Home » Yandamuri veerendranath » Rakshasudu
పద్నాలుగు గంటల తరువాత అతడికి చివరిసారిగా స్పృహ వచ్చింది.
ఎంతో తర్జన భర్జన జరిగాక అతడికి మెడికేషన్ ఆపుచేసి, చివరికోర్కెకి వప్పుకున్నారు డాక్టర్లు. అప్పటికే 'మారో' పూర్తిగా బ్లడ్ లో కలిసిపోవటం ప్రారంభమై చాలా సేపయింది.
అతడు కళ్ళు విప్పాడు. ఒక సూర్య కిరణం తాటాకులమధ్య నుంచి జారుతూంది. కిరణాన్ని చూసి, తనెక్కడున్నదీ తెలియగానే అతడి మొహంలో వెలుగురేఖ తొంగి చూసింది. కొద్దిగా తల తిప్పాడు- కేదారేశ్వరి, సుమతి, వాణి, సింహం... చివరగా విజయ్! విజయ్ కళ్ళు తడిగా వున్నాయి. 'ఋణం తీర్చుకున్నారు సుమా' అన్నట్టున్న అతడి చూపుల పలకరింపును చూసి కళ్ళుదించుకున్నాడు.
తరువాత అతడి చూపు వాణి, సింహాలమీద నిలిచింది. "వెళ్ళొస్తాను మిత్రులారా!"
అతడి మౌనం సంకేతాన్ని వాళ్ళు ...గతంలో అందుకున్న మిగతా అన్ని సూచన్లలాగే అందుకున్నారు.
వాణి అతడి పక్కగా కూర్చుని అతడి చేతిని తన చేతిలోకి తీసుకుంది. ఎప్పుడూ చంచలంగా, కొండ శిఖరంగా వుండే సింహం కూడా వేదనా భరితమైన వదనాన్ని అవనతం చేసుకున్నాడు.
స్మృతులు చేతులైతే అంజలే గీతాంజలి!.. దుంఖాశ్రువులు మెళ్ళో ముక్తాహారాన్ని అల్లితే, ఆ వియోగం దుఃఖ స్పందనమే!! రాత్రంతా నక్షత్రాన్నించి నక్షత్రానికి మౌనంగా కళ్ళు విప్పి చూసేది, ఆషాడవర్షనిశీధిలో ఈ వియోగ భేదమే!!! భూమ్యాకాశాల్ని కలిపేదికూడా వియోగమే!
ఈ లోపులో నిశ్శబ్దాన్ని చీలుస్తూ కార్ల చప్పుడు. వరుసగా పదికార్లు వచ్చి ఆగాయి. జానకిరాముడు పరిస్థితిని అర్థంచేసుకున్నాడు. అతడి పక్కనే మోకాళ్ళమీద నేలపై కూర్చున్నాడు.
ఇద్దరి చూపులూ కలుసుకున్నాయి.
"ఏం... ఏం... చేశావు.. నా కి...చ్చిన....మాటని?"
దేశాన్ని పేల్చెయ్యటం!
ఆ సమాధుల్లోంచి కొత్త తరాన్ని పునర్నిర్మించటం!!
జానకిరాముడు ఇబ్బందిగా చూశాడు. అతడు ఆ కోరిక కోరినప్పుడు అందులో వున్న తీవ్రత అర్థం కాలేదు. ఇప్పుడు ఒక దేశాధినేత అయ్యాక అవుతూంది! జానకిరాముడు నెమ్మదిగా అన్నాడు- "చూడూ- నేను చాలా చేశానని చెప్పుకోలేను. కానీ ఏమేం చేస్తున్నానో నీకు తెలుసు. ముఖ్యంగా డయాస్ట్ బిల్ వచ్చాక అసమానతలు వూహించని రీతిలో తగ్గిపోతున్నాయి. రిజర్వేషన్ ల నుంచి, పర్ కాపిటా ఇన్ కం పెంచటం వరకూ ఒక్కో అంశమే చేపడుతున్నాను. సమాధుల అవసరం లేకుండానే కొత్త పునాదులు తవ్వొచ్చని ఉద్దేశ్యం. నాకు కొద్దిగా టైమివ్వు. నువ్వు కోరిన రూపంలో దేశాన్ని తీర్చిదిద్దుతాను".
అతడు నవ్వేడు. 'అప్పటి వరకూ నేను బ్రతికి వుండ' నని దాని ఉద్దేశ్యం... అంతలో అతడి దృష్టి వరుసగా నిలబడిన పిల్లలమీద పడింది. వాళ్ళు పాడిన పాటలు గాలిలో అలలుగా తేలివస్తున్న భావన కలిగింది.
అతడు కోమాలోకి వెళ్ళిపోతున్నాడు.
డెలేరియమ్ స్టేజి వస్తోంది.
