Home » vasireddy seeta devi novels » Rakshasa Needa 2


    "అంటే నీ తల్లి శంకర్రావుకు భార్యకాకముందే మరెవడికో బిడ్డను కని...."
    "షటప్!" గౌతమ్ కంఠం నగారా దెబ్బలా మోగింది. కోర్టులో ఉన్నవాళ్ళంతా తుళ్ళిపడ్డారు ఒక్కసారిగా.
    "ఐ ఆబ్జెక్టిట్ యువరానర్. స్త్రీని కించపరిచే పదజాలం ఉపయోగించరాదు" అన్నాడు డిఫెన్స్ లాయర్.
    "ఆ విషయాలన్నీ స్వయంగా అన్నపూర్ణమ్మగారే కోర్టులో చెప్పారు. ఆమె చెప్పిన విషయాలను మరొకర్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు ప్రొసీడ్" అన్నాడు న్యాయమూర్తి.
    "ఎస్ యువరానర్!" స్టయిల్ గా న్యాయమూర్తి ముందు తలవంచి గౌతమ్ వైపు కదిలాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామనాథం.
    "అమలగా ఉన్నప్పుడే అన్నపూర్ణమ్మగారికి ఓ కొడుకు ఉన్నాడని నీకు తెలుసా?"
    "తెలియదు."
    గౌతమ్ చేతులు బోను అంచులమీద బిగుసుకున్నాయి.
    "మీ అమ్మగారికి మరో కొడుకు ఉన్నాడా?"
    "ఉన్నాడు."
    "పేరు?"
    "రవి." గౌతమ్ ముఖం కోపంతో ఎర్రబడింది.
    అది చూసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి హుషారెక్కింది. లాయర్సుకు కావాల్సిందదే. పార్టీని ఇరిటేట్ చేసి, తికమకపెట్టి తమకు కావాల్సిన సమాధానాలను లాగడానికి ప్రయత్నిస్తారు. చాలామంది ఆ కళలో ప్రవీణులై ఉంటారు. అలాంటివారినే గొప్ప లాయర్లుగా చెప్పుకుంటారు. వాళ్ళు కోర్టులో నిలబెట్టిన నందిని పందిగా, పందిని నందిగా చెయ్యగలరు. చూసే వాళ్ళ కళ్ళకు కట్టేలా చూపగలరు.
    "రవి తండ్రి పేరు?"
    గౌతమ్ కు లాగి కొట్టాలనిపించింది.
    అయినా తమాయించుకున్నాడు.
    "శంకర్రావు."
    "ఎలా చెప్పగలవు?" కోర్టులో ఉన్నవాళ్ళు కొందరు కిచకిచనవ్వారు.
    "ఐ ఆబ్జెక్ట్ ఇట్ మిలాడ్. ఆ మాటకొస్తే ఎవడి తండ్రి ఎవరో కచ్చితంగా తెలియదు" అన్నాడు డిఫెన్స్ లాయరు.
    "ఆబ్జెక్షన్ సస్పెండ్" అన్నాడు న్యాయమూర్తి.
    "రవీంద్ర నీకు తమ్ముడా?"
    "అవును."
    "నీ అన్న పేరేమిటి?"
    "నాకు అన్నలు లేరు." గౌతమ్ కంఠం కంచులా మోగింది.
    "ఉన్నాడు. ఉన్నాడు." రవి లేచి పిచ్చివాడిలా అరిచాడు.
    "ఆర్డర్! ఆర్డర్!"
    జనంలోకి కలకలం తగ్గింది.
    "నీ తమ్ముడు రవీంద్ర నీకు అన్న ఉన్నాడనీ, అతడు అచ్చం నీలాగే ఉంటాడనీ, అతడే ఈ అపరాధాలన్నీ చేశాడనీ సాక్ష్యం ఇచ్చాడు."
    "నన్ను రక్షించడానికి కట్టుకథ అల్లాడు."
    "స్వయంగా మీ అమ్మ అన్నపూర్ణమ్మగారే చెప్పింది.
    "ఆమె కూడా నన్ను రక్షించడానికే అలా చెప్పింది.
    "ఏ స్త్రీ కోర్టులో బోనెక్కి పదిమంది ముందు తను పతితనని చెప్పదు. పైగా ఇద్దరు చెట్టంత కొడుకుల ముందు మర్యాదగల కుటుంబ స్త్రీ అసలే చెప్పదు."
    "ఆ మాటలు చెప్పిన వ్యక్తి ఒక స్త్రీ కాదు."
    "మరి స్త్రీ వేషంలో ఉన్న పురుషుడా?"
    కోర్టులో అందరూ ఘొల్లుమన్నారు. మిగతావాళ్ళు గౌతమ్ ను మతిపోయినవాడ్ని చూసినట్టు చూశారు.
    "కాదు." గౌతమ్ తాపీగా అన్నాడు.
