Home » Sree Sree » Srisri Kathalu
మదన కదన కథ
శృంగార రసం
డాక్టర్ భగవంతం గొప్ప మేథావి. అంతకుమించిన గొప్ప
భక్తుడు అన్నట్టు పాఠకులు నన్ను మన్నించాలి. ఈకథ
భక్తుని గురించి కాదు. ఈ డాక్టరు గారి గురించి అంతకన్నా
కాదు. ఏదో పేరు చాలా సెక్సీగా ఉందని ఈయన
గారితో ప్ర్రారంభించాను. అసలు ఈ కథకు నాయకుడు
ఇంకో డాక్టరు.
ఆయన పేరు మదన్ మోహన్. డాక్టర్ మదన్ మోహన్. (ఆ తర్వాత ఆయన జాతీయ అంతర్జాతీయ డిగ్రీలు ముద్రించాలంటే ఒక దినపత్రికను ముద్రించినంత పని అవుతుంది. ఆయన లెటర్ హెడ్ మీద "డాక్టర్ మదన్ మోహన్, యం.డి. అని మాత్రమే ఉంటుంది.) ఆయనకి చిరునామా అంటూ ఏదీలేదు. ఇండియాకు లోపలా, బయటా డాక్టర్ మదన్ మోహన్ పేరు సుప్రసిద్దమే.
పేరునుబట్టి ఆయన ఏ ఉత్తరాదివాడో అని భ్రమపడే అవకాశం లేకపోలేదు. కాని ఆయన పదహారణాల ఆంధ్రుడు. (అవి రూపాయి అణాపైసల రోజులు) పూర్తి పేరు చట్రా మదన్ మోహనరావు. కలకత్తా యూనివర్శిటీలో కాలేజీ విద్యార్ధిగా ఆయన మదన్ మోహన్ చట్రా మెడికల్ డిగ్రీ తీసుకున్నప్పుడు డాక్టర్ సి. మదన్ మోహన్.
ఆంద్రత్వానికి చిహ్నమైన ఇంటిపేరును కూడా విసర్జించడంతో డాక్టర్ మదన్ మోహన్ కు అంతర్జాతీయ కీర్తి ప్ర్రారంభమయింది. మన కథకూడా ఆ తర్వాతనే ప్ర్రారంభమవుతోంది.
అదో ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంటు. మద్రాస్ అండ్ సదరన్ మహారాష్ట్రా రైల్వే వారిది హౌరాలో బయల్దేరి మద్రాసుకు వెళ్తోంది. అందులో తెల్లవాళ్ళూ, నల్ల జమీందారులూ మాత్రమే పయనిస్తూ ఉంటారు. వాల్తేరు స్టేషన్ వద్ద డాక్టర్ మదన్ మోహన్ ఆ కంపార్టుమెంటులోకి ప్రవేశించారు.
అకస్మాత్తుగా నాలుగు కళ్ళు ఒక్కసారి కలుసుకున్నాయి. వాటిలో రెండు డాక్టర్ గారివి మరో రెండు ఒక జమీందారిణిగారివి. ఇంకో దొరగారూ, దొరసాని గారూ ఆ పెట్టెలోనే ప్రయాణం చేస్తున్నారు గాని వాళ్ళసంగతి మన కనవసరం.
తుని స్టేషన్ వచ్చింది. నాలుగుకళ్ళ మౌనసంభాషణ ఆగిపోయింది. తుని సంస్థానపు రాజకుటుంబానికి చెందిన ప్రముఖు లిద్దరు జమీందారిణిగారిని చూడడానికి వచ్చాడు పక్కనే ఉన్న సర్వెంట్స్ కంపార్ట్ మెంట్ నుంచి ఒక పనివాడు ఉత్తరువులు తీసుకోవడానికిగాను బైటి కిటికీముందు నిలుచున్నాడు. వాణ్ని వెళ్ళిపొమ్మని చేతితోనే ఆజ్ఞాపించారు. జమీందారిణి గారు.
