సమ్మర్ లో మహిళలు తీస్కోవాల్సిన జాగ్రత్తలు

 

 

సమ్మర్ హీట్ మోతెక్కిస్తోంది. బయటికి వెళ్లాలంటేనే భయం వేసేంతగా వాతావరణం మారిపోయింది. ఎక్కువగా బయట తిరిగే మహిళల చర్మం ఈ సమ్మర్ ఎఫెక్ట్ కు నల్లగా మారిపోవడం, మేని ఛాయ తగ్గిపోవడం లాంటి సమస్యలు ఎదురౌతుంటాయి. ముఖ్యంగా మధ్యాహ్నపు ఎండ చర్మానికి తీవ్రమైన హాని కలుగజేస్తుంది. మహిళల మృదువైన చర్మంలో ఉండే సాగే గుణాన్ని, సమ్మర్ హీట్ ధ్వంసం చేస్తుంది. అందుకే మరీ అవసరమైతే తప్ప, మహిళలు బయటికి వెళ్లకుండా ఉండటమే శ్రేయస్కరం. ఒక వేళ తప్పనిసరైతే మాత్రం, స్కార్ఫ్, గ్లోవ్స్ తో పాటు, సాక్స్ కూడా వేసుకోవడం తప్పనిసరి. ఉదయం ఏడింటి వరకూ వచ్చే ఎండ చాలా మంచిది. ఇది చర్మానికి అవసరమైన విటమిన్లను అందిస్తుంది. శరీరంలో హార్మోన్ల ఉత్పత్తితో పాటు, డి విటమిన్, కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. కానీ ఆ తర్వాతి నుంచి మాత్రం భానుడి భగభగలు మొదలవుతాయి. అందుకే సమ్మర్ లో బయటికి వెళ్లేప్పుడు మాయిశ్చరైజర్ కంపల్సరీ. రెండు మూడు గంటలకోసారి సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. పెదాలు పొడిబారిపోయి, పగిలిపోకుండా లిప్ బాప్ వాడుతుండాలి.

 

సన్ స్క్రీన్ రాసుకున్నంత మాత్రాన ఎండలో తిరగచ్చు అనుకుంటే పొరబాటే. ఎట్టి పరిస్థితుల్లోనూ వెంట గొడుగో లేక స్కార్ఫ్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఒక వేళ ఎండ వేడికి చర్మంపై రాష్ లు గానీ దురదలు గానీ వస్తుంటే, కలబందతో తయారైన జెల్ వాడితే తక్షణ ఉపశమనం లభిస్తుంది. కుటుంబ ఆరోగ్యచరిత్రలో చర్మకాన్సర్ ఉన్నవాళ్లు వీలైనంత వరకూ ఎండలో తిరగడాన్ని నివారించాలి. సమ్మర్ అంతా బి, సి, ఇ, విటమిన్లు, కెరోటిన్‌, సెలీనియం, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా లభించే ఆహారాన్నే ఎంచుకోవాలి. ద్రాక్ష, చెర్రీ, బెర్రీలు, ఆపిల్‌, గ్రీన్‌టీ, ఉల్లిపాయ, బొప్పాయి, నిమ్మజాతిపండ్లు లాంటి ఫ్లేవనాయిడ్ల ఆధారిత ఆహారానికి ఎక్కువగా ప్రాధాన్యమివ్వాలి. వీటివల్ల శరీరంలో తేమ శాతం పెరుగి అలసట దూరమవుతుంది.