Home » Sree Sree » Srisri Kathalu
దైవ భీతి
భయానక రసం
ప్రతిదినం దేవుడులేడనడానికి నిదర్శనాలు కనబడుతూనే
ఉంటాయి. అయినా ప్రజలు దేవుడ్నే నమ్ముకుంటూ
వుంటారు. ఎందువల్ల? భయంవల్ల?
కందిగింజల శేషయ్య శేట్టిగారి రామయ్యశెట్టికీ నాకు
చిన్నప్పటినుంచి స్నేహం ఇద్దరం చిన్నప్పటినుంచీ మప్పి
తంగా తల్లితండ్రుల చాటున భయభక్తులతో పెరిగినవాళ్ళం.
క్రమక్రమంగా నాలో అంతర్ధానమవుతున్న భయం. భక్తీ
రామయ్య శెట్టిలో విపరీతంగా పెరిగిపోయాయి. గొంగళీ
చూసి జడుసుకుంటాడు. చీకటి పడేసరికి ఇంట్లోంచి
బయటికి రాడు. నీయంత పిరికివాడు ఈ భూ ప్రపంచంలో
లేడురా అంటాన్నేను. అన్నిటికి ఆ దేవుడే ఉన్నాడంటాడు
వాడు. దేవుడు లేడని నేను వాదిస్తూ ఉంటాను. అయినా
నామాట వినడు. ప్రస్తుతం మా యిద్దరికీ ఒకటిరెండు
నెలలతేడాతో ఇరవయి అయిదేళ్ళవయస్సు బహుశా
రామయ్య శెట్టి కంటే నేనే ఏ కొద్దిగానో పెద్ద.
చిన్నప్పుడు తాండ్రచెత్తూ, గోటీ బిళ్ళా ఆటలతో ప్ర్రారంభమై, హైస్కూలులో బాడ్మింటన్ తో అభివృద్ధి చెంది టౌనుహాలు క్లబ్బులో టెన్నిస్ దాకా మా స్నేహం తీగలా సాగింది. బాడ్మింటన్ రోజుల్లో నేను ఫుట్ బాల్ కూడా ఆడేవాన్ని. ఫుట్ బాల్ అంటే శెట్టికి విపరీతమైన భయం. వాడికాళ్ళు చీపురు పుల్లల్లా ఉంటాయి. బంతిని తంతేనే కాళ్ళు విరిగి పోతాయనుకుంటాడు.
ఒకమారు ఉప్పుటేరు పర్రలో మాకూ వెలంపేట జట్టుకూ ఫ్రెండ్లీమాచ్ జరుగుతోంది. అప్పుడు అవతలివాడి కాలు తగిలి మా జగన్నాధం గాడి కాలు విరిగిపోయింది? ఫెళ్ళుమని ఎదురుకర్ర విరిగిపోయినట్టు చప్పుడయింది. ఆ చప్పుడుకి హడలిపోయి, సెట్టి ఇంటికి పరుగెత్తిపోయాడు. ఆ దృశ్యం వాణ్ని చాలాకాలం దాకా కలల్లోకి వచ్చి భయపెట్టేదని నాతో చెబుతూ ఉండేవాడు. ఫుట్ బాల్ ఆట మానెయ్యమని నాకు సలహా ఇచ్చేవాడు. మా విశాఖ పట్టణంలో అందరూ నన్ను జీ.వీ అనో జీ.వీ.కే.అనో పిలిచేవారు. పూర్తిపేరు ఎవరికి తెలియదనుకుంటాను. తెలియవలసిన అవసరం కూడా లేదు. ఇరవయి ఒకటోయేట నేను మద్రాసునుంచి బి.యస్సీ ప్యాసయి వచ్చిన కొత్తరోజుల్లో అందరూ నన్ను జీ.వీ.కె.నాయుడుగారు అనడం మొదలుపెట్టారు. బ్రిటిష్ ప్రభుత్వం నాకు రావుసాహెబ్ అన్న బిరుదం ఇచ్చినంతగా నేనప్పుడు పొంగిపోతూ ఉండేవాడ్ని.