తునిలో దిగి ఒక్కరోజు తమ ఆతిధ్యం స్వీకరించాలని జమీందారిణిగారిని అభ్యర్ధించడానికి రాజబంధువులు వచ్చారు. వారిలో ఒకాయన డాక్టర్ మదన్ మోహన్ గారిని గుర్తించి వచ్చీ రాని ఇంగ్లీషులో అభినందన పరంపరలు వర్షించాడు. "తమ కభ్యంతరం లేకపోతే తమరూ మా గృహాన్ని పావనం చేసి మర్నాడు మెయిల్లో ఇదే టయింకి వెళ్ళిపోవచ్చు" నన్నాడు.
తునిలో ఆగడం జమీందారిణిగారి కిష్టంలేదు. స్వయంగా చూసుకోవలసిన సొంత పనులు చాలా ఉన్నాయి అర్జెంటుగా ఆ రాత్రికే సంస్థానం చేరుకోవాల. (ఆ రోజుల్లో మెయిలుబండి సంస్థానంలో ఆగేది.)
డాక్టర్ మదన్ మోహన్ మొగమాటపు మనిషి. ప్రత్యేకంగా మద్రాసులో తనకు పెద్ద పనులేవీ లేవు. పెద్దమనుష్యులు తనను పిలిచి ప్రాధేయపడితే కాదనలేకపోయాడు.
ఆడవాళ్ళు చిపలచిత్తలనడం అబద్దం కాదనడంలో అబద్దం లేదు. అంతవరకు తటపటాయిస్తున్న జమీందారిణిగారు. "సరే, మీ యిష్టమే కానియ్యండి. నేను కూడా రాణిసాహేబాగారిని చూసి చాలా కాలమయింది" అంటూ తుని స్టేషన్ లో దిగిపోయారు.
అల్లంత దూరంలో పనివాడు నిలుచున్నాడు. బండి కదలబోతోంది. వాణ్ని చూసి అమ్మగారు "ఉంటావా? వెళ్తావా?" అని అడిగారు. "తమరెట్లా సెలవిస్తే అట్లా చేస్తా" నన్నాడతను.. "వెళ్ళు." అన్నారావిడ. "చిత్తం" అన్నాడతను.
"రేపు టెలిగ్రాం ఇస్తాను. సామాన్లన్నీ భద్రంగా దింపించు."
"చిత్తం చిత్తం."
పనివాడు తన పెట్టెలోని కెక్కాడు. బండి కదిలింది.
తునిలో డాక్టరుగారికే ఎక్కువ మర్యాదలు జరిగాయో జమీందారిణి అమ్మారావు గారికే జరిగాయో చెప్పడం కష్టం ఇద్దరిలోనూ ఒక గొప్ప అనుబంధం పెనవేసుకుపోయిందని చెప్పడం మాత్రం సులభం.
మర్నాడు మెయిల్ లో ఇద్దరూ కలిసే సంస్థానానికి వెళ్ళిపోయారు. అక్కడ ఇద్దరికీ సమానమైన స్వాగతం లభించింది. ఇద్దరూ ఒక విశాలమైన హాలులో కొద్దిగా ఇద్దరికీ ఇరుకైన సోఫాలో విశ్రమించారు. నాలుగు కళ్ళతో బాటు ఒకటిన్నర పెదవులు కలుసుకున్నాయి. ఒక పెదవి డాక్టరు గారిది. అరపెదవి అమ్మారావుగారిది.
దంతక్షతాలమీద ఎంతో కృషిచేసిన జమీందారిణిగారు డాక్టరుగారి టెక్నిక్ ను మెచ్చుకోలేక పోయారు. మన ప్రాచీన కామశాస్త్ర గ్రంథాలన్నీ ఆవిడగారికి కొట్టిన పిండి ఒక దీర్ఘ నిమిషంపాటు చిన్న ప్రదర్శనం ఇచ్చి "ఇప్పుడెలా వుం"దని అడిగారు.
