Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda


                                      రెండవ ప్రపాఠకము

                                     మొదటి అనువాకము

    1. ప్రజాపతి ప్రజలను సృష్టించినాడు. ఆ విధముగా సృష్టించబడిన ప్రజలను ఇంద్రాగ్నులు దాచినారు. ప్రజలను ఇంద్రాగ్నులు దాచిన విషయము ప్రజాపతి గ్రహించినాడు. అతడు పదకొండు పాత్రలందు పురోడాశమును నిర్వాపము చేసినాడు. అప్పుడు ఇంద్రాగ్నులు ప్రజలను ప్రజాపతికి సమర్పించినారు.

    2. ఒకడు సంతానము కలిగించుటకు సమర్థుడు అగును. అయినను అతనికి సంతానము కలుగదు. అతని సంతానమును ఇంద్రాగ్నులు దాచిపెట్టుచున్నారు. అట్లగుట వలన సంతానము కోరువాడు ఇంద్రాగ్ని దేవతాకమగు పురోడాశమును పదకొండు పాత్రలందు నిర్వాపము చేయవలెను. స్వభాగధేయమున ఇంద్రాగ్నులను సేవించవలెను. అప్పుడు ఇంద్రాగ్నులే సంతానార్థికి సంతానము అనుగ్రహింతురు. అతడు సంతానవంతుడు అగును.

    3. భూమి, బంధు విషయములందు స్పర్థ కలవాడు ఇంద్రాగ్ని దేవతాకములైన పదకొండు పాత్రలందు పురోడాశమును నిర్వాపము చేయవలెను. స్వభాగధేయమున ఇంద్రాగ్నులను సేవించవలెను. ఇంద్రాగ్నులు శత్రువును నిర్వీర్యుని చేయుదురు. యజమాని ఎంతటి పాపిష్ఠి శత్రువులనైనను గెలిచి విజయవంతుడు అగును.

    4. యుద్ధమునకు తరలు వాని ఇంద్రియగత వీర్యము తొలిగిపోవును. అందువలన యుద్ధము చేయుపోవువాడు ఇంద్రాగ్ని దేవతాకమగు పదకొండు పాత్రలందు పురోడాశమును నిర్వాపము చేయవలెను. స్వభాగధేయమున ఇంద్రాగ్నులను సేవించవలెను. వారే అతని యందు ఇంద్రియగత వీర్యమును చేర్చెదరు. అతడు ఆ వీర్యమున యుద్ధమునకు తరలును. యుద్ధమునందు విజయము సాధించును.

    5. యుద్ధము నందు జయించినవాడు ఇంద్రియగత బలము పోగొట్టుకొనువాడు అగుచున్నాడు. అందువలన అతడు ఇంద్రాగ్ని దేవతాకమగు పదకొండు పాత్రలందు పురోడాశమును నిర్వాపము చేయవలెను. అతడు స్వభాగధేయమున ఇంద్రాగ్నులను సేవించవలెను. అప్పుడు ఇంద్రాగ్నులే అతనికి శక్తి సామర్థ్యము కలిగింతురు. అతడు ఇంద్రియగత సామర్థ్యము గలవాడు అగుచున్నాడు.

    6. సభను జయించకోరువాని ఇంద్రియగత వీర్యము తొలగిపోవును. అందువలన అతడు ఇంద్రాగ్ని దేవతాకమగు పదకొండు పాత్రలందు పురోడాశము నిర్వాపము చేయవలెను. స్వభాగధేయమున ఇంద్రాగ్నులను సేవించవలెను. అప్పుడు ఇంద్రాగ్నులు అతనికి ఇంద్రియ గత సామర్థ్యము కలిగింతురు. ఆ సామర్థ్యమున అతడు సభను జయించును.

    7. ఇంకను అతడు పూష దేవతాకమగు చరువును నిర్వాపము చేయవలెను. పూషదేవతయే ఇంద్రియగత సామర్థ్యము కలిగించగలవాడు. అందువలన స్వభాగధేయమున పూషదేవతను సేవించవలెను. అప్పుడు పూషదేవతయే అతనికి ఇంద్రియగత సామర్థ్యము కలిగించుచున్నాడు.

    8. సభకు చేరువాడు క్షేత్రపతి దేవతాకమగు చరువును నిర్వాపము చేయవలెను. భూమియే క్షేత్ర భాగములకు ప్రభువు. కావున అతడు భూమి మీద సుప్రతిష్ఠతుడు అగుచున్నాడు.

    9. ఇంతకు ముందు చెప్పిన చరునిర్వాపనము అయినంత యజమాని ఇంద్రాగ్ని దేవతాకమగు పదకొండు పాత్రలందు పురోడాశమును నిర్వాపము చేయవలెను. అందువలన అతడు భూమి మీద ప్రతిష్ఠ పొందును. తదుపరి ఇంద్రియగత సామర్థ్యము గలవాడగుచున్నాడు.

