Home » Yandamuri veerendranath » Prarthana


    ఇంకేమి మిగిలింది... దుఃఖం తప్ప. చాలాసేపటికి అతడు తేరుకున్నాడు. డాక్టర్ వైపు చూసి "నేనొకసారి నా కూతుర్ని చూసుకోవచ్చా- బ్రతికివుండగా ఆఖరిసారి..." అని అభ్యర్థించాడు. అందులో వెటకారం లేదు, బాధే వుంది.

 

    మహేంద్ర ఏదో అనబోయి, మనసు మార్చుకుని సరే అన్నట్టు తలూపాడు.

 

    ఇద్దరూ లోపలికి ప్రవేశించారు. భార్గవ మంచం దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చుని కూతురి తలమీద చెయ్యివేసి "వెళ్ళొస్తానమ్మా" అన్నాడు.

 

    అతడు గొంతు రుద్ధమైంది.

 

    "వద్దు నాన్నా- నువ్వు వెళ్ళొద్దు" వదిలేస్తే ఎక్కడ వెళ్ళిపోతాడో అన్నట్టు చేతిని గట్టిగా పట్టుకుంది.

 

    "లేదమ్మా, వెళ్ళాలి. మళ్ళీ వస్తానుగా"

 

    "ఉహూ, రావు"

 

    "ఏం, ఎందుకు రాను? కొన్ని మందులు కొనాలట. అవి కొని తీసుకొస్తాను".

 

    "ఉహూ. నాకు మందులొద్దు. నేను ఇంటికి వస్తాను".

 

    "ఇంకెంతమ్మా- నాల్గయిదు రోజుల్లో నేనే స్వయంగా తీసుకెళతాగా?"

 

    ఇక వెళతారా' అన్నట్టు మహేంద్ర దగ్గాడు. నర్సు మళ్ళీ ట్యూబ్ అమర్చటానికి దగ్గిరకొచ్చింది. భార్గవ లేచి నిలబడ్డాడు.

 

    "డాడీ".

 

    అతడు ఆగేడు.

 

    "నిన్ను అరెస్టు చేస్తున్నారెందుకు?"

 

    ఉలిక్కిపడ్డాడు. ప్రార్థన చిన్న పిల్లకాదు. ఇంగ్లీషు బాగా అర్థం చేసుకోగలదు. పెదవుల మీద బలవంతంగా నవ్వు తెచ్చుకున్నాడు. "అదా... అది ఇంటెన్సివ్ కేర్ లోకి ఇలా ఎవరూ రాకూడదు, అందుకని. మరి నే వెళ్ళిరానా...."

 

    ప్రార్థన మాట్లాడలేదు.

 

    భార్గవ వంగి, ఆమె నుదుటిమీద ఆప్యాయంగా ముద్దుపెట్టుకున్నాడు. ఎవరివైపూ చూడకుండా తలవంచుకుని గుమ్మం వరకూ సాగిపోయాడు. అక్కడ మాత్రం కాళ్ళు నిరాకరించాయి. ఆగి వెనుతిరిగి చూసేడు. ప్రార్థన కూడా ఇటే చూస్తూంది. ఇద్దరి కళ్ళూ కలుసుకున్నాయి.

 

    అతడు చటుక్కున కళ్ళు తిప్పుకున్నాడు.

 

    ప్రత్యర్థులు గెలిస్తే అదే ఆఖరి చూపు అని అతడికి తెలుసు- కూతురు బ్రతికి వుండగా!!!

 

                                                            *    *    *

 

    శంకర్ లాల్ తన పెర్సనల్ ఫోన్ ఎత్తి నంబర్ డయల్ చేశాడు.

 

    "హల్లో".

 

    "చెప్పు శంకర్ లాల్! నేనే".

 

    "థాంక్స్".

 

    "దేనికీ?"

 

    "మీరు చెప్పిన రెండు సూత్రాలూ టేబిల్ కి చెరోవైపునా పెట్టుకోవటమే కాదు, ఆచరించాను కూడా".

 

    "గుడ్!"

 

    "భార్గవ దగ్గర్నుంచి రాజీనామా తీసుకున్నాను".

 

    "పాపం పూర్ ఫెలో! సల్ఫా-3 కనుక్కుంటే ఇన్ని కష్టాలు రాకపోవును కదా!"

 

    "మీకు థాంక్స్ చెపుదామని ఫోన్ చేశాను"

 

    "దేనికి శంకర్ లాల్?"

 

    "నాకు సలహా ఇచ్చినందుకు, బోర్డు మెంబర్ల దగ్గిర నా పరువు నిలబెట్టినందుకు. అన్నిటికన్నా ముఖ్యంగా అతడిని మీ ఫ్యాక్టరీలో రెడ్ హేండెడ్ గా పట్టుకున్నందుకు".

