వేసవిలో ఆయిల్ స్కిన్ వేధిస్తోందా.. ఈ చిట్కాలతో భలే ఉపశమనం ఉంటుంది!

వేసవి రాకతో, చర్మానికి సంబంధించిన అనేక సమస్యలు పెరగుతాయి. మండే ఎండ, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, చెమట , గాలిలోని తేమ చర్మాన్ని జిగటగా , నూనెగా మారుస్తాయి. ముఖ్యంగా, ఇప్పటికే జిడ్డు చర్మం ఉన్నవారు వేసవిలో తమ ముఖంపై నూనె, చెమట , దుమ్ము పేరుకుపోయే సమస్యను తరచుగా ఎదుర్కొంటారు. ఇది ముఖం నిర్జీవంగా కనిపించేలా చేయడమే కాకుండా, మొటిమలు, బ్లాక్‌హెడ్స్ , ఇతర చర్మ సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అయితే, కొన్ని సులభమైన చర్మ సంరక్షణ చిట్కాలను పాటించడం ద్వారా వేసవిలో కూడా చర్మాన్ని తాజాగా, నిర్మలంగా , కాంతివంతంగా ఉంచుకోవచ్చు. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే..
శుభ్రత..
చర్మంపై అధికంగా నూనె , మురికి ఉంటే దాన్ని తొలగించడానికి తేలికపాటి ఫేస్ వాష్ ఉపయోగించాలి. పదే పదే ముఖం కడుక్కోవడం మానుకోవాలి, ఎందుకంటే దీనివల్ల చర్మం మరింత నూనెను ఉత్పత్తి చేస్తుంది. ఉదయం, రాత్రి పూట ముఖాన్ని శుభ్రం చేసుకోవడం మంచిది. నిర్మలమైన చర్మం మొటిమల ప్రమాదాన్ని తగ్గించడంలో రోజులో ఉదయం, రాత్రి ముఖం శుభ్రం చేసుకోవడం ఎంతో సహాయపడుతుంది.
మాయిశ్చరైజర్..
వేసవిలో కూడా చర్మాన్ని తేమగా ఉంచుకోవడం ముఖ్యం. ఇందుకోసం మాయిశ్చరైజర్ రాయాలి. చాలామంది మాయిశ్చరైజర్ కేవలం చలికాలంలోనే అవసరం అనుకుంటారు. కానీ అన్ని కాలాల్లో చర్మానికి తగినట్టు మాయిశ్చరైజర్ ఎంచుకోవడం మంచిది. వేసవిలో తేలికైన , జెల్ ఆధారిత మాయిశ్చరైజర్లు మంచి ఎంపిక అవుతాయి. ఇది చర్మానికి అదనపు జిడ్డును చేర్చకుండా, తేమగా ఉంచుతుంది. చర్మానికి ఉండే సహజ సమతుల్యత కాపాడుతుంది.
సన్ స్క్రీన్..
తీవ్రమైన సూర్యరశ్మి చర్మానికి హాని కలిగిస్తుంది. ఇది వేసవిలో చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. బయటకు వెళ్లే 20 నిమిషాల ముందు సన్‌స్క్రీన్ రాసుకోవాలి. SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్‌ను ఎంచుకోవాలి. ఇది చర్మం నల్లబడటాన్ని , అకాల వృద్ధాప్య లక్షణాలను నివారించడంలో సహాయపడుతుంది.
ఫేస్ ప్యాక్..
ముల్తానీ మట్టి, రోజ్ వాటర్ , దోసకాయ వాడకం చర్మాన్ని చల్లబరుస్తుంది. ఇది అధిక నూనెను నియంత్రించడంలో సహాయపడుతుంది. వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. చర్మం మరింత శుభ్రంగా, తాజాగా అనిపిస్తుంది.
నీరు..
శరీరాన్ని తగినంత తేమగా ఉంచుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది. శరీరం నుండి విష పదార్థాలను తొలగించడంలో నీరు సహాయపడుతుంది. వేసవిలో 8-10 గ్లాసుల నీరు త్రాగాలి. లేదా అవసరాన్ని బట్టి ఇంకా ఎక్కువగా త్రాగడం కూడా మంచిదే. నీరు బాగా తాగడం వల్ల చర్మం తేమగా మారుతుంది. తేమగా ఉన్న చర్మం తాజాగా, కాంతివంతంగా కనిపిస్తుంది.
*రూపశ్రీ.