డాక్టరుగారు ఏమని జవాబిచ్చారో అది మన కనవసరం. ఆయన గొప్ప శాస్త్రజ్ఞుడయితే కావచ్చును కాని నిష్ణాతుడైన కామ కళాకారుడు కాదు. ఇంగ్లీష్ నావికుల్లాగ "తుపానులో ఏ రేవయినా చాలు" ననుకుంటారాయన కాని ఇప్పుడతనికి దొరికిన రేవులో జలం ఇంకిపోయింది.
తొలినుంచీ చెబుతామనుకుంటూ మరచిపోయిన ఒక ముఖ్య విషయం ఇప్పుడే జ్ఞాపకం వచ్చింది. అమ్మారావుగారి వయస్సు అరవై యేళ్ళు డాక్టరుగారు యాభైఏళ్ళవాడు.
"ఇదెక్కడి ఇనప శృంగారం రా నాయనా" అని పాఠకులు ఆశాభంగం చెందవచ్చు. కాని అసలు కథ ఇప్పుడిప్పుడే రసవద్ఘట్టం చేరుకుంటోంది.
"ఇప్పుడే ఇంత అందంగా ఉన్నారు కదా, నలభైయేళ్ళ కిందట ఇంకా ఎంత బాగుండేవారో" అన్నారు డాక్టరు వెంటనే అప్పుడు తన వయస్సు పదేళ్ళే అవుతుందని ఏ శాస్త్ర సాహాయ్యానికీ ఎదురుచూడకుండా సునాయాసంగా గ్రహించారాయన.
"ప్రస్తుతానికి వెళ్ళిపోతున్నాను. వారం రోజులు తిరక్కుండా తిరిగివస్తాను. అప్పుడు మీరు ముఫ్ఫయ్యేళ్ళ అప్సరస అవుతారు." అంటూ ఆయన వెళ్ళి పోయారు. వెళ్ళేముందు ఆమె రక్తం (రెండు మూడు ఔన్సులు మాత్రమే) కొన్ని నాడీ గ్రంథులూ తనతో తీసుకు వెళ్ళారు.
డాక్టరుగారికి అంతర్జాతీయ విఖ్యాతి రావడం ఆయన మనుష్యుల వయస్సుల మీద సాగిస్తూన్న పరిశోధనలవల్లనే ఇంత వరకు ఎన్నో సైన్సు పత్రికలలో ఆయన ఒక మనిషి ఆయుర్దాయాన్ని పొడిగించ వచ్చుననే విషయం మీద దిగ్భ్రాంతి గొల్పే వ్యాసాలు ప్రచురించారు. ఇప్పుడు అమ్మారావుగారిని చూసిన తర్వాత, "పొడిగించడం సాధ్యమయినప్పుడు తగ్గించడం మాత్రం ఎందుకు సాధ్యం కాదు?" అనే ప్రశ్న ఆయనలో ఉదయించింది.
అంతలోనే ఆయనకింకో ఆలోచన కూడా కలిగింది. తానూ తన ప్రియురాలూ తప్ప ఇంకొకరు తన పరిశోధన ఫలితాలను అనుభవించకూడదని ఇది స్వార్ధంతో కూడుకున్నదనీ శాస్త్రీయ దృక్పథానికే విరుద్దమనీ అతనికి తెలియక పోలేదు. అయినా స్వార్ధమే జయించింది.
సంస్థానం నుంచి బయల్దేరిన రెండురోజుల్లోనే అతని పరిశోధనలు ఫలించాయి ఈ రెండు రోజుల్లోనూ అతనికి నిద్రాహారాలు లేవు. రెండు రోజులూ అతను ప్రయోగశాలను వదలలేదు. ఎప్పుడూ తనతో బాటు పనిచేసే వాళ్ళ నెవ్వరినీ లోనికి రానియ్యలేదు. చిన్న చిన్న పనులు కూడా తానే శ్రద్ధతో చేశాడు.
