"గుడ్ ఈవినింగ్ సర్..... చారిని మాట్లాడుతున్నాను. మీరు చెప్పిన ఎసైన్ మెంట్ పూర్తిచేశాను. కాంట్రాక్ట్ మనకే వచ్చేట్లుంది" చారి ఇంకా ఏదో చెప్పబోయాడు.
    
    "చారీ! రేపు మార్నింగ్ మాట్లాడదాం. బై" రిసీవర్ పెట్టేశాడు జయచంద్ర.
    
    జేసీ ఇండస్ట్రీస్ జి.ఎం. చారి చెప్తున్న కాంట్రాక్ట్ కోట్లు లాభం తెచ్చిపెట్టేదనీ, అది జె.సి. ఇండస్ట్రీకి రావడం ప్రిస్టేజియస్ విషయం అనీ జయచంద్రకి తెలుసు. అయినా ఎందుకో ఆ సమయంలో ఆ విషయాన్ని గురించి మాట్లాడడానికి అతనికి మనసు ఇష్టపడలేదు.
    
    పున్నమిరేయి విరగబడి నవ్వుతోంది.
    
    కిటికీకున్న వెనీషియమ్ బ్లెండ్స్ ని క్రిందకీ మీదకీ చేస్తూ వెన్నెల్ని చూడసాగాడు.
    
    మాటిమాటికీ వర్షంలో నిలువెల్లా తడిసిపోయి తనని హత్తుకుపోతున్న ఆమె రూపమే గుర్తొస్తోంది. ఎన్ ఛాటింగ్ బ్యూటీ.
    
    కిటికీ తెరలు లీలగా కదులుతున్నాయి. వాటికి కుట్టిన మువ్వలు మంద్రంగా మ్రోగినప్పుడల్లా అతనికి ఆ సవ్వడి ఎక్కడో వినినట్లుగా అనిపిస్తోంది.
    
    కిటికీ అవతలవున్న జాజిమల్లి, ఎదలోగిల్లో నిదురిస్తున్న కీట్సూ, షెల్లీనీ వెలికి తీస్తున్న అనుభూతి!
    
    పడక కుర్చీలో వెనక్కివాలి పడుకుని రవిశంకర్ సితార్ వాదనని వినాలనిపించింది చాలారోజుల తర్వాత.
    
    ధూళి మూగి మూసిపెట్టబడిన జ్ఞాపకాల కుంచెల్ని బైటకితీసి రూపం అంతుబట్టని ఆకారాన్ని బొమ్మగా గీయాలనిపించింది చాలా ఏళ్ల తరువాత.
    
    ఇంకా చాలా గంటలు గడిస్తేకానీ తెల్లవారదు. ఇంత రాత్రి ఎం చేసుకోవాలి అనుకున్నాడు చాలాకాలం తరువాత.
            
                                                   * * *


    'ఈ రాత్రి గడిచేనా? ఓహ్....కాళరాత్రి అంటే ఇదే' బాధగా అనుకుంది కాంచన.
    
    ఆమె హృదయంలో బాధ సుళ్ళు తిరుగుతోంది. కన్నీళ్లు 'మేము ఇంకా మిగిలే వున్నాం' అన్నట్లు చెంపలపై నుండి జారిపోతున్నాయి.
    
    గడియారంలో నిముషాలముల్లు చేసే శబ్దం కూడా ఆమె భరించలేకపోతోంది. తన శరీరంలో నుండి అతి లాఘవంగా ఎవరో హృదయాన్ని దొంగిలిస్తున్నట్లుగా అనిపిస్తోంది.
    
    అతికష్టంమీద లేచి టేబుల్ మీదున్న మంచినీళ్ళ జగ్గు అందుకోబోయింది. పక్కనే వున్న ఫోటో అద్దం బీటవారి జాలిగా చూస్తోంది. ఆమె కుడి కన్ను అదేపనిగా ఆదరసాగింది. వరుసగా అపశకునాలు, ఆమెకు వెంటనే జయచంద్ర కోటు జేబులోని రింగులు గుర్తొచ్చాయి.
    
    ఒక్కసారంటే పొరపాటు. రెండవసారి జరిగితే అలవాటేగా, ఆపైన ఆమె ఆలోచించలేకపోయింది. ఆమెకి భరించలేనంత నొప్పిగా అనిపిస్తోంది. గ్లాసులోకి నీళ్ళు ఒంపుకోవాలన్న ఆమె ప్రయత్నం ఫలించలేదు. నీళ్ళు చెయ్యి జారిపోయాయి. చెయ్యి జారిన వాటిని పట్టుకోవడం ఎవరితరం?
    
    "అమ్మగారూ......అమ్మగారూ ఏమైందీ? నన్ను లేపవచ్చుకదమ్మా!" నొచ్చుకుంటూ అంది రత్నం.
    