ఆ స్టేజిలో కూడా అతడికి దేశమే కనపడుతూంది. కొన్ని వేలమంది, లక్షలమంది పిల్లలు... ముక్తకంఠంతో పాడుతున్నారు-
"జయ జయ జయ ప్రియభారత
జనయిత్రీ దివ్యధాత్రి!
జయ జయ జయ శతసహస్ర
నర నారీ హృదయ నేత్రి!"
ఈ దేశం నాది అన్న ఒక్కహామీ ఇవ్వండి మాకు! మేము పడిన కష్టం అంతా మా దేశానికి చెందుతుంది అన్న ఒక్క హామీ ఇవ్వండి!! అప్పుడు మా వేళ్ళతో ఈ భూమిని దున్నుతాము. మా రక్తంతో ఈ పైర్లు తుడుపుతాము. కాలే మా వేళ్ళ కొవ్వొత్తుల చివర్లతో ఈ దేశపు అంధకారాన్ని పారద్రోలుతాము.
"జయ దిశాంత గత శకుంత
దివ్య గాన పరితోషణ!
జయ గాయక వైతాళిక
గళ విశాల పథ విహరణ!"
మేము పిల్లలము. ఎగిరే పతాకాలము. మేము మహస్సులము. రోచిస్సులము. మమ్మల్ని నాశనం చెయ్యొద్దు. మమ్మల్ని కలుషితం చెయ్యవద్దు. మమ్మల్ని పెరగనివ్వండి. మా డిక్షనరీ నుంచి బ్యూరోక్రసి, రెట్ టేపిజం అనే పదాలు చెరిపేస్తాం. లంచం- పలుకుబడి- వత్తిడి తుడిసేస్తాం. జ్ఞానం మీద దుమ్ము పెరగని దేశాన్ని నిర్మిస్తాం. పార్లమెంటుని గుడిగా భావిస్తాం.
చరిత్ర సృష్టించిన దేశపు దౌర్భాగ్యాన్ని మా లేత అరచేతుల్తో చెరిపేస్తాం.
అతడి దృష్టి పిల్లల మీదుగా జానకిరాముడి వైపు తిరిగింది. అతడి కళ్ళల్లో భావాన్ని గుర్తించి జానకిరాముడి మొహం విప్పారింది. అర్థం చేసుకున్నట్లుగా తలూపాడు. చేయిలో చెయ్యి బిగుసుకుంది.
అతడి కళ్ళు నెమ్మదిగా మూతలు పడసాగాయి. బలవంతంగా తెరిచాడు.
చివరగా మిగిలింది సుమతి.
ఆమె మీద చూపుల్నీ పెనవేస్తూ-
వేల వేల గొంతులు... అతడి చుట్టూ చేరి ఒకే పాట.. ఒకే స్వరం... ఒకే కంఠం.. జ..య..భా..ర..త జనయిత్రీ...ది..వ్య...ధాత్రి.
"నాకు... నాకు... నా అమ్మె...వరో ... తెలిసింది" అన్నాడు.
సుమతి చప్పున ముందుకు వచ్చింది. అతడు చెప్పబోయాడు.
అవును. నాకు నా తల్లెవరో తెలిసింది. ఇంత దగ్గిరగా వున్న తల్లిని తెలుసుకోలేక, కొండలూ, కోనలూ, పుట్టలూ, ఆకాశం- అన్నీ వెతికాను. తెలియని తల్లికోసం రాత్రిళ్ళు రోదించాను. దాహార్తితో శోధించాను. నా జీవితపు కొవ్వొత్తి మినుక్కు మినుక్కుమని ఆరిపోయే ఈ చివరి క్షణంలో- ఇన్నాళ్ళూ నేను తపిస్తున్న దెవరికోసమో తెలుసుకున్నాను.
అంతా చెప్పాలి... కానీ గొంతు రాలేదు. 'అమ్... మ్మా....' అన్నాడు.
అతడి చెయ్యి బలహీనంగా క్రిందికి జారింది.
పిడికిలిలో మట్టి తీసుకోవటానికి ప్రయత్నించింది.
అయినవారికి అర్థం అయింది- కానివారికి కాలేదు.
అంతలో అతడి తల పక్కకి వాలిపోయింది.
డాక్టర్ వచ్చి పల్స్ చూసి, తల విదిలించాడు.
సుమతి బావురుమంది. వాణీ చేతుల్లో మొహం దాచుకుంది.
అతడి మీదుగా విజయ్ దుప్పటి కప్పాడు.
క్రిందికి జారిన చేతిని తిరిగి పైకి సర్దుతూ మోచేతిక్రింద పచ్చబొట్టు ఖాళీ స్థలాన్ని చూశాడు.
తరువాత దాన్ని మామూలుగా సర్ది, దుప్పటి పూర్తిగా కప్పేశాడు.
* THE END *