ప్రతిదినం చాలామంది చనిపోతూండడం నిజం చచ్చిపోతున్నవాళ్ళ తాలూకు వాళ్ళు దేవుళ్ళకు మొక్కుకుంటూ ఉండడం నిజం. అయినా చచ్చిపోయిన వాళ్ళెవరూ బ్రతికి రాకపోవడం కూడా నిజం.
మొదట రామయ్య సెట్టి తల్లీ, ఆ తర్వాత ఆరునెలలు తిరగకుండా వాళ్ళ నాన్న చనిపోయారు. వాళ్ళని కాపాడమని ఏదేవుళ్ళకయినా మొక్కుకున్నావా? అని సెట్టిని అడిగాను "నువ్వు ఉత్తనాస్తికుడివి నీకు జవాబివ్వనుపో" అన్నాడు శెట్టి.
కందిగింజల శేషయ్య సెట్టిగారి రామయ్యసెట్టి స్కూలు ఫైనలులో రెండేళ్ళు డింకీలు కొట్టి, ఈ వెధవ చదువు తన కచ్చిరాదని విరమించుకున్నాడు. నాన్నగారి బట్టలు వ్యాపారం స్వయంగా చూసుకొంటున్నాడు. అందులో బాగా లాభాలు తీస్తున్నాడు. (అన్నట్టు రామయ్య సెట్టి వాళ్ళనాన్నగారి మూడో భార్య కొడుకు ఆ యిద్దరు భార్యలు సంతానం కోసం చెయ్యని నోములు లేవు తీర్ధయాత్రలు లేవు. దానధర్మాలు లేవు.)
అప్పుడే మా మిత్రుడు యల్. జనార్ధనరావుకి తాసిల్దారు ఉద్యోగమయింది. అతన్ని చూస్తే రామయ్య సెట్టికి చెప్పలేనంత భయమూ, భక్తి ఉన్నాయి. జనార్ధనరావు సెట్టి షాపులో ప్రవేశించి తనకూ, ఇంటిల్లిపాదికీ అయిదువందల రూపాయల గుడ్డలు ఖరీదు చేశాడు. వచ్చే ఫస్టుతారీఖుకి పూర్తిగా డబ్బు చెల్లించుతా నన్నాడు. అలాంటి ఫస్టులు చాలా వచ్చాయి. వెళ్ళాయి. గట్టిగా డబ్బిమ్మని అడగడానికి సెట్టికి వల్లమాలిన భయం! తాసిల్దారుగారి దగ్గర నుంచి డబ్బు వస్తుందన్న ఆశ వదులుకున్నాడు సెట్టి.
ఒక సంపన్న వైశ్య కుటుంబపు సంబంధం చూసి చిన్నప్పుడే రామయ్య సెట్టికి వాళ్ళనాన్న పెళ్ళి చేసేశాడు. ఇప్పుడు మా మిత్రుడికి ఇద్దరు పిల్లలు. ఒక కూతురూ, ఒక కొడుకూ! నాకు పెళ్ళి పెటాకులూ లేవు. జీవశాస్త్రంలో బి.యస్.సి. ప్యాసయినా ఉద్యోగం కూడా లేదు.
నేనూ సెట్టీ తీర్ధపు రాళ్ళదగ్గర బీచిలో కూర్చున్నాం. వాడు లోపల్లోపల ఏదో బాధపడిపోతున్నాడు. నాతో ఏమిటో చెప్పాలనుకుంటున్నాడు. చెప్పలేకపోతున్నాడు. నేనే తెగించాను. "నీ ఏడుపేమిటో ఏడవ్రా" అన్నాను. ఏడ్చేడే కాని సంగతి చెప్పలేదు.
