Home » Yandamuri veerendranath » Rudranethra
"ఊ..... కానీ-"
"దీనికి కారణం 'మీరే- మీరే-' అని హంసలేఖ రెట్టించి మీ గురించి చెప్పడంతో నాకు అనుమానం వచ్చింది. నిరోధ్ ని టేబ్లెట్ అనుకోవడం గుర్తొచ్చి అసలు విషయం రాబట్టాను. అది వింటే మీరు నమ్మరు. మీరే కాదు. బియస్సీ చదివిన అమ్మాయికి ఈ మాత్రం తెలీదా అని నవ్వుతారు కూడా-"
"ఏమిటా విషయం?"
"హంసలేఖకి ఇప్పటివరకూ ఇంటర్ కోర్స్ అంటే ఏమిటో తెలీదు. ముద్దు పెట్టుకుంటే పిల్లలు పుడతారు అనుకుంటూంది."
కీచుమన్న శబ్దంతో కారాగింది. "ఏమిటీ?" అరిచాడతను.
"అవును పుట్టినరోజునాడు మీరు ముద్దు పెట్టుకున్నారు. అందువల్లే తనకి ప్రెగ్నెన్సీ వచ్చిందన్న భావంతో వుంది హంసలేఖ. చెప్పండి ఆమెని పెళ్లిచేసుకుంటారా? సి.బి.ఐ. చేసిన తప్పు మీరు సరిదిద్దుతారా?"
* * *
ట్రాఫిక్ ఎక్కువగా వుండడంతో నేత్ర నెమ్మదిగా నడుపుతున్నాడు కారు. పక్కన స్వర్ణరేఖ వున్నదనీ - ఆమె నుంచి ఒక ముఖ్యమైన రహస్యం రాబట్టాలని అతడికి తెలుసు. కానీ, అతడు కూడా మామూలు మనుషులకుండే భావ సంచలనాలకు అతీతుడైన జేమ్స్ బాండ్ కాదు. అతడి వృత్తి వేరు. ప్రవృత్తివేరు. తన డిపార్ట్ మెంట్ పన్నిన వలలో చిక్కుకున్న అమాయకప్పక్షి పిలుపులో వున్న తీయదానానికి తాను తాత్కాలికంగా వృత్తిని మరిచి స్పందించిన వైనం అతడిని నిలదీస్తున్నది. మరోవైపు, స్వర్ణరేఖతో రహస్యంగా రాత్రి గడపటానికి వచ్చి, పక్కగదిలో హంసలా పడుకుని ఉన్న హంసలేఖని గమనించి అటు వెళ్ళి మత్తులో వున్న ఆమెను అనుభవించిన క్యూ..... నికృష్టానికి పరాకాష్ట అయిన ఆ చర్య అతడిని చికాకుపరుస్తోంది.
అతడి ఆలోచన్లని భంగపరుస్తూ స్వర్ణరేఖ అంది.
"ఆ అమ్మాయినించి అసలు విషయం ఎక్కువ కాలం దాయడం కష్టం. ప్రెగ్నెన్సీకి కారణం ముద్దుకాదనీ, మరొకటి అని ఆమెకు త్వరలోనే ఎలాగూ తెలుస్తుంది. ఆ పని చేసింది కూడా మీరేనని మీరు చెప్పాలి! దాంతో ఆ అమ్మాయికి మీమీద వున్న మంచి అభిప్రాయం పోవచ్చు. అంత ప్రేమించినవాడివి మత్తులో వుండగా అలా అనుభవించవలసిన అవసరం ఏమిటి అని జీవితాంతం మిమ్మల్ని వేధించవచ్చు. కానీ సమస్య అది కాదు."
"సమస్య అది కాదని నాకు తెలుసు. ఇంతకాలం హంసలేఖ తన ప్రెగ్నెన్సీకి కారణం నేనని అందరికీ చెపుతూంటే ఇదోరకమైన ట్రాప్ అనుకున్నాను. అంతేకానీ, ఇది ఆమె తెలియనితనం అనుకోలేదు. పాతిక సంవత్సరాల క్రితం అమ్మాయిలకైతే అంత అమాయకత్వం వుందంటే నమ్మొచ్చు. హంసలేఖ లాంటి మోడరన్ అమ్మాయికి, అందులోనూ బి.యస్సీ చదివిన అమ్మాయికి ఇంత చిన్న విషయం తెలీదంటే-"
"హంసలేఖ తెలియనితనం సైకాలజీకి సంబంధించినది నేత్రా" అతడి మాటలు మధ్యలో కట్ చేస్తూ అంది స్వర్ణ. "ఆమె ఉత్సకతని ఆమె స్నేహితురాలు ఆకతాయితనంతో తప్పుదార్లో మూసేసింది. దాంతో ఇక ఆమె దాని గురించి లోతుగా కానీ. లాజికల్ గా కానీ ఆలోచించడం మానేసింది. మీరన్నట్టు పాతిక సంవత్సరాల క్రితం" మొదటిరాత్రి ఏం జరుగుతుందో" తెలియనివాళ్ళు పదిశాతం. 