    "స్త్రీ కాదు, పురుషుడు కాదు. అంటే...."
    "ఒక తల్లి." మధ్యలోనే అందుకొని గట్టిగా అన్నాడు గౌతమ్.
    ఇందుమతీ, సునందా మొదలైన హితైషులు రిలీఫ్ గా నిట్టూర్చారు.
    "తల్లి స్త్రీ కాదా?"
    "స్త్రీ హృదయం వేరు, తల్లి హృదయం వేరు. తల్లి తన బిడ్డను రక్షించుకోవడానికి ఎంత త్యాగాన్నయినా చేస్తుంది. తన మానాభిమానాలనే కాదు. ప్రాణాలను సైతం తన బిడ్డ కోసం ధారపోస్తుంది. ప్రపంచంలో నిస్వార్థమైన ప్రేమ ఒక్క వాత్సల్య ప్రేమ మాత్రమే. అందుకే మన పెద్దలు 'మాతృదేవోభవ' అని ముందుగా తల్లికి నమస్కరించమన్నారు."
    న్యాయమూర్తి అతి శ్రద్ధగా వింటున్న విషయం గ్రహించిన ప్రాసిక్యూషన్ లాయర్ కామెంట్సు పాస్ చెయ్యలేదు. జనం నిశ్శబ్దంగా వినసాగారు.
    ఇందుమతి దృష్టిలో గౌతమ్ వ్యక్తిత్వం చాలా చాలా ఎత్తుకు పెరిగింది.
    "నువ్వు అపరాధిగా అంగీకరిస్తున్నావా?"
    "అంగీకరిస్తున్నాను."
    "నీ మరదల్ని నువ్వు రేప్ చేశావా?"
    జనంలో కలకలం. 'ఎంతో సంస్కారవంతుడుగా కన్పించే ఇతడు మరదల్ని రేప్ చేశాడా?"' అందరి మనసుల్లో ఒకే ప్రశ్న.
    "రేప్ జరగలేదు."
    "వంటమనిషి వచ్చి తలుపు కొట్టకపోతే అంతపని జరిగిపోయేదేగా?"
    గౌతమ్ సమాధానం ఇవ్వలేదు. తలవంచుకొని నిలబడ్డాడు.
    "చెప్పు. ఎందుకు చేశావా పని?"
    గౌతమ్ చివ్వున తలెత్తి 'ఇదేం ప్రశ్న, తెలివి తక్కువ ప్రశ్న అన్నట్టుగా ఓ క్షణం చూసి, అదోలా నవ్వాడు.
    "నవ్వుతావేం? సమాధానం చెప్పు."
    "స్త్రీలమీద రోజూ జరిగే ఈ అన్యాయాలన్నీ ఎందుకు జరుగుతున్నాయ్?"
    "ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు."
    "కొన్ని సందర్భాల్లో ప్రశ్నకు ప్రశ్నే సమాధానం అవుతుంది" అన్నాడు గౌతమ్ తాపీగా.
    "సూటిగా సమాధానం ఇవ్వు."
    "ఇవ్వకపోతే?"
    "జైలుశిక్ష పడుతుంది."
    "సమాధానం ఇస్తే పడదా? తీర్పు కూడా నువ్వే ఇస్తున్నావా?"
    గౌతమ్ ప్రశ్నకు లాయర్ రామనాథం తికమకపడ్డాడు.
    "చెప్పు__నువ్వంత దారుణానికి ఎందుకు పాల్పడ్డావ్?"
    "వివరంగా కావాలా? మగవాడు పశువుగా మారినప్పుడు ఇలాంటి దారుణాలు చేస్తాడు. ఆ మగవాడు పశువుగా ఎందుకు, ఎలా మారతాడో చెప్పమంటావా?"
    గౌతమ్ కంఠంలోని తీవ్రతకు లాయర్ రామనాథం తగ్గిపోయాడు.
    "జనరలైజ్ చేసి నువ్వక్కడ ఉపన్యాసం ఇవ్వక్కర్లేదు."
    "నా సమాధానం నేను ముందే ఇచ్చాను."
    "ప్రొసీడ్ ఫర్ దర్!" న్యాయమూర్తి లాయర్ రామనాథాన్ని ఉద్దేశించి అన్నాడు.
    "బ్యాంకులోని ఫిక్సెడ్ డిపాజిట్ తీశావా?"
    "తీశాను."
    "ఎందుకు తీశావు?"
    "అది నా డబ్బు. నేను తీసుకున్నాను." ఈ ప్రశ్న వేసే హక్కు మీకెవరిచ్చారు?" గౌతమ్ తిన్నగా అయి సూటిగా లాయర్ను చూశాడు.
    పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెల్లముఖం వేశాడు. మరో ప్రశ్న కోసం తడుముకుంటూ ఉండగానే గౌతమ్ అన్నాడు__


Related Novels


Prathikaram

Mises Kailasam

Matti Manishi

Idee Katha

More