుకునే వాళ్ళు, వాళ్ళ వాళ్ళ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళు కొన్ని కొన్ని విషయాల్లో ఎంతో గొప్పగా, గొప్ప తెలివితేటల్తో ప్లాన్ చేశామనుకుంటూనే గోతిలో పడుతూ వుంటారు.
   
    రవితేజ చెప్పినదాన్లో ఎంతవరకూ నిజముందో తెలుసుకోవడం కోసం అతడు వెంటనే ప్రయత్నాలు ప్రారంభించాడు. రాత్రి పన్నెండయింది అప్పుడు. అయినా అతడు రేపటివరకూ ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయలేదు. ఆ ఊళ్ళో వున్న పన్నెండు పెద్ద హోటల్స్ కీ వెళ్ళాడు. ఓపిగ్గా పాత రిజిస్టర్లు తీయించాడు.....ఆ డిపార్టుమెంట్ లో చాలా తక్కువగా వుండే నిజాయితీపరుల్లో అతనొక్కడు. డ్యూటీ అంటే గౌరవం వున్నవాడు. మొత్తం 12 హోటల్స్ లోనూ జంటగా దిగి, ఆ మూడురోజులు వున్నవాళ్ళు ఎంతమంది అని చూశాడు. మూడు జంటలు కనపడ్డాయి. మాధవి చనిపోయిన రోజు మధ్యాహ్నం ఖాళీచేసిన జంటలు అందులో రెండు తేలాయి. రెండూ తప్పు అడ్రసులు ఇచ్చినవే.
   
    అతడు హోటల్ బుక్స్ చూశాడు. ఒక జంట రాత్రిపూట డిన్నర్ కి బయటికి వెళ్ళింది. రవితేజ, ప్రియంవద అలా వెళ్ళి వుండరు- అని అతడు వూహించాడు. కాబట్టి ఆ జంట కాదు.
   
    అలా చివరికి ఒక జంట మిగిలింది.
   
    .... ఆ గదినుంచి బయటకు వెళ్ళిన ఫోన్ లు ఎన్ని? అని చూశాడు.
   
    .....రూమ్ ఖాళీ చేయటానికి అయిదు నిముషాలు ముందు ఆ గదినుంచి బయటకు ఒక ఫోన్ వెళ్ళింది.
   
    ....దాని నెంబరు చూశాడు.
   
    రవితేజ ఇంటి నెంబరు అది!
   
    అంటే- తనూ ప్రియంవదా ఇక్కడే గడిపామని రవితేజ చెప్పిన విషయం వాస్తవమే! కనీసం అక్కడివరకూ అతడు నిజం చెప్పాడు. ఇంకా తెలవవలసింది అతడు తన భార్యని హత్య చేశాడా లేదా అన్నది!


Related Novels


Vennello Godaari

Rudranethra

Rakshasudu

Stuvartapuram Police Station

More