    10. ఒకడు దర్శపూర్ణమాస యజ్ఞము చేయును. కాని అందు అమావాస్య, పూర్ణిమలందు చేయవలసిన కర్మలను చేయకుండును. అట్టివాడు పథికృత అగ్ని కొరకు ఎనిమిది పాత్రలందు పురోడాశమును నిర్వాపము చేయవలెను.

    ఒకడు దర్శపూర్ణ మాస యజ్ఞము చేయును. కాని అందు అమావాస్య, పూర్ణిమలందు చేయవలసిన ఇష్టులను చేయకుండును. అట్టివాడు మార్గము నుండి అపమార్గమునకు పోయినవాడగు చున్నాడు. అట్టివాడు స్వభాగధేయమున పథికృత అగ్నిని సేవించవలెను. అప్పుడు పథికృత అగ్నియే అతనిని అపమార్గమునుండి మార్గమునకు చేర్చుచున్నాడు.

    భారము వహించు ఎద్దు దక్షిణ యగును. అది యజమానికి ఫల సమృద్ధి కలిగించును.

    2. ఆహితాగ్నియై ఉండి అప్రత్యయమును ఆచరించినవాడు ఎనిమిది పాత్రలందు పురోడాశమును నిర్వాపము చేయవలెను. స్వభాగధేయమున వ్రతస్వామి యగు అగ్నిని సేవించవలెను. అగ్నియే అతనిని వ్రతము కలవానిని చేయును. అప్పుడు అతడు వ్రతయోగ్యుడు అగుచున్నాడు.

    3. రాక్షసుల వలన బాధలు పడువాడు - రాక్షస సంహారి యగు అగ్నికి ఎనిమిది పాత్రలందు పురోడాశమును నిర్వాపము చేయవలెను. స్వభాగధేయమున అట్టి అగ్నినే అర్చించవలెను. ఆ అగ్నియే అతనిని రాక్షసుల నుండి రక్షించును.

    4. నిర్వాపము రాత్రియందు చేయవలెను. ఏలనన రాక్షసులు రాత్రులందు సంచరింతురు కదా! అగ్ని - ఎక్కువ సంచరించు - రాక్షసులను నిశ్చయముగా సంహరించుచున్నాడు. రాక్షసులు ప్రవేశించకుండునట్టి ప్రదేశమున యజ్ఞము చేయవలెను.

    రాక్షసుల నాశనమునకగు యాజ్యానువాక్యలు రాక్షస నాశకములు అగుచున్నవి.

    5. శత్రువును సంహరించగోరువాడు రుద్రవత అగ్నికి ఎనిమిది పాత్రలందు పురోడాశము నిర్వాపము చేయవలెను. రుద్ర విశేషణము అగ్నికి భీకర తనువు అగును. అట్టి భయంకర దేహము గల అగ్ని యజమాని శత్రువును నశింపజేయును. శత్రువు వెంటనే నశించును.

    6. ఎవని గోవులు, భృత్యాదులు మరణించునో, ఎవనికి అపమృత్యు భయము కలుగునో, అతడు సురభి విశేషణము గల అగ్నికి ఎనిమిది పాత్రలందు పురోడాశము నిర్వాపము చేయవలెను. సుగంధ విశేషణమే అగ్నికి ఆరోగ్యవంతమగు శరీరము. ఆ శరీరము చేతనే అగ్ని యజమానిని ఆరోగ్యవంతుని చేయుచున్నాడు.

    సుగంధ అగ్ని కొరకు చేసిన నిర్వాపము శవగంధ పరిహారకము అగుచున్నది.

    7. యుద్ధమునకు సిద్ధమై జయము కోరువాడు ఆకలిగొన్న అగ్నికి ఎనిమిది పాత్రలందు పురోడాశము నిర్వాపము చేయవలయును. స్వభాగధేయమున అగ్నిని శాంతింపచేసి అగ్నిని శత్రువునకు అభిముఖముగా ప్రదర్శించవలెను.

    తన సేన నడుమ ఉన్నవాడు శత్రువు బాణములు తగిలియు జీవించును. శత్రుసేన నడుమ తనవారి బాణములు తగిలిన వాడు మరణించును.

    జయతి సంగ్రామమ్ - యుద్ధమున యజమాని విజయుడు అగును.

    8. తనకన్న పెద్దవారు, తన కన్న చిన్నవారు తనముందు మరణింతురు. అట్లయినపుడు అగ్ని వారిని కలిసికొనును. ఆ అగ్నికి పురుషాహుతియే ప్రియము. కావున బంధు మరణ నివారణ కోరువాడు ఆకలిగొన్న అగ్నికి అష్టాకపాల పురోడాశము నిర్వాపము చేయవలెను. యజమాని స్వభాగధేయమున అగ్నిని శాంతింపచేయవలెను. అనంతరము బంధువులందు ఎవరును అకాలమరణము పొందరు.

