Home » vasireddy seeta devi novels » Rakshasa Needa 2


    "తెలిశాయి. అంతే! ఇంకేమీ నన్ను అడక్కు."
    "నామీద కోపంగా ఉందా బాబూ?"
    "లేదమ్మ. నిన్ను నేను అర్థం చేసుకోగలను."
    "నన్ను వదిలి వెళ్ళిపోవు గదూ?"
    "నిన్ను వదిలి నేను ఎక్కడి కెళ్తానమ్మా? నీకంటే నాకెవరున్నారు?"
    "బాబూ!" కొడుకు తల నిమిరింది వర్ధనమ్మ.
    "అమ్మా! ఆకలేస్తుంది. టిఫిన్ పెట్టు." ఆమె ధ్యాసను మరోవైపుకు మళ్ళించడానికి అన్నాడు గౌతమ్.
    "రా బాబూ!" పెడ్తాను."
    వర్థనమ్మ లేచి లోపలకు వెళుతుంటే వెనకనుంచి నమస్కరించాడు గౌతమ్.
    "అమ్మా! నీ ఋణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఉద్రేకంలో ఏదేదో అన్నాను. కన్నతల్లి కంటే మిన్నగా పెంచిన నీ ప్రేమను అర్థం చేసుకోగలను. నువ్వు అబద్ధం ఎందుకు చెప్పావో అర్థం చేసుకోగలను. నాకోసం ఎన్ని ఇబ్బందులు పడ్డావో నాకు తెలుసు. పిచ్చి అమ్మా! నిన్ను నేను వదిలేసి వెళ్ళిపోతానని భయపడుతున్నావా? ఎక్కడి కెళతానమ్మా? నీలా నన్ను ప్రేమించేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరున్నారు? కన్నతల్లి నన్ను చూసి భయపడిపోయింది. ఒక్క మాట మాట్లాడలేకపోయింది. ఎందుకు?
    ఇప్పుడు ఆమెకు సమాజంలో ఓ అంతస్తు ఉంది. అందరూ చాలా గొప్ప వ్యక్తిగా భావిస్తున్నారు. ఇంకా ఇద్దరు కొడుకులున్నారు. ఆ కొడుకుల ముందు, సమాజం ముందు తనకు ఏర్పడిన ఇమేజ్ పోతుందని భయం. శంకర్రావుతో వివాహానికి ముందే మరొకడికి పుట్టినవాడు ఇంకొకడు ఉన్నాడని తెలుస్తుందనే భయం. ఇంతవరకూ తనను మహా పతివ్రతగా భావించిన సమాజం, కొడుకులూ తనను పతితగా తెలుసుకొని ఈసడిస్తారనే భయం.
    మూడు నెలల బిడ్డగా తనకు దూరమైనా కొడుకు ఇరవై ఎనిమిదేళ్ళ వాడై, పొడవుగా చెయ్యి ఎత్తినా అందనంత ఎత్తున, అకస్మాత్తుగా ఎదురుగా నిలబడితే ఆమె కన్నతల్లి భయపడిపోయింది.
    "తను కనని బిడ్డ మలమూత్రాలను ఎత్తి పెంచింది మరో తల్లి...."
    "బాబూ! టిఫిన్ పెట్టాను."
    "వస్తున్నానమ్మా!"
    గౌతమ్ లేచి డైనింగ్ హాల్లోకి వెళ్ళాడు. టేబుల్ ముందు కూర్చున్నాడు.
    "అమ్మా! నువ్వు కూడా తిను!"
    "నాకు ఆకలిగా లేదు. నువ్వు తింటే నాకు కడుపు నిండుతుందిరా!"
    గౌతమ్ వర్థనమ్మ ముఖంలోకి చూశాడు. మాతృదేవత అని స్త్రీని ఎందుకంటారో మొదటిసారిగా అర్థం అయింది.
    "ఊఁహూఁ! నువ్వూ తినాలి. లేకపోతే నేనూ తినను" అంటూ తన ఎదుట వున్న టిఫిన్ ప్లేటును పక్కకు తోశాడు.
    వర్థనమ్మ ముఖం వెలిగిపోయింది సంతోషంతో.
    పిచ్చి సన్నాసి! వయసు పెరిగింది. పసితనం వదల్లేదు__అనుకుంటూ కొడుక్కేసి ఆప్యాయంగా చూసింది.
    "ఊఁ! నీ ప్లేటు తెచ్చుకో."
    వర్థనమ్మ టిఫిన్ ప్లేటు తెచ్చుకొని కొడుకు పక్కన కూర్చుంది.