 

    "అది యాదృచ్చికంగా జరిగింది. నేను కారులో వస్తూంటే సెంట్రీ రూమ్ నుంచి బయటకొస్తూ కనపడ్డాడు. నీకు అతనో సలహా ఇచ్చాడు జ్ఞాపకం వుందా- న్యూస్ పేపర్ వాళ్ళు లోపలికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటూంటే ఇన్ స్టిట్యూట్ తాలూకు సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు అని- అతగాడికి నా సెక్యూరిటీతో ఏం పనా అని ఎంక్వయిరీ చేశాను. దొంగతనానికి వచ్చాడని తెలిసింది. దొరికిందిరా పిట్ట అనుకున్నాను. తర్వాత నాటకం అంతా నువ్వు ఆడిందిగా శంకర్ లాల్?".

 

    "ఏది ఏమైనా థాంక్స్".

 

    "తొందరగా నాకో కొత్త మందుకి ఫార్ములా ఇవ్వు. కాన్స్-క్యూర్ పాత పడిపోతుంది".

 

    "అలాగే- వుంటాను మరి".

 

    "మంచిది" అటువైపు ఫోన్ పెట్టేశాడు.

 

                                          *    *    *

 

    ఆస్పత్రి గేటు దగ్గిర నిలబడి అతడు వెనక్కి తిరిగి చూసేడు. ఆ నాలుగంతస్తుల భవనం ఎత్తుగా చేతులు సాచుకున్న బ్రహ్మ రాక్షసుడిలా కనపడింది.

 

    తను అన్నిటినీ కోల్పోయాడని అతడు తెలుసుకున్నాడు. ఇప్పుడిక ఏమీ లేదు- సమాజంలో గౌరవం, ఉద్యోగం, ప్రతిష్ట అన్నింటికన్నా ముఖ్యంగా... ప్రార్థన.

 

    అతడికి ప్రపంచంమీదే విరక్తి జనించింది. ఏమిటీ ప్రపంచం? కల్తీ మందులతో సామాన్యుల్ని మోసంచేసే కాపిటలిస్టుల ప్రపంచం...రిసెర్చి పేరుతో ప్రభుత్వంనుంచి లక్షల లక్షల గ్రాంటుల సంపాదించి తినేసే ఇన్ స్టిట్యూట్ ల ప్రపంచం ... ఇక మనుష్యుల సంగతికి వస్తే ఏమిటీ మనుష్యులు? 'మీ అనారోగ్యానికి కారణం ఇదిరా' అని చెప్పినా వినకుండా తనమీదకు రాళ్లు రువ్విన మనుష్యులు... దొంగతనానికి వచ్చినట్టు తనమీద నేరం మోపి, తన దగ్గరున్న నాలుగువేలూ దొంగతనం చేసిన మనుష్యులు నిజాయితీకోసం నిలబడ్డ ఒక వ్యక్తిని కేవలం తమ మాట వినలేదన్న పగతో, ద్వేషంతో పాతాళానికి తొక్కెయ్యటానికి ఎన్ని అడ్డదార్లయినా తొక్కటానికి సిద్ధపడే మనుష్యులు...

 

    ఈ మనుషులూ, ఈ ప్రపంచం అన్నిటికన్నా ముఖ్యంగా తన భార్య...

 

    అతడికి వసుమతిమీద కోపం రాలేదు. తన జీవితంలోకి ఒక అనామకురాలిగా ప్రవేశించి భార్యగా ఆమె, తనకింత ద్రోహం చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. ప్రార్థనంటే తనకెంత ప్రేమో, ఎంత గాఢంగా ప్రార్థనని తను ప్రేమిస్తాడో తెలిసి కూడా తననుంచి ఆ పాపని కోర్టుద్వారా వేరుచేయగలిగిందంటే- ఆమె స్త్రీ అయివుండదు. రాక్షసి అయి వుంటుంది. అయినా అతడికి ఆమెమీద కోపం రాలేదు.

 

    తను మాత్రం చేసినదేముంది? ఈ మనుష్యుల్లో తానూ ఒకడే. ఇంతకాలం ఇన్ స్టిట్యూట్ లో జీతం తీసుకుంటూ కూడా ఏమీ కనుక్కోలేక పోయాడు. ఈ రోజు బాధపడే హక్కు తనకి లేదు. ఇన్ని కోల్పోయేక, ఇందరితో 'ఛీ' అనిపించుకున్నాక ఇక ఈ ప్రపంచంనుంచి నిష్క్రమించటమే మంచిది.

 

    అతడికి ఒకందుకు సంతోషం వేసింది. తను లేకపోతే మిగిలిన పిల్లలిద్దరూ అనాధలవరు. కనీసం ఈ విషయంలో వసుమతిని వివాహమాడటం ద్వారా మంచిపని చేసేడు.


Related Novels


Vennello Godaari

Rudranethra

Rakshasudu

Stuvartapuram Police Station

More