    9. ఏ యొక్క ఆహితాగ్ని గృహములను అగ్ని దహించునో వానిని అగ్ని కలిసికొనుచున్నాడు. అందువలన యజమాని ఆకలిగొన్న అగ్నికి అష్టా కపాల పురోడాశము నిర్వాపము చేయవలెను. స్వభాగ ధేయమున అగ్నిని శాంతింపచేయవలెను. తదుపరి అగ్ని అతని గృహములను దహించడు.

                                     మూడవ అనువాకము

    1. కోరిన కోరిక తీరని వాడు "అగ్నయే పురోడాశమాష్టా కపాలమ్ నిర్వపేద్యం." కోరికలు తీర్చునట్టి అగ్నిని స్వేనభాగధేయేనోపధావతి. ఆ అగ్నియే కామేన సమర్థయతి. అతని కోరికలను తీర్చునది.

    2. భూమి విషయమున కాని, బంధువుల విషయమున కాని స్పర్థ కలవాడు వియోగకారియైన "అగ్నయే పురోడాశమష్టాకపాలమ్ నిర్వపేద్యం" నియోగకారియైన అగ్నిని "స్వేనభాగధే యేనోపధావతి" ఆ అగ్నియే పగవాని సామర్థ్యమును తొలగించును. అప్పుడు యజమాని శత్రువు మీద విజయము సాధించుచున్నాడు.

    3. అన్యుల అభిచారాదుల వలన బాధలు పడుచున్నవాడు బాధలను దూరము చేయు 'అగ్నయే పురోడాశమష్టాకపాలం నిర్వపేద్యం' బాధలు బాపు అగ్నిని 'స్వేన భాగధేయేనోపధావతి' అట్లయినపుడు అగ్నియే అతనిని రాక్షసాదుల నుండి రక్షించును. యజమానిని బాధింపదలచిన శత్రువు నిర్వీర్యుడు అగుచున్నాడు.

    4. సంపూర్ణ ఆయువు కోరునట్టివాడు ఆయువు ప్రసాదించు 'అగ్నయే పురోడాశమష్టా కపాలమ్ నిర్వపేద్యం' ఆయుష్పదుడగు అగ్నిని. 'స్వేన భాగధేయేనోపధావతి' అగ్నియే అతని యందు ఆయువును స్థాపించును. అతడు పరిపూర్ణ ఆయుష్మంతుడు అగుచున్నాడు.

    5. సంపదలు కోరువాడు సంపద కలిగించు "అగ్నయే పురోడాశ మష్టాకపాలమ్ నిర్వపేద్యం. ధనప్రదుడగు అగ్నిని 'స్వేన భాగధేయేనోపధావతి. సఏవైనం భూతిం గమయతి'. ఆ అగ్నియే అతనికి సంపదలు కలిగించును. యజమాని నిశ్చయముగా సంపన్నుడు అగుచున్నాడు.

    6. కాంతిని కోరువాడు కాంతి ప్రదుడగు 'అగ్నయే పురోడాశమష్టాకపాలమ్ నిర్వపేద్యం. కాంతి ప్రదుడగు అగ్నిని 'స్వేన భాగధేయేనోపధాపతి' సఏవాస్మిన్రుచం దధాతి. రోచతయేవ. అతడు నిశ్చయముగా కాంతిమంతుడు అగుచున్నాడు.

    7. తేజస్సు కోరువాడు కాంతి ప్రదుడగు 'అగ్నయే పురోడాశమష్టాకపాలమ్ నిర్వపేద్యం. అగ్నిమేవ తేజస్వవ్తగం స్వేనభాగధేయేనోపధావతి' సఏవాస్మిన్రుచం దధాతి. తేజస్వ్యేవభవతి. తేజస్సు కలవాడు అగుచున్నాడు.

    8. శత్రువును పరాభవించు కోరిక కలవాడు సహనశీలుడగు "అగ్నయే పురాడాశమష్టా కపాలమ్ నిర్వపేద్యం. అగ్నిమేవ సహన్త్యగం స్వేన భాగధేయేనోపధావతి". ఏ శత్రువును అతడు పరాభవించదలచినాడో వానిని అతడు పరాభవించుచున్నాడు.

                                         నాలుగవ అనువాకము

    1. అన్నవంతుడు కాదలచినవాడు 'అగ్నయేన్నవతే పురోడాశమష్టాకపాలం నిర్వపేద్యం. అగ్నిమేవాన్నవన్తగం స్వేన భాగధేయేనోపధావతి. స ఏవైన మన్నవన్తంకరోతి. అతడు అన్నవానేవ భవతి.


Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More