ఇద్దరం సిగరెట్లు ముట్టించాం. చీకటి పడకముందే ఇంటికి వెళ్ళి పోవాలని రామయ్యసెట్టి ఉబలాటం. ఇంటిదాకా వచ్చి దిగబెడతానుగాని విషయమేమిటో చెప్పమన్నాను అప్పుడు వాడన్న మాటల సారాంశం ఇది! "ఒరే, జీ.వీ.కె. నేను చస్తున్నాన్రా! నా పెళ్ళాం నన్ను మోసం చేసిందిరా! నాకేదీ దారి కనిపించలేదురా! నా కొడుకుది తెల్లరంగురా! నేనూ నా పెళ్ళాం నల్లగా ఉంటాము కదా. దానికీ తెల్లవాడెలా పుట్టేడురా? ఎవడో సోల్జరు పేట ఆంగ్లోఇండియన్ తో పోయి నా పెళ్ళాం ఈ తెల్ల ప్రసాదం తెచ్చుకుందిరా" అంటూ వలవల వాపోయాడు.
అప్పుడు నేను వాణ్ని తెగ చీవాట్లు పెట్టాను. అయినదానికీ, కాని దానికీ నీ నీడను చూసుకుని నువ్వే బెదురుతున్నావన్నాను. "మెండీలియన్ థియరీ ప్రకారం ఇద్దరు నల్లవాళ్ళకి ఒక తెల్లా, నల్లా పుట్టడాని కభ్యంతరం ఏదీ లేదన్నాడు. నీ భార్యవైపునో, నీవైపునో పూర్వీకులలో తెల్లవాళ్ళుండ వచ్చును. వాళ్ళివాళ నీ సంతతి కావచ్చు" అన్నాను. కాలేజీలో సంపాదించిన జీవశాస్త్ర విజ్ఞానంతో.
"ఒరే జీ.వీ.కె. నా కూతురు అచ్చం నాపోలికేన్రా ఆ కళ్ళూ, ఆ ముక్కు, ఆ నొసలు అన్నీ నేనే అనుకో ఆడపిల్ల తండ్రిని పోలితే అదృష్టవంతు రాలవుతుందంటార్రా పెద్దలు?
"తొలికాన్పు ఆడపిల్లయితే చాలా మంచిదని కూడా అంటార్రా!"
"అది సరికాని ఈ తెల్లవాడు నాకొడుకే అంటావా? కొంచెం తల్లి పోలికలు లేకపోలేదులే. ఏమో నీ సైన్సుని నమ్ముతున్నాను."
"దేవుణ్ణి నమ్మడం మానుకుంటే బాగుపడతా" వన్నాను నేను.
ఇద్దరం వాడి ఇంటి ముఖం పట్టేము.
ప్రతిదినం సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు. అస్తమిస్తూనే ఉంటాడు. కాషాయాలు ధరించిన కసాయి బాబాలు క్షుద్రమైన గజకర్ణ గోకర్ణ విద్యలభ్యసించి జనాల్ని హడలకొడుతూ ఉంటారు. వాళ్ళ తాయెత్తులు జేబుల్లో వేసుకుని పరీక్షలో ప్యాసయిన వాళ్ళూ వాళ్ళిచ్చిన విభూతిని ఆరోజు కొన్న లాటరీ టిక్కెట్టుకు పట్టించడంవల్ల లక్షరూపాయల ప్రైజు కొట్టేసినవాళ్ళూ వాళ్ళ రక్షరేకుల్ని ఎడంచేతితో పట్టుకుని భర్తల దగ్గరకు వెళ్ళిన తర్వాత గర్భం ధరించిన వాళ్ళూ ..... ఇలా ఒకటేమిటి లక్షోపలక్షల ఉదాహరణలతో దేవుడి తరపున సర్వత్రా ప్రచారం సాగిపోతోంది. దేవుడు ఎవరినీ పుట్టించలేదనీ ఎప్పుడూ ఎవరినీ రక్షించలేదని అంటే ఎవరూ నమ్మరు. దేవుడి మహిమల్ని గురించి ఎన్నెన్ని అభూత కల్పనలతో కూడిన కట్టుకథలనైనా అందరూ నమ్ముతారు.