మూడో రోజున అతను ఇరవయ్యేళ్ళ యువకుడయాడు. అదే సమయంలో అమ్మారావుగారి వయస్సు సగానికి సగం తగ్గుతుందని అతనికి తెలుసు. ఎందుకైనా మంచిదని ఆవిడకి ట్రంక్ కాల్ చేశాడు. ఆమె ఆనందానికి అవధుల్లేవు. "వెంటనే వచ్చెయ్యండి. నన్ను మీరెలా చూడదలచుకున్నారో అలా కనబడతాను" అన్నదావిడ.
ఇరవయ్యేళ్ళ డాక్టరుగారిని చూసి వారి జూనియర్లు ఆశ్చర్యపోయారు. ప్రయోగ ఫలితాలను పత్రికలకు పంపుదామన్నారు.
"వీల్లేదు ఈ రహస్యం బైటకు తెలియకూడదు. ఎన్నో గుప్తా విద్యల్లాగ ఇది కూడా నాతో అంతం కావలసిందే. నేటి నుండి నేను సైంటిస్టునికాను. పరమ భక్తుణ్ణి!" అని ఆయన తన నోట్సన్నీ తగలబెట్టి ప్రయోగశాలను జూనియర్లకు వదిలిపెట్టి ఒక్కడే కారును నడుపుకుంటూ బయలుదేరి పోయాడు.
ఆ రాత్రి సంస్థానంలో అంతఃపురంలో అమ్మారావుగారు నిజంగా అప్సరసలాగే ఉన్నారు. మన పాతశాస్త్రాలన్నీ దేవతల వయస్సు ముఫ్ఫయ్యేళ్ళనే కదా చెబుతున్నాయి.
కాని ఏది ఏమయినా అమ్మారావుగారు మానవమాత్రురాలు కాబట్టి ఆ వయస్సులో వారి స్తనవైభవం బాగా తగ్గిపోయింది. "సహసానఖంపచ స్తనదత్త పరిరంభం" లేనందుకు ఆవిడ మనస్సు చివుక్కుమంది. డాక్టరుగారి కటువంటి పట్టింపులు లేనందువల్ల నాకు సంభోగ శృంగారం జేగీయమానంగానే సాగిపోయింది.
అమ్మారావుగారు మాత్రం, "మీ కసాధ్యం ఏముంది? మీ వయస్సు ఇరవైగానే అట్టేపెట్టి, నా వయస్సులో పది పన్నెండేళ్ళు తగ్గించలేరా?" అని అడిగారు.
"ఇప్పుడు మనకొచ్చిన లోపం ఏముంది? ఇక మీద నేనే పరిశోధనలూ చెయ్యదలచుకోలేదు. ఇద్దరమూ ఏదయినా బాబాగారి ఆశ్రమానికి పోదాం" అన్నారు డాక్టరుగారు. తన పేరు భగదంత బాబాగా మార్చుకొని ప్రియురాలితో సహా తానే ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు.
సైన్సు లోకంలో పెద్ద కలవరం బయలుదేరింది. వైజ్ఞానిక పత్రికలన్నీ డాక్టర్ మదన్ మోహన్ ను శాస్త్రజ్ఞాన శత్రువుగా పేర్కొని, తిట్లవర్షం కురిపించాయి.
బాబాగారి భక్తులు మాత్రం "తమ ఇష్టదైవం గొప్ప ఆధ్యాత్మిక పరివర్తన చెందిన సిద్ధుడనీ, ప్రేమకోసం, సైన్సు లాంటి క్షుద్రవ్యాసంగాలను వదలి పెట్టిన త్యాగమూర్తి" అని వేనోళ్ళ భగదంతాన్ని ఉగ్గడించారు.
(ఇందులోని పాత్రలూ, సంఘటనలూ కేవలం కల్పితం)
---౦౦౦---



