"నాపేరు మీనాక్షి. వెనుకలవైపున వుంటున్నాం. సంగీతం టీచర్ గా రామకృష్ణా మఠంవారి స్కూల్లో పనిచేస్తున్నాను. ఇద్దరుపిల్లలు. ఒకరు ఆడా, ఒకరు మొగా" అని గడగడా చెప్పింది.
"నాపేరు శక్తిమతి" చెప్పింది శక్తి.
"బ్యాంక్ లో ఉద్యోగమటగా! అదృష్టవంతులు" అంది మీనాక్షి.
శక్తి చిన్నగా నవ్వి "ఇంద్రనీల్.... కాఫీ పట్రా" అంది.
మీనాక్షి లోపలికి చూస్తూ "ఎవరున్నారు లోపలా?" అంది.
"మా ఆయన" అంది శక్తి.
మీనాక్షి అప్రయత్నంగా గుండెలమీద చెయ్యేసుకుని "అమ్మో! ఆయన్నా మీరు కాఫీ తెమ్మన్నదీ? ఆయన ఏవీ అనుకోరా?" అంది.
"కాఫీనేగా తెమ్మన్నదీ అందులో తప్పేంవుందీ?" నవ్వుతూ అడిగింది శక్తి.
"అయ్యబాబోయ్.... మా ఆయనైతే కాఫీ తెమ్మనడం కాదు. అక్కడ పెట్టాను తీసుకోండి అన్నా తప్పు పడతాడు. అన్నింటికి అలిగి, "నేనేం సంపాదించడం లేదనేగా నీకింత అలుసూ!" అని సాధించి చంపుతారు" అంది.
ఇంద్రనీల్ రెండు కప్పులతో కాఫీ తెచ్చాడు.
అతడ్ని చూడగానే మీనాక్షి ఠక్కున లేచి నిలబడి "నమస్కారం అన్నయ్యగారూ" అంది.
'ఆడవాళ్ళు యిలా మగవాళ్ళని చూడగానే భయపడిపోయి వరసలు కలపడం ఎందుకో' అనుకుని శక్తి నవ్వుకుంది.
"నమస్తే! ఈ చెల్లెమ్మ ఎవరూ...?" శక్తిని అడిగాడు.
"వెనుకవైపు వాటాలో వుంటారట. మీనాక్షిగారు" అంది శక్తి.
"ఓ.... సదానందంగారి భార్యా మీరు?" అన్నాడు.
"ఆ సదానందంగారు నీకు చిన్నప్పటినుంచీ తెలుసా?" శక్తి నడుంమీద చేతులు పెట్టుకుని కనుబొమలు చిట్లించి అడిగింది.
"అబ్బే! నీళ్ళు తోడుతున్నప్పుడు వచ్చి మాట్లాడారు. అంతే..." అన్నాడు.
"మరి ఆవిడ తన పేరు మీనాక్షి. వెనక వాటాలో వుంటాను... అని చెప్పాక కూడా 'సదానందంగారి భార్య' అనే డిగ్రీ ఎందుకూ? ఆ బిరుదువల్ల అదనంగా ఏదైనా లాభం చేకూరిందా నీకు? మనుషుల్లో ఈ జాడ్యం ఎప్పుడు పోతుందో? ఎదురుగుండా వున్నవాళ్ళ మీదకంటే వాళ్ళు ఎవరికో తోడికోడలనో, మేనల్లుడనో లేక ఒక వేలువిడిచిన చుట్టమనో గుర్తింపు ఇవ్వడం అలవాటయిపోయింది" కటువుగా అనేసింది శక్తి.
ఇంద్రనీల్ అటూ యిటూ చూసి "కాఫీ చల్లారిపోతుంది శక్తీ...." అన్నాడు.
మీనాక్షి ఈ పరిస్థితికి తట్టుకు నిలబడలేకా, జీర్ణించుకోలేకా, నానా అవస్థా పడుతూ ఇంద్రనీల్ వైపు జాలిగా చూసింది.
ఇంద్రనీల్ నవ్వుతూ కాఫీ అందించాడు.