'ఏదో జరుగుతుంది- ఏం జరుగుతుందో తెలియదు' అనుకునేవాళ్ళు యాభైశాతం వుండేవారనుకుంటే, ఇప్పుడిలాంటివాళ్ళు కనీసం ఒక శాతమైనా వుండే వుంటారు. ఈ తెలిసీ తెలియనితనం అనేది సెక్స్ లోనే వుంది. సెక్స్ అనేది ఒక ఉద్యానవనం లాంటిది. కొంతమంది మొదటి వరుస పూలని చూస్తే 'అంతా చూశాం. అద్భుతంగా వుంది' అనుకోవచ్చు. మరికొంతమంది మరికాస్త లోపలికి వెళ్ళి జింకల్నీ, జలపాతల్నీ చూడొచ్చు. ఇంకా కొందరు ఇంకా లోతు కెళ్ళి పర్వత పంక్తుల్నీ యోగసిద్ధుల్నీ కనుక్కుని వుండొచ్చు! ముద్దు పెట్టుకుంటే కడుపు వస్తుందనుకుందా- అని హంసలేఖని చూసి నవ్వుకునే ఎంతమందికి, వేడివేడి కాఫీ తాగుతూ సిప్ కీ - సిప్ కీ చేసే మధ్యలో స్త్రీ ఓరల్ సెక్స్ అద్భుతంగా వుంటుందని తెలుసు? అదే ఫేషియాల్ సెక్స్ లో మగవాడి ఫ్రేవ్యూలమ్ చివర క్లెయిటోరస్ లాటి సున్నితమైన పాయింట్ ని టికిల్ చేయవచ్చని ఎందరాడవాళ్ళకి తెలుసు? అంతవరకూ ఎందుకు? రిథమాటిక్ వజీనల్ జిల్ కంట్రాక్షన్ అనేది ఒకటుంటుందనీ, అది తెలిసిన స్త్రీని ఇక జీవితాంతం పురుషుడు వదిలిపెట్టడనీ ఎందరికి తెలుసు? ఇవన్నీ తెలియడానికి బియస్సీ చదవక్కర్లేదు. బియస్సీ చదివినా తెలీదా అని ఆశ్చర్యపడనవసరంలేదు. అయినా ఇప్పుడు సమస్య హంసలేఖకి సెక్సు సైన్స్ ఎంత వరకూ తెలుసని కాదు. హంసలేఖ సమస్యని పరిష్కరించటం ఎలా అని? మీ సీక్రెట్ ఏజెస్సీలూ, టెర్రరిజాలూ పక్కన పెట్టండి. ఒక మనిషిగా ఆలోచించి చెప్పండి-"
అతడు ఆమె మాటలు వినడం లేదు. ఆలోచిస్తున్నాడు. ఒక మంచి ఛాయాగ్రహకుడి కెమెరా బంధించిన అపురూప దృశ్య పరంపరలా అతడి కళ్ళముందు హంసలేఖ తాలూకు అనుభూతులు స్లోమోషన్ లో సాగిపోతూ వున్నాయి.
నాలుగు ఫర్లాంగులు నడిరోడ్డు మీద పరుగెత్తుకుంటూ వచ్చి, చెమటతో తడిసిన జుట్టు చెవి వెనక్కి తోసుకుంటూ, కదిలే రైలు ముందు నిలబడి "జనం చూస్తారనీ, నవ్వుకుంటారని అనుకుంటే, అది ప్రేమెలా అవుతుందీ" అని ప్రశ్నించిన రసరమ్య రాగలేఖ-
1989 కొవ్వొత్తుల్తో స్నేహితుడి కళ్ళల్లో మెచ్చుకోలు కోసం చూసిన సజీవ ప్రేమలేఖ-
కడుపులో పెరిగే శిశువుకు కారణం ఏదో కూడా తెలుసుకోలేని మనసు తెల్ల కాయితం మీద అమాయక అక్షర లేఖ-
హంసలేఖ.....
.......దూరంగా ట్రాఫిక్ లైట్లు కనపడుతున్నాయి. అది దాటగానే యస్బీఆర్ బిల్డింగ్. ఎదురుగా తన ప్లాట్.... కారు పోనిస్తూ తనన్నాడు- "ఇదంతా ఒక యాక్సిడెంట్. అవును. ఒక యాక్సిడెంట్ అంతే. నిరపాయకరమైన యాక్సిడెంట్! ఆమె తప్పేమీ లేనప్పుడు ఆమె శిక్ష ఎందుకు అనుభవించాలి? ప్రేమ ముందు సెక్స్ ఎంత చిన్న విషయం? ఇదంతా ప్రేమ కాదనుకుంటే అది ఆత్మవంచన. జరిగిందంతా ఆమెకు తెలియవలసిన అవసరంలేదు. ఆ రాత్రి జరిగిన తొందరపాటు చర్య నాదే అని క్షమాపణ కోరతాను-" అని ఆగి, ఆ తరువాత తన చివరి వాక్యం పూర్తిచేశాడు. "....ఏజెంట్ క్యూ బిడ్డకి నేను తండ్రినవుతాను-"
ఆమె చివ్వున తలెత్తింది.
ఎట్లా నమ్మను- కృపా, ప్రేమా లోకాన్ని ఇంకా పరిపాలిస్తున్నాయని? మనిషికీ, జంతువుకీ తేడా 'కరుణే' అని! కళ్ళు లేని గురువింద తీగెకి పట్టుకొమ్మ దొరికేందుకు కస్తూరి పూల పరిమళం తోవ చూపిందా? చెలం వ్రాసినట్టు.... 'శ్వాస ఆగిన మహోద్రేకం మనో నిర్మిత అవధుల్ని దాటి శాంతిలో ఆగిపోయిన క్షణాన నువ్వూ లేవు, నేను లేను, ప్రేమ తప్ప మరీమీ లేదు, అన్నభావం మెరుపై మెరిసిందా? చరాచర ప్రపంచాన్ని సహస్ర కరాల ఆలింగనంతో దేదీప్యమానంగా ఉద్దేపనం చెయ్యటానికి ఒక చర్యా, మానవజాతిని మంచితనంతో హత్తుకునే రెండు చేతులూ...... అభిషిక్తం చేయడానికి రెండుకళ్ళ నిండా నీళ్ళు!!!