నువ్వెందరు దేవుళ్ళకు మొక్కుకున్నా మీ అమ్మా నాన్నా ఎందుకు బతకలేదని రామయ్య సెట్టిని సూటిగా ప్రశ్నించాను. "ఆ! దానికేమిటి? కర్మఫలం అంటూ ఒకటి వుండనే ఉందిగా" అని జవాబిచ్చాడు వాడు. ఈ దైవభక్తీ, కర్మ సిద్దాంతమూ కలిసి మనందరినీ పిరికిపందలు చేస్తున్నాయంటే ససేమిరా వాడు ఒప్పుకోలేదు.
తెల్లబిడ్డడు తనకొడుకే అని నేను చెప్పిన మీదట ఆ పిల్లాన్ని రామయ్యసెట్టి అల్లారుముద్దుగా చూసుకోవడం ప్రారంభించాడు. ఆకొడుక్కి ఒకరోజు ఉధృతంగా జ్వరం వచ్చింది. ఒక్కొక్కరోజు గడుస్తూ ఉంటే జ్వరం తగ్గే సూచనలేవీ కనిపించడంలేదు. కొడుకు వైద్యానికి గాను రామయ్య సెట్టి డబ్బును మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చుపెట్టాడు. అయినా జబ్బు నయంకావడం లేదు.
కొడుకు చచ్చిపోతాడేమోఅని రామయ్య సెట్టికి నిజంగానే భయం వేసింది.
నవగ్రహశాంతి చెయ్యించాలని బ్రాహ్మణోత్తములందరూ సెట్టిని ప్రోత్సహించారు. యధావిధిగా జపాలు జరిగాయి. కొడుకు జబ్బు మాత్రం నయం కాలేదు.
అటువంటి ఆపత్సమయంలో రామయ్య సెట్టి ఏదో దేవుడికి మొక్కుకున్నాడనీ, ఆపద్భాంధవుడైన ఆ దేవుడనుగ్రహించి సెట్టికి పుత్రభిక్ష పెట్టాడనీ రాసి ఈ కథను నేను ముగించవచ్చు. కాని అది యదార్ధానికి విరుద్దం.
నిజానికి రామయ్య సెట్టి తన కొడుకు బతికి బాగుంటే, తనవీ, కొడుకువీ, తలనీలాలు సమర్పిస్తానని ఏడుకొండలవాడికి మొక్కుకున్నాడు. రెండు రోజులపాటు జ్వరం తగ్గుముఖం పట్టింది. ఏమయినా దేవుడు దేవుడే అని పొంగిపోయాడు సెట్టి. అయినా కర్మఫలం అంటూ ఒకటి అందర్నీ వెంటాడుతూ ఉంటుంది కాదూ! దానిఫలితంగా జ్వరం తగ్గిన మూడోరోజుకి సెట్టి కొడుకు మరణించాడు.
సెట్టిని ఓదార్చటానికి నేను వెళ్ళాను. ఎంత మొక్కుకున్నా ఏమి లాభంలేకపోయిందనీ, ఇంతకూ ఇది పూర్వజన్మంలో తాను చేసిన పాపానికి ఫలితమనీ అన్నాడతడు. పూర్వజన్మలనీ, ఉత్తర జన్మలనీ ఏవీ లేవని వాడితో వాదించదలచుకోలేదు. తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకోవలసిన అవసరం తప్పిపోయినందుకు సంతోషించమని సలహా యిచ్చాను.
రామయ్యసెట్టి భయంతో గజగజ వణికిపోయాడు. ఏమయినా తలనీలాలు దేవుడికి సమర్పించే తీరుతానన్నాడు. అలాగే చేశాడు. చెయ్యకపోతే తన ప్రాణానికే ముప్పు వస్తుందని నా మిత్రుడి భయం.
---౦౦౦---



