"మేడమ్!" కానిస్టేబుల్ పరుగున వచ్చాడు "ఏయస్పిసాబ్ స్పృహలో కొచ్చారు."

 

    అరనిముషంలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోకి నడిచారంతా.

 

    "థాంక్యూ మై ఫ్రెండ్!" శమంత్ ముందు పలకరించింది శ్రీహర్షని. అలవోకగా బేండేజ్ ఉన్న శ్రీహర్ష చేతినందుకున్నాడు "మృత్యువుని వెంట్రుకవాసిలో తప్పిస్తూ అరచేతిని అడ్డంపెట్టారు... గాయం బలంగా అయ్యుంటుంది కదూ!"

 

    శ్రీహర్ష జవాబు చెప్పలేదు. ఏకాగ్రతగా శమంత్ ని చూస్తున్నాడు.

 

    "నా ఆయుష్షుని పొడిగించిన మీకు బదులుగా ఏమివ్వగలవో చెప్పలేనుకాని పొడిగించబడిన జీవితకాలాన్ని బదులు తీర్చుకోటానికి వినియోగిస్తాను."

 

    "ఇప్పుడా మాటలు దేనికి" వారించబోయింది రేవతి.

 

    "తప్పదు రేవతీ! ఇలాంటి సాహసం చేసిన మహేంద్రని ఉపేక్షించలేను."

 

    శత్రువు ఎవరో ఊహించగలిగిన శమంత్ ని అభినందించలేదు శ్రీహర్ష. చాలా పరిమితులున్న ఓ పోలీసాఫీసర్ అలాంటిక్షణంలో సైతం యిలా ఆలోచించడం బాధనిపించింది.

 

    సాధ్యాసాద్యాలను గురించి బేరీజువేయలేదు శ్రీహర్ష.

 

    రేవతి మెడలో వేళ్ళాడుతున్న తాళిబొట్టు శక్తిని అంచనా వేస్తున్నాడు.

 

    శ్రీహర్ష ఆలోచిస్తున్నది అదికూడా కాదు.

 

    ఒక ఐ.పి.యస్. ఆఫీసర్ పై హత్యాప్రయత్నం జరిగినా హాస్పిటల్ కు రాని పోలీస్ అధికారుల గురించి...

 

    అదిచాలు మహేంద్ర శక్తిని గ్రహించటానికి.


                                                           *  *  *


    సరిగ్గా యిదే సమయంలో...

 

    యూనివర్సిటీ కాంపస్ లో ఓ యువతి ఆదుర్దాగా నడుస్తోంది. ఆమె పేరు రాజ్యం. పోస్టు గ్రాడ్యుయేషన్ చేస్తున్న రాజ్యానికి కొన్ని క్షణాల క్రితం క్లాసులో ఉండగా ఓ మెస్సేజ్ అందించారెవరో. అది ఆమె తండ్రి హార్ట్ అటాక్ మూలంగా కె.జి.హెచ్ లో చేర్చబడ్డారని.

 

    ఒక సాధారణ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేసి రిటైరయిన ఆమె తండ్రి ఆర్థికమైన పరిస్థితి తెలిసిన రాజ్యానికి పోస్టు గ్రాడ్యుయేషన్ చేయటమన్నది అసాధారణ విషయం కాని ఆమె చదువులో ఎక్కువగా స్కాలర్ షిప్స్ మీదనే ఆధారపడింది.

 

    యమ్మెసి నుంచి రేంకు స్టూడెంట్ గా కుటుంబానికంతటికీ చాలా ధైర్యాన్ని అందిస్తుంది, ముఖ్యంగా ఆమె తండ్రికి. కొడుకుల్లేని సత్యంమాస్టారు రాజ్యాన్ని పెద్ద దిక్కుగా భావించటానికి కారణం మరో ఏడాదితో ఆమె చదువు ముగుస్తుందని మాత్రమే కాదు... ఇంటి బాధ్యత సైతం తీసుకునే రాజ్యం మిగతా యిద్దరు చెల్లెళ్ళనూ చదివిస్తూ సాయంకాలంపూట కొంతమంది పిల్లలకి ట్యూషన్ చెబుతూ తానూ సంపాదిస్తూంది.

 

    కేంపస్ దాటిన రాజ్యం బస్సుకోసం ఆగలేదు.

 

    అసలు బస్సు ప్రయాణం కూడా ఆమెకు లగ్జరీలాంటిదే.