మీనాక్షి కాఫీ తాగి, ఏ అవసరం వచ్చినా సంకోచించకుండా తనని అడగమని శక్తికి చెప్పి వెళ్లిపోయింది.
"వంట అయిపోయింది" ఇంద్రనీల్ వంటింట్లోంఛి వచ్చి శక్తికి చెప్పాడు.
"అయిపోయింది కాదు. పూర్తయింది అనాలి" అంది ఆమె.
ఇంద్రనీల్ పెరట్లోంఛి రెండు అరటిఆకులు తీసుకొచ్చి కడిగి పరిచాడు.
శక్తి మోకాళ్ళమీద గెడ్డం ఆనించుకుని కూర్చుని, అతని చర్యలు గమనించసాగింది.
"దోసకాయ పప్పులో కొత్తిమీరా వేసి నిమ్మకాయ పిండితే బాలమురళీ కృష్ణ ర్యాప్ సాంగ్ పాడినట్లు రంజుగా వుంటుంది" అన్నాడు.
శక్తి అది వూహించుకుని పకపకా నవ్వింది.
"చారులో చారెడు మెంతులు వేశాను. చాలాయో, లేదో?" అన్నాడు.
ఆమె భయంగా "చారెడు మెంతులా?" అంది.
"ఏం చాలవా?" అడిగాడు.
ఆమె ఏమీ అనలేక అలాగే చూస్తుండిపోయింది.
అతను వడ్డిస్తూ "ఏదో కొత్త చేతనయినట్లు చేశాను. రేపటినుంచీ నేర్చుకుంటాను. ఏమీ అనుకోకు.... సర్దుకో" అన్నాడు.
ఆమె మాట్లాడకుండా కలుపుకుని తినసాగింది.
అతనుకూడా ముద్ద నోట్లో పెట్టుకుని "శక్తీ.... అసలు పప్పులో ఉప్పులేదు. చెప్పవేం!" అన్నాడు.
"ఈ రోజుకి సర్దుకోమన్నావుగా....రేపటినుంచీ కరెక్ట్ గా చేస్తానన్నావుగా" అంది.
"అవును" అతను నవ్వేశాడు.
"కాదు! ఈరోజు సాయంత్రంనుంచే నేర్చుకో" అంది.
అలా ఎందుకు అందో చారు నోట్లో పెట్టుకున్నాక అతనికి అర్ధం అయింది.
వాళ్ళు భోజనాలు పూర్తిచేశాక అక్కడంతా శుభ్రం చేస్తుండగా మామ్మగారు నవనవలాడే లేత సొరకాయ పట్టుకుని "అమ్మాయ్ శక్తీ..." అంటూ లోపలికి వచ్చింది.
"రండి మామ్మగారూ..." అన్నాడు ఇంద్రనీల్.
మామ్మగారు వచ్చి స్టూల్ మీద కూర్చుంతూ "ఎవరో తాతగారికి నాలుగు సొరకాయలు యిచ్చి పంపారట. ఒకటి మీకు తెచ్చాను. దీన్ని అంటుపులుసు పెట్టి వండితే భలే పసందుగా ఉంటుందిలే" అంది.
"అవును మామ్మగారు సాయంత్రం వండుతాను" ఇంద్రనీల్ అందుకుంటూ అన్నాడు.
శక్తి వెంటనే "నీకు తెలుసా దాన్ని వండటం?" అని అడిగింది.
"తెలీదు మామ్మగారు ఇప్పుడు నేర్పిస్తారుగా" అన్నాడు.
"దానికేం భాగ్యం నాయినా!" మామ్మగారు ఎంతో ఆసక్తిగా చెప్పదానికి తయారయిపోయింది.
శక్తి బ్యాగ్ అందుకుంటూ "నేను ఓసారి తారా వాళ్ళింటికెళ్ళొస్తాను" అని బయటికి వెళ్లిపోయింది.
"మీరు చెప్పండి మామ్మగారూ..." ఇంద్రనీల్ పుస్తకం, పెన్నూ తెచ్చుకుని కూర్చున్నాడు.
    
                                                                  * * *