    "దాహం" చెప్పింది కాంచన.
    
    రత్నంలేచి "నేను తీసుకువస్తాను వుండండి. నొప్పి ఎలా వుంది? అయ్యగార్ని లేపనా?" ఆదుర్దాగా అడిగింది.
    
    కాంచన తల అడ్డంగా వూపి, "వద్దు ఎవర్నీ డిస్టర్బ్ చేయద్దు. పగలంతా పనిచేసిన వాళ్ళు రాత్రులు నిద్రపోతారు. పనిలేని నేను ఇలా రాత్రి.....విషాదంతో యుద్ధం చేస్తాను. నువ్వు కూడా పడుకో. నీళ్ళతో తీరేదికాదీ దాహం" అంది విరక్తిగా.
    
    రత్నం కన్నీళ్ళతో చూసింది. "అలా మాట్లాడకండి నాకు భయం వేస్తుంది. పోనీ అమ్మాయిగార్ని లేపనా?" అంది.
    
    "వద్దు రోజులో చాలాభాగం వాళ్ళు నా బాధని పంచుకుంటూనే వున్నారు. కనీసం రాత్రిపూటైనా నా బాధేదో నేనొక్కదాన్నే పడనీ రత్నం నువ్వు కూడా పడుకో. దయచేసి నన్ను ఒక్కదాన్నే ఈ బాధని అనుభవించనీ" అతికష్టంమీద మాట్లాడుతోంది కాంచన.
    
    రత్నం ఆమె బాధనిచూస్తూ కూడా మాట్లాడించలేనట్లు మౌనంగా చూస్తూ పడుకుంది.
    
    కాంచన మనసు ఆక్రోశించింది. నువ్వు పక్కనలేని ఈ నిశీధిలో భయాల వికృతపు నీడలు కరాళనృత్యం చేస్తున్నాయి. ఆనందం అంతా కంట్లోంచి కారిపోయి వేదనా చారికలను మాత్రం కళ్ళకింద మిగిల్చింది. నన్ను మృత్యువు కబళించినా నా ఆత్మ నీతోనే వుంటుంది.
    
                                             * * *
    
    "ఈ రాత్రి తెల్లవారకూడదు" ఆశగా అనుకుంది చాయ. తెల్లవారితే ఈ స్వర్గం నుంచి మళ్ళీ తన నరకానికి ప్రయాణం అవ్వాలి.
    
    సంధ్య పక్క మంచంమీద ఆదమరచి నిద్రపోతోంది.
    
    అలవాటులేని మెత్తని పక్క చాయని నిద్ర పోనివ్వడంలేదు. 'రాత్రి వృధాగా గడిచిపోతోంది' విసుక్కుంది. ఆలోచనల జెట్ విమానాల తాకిడికి అలసిపోయిన ఆమె మస్తిష్కం ఇక పని చెయ్యనని ఆమెమీద యుద్ధం ప్రకటించింది.
    
    చాయ నెమ్మదిగా లేచి కూర్చుంది.
    
    ఆమెకి తను వేసుకున్న ఫారెన్ ఫెర్ ఫ్యూమ్ కర్తవ్యాన్ని బోధిస్తున్నట్లుగా తోచింది. ఒంటిమీద నగలని తడుముకుంది. ఈ చీరలతో, ఈ నగలతో నేను పారిపోతేనో అనుకుంది. ఎదురుగుండా వున్న అద్దంలోంచి ఆమె ప్రతిరూపం నీలిరంగు కాంతిలో వింతగా మెరిసిపోతోంది.
    
    చాయ కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఆమె ప్రతిరూపం విరగబడి నవ్వుతోంది.
    
    "ఎందుకు? ఎందుకలా నవ్వుతున్నావు? ఆపు.....ఆపు.....నీకు పిచ్చి ఎక్కిందా?" కోపంగా అంది చాయ.
    
    "పిచ్చి నాకు కాదు నీకు" బదులిచ్చింది మనసు.
    
    "నాకా?"
    
    "లేకపోతే ఏమిటి? చిన్న సెంట్ బాటిల్ ఎత్తుకుపోగలవు. కావాలంటే ఆ చీర అడిగి పట్టుకుపోగలవు. ఇంకా కావాలంటే ఆ నగలని దొంగిలించగలవు. కానీ.....ఒక్కసారి ఆలోచించుకో! నువ్వు ఈ ఇంటిలో అనుభవించిన ఈ సౌఖలన్నీ పట్టుకుపోగలవా?"
    
    చాయకి బాత్ టబ్ లో స్నానం చేయడం కళ్ళల్లో మెదిలింది.
    
    ఇటువంటి పక్కమీద ఎన్నడైనా పడుకోగలనని వూహించావా?