                                                         21


    సిటీ సివిల్ కోర్టు జనంతో కిటకిట లాడుతోంది. గౌతమ్ కేసు పేపర్లలో చదివిన కొందరు కుతూహలం కొద్దీ వచ్చారు. గౌతమ్ స్నేహితులూ, హితులూ వచ్చారు. సాక్షుల సాక్ష్యాలు అయిపోయాయి. ఆరోజు గౌతమ్ ను పబ్లిక్ ప్రాసిక్యూటర్ క్రాస్_ ఎగ్జామ్ చేస్తాడు.
    ఆ కోర్టులో అంత జనం ఎందుకు ఉన్నారోనన్న కుతూహలం కొద్దీ పక్క కోర్టులకు పనిమీద వచ్చిన వాళ్ళు కూడా వచ్చి వరండాల నిండా నిలుచున్నారు.
    న్యాయమూర్తి ప్రవేశించారు. 'సైలెన్స్_సైలెన్స్' అన్న కేకలు. జనం కలకలం తగ్గింది.
    ఒక బెంచీమీద ఇందుమతి, సునంద, విమల కూర్చుని ఉన్నారు. ఆ పక్క బెంచీ మీద రవి ఓ చివర, విశ్వం ఓ చివర కూర్చుని ఉన్నారు. బాగా ప్రేమించే యజమాని చేత తన్నులు తిన్న అల్ షేషన్ డాగ్ లా మునగదీసుకుని కూర్చున్నాడు విశ్వనాథం.
    గౌతమ్ స్నేహితులు వాళ్ళిద్దరి మధ్య కూర్చున్నారు. రవి ముఖంలో విషాద ఛాయలు స్పష్టంగా గోచరిస్తున్నాయి.
    ఇందుమతి కళ్ళు శ్రావణమేఘాల్లా ఉన్నాయి. ముఖం మబ్బులు కమ్మిన ఆకాశంలా ఉంది.
    గౌతమ్ బోనులోకి వచ్చి నిల్చున్నాడు.
    వస్తూనే ఇందుమతిని చూశాడు. ఆ కళ్ళలో ఎంతో ఆదరణా, ఆరాధనా. ఇందుమతికి దుఃఖం పొర్లుకొచ్చింది. కళ్ళలో శ్రావణమేఘాలు గౌతమ్ చల్లని చూపులకు కరిగి ప్రవహించసాగాయి.
    "ఇందూ!" తల్లి ఇందు చేతిని తన చేతిలోకి తీసుకుంది. "ధైర్యంగా ఉండు. న్యాయం జయిస్తుంది" అన్నది.
    "ఆ నమ్మకం నాకు లేదమ్మా!" పెల్లుబికిన దుఃఖాన్ని ఆపుకోలేక వరండాలోకి వెళ్ళింది ఇందు.
    ఆ ముఖంలో ఎంత ప్రశాంతత! ఆ కళ్ళలో ఎంత నైర్మల్యం! ఆ వ్యక్తిత్వంలో ఎంత హుందాతనం! సునంద గౌతమ్ ను చూస్తూ అనుకుంది.
    గౌతమ్ రవిని చూశాడు. పలకరింపుగా చిరునవ్వు నవ్వాడు. అన్న చూపుల్ని ఎదుర్కోలేనట్టు రవి తలవంచుకున్నాడు.
    గౌతమ్ విశ్వం ముఖంలోకి జాలిగా చూశాడు. విశ్వం తల తిప్పుకున్నాడు. అతడి అవస్థ చూసి సానుభూతిగా నవ్వుకున్నాడు గౌతమ్.
    ప్రాసిక్యూషన్ లాయర్ రామనాథం లేచి గౌతమ్ ముందుకు వచ్చాడు.
    గౌతమ్ మనస్సాక్షిగా ప్రమాణం చేశాడు.
    "నీ పేరు?" రామనాథం ముందుకొచ్చి ప్రశ్నించాడు.
    "గౌతమ్!"
    "మీ అమ్మగారి పేరు?"
    "అన్నపూర్ణమ్మ"
    "అన్నపూర్ణమ్మా, అమలా?"    
    "అన్నపూర్ణమ్మ." గౌతమ్ ఒక్కొక్క అక్షరాన్నే స్పష్టంగా నొక్కి పలికాడు.
    "అమల ఎవరు?"
    "నాకు తెలియదు."
    "అన్నపూర్ణ అసలు పేరు అమల అని తెల్సా?"
    "తెలియదు."
    "ఆమె అసలు పేరు అమల. ఆమెకు పెళ్ళి కాకుండానే కొడుకు పుట్టాడు. ఆ కొడుకువు నువ్వేనా?"
    "ఐ ఆబ్జెక్టు యువరానర్. ఇర్రెలెవెంట్ క్వెశ్చన్" అన్నాడు డిఫెన్స్ లాయర్ లేచి."
    "ఇర్రెలెవెంట్ కాదు మిలాడ్. స్వయంగా అన్నపూర్ణమ్మే ఈ విషయం అంగీకరించారు."
    "అబ్జెక్షన్ ఓవర్ రూల్ద్. ప్రొసీడ్" అన్నారు న్యాయమూర్తి.
    "చెప్పు__ఆ కొడుకు నువ్వేనా?"
    "నా తండ్రి పేరు శంకర్రావు."


Related Novels


Prathikaram

Mises Kailasam

Matti Manishi

Idee Katha

More