 

    తండ్రి అనారోగ్యం వార్థ ఆమెనెంత కలవరపెట్టిందంటే ఓపక్క కళ్ళల్లో నీళ్ళు పేరుకుంటున్నాయి. తండ్రికేమీ కాకూడదని మనసులోనే దేవుణ్ని ప్రార్థిస్తూ నడక వేగాన్ని పెంచింది.

 

    మధ్యాహ్నం పన్నెండుగంటలు కావస్తుంది.

 

    బీచ్ రోడ్డుపైనుండి కె.జి.హెచ్ కి వెళ్ళాలనుకోవడంతో అక్కడ అమ్మవారి గుడిదగ్గర మలుపు తిరిగింది.

 

    ముందు సన్నగా ఈలలు వినిపించాయి. గుండె గతుక్కుమందేమో ఓరగా చేసింది.

 

    ఓ మూల జీప్ లో కూర్చున్న నలుగురు యువకులు చేతిలో బీరుబాటిల్స్ తో ఆమె ముందుకు వచ్చారు.

 

    రాజ్యం ధైర్యం సడలిపోయింది.

 

    నడక వేగాన్ని పెంచుతూ చుట్టూ చూసింది.

 

    కనుచూపు మేరలో మనుష్య సంచారం లేదు.

 

    "ఆగు" ఓ యువకుడు చేయి పట్టుకున్నాడు.

 

    కెవ్వుమనబోయింది.

 

    అలానే ఆమెను వెనుకనుంచి ఒడిసిపట్టుకున్న మరో యువకుడు నోటిలో బీరు పోశాడు.

 

    పొలమారింది.

 

    చేతిలో బుక్స్ నేలపైకి జారాయి.

 

    శక్తిని కూడగట్టుకున్న రాజ్యం పట్టుకున్న వ్యక్తి చేయికొరికి ముందుకు పరుగెత్తింది.

 

    నవ్వులు... కేరింతలు...

 

    ఇద్దరు యువకులు ఆమెను వెంటాడుతుంటే మరో యిద్దరు ఉల్లాసంగా జీప్ నడుపుకొస్తున్నారు.

 

    అలసిపోయింది. ఆమె కళ్ళనుంచి నీళ్ళు రాలుతుంటే వెక్కిపడుతూ యింకా పరుగెత్తుతూనే ఉంది.

 

    అదిగో సరిగ్గా అప్పుడు ఓ మోటార్ బైక్ ఆమె సమీపంలోకి వచ్చి ఆగింది.

 

    "రండి... వెనక్కూర్చోండి..." తొందరచేసాడా మోటార్ బైక్ యువకుడు.

 

    ఆపదలో దేవుడిలా ప్రత్యక్షమైన ఆ యువకుడ్ని చూస్తూ వెనుక సీటుపై కూర్చుంది.

 

    "ఫాలో హిమ్..."

 

    నలుగురూ యువకులూ బైక్ ను అనుసరిస్తున్నారు.

 

    గాలి రివ్వున వీస్తూంది.

 

    "భయపడకండి" బైక్ వేగాన్ని పెంచాడు.

 

    జీప్ సమీపంకి రావడంతో హఠాత్తుగా బ్రేక్ వేసిన వ్యక్తి వెనువెంటనే భీమిలి రోడ్డుపై ఉత్తరంవేపు పోనిచ్చాడు.

 

    జీప్ కూడా మార్గం మళ్ళింది.

 

    సరిగ్గా నాలుగు నిమిషాలలో గంటకి వంద కిలోమీటర్ల వేగాన్ని చేరుకున్న బైక్ యిప్పుడు రోడ్డుపక్కనున్న చిన్న సరుగుడు తోటలో నుండి వెళ్ళి ఓ గెస్ట్ హౌస్ లాంటి భావన ప్రాంగణంలో ఆగింది.

 

    "కమాన్... క్విక్" ఆమెకు ఆసరా యిచ్చాడు.

 

    "కౌన్ హై?" గుర్ఖాలావున్న ఓ వ్యక్తి అడ్డంపడబోయాడు.

 

    బైక్ యువకుడు చెప్పాడు "ప్లీజ్... గూండాలు వెంటాడుతున్నారు" రాజ్యాన్ని లోపలికి లాక్కుపోయాడు.

 

    ద్వారం మూసి ఆందోళనగా టేబుల్ పై వున్న ఫోన్ అందుకున్నాడు.

 

    "డోంట్ వర్రీ... మీరు రిలాక్స్ కండి... నేను పోలీసులకి ఫోన్ చేస్తాను."

 

    కృతజ్ఞతగా ఆమె కళ్ళనుండి నీళ్ళు వర్షిస్తున్నాయి.